NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌..
సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అయితే, ఏపీ సర్కార్‌ మరోసారి పేపర్‌ లెస్‌ విధానాన్ని అవలంభిస్తోంది.. ఈ-కేబినెట్ భేటీని నిర్వహించనుంది. 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ-కేబినెట్ నిర్వహించింది. తిరిగి మళ్లీ ఇవాళ్టి నుంచి ఈ-కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. అజెండా మొదలుకుని కేబినెట్ నోట్స్ వరకు అంతా ఆన్ లైన్ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేయనుంది. ఈ-కేబినెట్ నిర్వహణపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ఈ-కేబినెట్ వల్ల ఉపయోగాలను జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ వివరించారు. కేబినెట్‌ ప్రారంభం కాగానే ఈ-కేబినెట్ విధానం అమలుపై మంత్రులకు డెమో ఇవ్వనున్నారు ఎన్ఐసీ అధికారులు. ఇక, ఈ కేబినెట్‌ సమావేశంలో కీలకాంశాలపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది.. సెబ్ రద్దుపై మంత్రివర్గంలో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా.. ఎక్సైజ్ కొత్త పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీలపై కేబినెట్‌లో చర్చించనున్నారు మంత్రులు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణపై కేబినెట్‌లో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.. రేషన్ బియ్యం సరఫరా చేసే ఎండీయూ వాహానాలను రద్దు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది… ఏపీ విజన్ డాక్యుమెంట్-2047పై మంత్రివర్గంలో చర్చ సాగనుండగా.. ఇసుక విధానం అమలు తీరుపై కేబినెట్‌ సమీక్షించనుంది.. గత ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై విచారణలపై మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. కాసేపట్లో గేట్లు ఎత్తనున్న అధికారులు..
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది.. దీంతో.. మరోసారి గేట్లు తెరిచేందుకు సిద్ధం అవుతున్నారు ఇరిగేషన్‌ శాఖ అధికారులు.. కాసేపట్లో రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయబోతున్నారు.. అయితే, ఇన్ ఫ్లో రూపంలో 2,13,624 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌లో వచ్చి చేరుతుంది.. అయితే, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండడంతో.. ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో రూపంలో 68,876 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది.. ఇక, శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 215.8070 టీఎంసీలుగా ఉంది.. మరోవైపు.. శ్రీశైలం డ్యామ్‌ దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది.. 2 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 30,026 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 78,854 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 78,854 క్యూసెక్కులుగా ఉంది.. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 312.0450 టీఎంసీలుగా ఉండగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 .0450 టీఎంసీలు.. అయితే, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులోని 2 గేట్లను ఎత్తి నిన్నటి నుంచే దిగువకు నీటిని వదులుతున్నారు అధికారు.. శ్రీశైలంలో కాసేపట్లో మళ్లీ గేట్స్ ఓపెన్ చేయబోతున్న నేపథ్యంలో.. ఇన్‌ఫ్లో పెరిగితే.. నాగార్జున సాగర్‌ లో మరికొన్ని గేట్లు ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు.

శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు.. జనం పరుగులు..
శ్రీకాకుళం జిల్లా భూ ప్రకంపనలు.. ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.. జిల్లాలోని ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది.. తెల్లవారుజామున 3:40 గంటల ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటు చేసుకోగా.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రజలు.. భయాందోళనకు లోనయ్యారు.. మరోసారి ఉదయం 4:03 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి.. దీంతో.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు.. అయితే, శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకున్న తరుణంలో.. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు తెలియరాలేదు.. దీంతో ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు. మరోవైపు.. భూప్రకంపనలపై ఆరా తీస్తున్నారు అధికారులు. రెండేళ్ల క్రితం తరచూ భూప్రకంపనలు సంభవించాయి.. ఏ ప్రమాదం లేఖ పోవడంతో ఊపిరి పిల్చుకున్నారు ఉద్దానం ప్రజలు.

నేడు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ..
డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:00 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అనంతరం మధ్నాహ్నం 12.30 కు రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ పై సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్లో సీఎం చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరుగనుంది. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందుభాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలసిందే.. ఈ క్రమంలో.. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరుగనుంది.

నేడు హైదరాబాద్‌ రానున్న కవిత.. ఎన్ని గంటలకు అంటే..
ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రానున్నారు. కాగా.. ప్రస్తుతం ఢిల్లీ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో కవిత ఉన్నారు. ఇవాళ రౌస్ ఏవిన్యూ కోర్టులో సీబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ ఏవిన్యూ కోర్టుకు వర్చువల్ గా కవిత హాజరు కానున్నారు. కోర్ట్ ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక మధ్నాహ్నం ఢిల్లీ నుంచి హైదారాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కవిత రాక సందర్భంగా అభిమానులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆమెకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి 9 గంటలకు తీహార్ జైలు నుంచి విడుదల కావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైలు గేటు నుంచి బయటకు రాగానే కొడుకు, భర్త, సోదరుడిని కౌగిలించుకుని కన్నీరుపెట్టుకున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూనే.. పోరాటం కొత్త కాదని..18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసానని తెలిపారు కవిత. బీఆర్ఎస్ పార్టీకి, కేసిఆర్ కి, నాకు, నా కుటుంబానికి అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి, మన కుటుంబానికి ఇబ్బందులు సృష్టించిన వాళ్లకు కచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు. ఇటువంటి కష్ట సమయంలో మా కుటుంబానికి వెన్నంట ఉన్న ప్రతి ఒక్కరికి పాదయాభివందనాన్ని తెలియజేస్తున్నానని తెలిపారు. ఐదున్నర నెలలు కుటుంబం నుంచి విడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కవిత విడుదల సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తీహార్ జైలుకు చేరుకున్నారు. వసంత్ విహార్ లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న కవితను గుమ్మడికాయతో కవితకు దిష్టి తీసి స్వాగతించారు పార్టీ శ్రేణులు.

నేడు బెంగాల్లో 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ హత్యాచారం, హత్య కేసులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మంగళవారం బెంగాల్ రాష్ట్ర సచివాలయం నవన్‌కు విద్యార్థి సంఘం నిర్వహించిన మార్చ్‌లో పాల్గొన్న వారిపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో అడ్డుకున్నారు. ఈ చర్యకు నిరసనగా ఇవాళ ( బుధవారం) రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ బెంగాల్‌లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ పాటించాలని కోరారు. కాగా, మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు గురైన ఘటనపై ప్రజల బాధలను ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని అధికార తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఎలాంటి బంద్‌ను అనుమతించబోదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ తెలిపారు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయని వెల్లడించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే బంద్ కారణంగా సాధారణ జన జీవనం దెబ్బ తినకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.

అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాహుల్ అమెరికా పర్యటనలో మార్పులు
హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో మార్పులు చేశారు. రాహుల్ గాంధీ ప్రతిపాదిత పర్యటనను 10 నుంచి 12 రోజులు కాకుండా ఒకటి రెండు రోజులకు కుదించినట్లు కుదించినట్లు సమాచారం. రాహుల్ గాంధీ అమెరికాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చట్ట నిర్మాతలను కూడా కలవనున్నారు.రాహుల్ గాంధీ సెప్టెంబర్ 5 నుంచి 6వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఇంతకుముందు ఈ పర్యటన సుదీర్ఘంగా ఉండబోతుందని ప్రకటించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ కార్యక్రమాన్ని తగ్గించారు. ఇప్పుడు ఈ పర్యటన 5 నుండి 7 రోజులు మాత్రమే ఉంటుంది. ఎన్నికల కారణంగా ఆయన కార్యక్రమాలు రద్దయ్యాయి. టెక్సాస్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. దీని తరువాత, అతను వాషింగ్టన్ డీసీలో చట్ట రూపకర్తలతో కూడా మాట్లాడతారు. ఈ లోగా అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు ప్రియాంక గాంధీ చేపడతారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చే వరకు ఆమె కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. ఈ కాలంలో తన అనేక కార్యక్రమాలు జమ్మూ కాశ్మీర్, హర్యానాలో నిర్వహిస్తారు.

కమలా హారిస్‌తో డిబేట్కు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్..!
డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌పై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ రియాక్ట్ అయ్యారు. కామ్రేడ్‌ కమలా హారిస్‌తో చర్చ కోసం రాడికల్‌ లెఫ్ట్‌ డెమోక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ పోస్టు పెట్టారు. సెప్టెంబర్‌ 10వ తేదీన ఫిలడెల్పియాలో ఈ కార్యక్రమం జరగనుందని తెలియజేశారు ట్రంప్. ఈ సమావేశానికి నిర్దిష్ట షరతులు, నియమాలను అతడు వివరించారు. కాగా, జూన్‌ 27వ తేదీన సీఎన్‌ఎన్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన చర్చలో పాటించిన నియమాలను అనుసరించడానికి తాను, కమలా హారిస్‌ ఒప్పందానికి వచ్చినట్లు డొనాల్డ్ ట్రంప్‌ పేర్కొన్నాడు. ఇందులో ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరని చెప్పుకొచ్చారు. అభ్యర్థులు మాట్లాడినప్పుడు మైక్రోఫోన్లు మ్యూట్‌ చేసి ఉంటాయి అని వెల్లడించారు. ఇక, 2020 ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింస నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆరోపణలపై కొత్త అభియోగపత్రాన్ని ప్రత్యేక న్యాయవాది జాక్‌ స్మిత్‌ దాఖలు చేయగా.. ప్రధాన ఆరోపణలను అలాగే ఉంచారు.. ఇమ్యూనిటీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ప్రతి స్పందనగా కొన్ని అంశాలను డొనాల్డ్ ట్రంప్ ను వదిలి వేశారు.

ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉంది : జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ఒక ప్రణాళికను అందజేస్తానని ప్రకటించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడమే ఈ ప్రణాళిక లక్ష్యం. సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా ఈ ప్రణాళికను సమర్పించనున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడమే జెలెన్స్కీ ప్లాన్ అని నమ్ముతారు. ఇందులో అమెరికా కీలక పాత్ర పోషించనుంది. వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించడానికి అనేక దశలను ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఎన్నో ప్లాన్లు కూడా వేసుకున్నాడు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణపై పలు స్థాయిల్లో చర్చలు జరిగినా.. ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. జెలెన్స్కీ ఈ చొరవ నిర్ణయాత్మకంగా పరిగణించబడుతుంది. ఈ ప్రణాళికలో మొదటి భాగం ఇటీవల రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో చేపట్టిన సైనిక చర్య. ఈ చర్య ఉక్రెయిన్ విజయంలో ముఖ్యమైన భాగమని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు.

నేటి నుంచి పారాలింపిక్స్‌.. భారత్ తరపున బరిలోకి 84 మంది అథ్లెట్లు
పారా ఒలింపిక్స్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ క్రీడలు స్టార్ట్ కానున్నాయి. మొన్నటి వరకు జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌ క్రీడలను ఘనంగా నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పారిస్‌ ఇప్పుడు మరోసారి అలరించేందుకు రెడీ అవుతుంది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నీలో వివిధ దేశాల నుంచి మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు 549 పతకాల కోసం పోటీ పడబోతున్నారు. ఇక భారత దేశం విషయానికొస్తే ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి 84 మంది అథ్లెట్లు రంగంలోకి దిగుతున్నారు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు సహా 19 పతకాలు కొల్లగొట్టిన ఇండియన్ అథ్లెట్లు ఈసారి అంతకుమించి పతకాలు సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కాగా, ఈ సారి పారా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్‌ అంటిల్‌, షాట్ పుటర్ భాగ్యశ్రీ జాదవ్‌ భారత పతాకధారులుగా కనిపించనున్నారు. వీరిద్దరిపై భారత్ భారీ ఆశలే పెట్టుకుంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన వీరు ఈసారి కూడా అదే ప్రదర్శన కనబర్చాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. పారిస్‌ పారాలింపిక్స్‌లో ఈసారి ఖచ్చితంగా స్వర్ణ పతకం సాధిస్తారన్న వారిలో తెలంగాణ యువ అథ్లెట్‌ జివాంజీ దీప్తి, మరియప్పన్‌ తంగవేలు, డిస్కస్‌త్రో ప్లేయర్ యోగేశ్‌ కథునియా, ఆర్చరీ-కాంపౌండ్‌ నుంచి శీతల్‌ దేవి, కృష్ణ నాగర్‌, సుహాస్‌ యతిరాజ్‌ (బ్యాడ్మింటన్‌), భవీనాబెన్‌ పటేల్‌ (టేబుల్ టెన్నిస్) ముందు వరుసలో ఉన్నారు. అయితే, ఈ వేడుకలు భారత కాలమాన ప్రకారం రాత్రి 11:30 గంటలకు ఆరంభం కానున్నాయి.