NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

లడ్డూ ప్రసాదం కల్తీపై విచారణ.. నేడు తిరుపతికి సిట్‌ బృందం..
తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరుపనుంది. దీంతో.. ఎవరిని ప్రశ్నిస్తారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు.. పక్క రాష్ట్రాలనుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వం

స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్.. 4 వేల మంది కార్మికులు ఔట్..!
వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ విషయంలో గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది.. ఓవైపు సెయిల్‌లో స్టీల్‌ ప్లాంట్‌ విలీనం అంటూ లీకులు వచ్చిన కొద్ది సేపటికే.. పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది యాజమాన్యం.. ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూనే ఉద్యోగులపై వేటు వేసింది.. తాజా నిర్ణయంతో స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేసే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఔట్ కానున్నారు.. స్టీల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోంది.. బయో మెట్రిక్ నుంచి కార్మికుల ఐడీలు తొలగించారు.. బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటే నడుస్తున్నందున కాంట్రాక్టు కార్మికులలో కోత పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. వీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే 2500 మందికి ఆఫర్‌ ఇచ్చారు.. దీని కోసం 14 వేల కోట్లు కేటాయించిన RINL. ఇక, 500 మందిని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ కు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. అయితే, ఇదంతా ఉత్పత్తి వ్యయం తగ్గించుకునే ప్రయత్నంగా చెబుతోంది ఆర్ఐఎన్ఎల్.. కానీ, మరోసారి ఆందోళన బాటపట్టాయి కార్మిక సంఘాలు.. నేడు ట్రైనింగ్ సెంటర్ దగ్గర భారీ ధర్నాకు పిలుపునిచ్చారు..

నేడు గాజువాకలో 75 అడుగుల బెల్లం వినాయకుడి నిమజ్జనం
తొమ్మిరోజుల పాటు.. 11 రోజుల పాటు.. 15 రోజుల పాటు.. ఇలా పూజలు అందుకున్న వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు భక్తులు.. అయితే, ఈ సారి గాజువాకలో ఏర్పాటు చేసిన 75 అడుగుల బెల్లం వినాయకుడిని ఈ రోజు నిమజ్జనం చేయనున్నారు.. 21 రోజుల పాటు పూజలు అందుకున్న లంభోదరుడుని.. నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. గ్రేటర్‌ విశాఖ పరిధిలోని గాజువాక డిపో వద్ద.. ఈ అత్యంత భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే.. లంబోదర ట్రస్టు ఆధ్వర్యంలో బెల్లం ముద్దులతో 75 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. ఈ విగ్రహం ఏర్పాటు కోసం ఏకంగా 18 టన్నుల బెల్లం కుందులను వినిగించినట్టు లంబోదర ట్రస్ట్‌ ఛైర్మన్‌ మొల్లి గోవర్థన్‌ ప్రకటించిన విషయం విదితమే.. నిమజ్జనం రోజు బెల్లం భక్తులకు పంచిపెడతామన్నా కమిటీ నిర్వాహకులు ముందుగానే ప్రకటించిన నేపథ్యంఓల.. బెల్లం వితరణపై పోలీసుల ఆంక్షలు విధించారు.. బెల్లం భక్తులు తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని బెల్లం కరిగించమని ఆదేశాలు జారీ చేశారు..

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, నల్సార్ ఛాన్సలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహులు హాజరుకానున్నారు. కాగా.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క రాష్ట్రపతికి స్వాగతం పలికినప్పటి నుంచి నగరం నుంచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే సీతక్క ఉంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేస్తామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్‌, పీఎన్‌టీ జంక్షన్‌, రసూల్‌పురా, సీటీఓ ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీసు, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, అటవీ, విద్యుత్ తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్షించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు, ఏర్పాట్లను పర్యవేక్షించాలని పోలీసులను ఆదేశించారు.

నేడు హర్యానా, జమ్మూలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానా రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ఇరు రాష్ట్రాల ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. కాగా, మోడీ షెడ్యూల్ ను బీజేపీ తన అధికారికి ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో తెలిపింది. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు జమ్మూ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జమ్మూలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.. ఆ తర్వాత ఇక్కడి నుంచి ప్రధాని మోడీ హర్యానాకు చేరుకుంటారు. హిసార్‌లో నిర్వహించే బీజేపీ భారీ బహిరంగ సభలో మధ్యాహ్నం 3 గంటలకు పాల్గొని ప్రసంగిస్తారు. అయితే, ప్రధాని ఎన్నికల పర్యటనతో రెండు రాష్ట్రాల బీజేపీ నాయకత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది. నరేంద్ర మోడీ బహిరంగ సభలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర భద్రతా బలగాలతో పాటు రాష్ట్రాలు కూడా కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశాయి.

రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని వ్యతిరేకించిన వక్ఫ్.. కోర్టుకు ముస్లిం సంఘం క్షమాపణలు!
షాహీ ఈద్గా సమీపంలోని పార్క్‌లో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వక్ఫ్ బోర్డు వ్యతిరేకించినందుకు ఢిల్లీ షాహీ ఈద్గా మేనేజింగ్ కమిటీపై హైకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీంతో శుక్రవారం కోర్టుకు ముస్లిం సంఘం క్షమాపణలు చెప్పడంతో పాటు గతంలో న్యాయమూర్తులు, ప్రార్థన మందిరాలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు తెలియజేసింది. ఈ సందర్భంగా షాహీ ఈద్గా కమిటీ తన పిటిషన్ల ద్వారా మత రాజకీయాలు చేస్తోందని న్యాయస్థానం పేర్కొంది. ఇక, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణను పత్రాలను తీసుకురావాలని.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అలాగే, రాణి లక్ష్మీబాయి విగ్రహ ప్రతిష్ఠాపనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ప్రార్థన మందిరానికి సమీపంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని ముస్లిం సంఘాలు చేసిన వాదనలను తోసిపుచ్చింది. మతపరమైన హక్కులను ఏ విధంగా ప్రమాదంలో పెడుతుందో చూపించాలని కోరింది. మత ప్రాతిపదికన చరిత్రను విభజించరాదని న్యాయస్థానం పేర్కొంది. ఝాన్సీ కీ రాణి (లక్ష్మీబాయి) జాతీయ వీర వనిత.. అన్ని మతాలకు ఆదర్శంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

జపాన్ ప్రధానిగా మాజీ రక్షణమంత్రి ఇషిబా
జపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిద వారసుడిగా మాజీ రక్షణశాఖ మంత్రి షిగెరు ఇషిబా ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచారు. దీంతో అక్టోబరు 1వ తేదీన ఇషిబా దేశ 102వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎల్‌డీపీ అధ్యక్షుడిగా 2021లో కిషిద ఎన్నికయ్యారు. ఆయన మూడేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబరుతో ముగియనుంది. దీంతో పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించింది. అవినీతి ఆరోపణల దృష్ట్యా కిషిద ఈ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. ఈ క్రమంలోనే పార్టీ అధినాయకత్వ పదవికి 9 మంది పోటీపడగా.. వీరిలో ఇద్దరు మహిళలు సైతం ఉన్నారు. కాగా, ఎల్‌డీపీ పార్లమెంట్‌ సభ్యులతో పాటు దాదాపు 10 లక్షల మంది పార్టీ సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత కౌంటింగ్‌ చేపట్టి షిగెరు ఇషిబా విజయం సాధించినట్లు వెల్లడించారు. అయితే, 67 ఏళ్ల ఇషిబా కెరీర్‌ ఆరంభంలో బ్యాంకింగ్‌ సెక్టార్ లో పని చేశారు. తన 29 ఏళ్ల వయసులో 1986లో తొలిసారిగా పార్లమెంట్‌కు ఎంపికయ్యాడు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ తరచూ ఇషిబా వార్తల్లో నిలిచేవారు. ఈ క్రమంలో కిషిద సర్కార్ లో ఆయనను పక్కనబెట్టింది. గత ఎల్‌డీపీ ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా కూడా ఇషిబా పని చేశారు.

మెగాస్టార్‭ను వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు..
టాలీవుడ్ సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి., చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తన 46 ఏళ్ల సినీ జీవితంలో 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను అలరించి ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ అవార్డు అందుకున్న తొలి నటుడిగా మెగాస్టార్ గుర్తింపు పొందారు. ఇదిలా ఉంటే.. తాజాగా చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లోని అబుదాబిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొన్నారు. అవార్డు గెలుచుకున్నందుకు చిరంజీవిని వారు అభినందించారు కూడా. ఈ సందర్భంగా బాలకృష్ణ, చిరంజీవి ఒకరినొకరు కౌగిలించుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

యూఎస్ లో రికార్డు వసూళ్లు కొల్లగొట్టేస్తున్న దేవర
తెలుగు సినిమా చరిత్రలో కొందరు హీరోలు మాత్రమే చరిత్రను తిరగరాసే వాళ్లు ఉంటారు. ముఖ్యంగా అతి కొద్ది మంది స్టార్ హీరోలే వరుస హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉంటారు. వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఆయన రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఇప్పుడు ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు జనం నీరాజనం పలికారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి వరల్డ్ వైడ్ గా ఉన్న మాస్ ఫాలోయింగ్ తో కలెక్షన్ల దుమ్ము దులిపేశారు. తన ఫాలోయింగ్ కి తగ్గట్టు ఓ సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో తన లేటెస్ట్ భారీ చిత్రం “దేవర”తో బాక్సాఫీస్ కు చూపించాడు. దర్శకుడు కొరటాల శివతో చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ మొదటి రోజు రికార్డ్ వసూళ్లను కొల్లగొట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ తన స్టామినా ఏంటో చూపించేశాడు. ఇలా లేటెస్ట్ గా దేవర సినిమా అమెరికా మార్కెట్ సంచలన వసూళ్లను సాధించింది. ఒక్క నార్త్ అమెరికా లోనే దేవర ఏకంగా 3.5 మిలియన్ డాలర్లు గ్రాస్ ని అందుకుని మరే భారతీయ సినిమా అందుకోని రికార్డును నెలకొల్పింది. పూర్తిగా ఒక రోజు కాకుండానే దేవర ఈ రేంజ్ విలయ తాండవం చేస్తున్నాడంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి భారీ వసూళ్లు అందుకుంటున్న దేవర యూఎస్ మార్కెట్ లో ఇంకెలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.

Show comments