‘సేనతో సేనాని’కి సిద్ధమైన విశాఖ..
మూడు రోజుల జనసేన పండుగకు విశాఖ నగరం సిద్ధమైంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత పార్టీలో పరిస్థితులను సమీక్షించుకునేందుకు జరుగుతున్న సమావేశాలు కావడంతో శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. ఇవాళ, రేపు పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరుగుతుంది. బీచ్ రోడ్డులోని YMCA ప్రాంగణంలో జనసేన లెజిస్ట్లేటివ్ విభాగం భేటీ అవుతుంది. ఆపార్టీకి చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొంటారు. మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గంతో పవన్ కల్యాణ్ సమావేశమవుతారు. 29న 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పది మంది చొప్పున ప్రతినిధులతో పార్టీ అధినేత ప్రత్యేకంగా ముఖాముఖీ నిర్వహిస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తూ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఈనెల 30న జరిగే ‘ సేనతో సేనాని ‘ బహిరంగ సభపై జనసేనతో సహా రాజకీయపక్షాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి 15వేల మంది ప్రత్యేక ఆహ్వానితులతో ఈ మీటింగ్ జరగునుండగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. వర్షాలు కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జర్మన్ హ్యాంగర్స్ నిర్మిస్తున్నారు.
తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఐదు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెగని రీతిలో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచింది. విజయవాడలో ఉదయం నుంచి కంటిన్యూస్‌గా వర్షం కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బెంజ్ సర్కిల్, నిర్మలా సెంటర్, ఆటోనగర్ 100 అడుగుల సెంటర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రోడ్లు కాలువల్లా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్‌కు చేరుతుండడంతో … పరివాహక ప్రాంత ప్రజల్ని హెచ్చరిస్తున్నారు అధికారులు.. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక, వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.. ఒడిశా తీరాన్ని అనుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేస్తోంది.. అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్ ఘడ్ మీదుగా విస్తరించింది రుతుపవన ద్రోణి… దీని ప్రభావంతో.. రాగాల ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ.. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.. మత్స్యకారులకు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.. పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి..
రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధం.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ
ఏ ఆదెరువు లేనివారు పొట్టకూటికోసం యాచిస్తుంటారు. వచ్చిన డబ్బులతో పూటగడుపుతుంటారు. కాగా దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భిక్షాటన చేస్తున్న వారికి సహాయం చేస్తూ ఉపాధి కల్పిస్తున్నాయి. ఇప్పుడు మిజోరాంలో భిక్షాటనను పూర్తిగా నిషేధించారు. మిజోరాం అసెంబ్లీ ‘మిజోరాం యాచక నిషేధ బిల్లు, 2025’ను ఆమోదించింది. ఈ చట్టం ఉద్దేశ్యం యాచకులను నిషేధించడమే కాకుండా, వారికి సహాయం, ఉపాధి కల్పించడం. మిజోరాంలో ప్రస్తుతం యాచకులు చాలా తక్కువగా ఉన్నారని సాంఘిక సంక్షేమ మంత్రి లాల్రిన్‌పుయ్ అన్నారు . దీనికి కారణం ఇక్కడి బలమైన సామాజిక నిర్మాణం, చర్చి, స్వచ్ఛంద సంస్థల సహాయం, ప్రభుత్వ ప్రణాళికలు. కానీ త్వరలో సైరంగ్-సిహ్ము రైల్వే లైన్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని ప్రారంభిస్తారు. దీని తర్వాత, బయటి నుంచి వచ్చే యాచకుల ప్రమాదం పెరగవచ్చు.
రాబోయే నాలుగు గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల వారు జాగ్రత్త!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రం వణికిపోతోంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. అల్పపీడనం కొనసాగుతున్నందున కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ లో పరిస్థితి మళ్ళీ చాలా దారుణంగా ఉండబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రాబోయే 4 గంటల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురుస్తాయని తెలిపింది. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్‌లలో కూడా రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కామారెడ్డి గత 36 గంటల్లో 500-600 మిమీ రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక.. భద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురంభీం, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు, వరదలు.. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భద్రతా సిబ్బంది.. అధికారులు సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటుకు యత్నించారు. దీంతో భారత సైన్యం అప్రమత్తమై చొరబాటును భగ్నం చేసింది. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసిందని అధికారులు తెలిపారు. నౌషెహ్రా నార్ సమీపంలో ఈ ఆపరేషన్ జరిగినట్లుగా చెప్పింది. ఎన్‌కౌంటర్ తర్వాత చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా ఎవరైనా చొరబాటుదారులు ఉన్నారేమోనన్న కారణంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఉక్రెయిన్పై యుద్ధాన్ని మోడీ నడిపిస్తున్నాడు.. ఆపేస్తే టారీఫ్స్ తగ్గిస్తాం!
భారత్ పై అమెరికా వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నవరో మరోసారి నోరు పరేసుకున్నాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎవరి నుంచైనా ఆయిల్ కొంటామని ఇండియన్స్ అహంకారంతో మాట్లాడటం నాకు నచ్చడం లేదు.. భారత్ వల్ల అమెరికన్స్ అందరూ నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానేస్తే వెంటనే 25 శాతం టారీఫ్స్ తగ్గిస్తామని అమెరికా వైట్‌హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యనించాడు. అయితే, రష్యా చమురు విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో ఉక్రెయిన్‌పై దాడులు మరింత ఎక్కువగా కొనసాగిస్తుందని అమెరికా వైట్‌హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవార్ పేర్కొన్నారు. దీని వల్ల కీవ్ తరచూ అమెరికా వద్ద నుంచి ఆయుధాలు, ఆర్థిక సాయం కోరుతోంది.. భారత్ చేసే ఈ చర్యల వల్ల అమెరికా వినియోగదారులు, వ్యాపారాలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ఉద్యోగాలు, కర్మాగారాలు, వేతనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు.. భారత్ ఒక పరిపక్వ ప్రజాస్వామ్యం.. కానీ, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి మోడీ యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. శాంతి మార్గం అని న్యూఢిల్లీ చెబుతుంది.. కానీ, వాళ్లు చేసే వ్యాపారం మాత్రం యుద్ధాన్ని పెంచేలా ఉందన్నారు. అందుకే నేను దీన్ని ‘మోడీ యుద్ధం’ అని పిలుస్తున్నాను అని నవర్రో అన్నారు.
సోనీ స్పోర్ట్స్ స్పెషల్ వీడియోపై టీమిండియా అభిమానుల ఆగ్రహం..
భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూనే ఆసియా కప్ 2025 మొత్తం తిరుగుతోంది. మరో 2 వారాల్లో ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుండగా మరోసారి వివాదం చెలరేగింది. యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీకి ముందు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ తాజాగా ఓ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన దుబాయ్‌లో జరిగే భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ను చూపిస్తూ రూపొందించిన ఈ క్లిప్ ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ వీడియోలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కనిపించడంతో అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐను కూడా ఫ్యాన్స్ నేరుగా దూషిస్తూ, ఈ టోర్నమెంట్ ఒక్క మ్యాచ్ కూడా చూడమని సోషల్ మీడియాలో బాయ్‌కాట్ పోస్టులు పెడుతున్నారు. అయితే, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టోర్నమెంట్ జరుగుతుందా? లేదా? అనే డౌట్స్ ఉండేది.. బీసీసీఐ వెనక్కి తగ్గితే టోర్నమెంట్ రద్దయే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, నెలల తరబడి కొనసాగిన ఉత్కంఠ తర్వాత పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా అయిన ఏసీసీ అధినేత మోహ్సిన్ నఖ్వీ అన్ని మ్యాచ్‌ల తేదీలు, వేదికలను ప్రకటించారు. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌లు ఈ టోర్నీలో 3 సార్లు పోటీ పడే ఛాన్స్ ఉందన్న వార్తలు టీమిండియా అభిమానులకు మరింత కోపాన్ని తెప్పించినట్లైంది.
‘పెద్ది’.. రామ్ చరణ్ ఇంట్రో కోసం భారీ ప్లాన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ను చక చక చేసేస్తున్నారు. కొంత కాలంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ ఫినిష్ చేసారు. అలాగే ఈ చిత్రంలోని రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోందట. ఆ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు బుచ్చి. రామ్ – లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ భారీ ఫైట్ విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుందని సమాచారం. పెద్ది విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మైసూరులో చేస్తున్నారు. భారీ సెట్స్ మధ్య చేస్తున్న ఈ షెడ్యూల్ లో చరణ్ ఇంట్రో సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ సెట్‌లో 1000+ మందికి పైగా నృత్యకారులు మరియు జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో, ఈ పాట అద్భుతమైన విజువల్స్ తో సినిమాలో కీలకమైన హైలైట్‌లలో ఒకటిగా ఉండబోతోందట.
