NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు తిరుమలకు వైఎస్‌ జగన్‌.. మాజీ సీఎం పర్యటనపై ఉత్కంఠ..!
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతోంది. శ్రీవారి దర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారాయన. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల పయనమవుతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం పదిన్నరకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నారు. అయితే జగన్‌ డిక్లరేషన్ ఇచ్చాకే వెళ్లాలని.. లేదంటే అలిపిరి వద్దే అడ్డుకుంటామంటూ బీజేపీ, హిందు సంఘాల హెచ్చరించాయి. దీంతో భద్రతను భారీగా పెంచారు. అటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకున్నారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. జగన్ పర్యటనతో హిందూ పరిరక్షణ సమితి, కూటమినేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 లకు ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్‌లో మీటింగ్ జరగనుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేదానిపై ఉత్కంఠగా మారింది.

ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్‌ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఏపీ ఏసీబీ అధికారులు. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయంలో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి.. ఈ నెల 11వ తేదీన కేసు నమోదు చేసింది ఏసీబీ.. ఇక, హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.. హైదరాబాద్‌ నుంచి తీసుకెళ్లి ఏసీబీ కోర్టులో వెంకట రెడ్డిని హాజరు పరచనున్నారు. అయితే, అవినీతి ఆరోపణలతో వెంకటరెడ్డిని సస్పెండ్ చేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం.. మరోవైపు.. ఈ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారాయన. వెంకటరెడ్డితో పాటు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించిన మూడు సంస్థలపై కూడా కేసులు నమోదు చేసింది ఏసీబీ. మొత్తం 7 మందిపై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసింది.. ఇందులో వెంకట రెడ్డి సహా సంస్థలపై కూడా కేసులు నమోదు చేశారు..

స్పష్టం చేసిన పవన్‌ కల్యాణ్‌.. నిరసనలకు జనసేన దూరం..!
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన కాకరేపుతోంది.. తిరుమల లడ్డూ వివాదం ముదురుతోన్న వేళ.. ఆయన తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది.. అయితే, జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చే శ్రీవారిని దర్శించుకోవాలని కూటమి నేతలు డిమాండ్‌ చేస్తున్నాయి.. ముఖ్యంగా బీజేపీ, హిందూ సంఘాలు.. వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.. మరోవైపు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలతో తిరుపతిలో నిరసనలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. వైఎస్‌ జగన్‌ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకొనే ప్రక్రియ.. జగన్ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదిది. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడవద్దు‌‌‌‌.. ఆ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.. ఇక, అధినేత వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్‌ జగన్ పర్యటన, డిక్లరేషన్ ఆంశాలకు దూరంగా ఉన్నారు జనసేన నేతలు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు
ఆగి ఉన్న లారీని కేవిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి సమీపంలో జరిగింది. దీంతో బస్సులో ప్రయాణం చేస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉదయం హైదరాబాదు నుంచి ఏలూరు జిల్లా చెక్కపల్లి కి బస్సు బయలు దేరింది. పెనుబల్లి మండలం సీతారామపురం వద్దకు రాగానే రోడ్డు ప్రక్కనే ఆగివున్న లారీని బస్సు స్పీడ్ లో వచ్చి ఢీ కొట్టింది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. లారీ డ్రైవర్ కాసేపు సేదతీరేందుకు ఉల్లిపాయల లోడ్ తో వున్న లారీని రోడ్డు ప్రక్కకు ఆపాడు. సుమారు 13 మంది ప్రయాణికులతో ఉన్న కేవిఆర్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా లారీ వెనుక భాగానికి బలంగా ఢీకొట్టాడు. దీంతీ ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. స్థానిక సమాచారంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సు ఎమర్జెన్సీ గేటుని ఓపెన్ చేసి అందులో నుంచి ప్రయాణికులు అందరినీ బయట తీశారు. గాయాలైన ప్రయాణికులకు ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్న బస్సులో చాలామంది దిగిపోవడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో నడిపాడా? లేక ఉదయం కావడంతో నిద్రమత్తులో బస్సును నడిపాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేవిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు యజమానులకు సమాచారం ఇచ్చారు. గాయాలై.. చికిత్స పొందుతున్న ప్రయాణికుల బంధువులకు కూడా సమాచారం ఇచ్చేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.

మహాలక్ష్మీని 59 ముక్కలు ఎందుకు చేశాడో చెప్పిన ముక్తి రంజన్ తల్లి..
బెంగళూరు మహాలక్ష్మి కేసులో ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ ఆత్మహత్య తర్వాత మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంజన్ ఆత్మహత్యకు ముందు నిందితుడు తన తల్లికి ఈ సంఘటన గురించి మొత్తం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఒక వార్తాపత్రికతో ముక్తి రంజన్ తల్లి మాట్లాడుతూ.. రంజన్ మంగళవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో కంగారుగా ఇంటికి వచ్చినట్లు తెలిపింది. ఎందుకు అలా కంగారు పడుతున్నావ్ అని అడగ్గా.. బెంగళూరులో ఓ మహిళను హత్య చేసినట్లు చెప్పాడని ఆమె పేర్కొనింది. దీంతో ఎందుకు చేశావాని ఆరా తీయగా.. బాధితురాలు తన నుంచి డబ్బు, బంగారు గొలుసు తీసుకున్నట్లు చెప్పాడని తెలిపింది. అలాగే, కొంత మందితో కలిసి నన్ను బెరించిందని ముక్తి రంజన్ ప్రతాప్ చెప్పాడని ఆమె వెల్లడించింది. ఇక, 15 రోజుల క్రితమే ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ మహాలక్ష్మీ ఇంటికి వెళ్లాడని అతడి తల్లి తెలిపింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటా.. కోపంలో ఆమెను గొంతుకోసి చంపేశాడని నాతో చెప్పినట్లు ఆ వృద్ధ మహిళ పేర్కొనింది. ఈ విషయం తెలియగానే.. షాక్ అయ్యాను అన్నారు. కానీ, బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచిన ముక్త రంజన్.. పోలీసుల విచారణ వల్ల మా కుటుంబానికి ఏం జరగొద్దనే ఉద్దేశంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను అని చెప్పిన కాసేపటికే సూసైడ్ చెసుకున్నాడని తెలిసిందని ఆమె కన్నీరు పెట్టుకుంది.

నేడు జపాన్ ప్రధాని పదవికి ఎన్నికలు.. బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు
జపాన్ ప్రధాన మంత్రి పదవికి ఈ రోజు (శుక్రవారం) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల బరిలో దాదాపు 9 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రస్తుత మంత్రులతో పాటు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అయితే, కొత్త ప్రధానిగా ఎన్నికైన వారు తమ ఇమేజ్ ను వినియోగించుకుని.. 2025 అక్టోబర్ లో జరిగే దిగవసభ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇక, ఎల్‌డీపీకి 368 మంది ఎంపీల బలం ఉండగా.. ఎంపీకి ఒక ఓటు ఉండనుంది. 11 లక్షల ఎల్‌డీపీ సభ్యుల ప్రాధామ్యాలకు అనుగుణంగా మరో 368 ఓట్లను పోటీ పడుతున్న అభ్యర్థులకు కేటాయించనున్నారు. అంటే తొలిరౌండ్‌లో మొత్తం 736 ఓట్లు ఉండనున్నాయి. మొదటి రౌండ్‌లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిని విజేతగా నిలవనున్నారు. ఏకంగా తొమ్మిది మంది ఎన్నికల బరిలో ఉండటంతో తొలిరౌండ్‌లో ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే ఛాన్స్ లేదని పరిశీలకులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజే రెండో రౌండ్‌ ఓటింగ్‌ కూడా జరగే అవకాశం ఉంది. మొదటిరౌండ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెకండ్ రౌండ్‌ ఓటింగ్‌కు అర్హత సాధించనున్నారు. ఈ రౌండ్లో 368 మంది ఎంపీలకు తోడు 47 మంది స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ఓటు వేసేందుకు అర్హులు.

ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఐఫోన్‌ 15పై 19వేల డిస్కౌంట్‌!
ఇ- కామర్స్‌ సంస్థ ‘ఫ్లిప్‌కార్డ్’ ప్రతి ఏడాది ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ను నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. దసరా, దీపావళి పండగ సీజన్‌ వేళ ఈసారి సేల్‌ను ప్రకటించింది. నేడు (సెప్టెంబర్‌ 27) సేల్‌ మొదలు కాగా.. ప్లస్‌, వీఐపీ మెంబర్లకు ఒక రోజు ముందుగానే డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్‌లో ఐఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. పెద్దఎత్తున రాయితీ, బ్యాంక్‌ ఆఫర్లతో తక్కువ ధరకే మంచి ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ‘యాపిల్‌’ ఐఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఐఫోన్‌లపై భారీగా డిస్కౌంట్ ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్‌ 15పై. ఇటీవల ఐఫోన్‌ 16 లాంచ్‌ సందర్భంగా ఐఫోన్‌ 15 ధరను యాపిల్‌ కంపెనీ తగ్గించింది. 128 జీబీ బేస్‌ వేరియంట్‌ ధర రూ.69,900గా నిర్ణయించింది. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఐఫోన్‌ 15 ధర రూ.54,999గా ఉంది. అంటే రూ.14వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.3 వేలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు ఉంది. అంటే రూ.19వేల డిస్కౌంట్‌ లభిస్తుంది. సేల్‌లో ఐఫోన్‌ 15ను రూ.49,999కే కొనుగోలు చేయొచ్చు.

నేటి నుంచే రెండో టెస్టు.. పిచ్‌, ప్లేయింగ్ 11 డీటెయిల్స్ ఇవే!
నేటి నుంచి ఆరంభమయ్యే చివరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొంటుంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్వదేశంలో రికార్డు స్థాయిలో 18వ టెస్టు సిరీస్‌ విజయంపై కన్నేసిన టీమిండియా.. కాన్పూర్‌లోనూ బంగ్లాను చిత్తు చేయాలని చూస్తోంది. మంచి ఫామ్ మీదున్న రోహిత్‌ సేనను ఆపడం బంగ్లాకు పెను సవాలే. తొలి టెస్టులో దెబ్బతిన్న బంగ్లాదేశ్‌ పుంజుకోవాలని భావిస్తోంది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అర్ధ శతకంతో రాణించాడు. గిల్‌ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తాచాటాడు. పునరాగమనంలో పంత్ మెరిశాడు. సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు రాణించాలని భారత్ కోరుకుంటోంది. బౌలింగ్‌లో భారత్‌కు ఏ సమస్యలూ లేవు. ఆర్ ఆశ్విన్‌ మరోసారి బంతితో మాయ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. జడేజా సిద్ధంగా ఉన్నాడు. ఈ ఇద్దరిని ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్లకు కష్టమైన పనే. ఈ మ్యాచ్‌లో భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయమే. బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారని తెలుస్తోంది. అతడి స్థానంలో కుల్దీప్‌ ఆడే అవకాశాలు మెండు. సిరాజ్‌, ఆకాష్ పేస్‌ భారాన్ని పంచుకుంటారు.

షకిబ్ సెక్యూరిటీతో మాకు సంబంధం లేదు: బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు
బంగ్లాదేశ్‌ సీనియర్ ఆల్‌రౌండర్‌ షకిబ్ అల్ హసన్ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ సందర్భంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో బంగ్లాదేశ్‌లో తన భద్రతపై షకిబ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బంగ్లాదేశ్‌కు వెళ్లడం పెద్ద సమస్య కాదు. వెళ్లాక బంగ్లాను వీడడమే కష్టం. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నా భద్రతపై ఆందోళనగా ఉన్నారు’ అని షకిబ్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్‌లో చివరి టెస్టు ఆడాలనుందని షకిబ్ అల్ హసన్ తన మనసులోని మాటను వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు (బీసీబీ) చీఫ్ ఫరూఖి అహ్మద్‌ స్పందించారు. షకిబ్ సెక్యూరిటీతో తమకు ఏ సంబంధం లేదన్నారు. ‘షకిబ్ సెక్యూరిటీ మా చేతుల్లో లేదు. బంగ్లా బోర్డు ఎవరికీ వ్యక్తిగతంగా భద్రతను ఇవ్వదు. షకిబ్ తన నిర్ణయం చెప్పాడు. అతడి సెక్యూరిటీకి సంబంధించి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు స్పందిస్తాయి. పోలీస్, రాబ్ మాదిరిగా బీసీబీ సెక్యూరిటీ ఏజెన్సీ కాదు. షకిబ్ విషయంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర. ఈ విషయంలో బీసీబీ ఎలాంటి ప్రకటన చేయదు’ అని ఫరూఖి తెలిపారు.

బంగారం లాంటి మా జాన్వీ పాపను కొంచమే చూపెట్టారు..
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ఆగమనానికి థియేటర్లు మారుమోగుతున్నాయి. ఎక్కడ చుసిన జై ఎన్టీయార్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. దేవర  బెన్ ఫిట్ షోస్ పాసిటివ్ టాక్ రాబట్టాయి.  అక్కడక్కడ కాస్త ల్యాగ్ అనిపించిన మొత్తంగా దేవర ఆడియెన్స్ ను అలరించాడని పబ్లిక్ టాక్. మరి ముఖ్యంగా దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయాయని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో వచ్చే షార్క్ ఫైట్, అండర్ వాటర్ సిక్వెన్సు వేరే లెవల్ లో ఉన్నాయని ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న మాట. సంగీత దర్శకుడు అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నిలబెట్టిందనే చెప్పాలి. కాగా, దేవర లో ఎన్టీయార్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. తారక్ జాన్వీ పై చిత్రీకరించిన చుట్టమల్లే లిరికల్ సాంగ్ రిలీజ్ కు ముందే విశేషంగా ఆకట్టుకుంది. ఇక సినిమాలో కూడా ఆ సాంగ్ ప్లేస్ మెంట్ చక్కగా కుదిరింది. తారక్ జాన్వీల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. కానీ జాన్వీ పాత్రను కొంతపరిధి మేరకు మాత్రమే చూపించారని ఆడియెన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాక్టింగ్ పరంగా జాన్వీ ఉన్నంతలో మెప్పించింది, మూడు గంటల సినిమా మొత్తంలో జాన్వీ కేవలం లిమిటెడ్ సీన్స్ లో మాత్రమే కనిపించింది. ఉన్నంతలో గ్లామర్ షో చేసింది. కానీ ఆమెకు ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటె బాగుండేది అనే ఫీలింగ్ చాలా మంది ప్రేక్షకుల్లో కలిగింది. కాగాసెకండ్ పార్ట్ లో జాన్వీ రోల్ ఎక్కువ ఉంటుందని కొరటాల ఆ మధ్య ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే .

రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేక్.. కొరటాల ఈజ్ బ్యాక్..?
జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివల దేవర మొత్తానికి థియేటర్లలో అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 లకు పైగా ప్రీమియర్స్ తో దేవర విడుదలయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన దేవర ఎన్నో అంచనాలతో భారీ ఎత్తున రిలీజ్ అయింది. అభిమానుల కోలాహలం, బాణాసంచాలు ఎటు చుసిన దేవర థియేటర్లు తిరునాళ్లను తలపించాయి, నిన్నరాత్రి నుండి మొదలైన సంబరాలు తెల్లవారుజాము వరకు సాగుతూనే ఉన్నాయి. దేవర ప్రీమియర్స్ తెల్లవారుజామున 1.08 షోస్ కాసేపటి క్రితం ముగిసాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ ను మొదటి భాగం అలరించగా, సెకండ్ హాఫ్ కాస్త అటు ఇటుగా ఉందని కొందరు అన్నారు. కొరటాల చచెప్పినట్టుగా ఏ విధమైన అంచనాలు లేకుండా, నార్మల్ ఆడియెన్ గా చూసే వారికి దేవర విశేషంగా అలరించాడు. ఓవర్ ఆల్ గ చూసుకుంటే దేవర ఒకసారి చూడదగ్గ సినిమా. కాగా రాజమౌళి తో సినిమా చేస్తే తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంట్ ను తొలిసారి ఎన్టీయార్ బ్రేక్ చేసాడని, సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది అని టాక్. కాగా దేవర పాత్రలో యంగ్ టైగర్ అదరగొట్టాడని తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాను తన భుజస్కందాలపై మోశాడు, మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నడుస్తున్న రాజమౌళి సెంటీమెంట్ ను కొరటాల శివ బ్రేక్ చేసాడు. ఆచార్య వంటి దారుణ ప్లాప్ తర్వాత కొరటాల నుండి ఈ రేంజ్ కంబ్యాక్ ఊహించలేదు అని అన్నారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నవెబ్ సిరీస్ వచ్చేస్తోంది..
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2 యొక్క ప్రీమియర్‌ను అక్టోబర్ 2024లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ప్రకటించింది. గతేడాది జూన్ 30వ తేదీన ఆహా ఓటీటీలో విడుదలైన తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ మంచి సక్సెస్ సాధించింది. హర్షిత్ రెడ్డి, 30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ బాగా పాపులర్ అయింది. న్యూఏజ్ కామెడీతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.   కార్పోరేట్ జీవితంలోని ఒడిదుడుకుల చిత్రణతో ప్రేక్షకులను ఆకర్షించిన సీజన్ 1 విజయాన్ని అనుసరించి, ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను ఆకట్టుకుంది.ఇప్పుడు, ఈ అర్థమైందా అరుణ్ కుమార్ రెండో సీజన్ వస్తోంది. అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 1లో ప్రధాన నటులు హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ మరియు తేజస్వి మడివాడ అద్భుతమైన నటన , ముఖ్యంగా యువతను ఎంతగానో ఆకట్టుకోగా దానికి కొనసాగింపుగా సీజన్ 2  కథ కొనసాగుతుండగా, అరుణ్ కుమార్ ప్రయాణాన్ని మరింత సుసంపన్నం చేసే కొత్త పాత్రలు మరియు ఉత్తేజకరమైన సర్ప్రైజ్‌లను ప్రేక్షకులు ఆశించవచ్చు. అరీ స్టూడియో మరియు లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించబడిన అర్థమైంద అరుణ్ కుమార్ కార్పొరేట్ ప్రపంచం నుండి మరింత ఆకర్షణీయమైన కథనాలను అందిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే సీజన్‌లో అరుణ్ కుమార్‌కి ఎలాంటి కొత్త సవాళ్లు మరియు ఆశ్చర్యాలు ఎదురు కాబోతున్నాయో తెలుసుకోవడానికి అక్టోబర్ 2024లో ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే సీజన్ -2 చూడండి.