NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఈ రోజు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు.. క్రీడా, యువజన సర్వీసులపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. యువతకు ఉపాధి, పారిశ్రామిక రంగంలో.. యువతకు ప్రోత్సాహం, యువతకు ప్రొత్సాహం ఇచ్చేలా స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై చర్చించనున్నారు.. యూత్ పావసీ రూపకల్పనపై దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు.. గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం, స్టేడియంల అభివృద్ధి, గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖలో అవినీతి వంటి అంశాలపై కూడా దృష్టిసారించనున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పనపై కూడా సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు… కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్ పార్కులపై చర్చ సాగనుంది.. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై సమీక్షించబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, నిత్యం ఏదో శాఖపై వరుసగా సమావేశాలు, సమీక్షలను సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న విషయం విదితమే..

వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర.. ప్రధాన ఘట్టం పూర్తి..
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టంగా పూర్తి చేశారు.. చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పించారు. మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మవారికి అమ్మవారి సేవకులు ప్రాణప్రతిష్ట గావించారు. ఈ ప్రధాన ఘట్టంతో శ్రీ పోలేరమ్మ అమ్మవారు సమగ్రరూపం దాల్చడంతో భక్తజనులకు దర్శనభాగ్యం కలిగింది. అనంతరం ప్రత్యేక పూల రథంలో నడివీధి ఆలయానికి ముగ్గురమ్మల మూలపుటమ్మ బయలుదేరగా, ఈ అమ్మవారి ఉత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా సాగింది. తెల్లవారుజాము సరికి అమ్మవారు నడివీధి ఆలయంలో కొలువుదీరగా, అమ్మవారి సేవకుల ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం నుండి భక్తజనులకు దర్శన భాగ్యం కలగనుంది.

నేడు జనసేనలోకి కీలక నేతలు.. కండువా కప్పి ఆహ్వానించనున్న పవన్‌..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు.. ఇలా వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఇప్పటికే పలువురు నేతలు.. టీడీపీ గూటికి చేరగా.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీ కండువాలు కప్పుకున్నారు.. అయితే, ఈ రోజు జనసేన పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారు.. సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదబభాను, కిలారి రోశయ్య కూడా ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు.. నేడు జనసేనలో చేరనున్నారు వైసీపీ కీలక నేతలు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య.. దీని కోసం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయల్దేరనున్నారు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.. ఇవాళ అతికొద్ది మంది మాత్రమే బాలినేనితో పాటు పార్టీలో చేరనుండగా.. త్వరలో ఒంగోలు వేదికగా భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు..

జీవో 85 నిబంధనలు సడలింపు..! వెంటనే విధుల్లో చేరండి..
వెంట‌నే విధుల్లో చేరాల‌ని పీహెచ్‌సీ వైద్యులను కోరారు ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్.. మంగ‌ళ‌గిరి ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌లో బుధ‌వారం పీహెచ్‌సీ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో మూడో విడ‌త జ‌రిగిన చ‌ర్చలో మంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి ఎంటీ కృష్ణబాబు, క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, డీహెచ్ డాక్టర్ ప‌ద్మావ‌తి, డీఎంఈ డాక్టర్ న‌ర‌సింహం, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాల‌యం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి పాల్గొన్నారు. చ‌ర్చల అనంత‌రం మంత్రి స‌త్యకుమార్ మాట్లాడుతూ అన్ని బ్రాంచ్‌ల‌లో 20 శాతం రిజ‌ర్వేష‌న్ పెంచ‌డం వ‌ల్ల 258 సీట్లు పొందే అవ‌కాశ‌మేర్పడుతుంద‌న్నారు. పీజీ ఇన్ స‌ర్వీసులో జాయిన్ కాక‌ముందు ఏ బ్రాంచ్ లో డిప్ల‌మా చ‌దివితే అదే బ్రాంచ్‌లో పీజీ చేయాల‌న్న జీవో 85 లోని నిబంధ‌న‌ను స‌డ‌లిస్తామ‌ని, దీంతో ఏ బ్రంచ్ లోనైనా పీజీ చేసుకునేందుకు వెసులుబాటు క‌లుగుతుంద‌న్నారు. అలాగే స‌ర్వీసులోకి రాక‌ముందు పీజీ చేసి ఉంటే ఇన్ స‌ర్వీసులో రెండ‌వ పీజీ చేసేందుకు అర్హత లేద‌న్న నిబంధ‌న‌ను కూడా స‌డ‌లించి స్వంత ఖ‌ర్చుల‌తో పీజీ చేసేలా జీవోను స‌వ‌రిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు.

నేడు, రేపు భారీ వర్షాలు.. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 28, జూలై 15, 19, ఆగస్టు 3, 29, సెప్టెంబర్ 5, 13, 23 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలకు లానినో ప్రభావంతో భారీగా విజయవాడ, ఖమ్మం ప్రాంతాల్లో ఇటీవల వర్షం కురిసింది. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో అనుబంధ ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంపై స్థిరమైన అల్పపీడనం బుధవారం బలహీనపడింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో 123.3, సూర్యాపేట జిల్లా టేకుమట్‌లో 56.5, ఆదిలాబాద్‌ జిల్లా బజరహత్నూర్‌లో 46, వరంగల్‌ జిల్లా ఏనుగల్‌లో 45, సంగారెడ్డి జిల్లా మల్చెల్మలో 44.8, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 42.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.

ప్ర‌భుత్వ భూముల్లో ఇళ్ల రుణాలు ఇస్తే.. పేద‌వారికి న్యాయం జ‌రిగేలా చూస్తాం..
ప్ర‌భుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించ‌డానికి రుణాలు ఇస్తే.. పేద‌వారికి న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని హైడ్రా కమిషనర్ రంగ‌నాథ్ అన్నారు. పార్కుల క‌బ్జాపై అన్ని విభాగ‌ల‌తో స‌మ‌గ్ర స‌ర్వేకు అధికారులను రంగ‌నాథ్ ఆదేశించారు. ప్ర‌భుత్వ భూములే కాదు.. పార్కు స్థ‌లాల‌ను కాపాడే ప‌నిలో హైడ్రా నిమ‌గ్న‌మైంది. అమీన్‌పురా మున్సిపాలిటీ ప‌రిధిలోని హెచ్ఎండీఏ అనుమ‌తులిచ్చిన లేఔట్ల‌లో పార్కుల క‌బ్జాపై ప‌లు ఫిర్యాదులంద‌డం తో స‌మ‌గ్ర స‌ర్వేకు హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు.ఈ క్ర‌మంలోనే అమీన్‌పురా మున్సిపాలిటీ ప‌రిధిలోని స‌ర్వే నంబ‌రు 152, 153 లో హుడా అనుమ‌తి పొందిన వెంక‌ట‌ర‌మ‌ణా కాల‌నీలో పార్కుల స్థ‌లాల క‌బ్జాపై వ‌చ్చిన ఫిర్యాదులను హైడ్రా ప‌రిశీలించి స‌ర్వే నిర్వ‌హించింది.హైడ్రా అధికారుల‌తో పాటు ఈ స‌ర్వేలో రెవెన్యూ అధికారులు, హెచ్ ఎండీఏ, మున్సిప‌ల్ అధికారులు పాల్గొన్నారు. క‌బ్జా చేశారంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తుల‌తో పాటు.. ఫిర్యాదు చేసిన కాల‌నీవాసుల‌తో స‌మావేశాన్ని కూడా హైడ్రా క‌మిష‌న‌ర్ ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ అనుమ‌తి పొందిన లే ఔట్లో పార్కు స్థ‌లాల‌తో పాటు త‌మ ఇంటి స్థ‌లాలు క‌బ్జాకు గుర‌య్యాయ‌ని సంబంధిత‌ శాఖ‌ల అధికారుల‌కు ఎన్ని ఫిర్యాదులు చేసినా క‌నీసం స్పందించ‌లేద‌ని.. ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగి స‌ర్వే చేయ‌డాన్ని ఆయా లేఔట్ల‌లోని ప్లాట్ ఓన‌ర్లు సంతృప్తి వ్య‌క్తం చేశారు. అనంతరం బాధితుల‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ స‌మావేశమైంది. ప్ర‌భుత్వ స్థ‌లాల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే క్ర‌మంలో ఇటీవ‌ల అమీన్‌పురా ప్రాంతంలో కూల్చివేత‌లు చేప‌ట్టిన విష‌యం విధిత‌మే.. ఈ నేప‌థ్యంలో బాధితులతో పాటు.. ప్లాట్లు చేసి అమ్మేసిన రియ‌ల్ ఎస్టేట్‌వ్యాపారుల‌ను కూడా హైడ్రా కార్యాల‌యానికి పిలిపించి ఏవీ రంగ‌నాథ్ బాధితుల‌తో మాట్లాడారు. వెంక‌ట‌ర‌మ‌ణా కాల‌నీ, చ‌క్ర‌పురి కాల‌నీ, ఆర్టీసీ కాల‌నీ, గోల్డెన్ కేవ్ కాల‌నీవాసులు ఒక‌రి లే ఔట్‌లోకి మ‌రొక‌రు వ‌చ్చేసిన‌ట్టు ఫిర్యాదులు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయా కాల‌నీ వాసుల‌తో పాటు.. లేఔట్లు వేసిన వారిని కూడా నేరుగా విచారించారు.

అజ్మీర్ దర్గాలో శివాలయం.. విచారణకు నిరాకరించిన కోర్టు
సూఫీ సన్యాసి మొయినుద్దీన్ చిస్తీ దర్గాను మహాదేవ్ ఆలయంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు అజ్మీర్ కోర్టు నిరాకరించింది. ఈ దర్గాపై తమకు ఎలాంటి అధికార పరిధి లేదని కోర్టు పేర్కొంది. ఈ విషయమై హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ దర్గాను ఆలయ శిథిలాలపై నిర్మించారని, అందుకే దీనికి శ్రీ సంకత్మోచన్ మహాదేవ్ ఆలయం అని పేరు పెట్టాలని వాదించారు. దాఖలైన పిటిషన్‌లో, దర్గా నిర్వహిస్తున్న చట్టం చెల్లదని ప్రకటించాలని, హిందువులకు పూజించే హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. గుప్తా తన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆ స్థలంలో సర్వే చేయమని ఆదేశించారు. గుప్తా తరఫు న్యాయవాది శశిరంజన్‌ మాట్లాడుతూ, వాది రెండేళ్లుగా పరిశోధనలు చేశారని, అక్కడ శివాలయం ఉందని, ముస్లిం ఆక్రమణదారులు దానిని ధ్వంసం చేసి, ఆపై దర్గాను నిర్మించారని ఆయన కనుగొన్నారు. గుప్తా తరపు న్యాయవాది మాట్లాడుతూ, “తదుపరి విచారణకు ముందు కేసును బదిలీ చేయాలని నేను జిల్లా కోర్టులో దరఖాస్తు చేస్తాను.” మరోవైపు, అజ్మీర్ దర్గా సేవకులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అంజుమన్ సెక్రటరీ సయ్యద్ జద్గాన్ సెక్రటరీ సయ్యద్ సర్వర్ చిస్తీ ఈ కేసును తీవ్రంగా ఖండించారు. ఇది సమాజాన్ని మతపరమైన మార్గాల్లో విభజించే ఉద్దేశపూర్వక ప్రయత్నమని పేర్కొన్నారు. అజ్మీర్‌లోని ఖ్వాజా గరీబ్ నవాజ్ పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత ఉపఖండంలో ముస్లింలు, హిందువులచే గౌరవించబడుతుంది. మితవాద శక్తులు సూఫీ మందిరాన్ని దృష్టిలో ఉంచుకుని ముస్లింలను ఒంటరిగా చేసి మత సామరస్యానికి భంగం కలిగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయనడంలో సందేహం లేదని అన్నారు.

లెబనాన్‌లో ఉద్రిక్తత.. భారత పౌరులు వెంటనే లెబనాన్ వదిలి వెళ్లాలంటూ.!
లెబనాన్‌లో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటీవల వైమానిక దాడులు, కమ్యూనికేషన్ పరికరాల్లో పేలుళ్ల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతప్రజల ఆందోళన కూడా పెరిగింది. ఈ సంఘటనల తరువాత, బీరూట్‌ లోని భారత రాయబార కార్యాలయం తదుపరి నోటీసు వచ్చే వరకు లెబనాన్‌కు వెళ్లకుండా సలహాలను జారీ చేసింది. అంతేకాదు, ఎవరైనా భారత పౌరులు ఉంటే వెంటనే లెబనాన్ వదిలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రాయబార కార్యాలయం తన నోటీసులో, ఆగస్టు 1, 2024న జారీ చేసిన సలహాను పునరుద్ఘాటిస్తున్నందున అలాగే ఈ ప్రాంతంలో ఇటీవలి సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, తదుపరి నోటీసు వచ్చే వరకు భారత పౌరులు లెబనాన్‌కు వెళ్లవద్దని సూచించబడింది. లెబనాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాగే రాయబార కార్యాలయంతో సన్నిహితంగా ఉండాలని సూచించారు. అందిన నివేదిక ప్రకారం, లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన సైనిక దాడుల్లో కనీసం 558 మంది మరణించినట్లు సెప్టెంబర్ 24న లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. IDF దాడుల వల్ల మరణించిన 558 మందిలో 50 మంది చిన్నారులు, 1,835 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంతో పాటు, ఇంగ్లాండ్ కూడా తన పౌరులకు కూడా సలహా ఇచ్చింది. లెబనాన్‌ను విడిచిపెట్టాల్సిందిగా బ్రిటిష్ పౌరులను ప్రధాని కైర్ స్టార్మర్ కోరారు. అత్యవసర తరలింపు అవసరమైతే దాదాపు 700 మంది బ్రిటిష్ సైనికులను సైప్రస్‌కు మోహరించారు.

టీమిండియా మహిళా క్రికెటర్లను కలిసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్!
యూఏఈ వేదికగా టీ20 మహిళా ప్రపంచకప్‌ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్‌ వేదికగా పొట్టి కప్ జరగాల్సి ఉన్నా.. బంగ్లాలో అల్లర్ల నేపథ్యంలో టోర్నీని యూఏఈకి ఐసీసీ మార్చింది. మొత్తం పది జట్లు రెండు గ్రూప్‌లుగా ఆడనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ అక్టోబర్ 20న జరగనుంది. గ్రూప్‌ స్టేజ్‌లో అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీ కోసం బుధవారం భారత్‌ దుబాయ్ చేరుకుంది. దుబాయ్‌లో భారత మహిళా క్రికెటర్లు దిగిన వేళ.. వారి ఓ స్పెషల్ గెస్ట్‌ ఎదురుపడ్డారు. ఆ స్పెషల్ గెస్ట్‌ ఎవరో కాదు.. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి. బుధవారం రానా దుబాయ్‌కు వెళ్లగా.. అదే సమయంలో భారత మహిళా క్రికెటర్లు విమానాశ్రయంలో ఎదురుపడ్డారు. భారత క్రికెటర్లతో రానా ఫొటోలకు ఫోజిలిచ్చారు. టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు పట్టుకురావాలంటూ.. ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ‘దుబాయ్ విమానాశ్రయంలో అద్భుతమైన వ్యక్తులను కలిశా. టీమిండియా విజేతగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్ భారత్’ అని రానా పేర్కొన్నారు. ఈ వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కాంత, వేట్టయాన్ సినిమాల్లో రానా నటిస్తున్న విషయం తెలిసిందే.

బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై ఇండియన్స్‌కు భారీ ప్రయోజనం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో మెగా వేలం వచ్చిన ప్రతిసారీ అన్ని జట్లలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. మెగా వేలం సమయంలో నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఐపీఎల్‌ జట్లకు ఉంటుంది. దాంతో ప్రాంఛైజీలు కీలక ఆటగాళ్లను కోల్పోవడంతో జట్టు స్వరూపం పూర్తిగా మారిపోతుంటుంది. అయితే ఈసారి ఒకరిని అదనంగా అట్టిపెట్టుకునే అవకాశాన్ని ప్రాంఛైజీలకు బీసీసీఐ కల్పించబోతోందని తెలుస్తోంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను అయిదుకు పెంచాలని ఫ్రాంఛైజీలు ఎప్పట్నుంచో డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాంఛైజీలు, బీసీసీఐ మధ్య జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. కొన్ని కారణాల వల్ల ప్రాంచైజీల డిమాండ్‌ను బీసీసీఐ అంగీకరించలేదు. అయితే చివరకు ప్రాంచైజీల డిమాండ్‌కు బీసీసీఐ ఓకే అన్నట్లు సమాచారం. ప్రతీ ప్రాంచైజీకి ఐదుగురు ఆటగాళ్ల రిటెన్షన్‌ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎమ్) కార్డ్ ఈసారి లేదని సమాచారం. ఐపీఎల్‌ 2025లో ఐదుగురు ఆటగాళ్లను ప్రతీ టీమ్ అట్టిపెట్టుకోవచ్చు. ఇది ముంబై ఇండియన్స్‌ లాంటి జట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

జూనియర్ ఎన్టీయార్ ‘దేవర ఓటీటీ’ రిలీజ్ ఎప్పుడంటే..?
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ఆగమనానికి సర్వం సిద్ధమైంది. తెల్లవారుజామున బెన్ ఫిట్ షోస్ తో గ్రాండ్ గా స్టార్ట్ కానుంది దేవర.   ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయిందని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో టెర్రిఫిక్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గ్గట్టుగానే దేవర బుకింగ్స్ ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలో, కర్ణాటక దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. కాగా దేవర ఓటీటీ స్ట్రీమింగ్ కు ఎన్ని తర్వాత వస్తుందోనని అభిమానులు ఆరాతీయడం మొదలెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల సూపర్ హిట్ సినిమాలు ఇలా రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీ స్త్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అది కాకుండా భారీ సినిమాలు అన్ని విడుదలకు ముందే ఓటీటీ అగ్రిమెంట్స్ చేస్తుండడంతో దేవరను ఎన్ని రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు అనే చర్చ మొదలైంది. దేవర సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో భారీ ధర కు కొనుగోలు చేసారు కాబట్టి త్వరగానే స్ట్రీమింగ్ చేస్తారని రకరకాల టాక్స్ వినిపించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేవర డిజిటల్ ప్రీమియర్ ను రిలీజ్ నైట్ నుండి 8 వారల తర్వాత మాత్రమే తీసుకువచ్చేలా అగ్గ్రిమెంట్స్ చేశారట మేకర్స్. అంటే సుమారు రెండు నెలల ఆ లెక్కన రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత నవంబరులో ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుంది దేవర.

మరొక మైలురాయిని చేరుకున్న దేవర.. ప్రీమియర్స్ ఈ రోజే
జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. థియేటర్లో దూకేందుకు ఎదురు చూస్తుంది.  ఇప్పటికే తెలుగు రాష్టాల బుకింగ్స్ దంచికొడుతున్నాయి. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్  నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్న దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర.  ఇక దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఉహింహిచిన దాని కంటే ఎక్కువ రాబట్టాయి. దేవర ఉత్తరఅమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్కును దాటింది ఇప్పటివరకు ప్రీమియర్ల ద్వారా వచ్చిన మొత్తం: $2.4M, డే – 1: $600K కలెక్ట్ చేసి మొత్తంగా M మార్క్ ను అందుకుంది దేవర. అలాగే టికెట్స్ పరంగా దేవర రికార్డు సృష్టించింది. గురువారం నాటికి దేవర 1,00,000 టిక్కెట్లు ప్రీ-సేల్స్‌తో విక్రయించబడ్డాయి. ప్రీమియర్స్ రూపంలోకి అత్యధిక ప్రీమియర్స్ గ్రాస్ రాబట్టిన సినిమాలలో ఆల్ టైమ్ టాప్-3 లో దేవర కొనసాగుతోంది. ఇంక దేవర దర్శనానికి మరికొద్ది గంటలు మాత్రమే ఉన్నాయి. 26న గ్రాండ్ ప్రీమియర్స్ లో విడుదల కానుంది దేవర. ఇప్ప్పటికే మూడు మిళియన్స్ రాబట్టిన దేవర ఫస్ట్ వీకెండ్ నాటికి $5 మిలియన్ రాబట్టే అవకాశం ఉంది. 6 ఏళ్ల తర్వాత యంగ్ టైగర్ సినిమా సోలో రిలీజ్ కానుంది, టాక్ ఎలా ఉన్న సరే దేవర కలెక్షన్స్ మాత్రం కాస్త భారీ నంబర్స్ ఉండే అవకాశం ఉంది