Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

అంతా విశాఖకే.. ఇప్పటికే సిటీలో డిప్యూటీ సీఎం పవన్‌.. నేడు స్టీల్‌ సిటీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తులంతా విశాఖపట్నంలోనే పర్యటిస్తున్నారు.. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విశాఖలో ఉన్నారు.. రెండో రోజు సేనతో సేనాని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ముఖ్య కార్యకర్తలతో ఇవాళ ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.. ఇక, మధ్యాహ్నం పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశంకానున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మరోవైపు, నేడు విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులు షికారు చేయనున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా వీటిని ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నగర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తొలిసారి రెండు ‘హోప్ ఆన్.. హోప్ ఆఫ్’ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్ కే బీచ్ లోని కాళీమాత ఆలయం సమీపంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జీవీఎంసీ చేసింది. ప్రతీ రోజు ఆర్కే బీచ్ నుంచి కైలాసగిరి, రుషికొండ, తొట్ల కొండ పర్యాటక ప్రదేశాలకు ఈ బస్సులు తిరుగుతాయి. విశాఖ సాగర తీర అందాలను డబుల్ డెక్కర్ బస్సుల్లో ఆస్వాదించడం ఖచ్చితంగా మంచి అనుభూతి మిగులుస్తుందని పర్యాటక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక, విశాఖలో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. వైజాగ్ కన్వెన్షన్ లో జరిగే అర్థసమృద్ధి 2025- ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్ కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ లో ఏఐ ల్యాబ్స్ ప్రారంభించనున్న ఆయన.. ఎయిరోస్పేస్ మానుఫ్యాక్చరింగ్ పై సీఐఐ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు హాజరుకానున్నారు.. ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్ లో జరిగే స్పోర్ట్స్ మీట్ లో పాల్గొననున్నారు లోకేష్.. సాయంత్రం భారత మహిళా క్రికెట్ జట్టుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు మంత్రి నారా లోకేష్..

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. తప్పిన పెను ప్రమాదం..!
విజయనగరం జిల్లాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది.. దీంతో, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో సంతకాల బ్రిడ్జి వద్ద పట్టాలు తప్పింది గూడ్స్‌ రైలు.. గూడ్స్‌ నుంచి మూడు వ్యాగన్లు విడిపోయాయి.. దీంతో, రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో.. రంగంలోకి దిగిన రైల్వే అధికారులు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.. సాంకేతిక సమస్య కారణంగానే గూడ్స్‌ రైలు పట్టాలు తప్పినట్లు నిర్ధారణకు వచ్చారు.. పునరుద్ధరణ పనులు చేపట్టిన రైల్వే అధికారులు.. ట్రాక్ క్లియర్ చేసి.. రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు.. దీంతో, విజయనగరం రూట్‌లో రైళ్ల రాకపోకలు యథావిథిగా కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.. అయితే, ఆ సమయంలో ఆ ట్రాక్‌పై ఎలాంటి రైళ్లు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్టు అయ్యింది..

తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగింపు.. కేంద్రం ఉత్తర్వులు జారీ
తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో ఏడు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చి నెల వరకు పదవీ కాలం పొడిగించింది. ఈ నెల 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసు పొడిగించాలని డివోపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మరో 7 నెలలు సర్వీసు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఏఐఎస్‌ (సీఎస్‌–ఆర్‌ఎం) రూల్స్‌–1960లోని రూల్‌–3ని ప్రయోగించడం ద్వారా ఏఐఎస్‌ (డీసీఆర్బీ) రూల్స్‌లోని 16(1) నిబంధనను సడలిస్తూ రామకృష్ణారావు సర్వీసును పొడిగించినట్టు కేంద్రం తెలిపింది. 1991 బ్యాచ్‌ తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రామకృష్ణారావు గత ఏప్రిల్‌ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

75 ఏళ్ల రిటైర్మెంట్‌‌పై మోహన్‌ భాగవత్‌ సంచలన వ్యాఖ్యలు
దేశంలో ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో ఉన్న నాయకులు 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌పై చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై మోహన్ భాగవత్ క్లారిటీ ఇచ్చేశారు. తాను గానీ.. మరొకరు గానీ 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం దాదాపు రెండున్నర గంటల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 75 ఏళ్ల పదవీ విరమణపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. సెప్టెంబర్‌లో మోడీ కంటే 6 రోజుల ముందు మోహన్ భాగవత్‌కు 75 ఏళ్లు నిండనున్నాయి.

జపాన్‌ చేరుకున్న మోడీ.. 2 రోజులు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ప్రధాని మోడీ జపాన్ చేరుకున్నారు. టోక్యో చేరుకోగానే ఎయిర్‌పోర్టులో మోడీకి ఘనస్వాగతం లభించింది. జపాన్, చైనా పర్యటన కోసం మోడీ గురువారం బయల్దేరి వెళ్లారు. శుక్ర, శనివారం పర్యటనలో భాగంగా 15వ భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు మోడీ జపాన్‌కు వెళ్లారు. 2014 నుంచి ఇప్పటి వరకు మోడీ ఎనిమిది సార్లు జపాన్‌లో పర్యటించారు. మోడీ చివరిసారిగా 2018లో ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. తిరిగి ఏడేళ్ల తర్వాత మరోసారి జపాన్‌లో పర్యటిస్తున్నారు. క్వాడ్, ఏఐ, సెమీ-కండక్టర్లు.. మొదలగు అంశాలపై జపాన్‌తో మోడీ చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ప్రాంతీయ, ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇక జపాన్‌కు చెందిన అనేక మంది రాజకీయ నాయకులతో పాటు జపాన్‌లోని భారత స్నేహితులతో కూడా చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సంబంధాలను మరింతగా పెంచే లక్ష్యంతో జపాన్, భారత పరిశ్రమల నాయకులతో జరిగే వ్యాపార నాయకుల ఫోరమ్‌లో కూడా మోడీ పాల్గొననున్నారు.

ఎయిర్‌ షోలో అపశృతి.. కూలిన జెట్ విమానం.. ఫైలట్ మృతి
పోలాండ్ ఎయిర్‌ షోలో అపశృతి చోటుచేసుకుంది. ఎయిర్ షో రిహార్సల్ చేస్తుండగా ఒక్కసారిగా ఫైటర్ జెట్ కూలిపోయింది. ప్రేక్షకులు చూస్తుండగానే కూలిపోయింది. కిందపడగానే ఒక్కసారి విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున నిప్పులు చెలరేగి ఎఫ్-16 పైలట్ మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెంట్రల్ పోలాండ్‌లోని రాడోమ్‌లో గురువారం వైమానిక ప్రదర్శన జరిగింది. ఇందుకోసం రిహార్సల్స్ చేస్తుండగా పోలిష్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ కూలిపోయింది. పోజ్నాన్ సమీపంలోని 31వ టాక్టికల్ ఎయిర్ బేస్ నుంచి వస్తుండగా ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పోలిష్ ఆర్మీ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. పైలట్ మృతి పట్ల పోలాండ్ ఉప ప్రధాన మంత్రి వ్లాడిస్లా కోసినియాక్-కామిస్జ్ విచారం వ్యక్తం చేశారు. వైమానిక దళానికి గొప్ప నష్టంగా పేర్కొన్నారు. ఎల్లప్పుడూ తన దేశానికి అంకితభావం, గొప్ప ధైర్యంతో సేవ చేసిన అధికారి అని కొనియాడారు. కుటుంబానికి, ప్రియమైన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్ Vs తెలుగు టైటాన్స్ మధ్య తొలి పోరు
కబడ్డీ ఫ్యాన్స్ కు ఇక కావాల్సినంత వినోదం దొరికేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఇవాళ్టి ( ఆగస్టు 29) నుంచే లీగ్‌ 12వ సీజన్‌ స్టార్ట్ కాబోతుంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్‌ పోటీ పడబోతుంది. రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ తో పుణెరి పల్టాన్‌ తలపడబోతుంది. అయితే, ఏడేళ్ల విరామం తర్వాత విశాఖపట్నంలో ఈ టోర్నీ జరగబోతుంది. అయితే, ఈ సీజన్‌లో స్ట్రాంగ్ గా పోటీ ఇస్తామని తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌ విజయ్‌ మలిక్‌ పేర్కొన్నాడు. అయితే, ప్రతి ఫ్రాంఛైజీ తన జట్టును బలోపేతం చేసుకుని వస్తుంది.. ప్రతి మ్యాచూ రసవత్తరంగా కొనసాగే అవకాశం ఉందని తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌ విజయ్‌ మలిక్‌ తెలిపారు. ఏ మ్యాచ్‌ కూడా తేలిక తీసుకునే ఛాన్స్ లేదు. ప్రతి విజయం ఆయా జట్లు కష్టపడాల్సిందేనన్నారు. జాతీయ క్రీడా దినత్సోవం సందర్భంగా ఇవాళ పలువురు క్రీడాకారులను గౌరవిస్తామని లీగ్‌ ఛైర్మన్‌ అనుపమ్‌ గోస్వామి వెల్లడించారు. కబడ్డీ జట్ల కెప్టెన్లతో కలిసి ఆయన ఆర్కేబీచ్‌లోని ఐఎన్‌ఎస్‌ కురుసుర జలాంతర్గామి మ్యూజియం దగ్గర ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ పోటీలను ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభిస్తారని నిర్వాహకులు చెప్పుకొచ్చారు.

యాక్సిడెంట్ కేసులో ఆ టెలివిజన్ యాంకర్‌కు ఏడాది జైలు శిక్ష..
ప్రముఖ టెలివిజన్ యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్ పై జనగామ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదం కేసులో ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది. 2018లో లోబో కారు నడుపుతూ హైదరాబాద్‌కు వస్తుండగా జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఓ విషాద ఘటన జరిగింది. ఆయన కారు ఒక ఆటోను ఢీ కొట్టడంతో, ఆ ఆటోలో ప్రయాణిస్తున్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఢీకొన్న తర్వాత కారు కూడా బోల్తా పడటంతో, లోబోతో పాటు కారులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరిపారు. ఎన్నాళ్లుగానో సాగిన ఈ కేసులో, చివరికి కోర్టు తీర్పు వెలువరించింది. లోబో నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కోర్టు నిర్ధారించి, శిక్షను ప్రకటించింది. లోబో టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్. షోలు, సినిమాల్లో కూడా తనదైన స్టైల్‌తో కనిపిస్తుంటాడు. అయితే ఈ తీర్పు ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

జనవరి 9న రెబల్ స్టార్ vs TVK విజయ్
రాజా సాబ్ జరిగి జరిగి డిసెంబర్ నుండి కూడా వెళ్లిపోయాడు. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి డార్లింగ్‌ను చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని హింట్ ఇచ్చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్.. మిరాయ్ ట్రైలర్ ఈవెంట్లో జనవరి 9న రాజా సాబ్ థియేటర్లలోకి వచ్చేస్తున్నాడంటూ చెప్పేశారు. యూనియన్ స్ట్రైక్ వల్ల కాస్త ఎఫెక్ట్ అయితే ఇప్పటికే షూటింగ్ పెండింగ్, ఇంకొంత పోస్ట్ ప్రొడక్షన్ కూడా సినిమా వాయిదా పడేందుకు కారణమైంది. ఇదిగో ఇలా రాజా సాబ్ వాయిదా పడిందన్న ఎనౌన్స్‌మెంట్ వచ్చిందో లేదో ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినా పొంగల్ బరిలో దిగుతున్నాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే రేసులో చిరంజీవి, నవీన్ పోలిశెట్టి కర్చీఫ్ రెడీ చేశారు. కానీ రాజా సాబ్‌కు మిగిలిన సినిమాలకు కాస్త గ్యాప్ ఉంది. ఇక కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ క్లాష్ ఎదురవుతోంది. ఎందుకంటే అదే రోజు ఇళయదళపతి విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న జననాయగన్ రిలీజ్ కాబోతుంది. నెక్ట్స్ ఇయర్ జనవరి 9నే వచ్చేస్తున్నట్లు ఎప్పుడో కర్చీఫ్ వేశాడు విజయ్.  నెక్ట్స్ సంక్రాంతి దంగల్ కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా మారింది. తెలుగులో ప్రభాస్‌దే డామినేట్ అందులో నో డౌట్ కానీ తమిళంలో విజయ్ మేనియాను తట్టుకుని నిలబడాల్సి ఉంది. అందులోనూ నెక్ట్స్ తెరపై విజయ్ కనిపించడన్న యాంగ్జైటీతో ఉన్న మ్యాడ్ ఫ్యాన్స్ జన నాయగన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. బాహుబలి2తో తమిళనాడులో క్రేజ్ సంపాదించుకున్న రెబల్ స్టార్ అక్కడ మాసివ్ కలెక్షన్స్ కొల్లగొడతాడా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఎండ్ కార్డ్ వేస్తున్న సినిమా ముందు రాజా సాబ్ నిలబడగలగా విజయ్ రిస్క్ చేసి డార్లింగ్ ఆరాను తట్టుకుని బాలీవుడ్, టాలీవుడ్‌లో సినిమాను అదే రోజు దింపగలడా చూడాలి

Exit mobile version