NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ.. ఏర్పాట్లలో అధికారులు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. వచ్చేనెల 6వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మిన పట్నం గ్రామానికి రానున్నారు.. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ.. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర.. రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ఆయన పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు. అయితే, కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో వివిధ పరిశ్రమలు.. ఇతర అవసరాల కోసం 20 వేల ఎకరాల భూమిని ఇదివరకే సేకరించారు. ప్రస్తుతం కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ కోసం 12 వేల 500 ఎకరాలను కేటాయించారు. ఈ సెజ్ పరిధిలో ఎగుమతి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిశ్రమలకు అనుబంధంగా చిన్న పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో రానున్నాయి. క్రిస్ సిటీ కోసం సేకరించిన భూములలో మౌలిక సదుపాయాలను కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయి. ఇప్పటికే సాగర మాల పథకం కింద తీర ప్రాంతంలో రహదారి నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండడంతో ఎగుమతులు.. దిగుమతులకు సౌలభ్యంగా ఉంటుందని భావించి ఈ ప్రాంతంలో పారిశ్రామిక సెజ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెజ్ వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని భావించినా.. అప్పట్లో వివిధ కారణాలవల్ల ప్రధాని పర్యటన వాయిదా పడింది. ఇక, ఇప్పుడు ప్రధాని పర్యటన ఖరారు కావడంతో.. అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు.

ఇవాళ నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో చర్చించనున్నారు.. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై సీఎం సమీక్ష కొనసాగనుంది.. ఇప్పటికే డాక్యుమెంట్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది ప్రణాళిక శాఖ. అయితే, ప్రధాని నరేంద్ర మోడీతో వికసిత్ ఏపీ విజన్ – 2047 డాక్యుమెంట్ విడుదల చేయించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.. మరోవైపు.. దేవదాయ శాఖపై కూడా ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి
ఉత్సాహంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.. కానీ, ఆ పుట్టిన రోజు వేడుకలకు గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయవాడలో విషాదంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భవనీపురంలో నివాసం ఉంటున్న ఖాజా మహమ్మద్ (33) .. తన ఇద్దరు కవల పిల్లలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు.. ఇక, పిల్లల రెండవ పుట్టినరోజు వేడుకలకు కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించాడు కాజా మహమ్మద్.. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆదివారం బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించాడు.. కానీ, రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోవడానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు ఖాజా మహమ్మద్.. మరోవైపు.. ఆదివారం పుట్టిన రోజు వేడుకలకు హాజరైన గంగూరులో ఉండే ఖాజా మహమ్మద్ పిన్ని జరీనా బేగం కూడా హాజరయ్యారు.. ఆమె వయస్సు 46 సంవత్సరాలు.. అక్క కొడుకు చనిపోయిన వార్త తెలుసుకొని చూడడానికి ఇచ్చిన ఆమె.. ఒక్కసారిగా ఖాజా మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే జరీనా బేగం మరణించినట్టు వైద్యులు తెలిపారు.. అయితే, గంటల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది.. ఉత్సాహంగా కవలల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతచెందడతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు..

తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు (నేడు, రేపు, ఎల్లుండి) వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపోస్పియర్‌లో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏపీలోని లోయర్ ట్రోపో జోన్, యానాంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలే.. పోలీసులకు సీపీ వార్నింగ్‌..
పోలీసుల అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. లంచాలు, వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోని ఉన్నతాధికారులపై నిఘా ఉంచుతామని కొత్తకోట శ్రీనివాస్ అన్నారు. ఆరోపణ నిజమైతే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు. కాగా.. హైదరాబాద్‌లో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో నగర పౌరులకు సీపీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల బోయినపల్లిలో రూ.8.5 కోట్ల విలువైన 8.5 కిలోల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలో యాంఫెటమైన్ అనే డ్రగ్ పెద్ద మొత్తంలో పట్టుబడిందన్నారు. ఈ మందులను ఇంజక్షన్లు, లిక్విడ్ రూపంలో వివిధ రూపాల్లో తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. కూల్ డ్రింక్స్ లో అమ్మాయిలకు ఈ మందు ఇస్తున్నారని తెలిపారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరిపైనా అయిన అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నగర యువత డ్రగ్స్ బారిన పడవద్దని హెచ్చరించారు. ఈ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని సీపీ శ్రీనివాస్ అన్నారు.

శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంపై నౌకాదళం దర్యాప్తు.. కాంట్రాక్టర్‌పై కేసు నమోదు..!
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సోమవారం బలమైన గాలులకు కూలిపోయింది. ఈ విగ్రహాన్ని గత ఏడాది (4 డిసెంబర్ 2023) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. విగ్రహం కూలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మరోవైపు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిన ఘటనపై భారత నౌకాదళం విచారణకు ఆదేశించింది. ఈ విగ్రహాన్ని గతేడాది నేవీ డే రోజున ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అలాగే ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి వీలైనంత త్వరగా విగ్రహం మరమ్మతులు చేపట్టేందుకు ఒక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. నేవీ, మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ తో సంబంధిత నిపుణులు ప్రమాదానికి గల కారణాన్ని పరిశోధిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ధ్వంసం ఘటనలో కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టే, స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌లపై భారత న్యాయ స్మృతి 109, 110, 125, 318, 3(5) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సింధుదుర్గ్ పోలీసులు తెలిపారు. మరోవైపు, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని.. భారత నావికాదళం ఏర్పాటు చేసిందన్నారు. ఛత్రపతి శివాజీ మనకు ఆదర్శం, ఆయన విగ్రహమే మనకు గుర్తింపు.. విగ్రహం డిజైన్‌ను కూడా నేవీ సిద్ధం చేసింది అని సీఎం గుర్తు చేశారు.

పాకిస్థాన్లో కొనసాగుతున్న వేర్పాటువాదుల మారణకాండ.. 70 మంది మృతి
పాకిస్థాన్‌ దేశంలో వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన సాయుధ బలగాలు మారణకాండ సృష్టించాయి. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లు, రైల్వే ట్రాకులు, వాహనాలపై కాల్పులకు పాల్పడి దాదాపు 70 మందిని హత మార్చాయి. ఇందుకు తమదే బాధ్యతని ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్‌ ప్రభుత్వ, భద్రత అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మొత్తం నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారు జామున సాయుధులు కాల్పులకు తెగబడ్డారు అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ దాడుల్లో దాదాపు 70 మంది మరణించారని వెల్లడించారు. మొదటి ఘటన ముసాఖేల్‌ జిల్లాలోని రరాషమ్‌లో ఆదివారం రాత్రి జరగింది.. ఇక్కడ పంజాబ్‌ ప్రావిన్స్ నుంచి వస్తున్న బస్సులను 10 మంది సాయుధులు ఆపి అందులోని ప్రయాణికులను కిందకు దించి.. వారి గుర్తింపు పత్రాలను తనిఖీ చేసి 23 మందిని కాల్చి చంపేశారు.. ఆ తర్వాత మరో ఘటనలో కలత్‌ ప్రాంతంలో ఐదుగురు పౌరులు సహా ఆరుగురు భద్రతా సిబ్బందిపై ఈ వేర్పాటువాదులు కాల్పులు జరిపి చంపారు. బలూచిస్థాన్‌ గిరిజన నాయకుడు నవాబ్‌ అక్బర్‌ఖాన్‌ బుగ్టీ వర్ధంతి సందర్భంగా ఈ దాడులు కొనసాగాయి. బొలాన్‌ జిల్లా కొల్పూర్‌లో జరిగిన దాడిలో మరో నలుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. వేర్పాటువాదుల దాడులను పాకిస్థాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా ఖండించారు.. సాయుధులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

జై షా వారసుడు ఎవరు?.. రేసులో మరో బీజేపీ నేత కుమారుడు!
ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడం లాంఛనమే. 16 మంది సభ్యులలో 15 మంది షాకు మద్దతుగా ఉన్నారు. అయితే షా ఎప్పుడు నామినేషన్‌ దాఖలు చేస్తాడన్నది ఇంకా తెలియరాలేదు. నామినేషన్‌ వేయడానికి నేడే (ఆగష్టు 27) ఆఖరు తేదీ. మరికొన్ని గంటల్లో విషయం తెలిసిపోనుంది. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌ క్లే పదవీకాలం నవంబర్‌ 30తో ముగియనుంది. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికైన బార్‌ క్లే.. మరోసారి పోటీ చేసేందుకు అవకాశం ఉన్నా అతడు సముఖంగా లేడు. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎన్నిక లాంఛనమే అయిన నేపథ్యంలో అతడి స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు ఎన్నికవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. బీసీసీఐ బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, బీసీసీఐ కోశాధికారి ఆశిష్‌ షెలార్, ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధూమల్, ఢిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ, క్యాబ్‌ అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియా సహా మరికొంతమంది పోటీలో ఉన్నారు. అయితే రోహన్‌ జైట్లీ రేసులో ముందున్నట్లు సమాచారం.

గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న శిఖర్ ధావన్.. కాకపోతే.?
ఇటీవల భారత క్రికెట్‌ జట్టు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్ ఇప్పుడు లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)లో ఆడబోతున్నాడు. ఈ లీగ్‌లో మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారని తెలిసిందే. కాబట్టి LLC ద్వారా గబ్బర్ అభిమానులు మరోసారి ఆయన బ్యాటింగ్ చేయడాన్ని చూడగలరు. ఇక ఈ విషయాన్నీ.., లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా.. ధావన్‌ను లీగ్‌కి స్వాగతిస్తూ, శిఖర్ ధావన్ మాతో చేరడం మాకు చాలా ఆనందంగా ఉంది. అతని అనుభవం, ప్రతిభ నిస్సందేహంగా లీగ్‌ని మెరుగుపరుస్తుంది. ఇంకా క్రికెట్ అభిమానులను అలరిస్తుంది. అతను చేరడం కోసం మేము ఎదురుచూస్తున్నాము. అతను లెజెండ్స్‌ తో ఆడటం కోసం క్రికెట్ ఎదురుచూస్తోంది అంటూ తెలిపాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ తదుపరి సీజన్ సెప్టెంబర్ 2024లో ప్రారంభం కాబోతోంది.

తమిళంలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన డ్యాన్సింగ్ డాల్ శ్రీలీల
పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయింది యంగ్ టాలెంటెడ్ శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ చిత్ర విజయంతో ఈ యంగ్ బ్యూటీకి టాలివుడ్ రెడ్ కార్పేట్ పరిచింది. స్టార్ హీరోల సినిమాలో వరుస అవకాశాలు ఇచ్చారు నిర్మాతలు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన గుంటూరు కారం, భగవంత్ కేసరి లో బాలయ్య కు కూతురుగా కూడా నటించి మెప్పించింది. కానీ టాలీవుడ్ లో శ్రీలీల హిట్ రేషియో చూసుకుంటే తక్కువ అనే చెప్పాలి. వరుస ఫ్లాప్ లు పలకరించడంతో ఇటీవల తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు తాగ్గాయి. దీంతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీ వైపు ద్రుష్టి మళ్లించింది. ఆ మధ్య తమిళ స్టార్ హీరోలకు జోడిగా శ్రీలీల పేరు వినిపించింది కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఫైనల్ ఇప్పుడు తమిళంలో ఛాన్స్ కొట్టేసింది ఈ యంగ్ డాల్. శివకార్తికేయన్ హీరోగా ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ కు జోడిగా శ్రీలీలను ఫిక్స్ చేశారు. ఇందుకు సంభందించి ఫోటో షూట్ కూడా కంప్లిట్ చేసారు. త్వరలోనే అధికారక ప్రకటన రెండు మూడు రోజుల్లో రానుంది. తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కానగరాజ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. కన్నడ, టాలీవుడ్ లో మెప్పించిన శ్రీలీల కోలీవుడ్ లో ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి. శివకార్తికేయన్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 25వ సినిమాగా రానుంది పురాణనూరు.

రండి బాబు రండి.. సినిమా చూస్తే లక్ష రూపాయలు.. త్వరపడండి
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్ సరసన అలనాటి హీరోయిన్ ఇంద్రజ నటించింది.  అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి విడుదల చేసింది. ఆగస్టు 23న రిలీజైన ఈ సినిమా మౌత్ టాక్ తో దూసుకెళుతుంది. విడుదలైన మొదటి 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.34 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. తాజాగా ఈ చిత్రాన్ని మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకువెళ్లేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. అదేమంటే ” మీరు లక్ష రూపాయలు గెలవాలి అనుకుంటున్నారా.. సుబ్రహ్మణ్యం అకౌంట్ లో లక్ష రూపాయకు పడినట్టే మీ అకౌంట్ లో కూడా పడాలంటే మురుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాను థియేటర్లో చూసి మీ టికెట్, మీ పేరు, మీ ఫోన్ నంబరును +91 8985865727 నంబర్ కు వాట్సప్ చేస్తే 1000 రూపాయల దగ్గరనుండి 1,00,000 మీ సొంతం చేసుకోమని” ప్రకటించారు చిత్ర నిర్మాతలు. లచ్చిమ్ లచ్చిమ్ లచ్చిమ్ దేవి మీ సొంతం అంటూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఈ ఐడియా ఎంతవరకు గిట్టుబాటు అవుతుందో చూడాలి.