ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకుంది.. దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు.. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు వ్యయం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇక, కేంద్రం నిర్ణయాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వం, ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. గత హయాంలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడడంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ సవాళ్ల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కీలకమైన సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. కడప జిల్లా కొప్పర్తిలో రూ. 2,137 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ హబ్ రూ. 8,860 కోట్ల పెట్టుబడులు, 54,500 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. రూ. 2,786 కోట్లతో కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ అభివృద్ధి ద్వారా రూ. 12,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 45,000 మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనాగా ఉంది.. 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం రూ. 15.4 కోట్లు కేటాయించింది. ఇంకా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం రూ. 4,500 కోట్లు మంజూరు చేసుంది. పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ గ్రామీణాభివృద్ధికి తోడ్పాటు అందించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోందన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, రాష్ట్రంలోని NDA ప్రభుత్వం పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన కోసం అంకిత భావంతో ఉంది అంటూ ట్వీట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీ సెక్రటేరియెట్‌లో కోవర్టులు..! వైసీపీకి లీక్‌లు..!
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారా? ఎప్పటికప్పుడు సమాచారాన్ని వైసీపీ లీడర్లకు చేరవేస్తున్నారా? ఇప్పుడు ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మంత్రులు.. సచివాయలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. సెక్రటేరియట్‌లోని వివిధ శాఖల్లో వైసీపీ అనుకూలురు ఉన్నారనే అంశంపై చర్చించారు.. ఆయా శాఖల్లో జరిగే పరిణామాలపై వైసీపీకి లీకులిస్తున్నారన్న పలువురు మంత్రులు ఆరోపించారు.. కీలక శాఖల్లోని ముఖ్యస్థానాల్లో వైసీపీ అనుకూలురే ఉన్నారని.. వారిని ఇప్పటి వరకు మార్చలేదంటున్నారు కొందరు మంత్రులు. శాఖల్లోని వైసీపీ అనుకూల లీకు వీరులను గుర్తించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడిందట.. సచివాలయంలోని కీలక శాఖల్లో చేపట్టాల్సిన మార్పు చేర్పులను వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ చర్యలు తీసుకోవాలని సూచించారు.. లీకుల వ్యవహరంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి తెర వెనుక వైసీపీ ఆడుతున్న డ్రామాలకు సహకరించే వారిని ఊపేక్షించవద్దని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
వైసీపీకి వరుస షాక్‌లు.. రాజీనామా లేఖలు రెడీ..! ఇద్దరు రాజ్యసభ సభ్యుల గుడ్‌బై..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులు.. తమ పదవులతో పాటు.. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.. తమ రాజీనామా లేఖలను సమర్పించేందుకు రాజ్యసభ చైర్మన్ అపాయింట్‌మెంట్ కోరారట ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు.. అయితే, మధ్యాహ్నం 12.30 గంటలకు ఆ ఇద్దరు ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు రాజ్యసభ ఛైర్మెన్.. దీంతో.. మధ్యాహ్నం రాజ్యసభ చైర్మన్ ను కలిసి తమ రాజీనామా లేఖలను ఎంపీలు మోపిదేవ, బీద మస్తాన్ రావు సమర్పిస్తారని తెలుస్తోంది.. ఇక, ఈ ఎంపీలతో పాటు.. మరికొందరు నేతలు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్టుగా ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తుండగా.. తాజాగా, పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేసిన విషయం విదితమే.. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను పంపించారట.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.. మరోవైపు.. రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు ఈ రోజు రాజీనా చేయనున్నారు.. ఢిల్లీలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం.. రేపల్లె ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశం పెట్టి.. భవిష్యత్ కార్యాచరణను మోపిదేవి ప్రకటిస్తారని సమాచారం..
నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న భారీ వరద..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. సాగర్ ప్రాజెక్ట్ 20 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 1,62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఎగువన శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 20 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో : 2,10,408 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 2,10,408 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం : 590.00 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.. ఇక ప్రస్తుత నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450 టీఎంసీలుగా కొనసాగుతుంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,394 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 9160 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8280 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1800 క్యూసెక్కులు, లోలెవల్ కెనాల్ ద్వారా 600 క్యూసెక్కులు, మొత్తం 2,10,408 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దిగువకు విడుదల చేయబడింది. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా జూరాలకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. 42 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో : 2,50,305 వేల క్యూ సెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 2,59,749 వేల, క్యూ సెక్కులు.. ఇక పూర్తిస్థాయి నీటిమట్టం :1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం :1042.093 ఫీట్లుగా కొనసాగుతుంది. పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు.. ప్రస్తుత నీటి నిల్వ: 7.894 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల నుంచి 9 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదలకు చర్యలు చేపట్టారు అధికారులు.
సెప్టెంబర్‌లో స్కూళ్లకు సెలవులు!.. ఎన్ని రోజులంటే..
సెప్టెంబర్ నెల మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే ఈ ఐదు రోజులు రెండు రాష్ట్రాలలో కలిపి సెలవులు వుండనున్నాయి. సెప్టెంబరు 7, 16 తేదీలను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఆ రెండు రోజులు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ వచ్చింది. ఈ 7వ తేదీ..శనివారం వస్తుంది. ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు ఉంటాయి. చాలా రాష్ట్రాలు ఈ వినాయక చవితిని అత్యంత వైభవంగా జరుపుకుంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇక.. సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం మరో ప్రభుత్వ సెలవు ప్రకటించింది. మిలాద్-ఉన్-నబీ సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. ఈ పండుగ సోమవారం వస్తుంది. అంతకు ముందు రోజు సెప్టెంబర్ 15 ఆదివారం.. అది ఎలాగో హాలిడేనే. అదే విధంగా సెప్టెంబర్ 14వ తేదీ రెండో శనివారం వచ్చింది. ఇలా సెప్టెంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యా సంస్థలు సెప్టెంబర్ 16న మూసి ఉండనున్నాయి. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వివిధ పండుగలు, ఇతర కార్యక్రమాల కారణంగా ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. విద్యార్థులకు ఐదు రోజులు సెలవులు వచ్చాయి. తాజాగా సెలవుల జాబితా తెలియడంతో కొందరు విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు.
బీజేపీ నుంచి న్యాయం ఆశించడం నేరం… ఫరూఖాబాద్ ఘటనపై రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో జరిగిన దారుణ ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం కూడా నేరమేనన్నారు. బలహీనులు, అణగారిన వ్యక్తులపై జరిగిన అత్యంత తీవ్రమైన ఘటనల్లో కూడా నేరాలను దాచిపెట్టడమే కాకుండా న్యాయం చేయడమే ప్రధానం అనే వారి నుంచి ఎవరైనా ఏం ఆశించాలని రాహుల్ ఆరోపించారు. ఫరూఖాబాద్ ఘటన అత్యంత దురదృష్టకరమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. బాధిత కుటుంబం పట్ల పరిపాలన వైఖరి ఆమోదయోగ్యం కాదు. వీటన్నింటిని ఎంతకాలం సహిస్తాం అని ఆయన ప్రశ్నించారు. భద్రత ప్రతి కూతురి హక్కు అని, ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ఇలా రాశారు, “బీజేపీ ప్రభుత్వంలో న్యాయం జరగాలని ఆశించడం కూడా నేరమే! బలహీనులు, అణగారిన వ్యక్తులపై జరుగుతున్న దాడులు హేయకరం. అత్యంత తీవ్రమైన సంఘటనలలో కూడా నేరాలను దాచిపెట్టడమే కాకుండా.. న్యాయం చేయకపోవడం ఘోరం. ఫరూఖాబాద్‌లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధిత కుటుంబం పట్ల పరిపాలన ఇటువంటి వైఖరిని ఎంతమాత్రం సహించలేమంటూ రాహుల్ రాసుకొచ్చారు.
మిషన్ 2047పై దృష్టి, 10 ఏళ్ల పనిపై చర్చ, మంత్రులతో మోదీ 5గంటల పాటు మేధోమథనం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో మహిళా సమస్యలు, విధానాల అమలుపై చర్చించారు. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో జరిగిన ఐదు గంటలపాటు జరిగిన సమావేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల ఎజెండాలో సాధించిన అభివృద్ధిని కూడా పరిశీలించారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు నిరసనలకు దారితీసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు కూడా హాజరైన ఈ సమావేశంలో మహిళలు, పేదలు, యువకులు, రైతుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించారు. జూన్‌లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సహా కొత్త పథకాలు, విధాన నిర్ణయాలపై అవగాహన కల్పించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం. మంత్రి మండలి సమావేశంలో మిషన్ 2047పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సమావేశంలో దేశం అభివృద్ధి చెందాలని, శరవేగంగా ముందుకు వెళ్లాలని ప్రధాన మంత్రి తీర్మానం చేశారు. దీనితో పాటు రాబోయే 100 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన సంక్షేమ పథకాలను సాధారణ ప్రజలకు ప్రచారం చేసి ప్రచారం చేయాలని, దానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను కూడా సిద్ధం చేయాలని కోరారు. ఇప్పటికీ నెమ్మదిగా పని చేస్తున్న ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు ప్రధాని మోదీ 6 నెలల పనిని అప్పగించారు. సమావేశంలో అభివృద్ధి పథకాలపై సమగ్ర చర్చ జరిగింది. అభివృద్ధి చెందిన భారత్ 2047 లక్ష్యాలను సాధించడంపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో ఇన్‌ఫ్రా, సోషల్, డిజిటల్, టెక్నికల్ సబ్జెక్టులకు సంబంధించిన మంత్రిత్వ శాఖలపై కేంద్రీకృత చర్చ జరిగింది. ప్రధాని మోదీ తన మంత్రులకు ముందస్తు రోడ్ మ్యాప్‌పై మార్గనిర్దేశం చేశారు.
సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ.. వావ్ అనిపించిన నాని, ఎస్ జే సూర్య
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా క్లాస్, మాస్ చిత్రాలతో అలరిస్తున్నాడు నేచరల్ స్టార్ నాని. తాజాగా ‘సరిపోదా శనివారం’ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ అయింది. అంతేకాదు ఈ సినిమా నాని కెరీర్‌లో మరో డిఫరెంట్ మూవీగా నిలవడం ఖాయమని అంటున్నారు. ఈ చిత్రంలో తమిళ సార్ట్ యాక్టర్ సూర్య విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో నాని.. సూర్య అనే పాత్ర పోషించారు. తన కోపాన్ని అణచుకునే పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడని తెలుస్తోంది. వారంలో శనివారమే తన కోపాన్ని బయటపెడతాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఆసక్తికర అంశం. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్ అనే చెప్పాలి. కల్కి తర్వాత మంచి మాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులను నాని ‘సరిపోదా శనివారం’ అలరించడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు నాని ఢీకొట్టే విలన్ పాత్రలో ఎస్.జే.సూర్య తన పాత్రలో జీవించేశాడని చెబుతున్నారు. ఈ మూవీ నాని కెరీర్ ల్లోనే మరో డిఫరెంట్ మూవీగా నిలవడం ఖాయం అంటున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోస్ పడగా.. ట్విట్టర్ వేదికగా సరిపోదా శనివారం గురించి ఎవరికి తోచిన విధంగా వారు రివ్యూలు ఇస్తున్నారు. అంతేకాకుండా న్యాచురల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందంటూ నెట్టింట్లో చర్చ నడుస్తోంది.
