సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులుకు షాక్.. మరో కేసు నమోదు
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు మళ్లీ షాక్.. పీఎస్సార్‌పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పటికే ముంబై నటి కాదాంబరి జిత్వానీ కేసులో ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయిన విషయం విదితమే కాగా.. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.. అయితే, తాజాగా పీఎస్సార్‌పై మరో కేసు నమోదైంది.. ఏపీపీఎస్సీ గ్రూప్1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు.. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పీఎస్సార్ ఆంజనేయులు పనిచేసిన సమయంలో.. ఈ అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగిదంటూ ఫిర్యాదులు వచ్చాయి.. దీంతో.. పీఎస్సార్ పై 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఇప్పటికే పీఎస్సార్ పై సినీనటి జిత్వానీ వేధింపుల కేసు, రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు నమోదు అయిన విషయం విదితమే కాగా.. తాజాగా మూడో కేసు ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదు చేశారు పోలీసులు.. ఇలా వరుసగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
అమరావతి రాజధానికి చట్టబద్ధత..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడతారన్నారు అని వెల్లడించారు మంత్రి నారాయణ.. చట్టబద్ధత విషయంలో రైతుల్లో ఉన్న ఆందోళన నిన్న సీఎం దృష్టికి రైతులు తీసుకు వచ్చారన్నారు నారాయణ.. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన.. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లును పరిశీలించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాజధాని అమరావతి కాదని చెప్పింది.. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైందన్నారు.. ఇదే విషయాన్ని రైతులు సీఎం చంద్రబాబు దృష్టికి నిన్న తీసుకువచ్చారు.. న్యాయ పరమైన అంశాలు చర్చించి కేంద్రంతో మాట్లాడతా అని సీఎం చంద్రబాబు.. రైతులకు చెప్పారని వెల్లడించారు..
పాకిస్తానీయులు భారత్ వీడేందుకు నేడే చివరి రోజు..
కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోపు దాయాది దేశ పౌరులు భారత్ విడిచి వెళ్లాలని తెలిపింది. పాకిస్తాన్ దేశస్థులు భారత్ ను వీడేందుకు ఈ రోజు (ఏప్రిల్ 29) చివరి రోజు.. మెడికల్ వీసాలపై వచ్చిన వారికి కూడా ఇవాళ డెడ్ లైన్.. దేశం విడిచి వెళ్ళిపోవాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాక్ పౌరులు తమ దేశానికి వెళ్లిపోతున్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్‌లో నమోదైన పాకిస్తాన్ పౌరుల వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే డీజీపీ జితేందర్ కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉంటున్న పాకిస్తానీలను పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో ఉన్న పాక్ పౌరులు తమ దేశానికి వెళ్లిపోవాలి.. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇప్పటికే నలుగురు పాకిస్తానీలు హైదరాబాద్ వదిలి పెట్టి వెళ్లిపోగా.. వారిలో ఒక పురుషుడు, ఒక మహిళ ఆమె కూతురు, మరో మహిళ ఉన్నారు.
ఆధిక్యంలో దూసుకెళ్తున్న మార్క్ కార్నీ పార్టీ
అమెరికా వాణిజ్య యుద్ధం, కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా విలీనం చేస్తామంటూ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో కెనడియన్లు అప్రమత్తం అయ్యారు. తదుపరి ప్రధానమంత్రి కోసం కెనడియన్లు సోమవారం ఓటేశారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో దూసుకెళ్తోంది. పలుచోట్ల లిబరల్స్, కన్జర్వేటివ్‌ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. నువ్వానేనా? అన్నట్టుగా పోటీపడుతున్నాయి. ప్రస్తుతం లిబరల్ పార్టీ 59 స్థానాల్లో విజయం సాధించింది. మరో 101 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కెనడా పార్లమెంట్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకకు 172 మంది సభ్యులు అవసరం. కెనడాలో 4 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. లిబరల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, న్యూ డెమోక్రాట్స్), బ్లాక్ క్యూబెకోయిస్ ఉన్నాయి. ప్రస్తుతం లిబరల్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి 152 స్థానాలున్నాయి. ప్రతిపక్షంలో కన్జర్వేటివ్ పార్టీ ఉంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో లిబరల్ పార్టీ 189 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కన్జర్వేటివ్ పార్టీ సైతం గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించే ఛాన్సుంది.
కింగ్‌డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కింగ్‌డమ్. ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు దేవరకొండ. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు విజయ్. షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కు, రీసెంట్‌గా రిలీజైన టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈసారి తనలోని మాస్ యాంగిల్‌ను చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ వాయిస్‌తో రిలీజ్ అయిన కింగ్‌డమ్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందుకుతగ్గట్టే ఈ సినిమా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ కింగ్‌డమ్ పై హైప్ పెంచుతూ వెళ్తున్నాడు. ఇక ఈ సినిమాను అనిరుధ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంటుందని టీజర్ బీజిఎంతోనే చెప్పేశాడు. అయితే ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడట అనిరుధ్. కానీ సినిమా మొత్తంలో మూడే పాటలు ఉంటాయట. ఈ మూడు కూడా ఓ రేంజ్‌లో ఉంటాయని అందులో ఒకటి లవ్ సాంగ్ అని తెలుస్తోంది. కింగ్ డమ్ ఫస్ట్ సాంగ్ ప్రోమోను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఇక ఈ సినిమాలో పాటలే కాదు అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పీక్స్‌లో ఉంటుందని సమాచారం. మరి ఈసారి అనిరుధ్ తన మ్యూజిక్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ లో ఉన్న కింగ్‌డమ్ మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
నితిన్ తో నటించేందుకు నో చెప్పేస్తున్న హీరోయిన్స్
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇక తన రెండవ సినిమాను యంగ్ హీరో నితిన్ తో చేస్తున్నాడు వేణు. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ను ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. కాగా ఈ సినిమాకు అనికొని అవరోధాలు ఏర్పడుతునే ఉన్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు. గతంలో సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె డేట్స్ ఇష్యూ కారణంగా ఈ చిత్రానికి నో చెప్పింది. ఇక రీసెంట్‌గా ఈ మూవీలో కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం మేరకు కీర్తి కూడా నితిన్ తో చేసేందుకు నో చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. కీర్తి కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకుందనే కారణం వినిపిస్తోంది. వరుస ప్లాప్ లు కొడుతున్న నితిన్ సరసన హీరోయిన్ గా చేయడం ఇష్టం లేక డేట్స్ కారణంగా చెప్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పయికే నితీన్ తో శ్రీలీల చేసిన రెండు సినిమాలు ప్లాప్ కావడంతోప్లాప్ జోడి అనే ముద్ర పడింది. అందుకు ఇప్పుడు హీరోయిన్స్ ఈ యంగ్ హీరోతో చేసేందుకు ముందు వెనక ఆలోచిస్తున్నారు. మరి ఫైనల్ గా నితిన్ కు ఎవరు దొరుకుతారో చూడాలి.
