NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పాపికొండలు పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి ప్రారంభం..
పాపికొండల పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు.. దీంతో.. నాలుగు నెలల తర్వాత పాపికొండల పర్యటన తిరిగి ప్రారంభం కానుంది.. పాపికొండల పర్యటనలు పునః ప్రారంభించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. అందులో భాగంగానే ఎస్‌డీఆర్ఎఫ్ టీంతో మాక్ డ్రిల్ నిర్వహించారు.. ఈ సందర్భంగా రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ.. పాపికొండల పర్యటనలు శనివారం నుండి మొదలుకానున్నాయని.. అందులో భాగంగానే పాపికొండల బోట్లను తనిఖీ చేసిన అనంతరం మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని వెల్లడించారు.. గోదావరి నదిపై బోటు ఏ విధంగా డ్రైవ్ చేయాలని.. అదేవిధంగా ప్రమాదవశాత్తు గోదావరిలో పర్యాటకులకు ప్రమాదం జరిగితే.. వారిని ఏ విధంగా రక్షించాలి అనే అంశంపై ఎస్‌డీఆర్ఎఫ్‌ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ.. వాతావరణం సహకరిస్తే శనివారం నుంచే పాపికొండల పర్యటనలు మొదలవుతాయని పేర్కొన్నారు.. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో.. నేటి నుండి ప్రారంభంకానున్నాయి పాపికొండలు విహారయాత్రలు.. నాలుగు నెలల విరామం తర్వాత పాపికొండలు విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టూరిజం శాఖ.. ఈ న్యూస్‌ తెలియడంతో.. విహారయాత్రకు బయలుదేరివెళ్తున్నారు పర్యాటకులు.. దేవీపట్నం మండలం పోశమ్మ గండి నుండి బయలుదేరనున్నాయి పర్యాటకుల బోట్లు.. దీంతో.. పర్యాటకులతో సందడిగా మారింది దేవీపట్నం మండలం పోశమ్మ గండి ప్రాంతం..

తిరుపతి రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కున్న దంపతులు.. ఊపిరాడక ఇబ్బంది
తిరుపతి రైల్వే స్టేషన్‌లోని లిఫ్ట్ లో ఇరుక్కున్నారు దంపతులు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకున్న సాయిబాబు దంపతులు.. మొదటి గేట్ వద్ద లిఫ్ట్ లో నుండి కిందకు దిగుతుండగా లిఫ్ట్‌ ఆగిపోయింది.. దాదాపు 2 గంటల పాటు లిఫ్ట్‌లో తీవ్ర ఇబ్బంది పడ్డారు.. అయితే, టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేపట్టడంతో కిందకు దిగింది లిఫ్ట్‌.. దీంతో.. సురక్షితంగా బయటపడ్డారు లిఫ్ట్ లో ఇరుక్కున్న చీరాలకు చెందిన సాయిబాబు, రజని దంపతులు.. అయితే, లిఫ్ట్ పాడైతే ఎవరికి ఫోన్ చేయాలన్న ప్రాథమిక సమాచారం లేకపోవడంతో.. 108కు ఫోన్ చేశారు దంపతులు.. ఇక, రిజర్వేషన్ చేసుకుని చీరాలకు వెళ్లాల్సిన శబరి ట్రైన్ వెళ్లిపోవడంతో దంపతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.. మరోవైపు.. రెండు గంటలకు పైగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో బ్రీతింగ్ సమస్యతో ఇబ్బందిపడ్డారు సాయిబాబు భార్య రజని.. దంపతులకు ధైర్యం చెప్పిన ప్రయాణికులు.. మరోవైపు ధైర్యం చెబుతూ వచ్చారు.. మరోవైపు టెక్నీషియల్‌ మరమ్మతులు చేయడంతో.. ఆ దంపతులు సురక్షితంగా బయటకు రావడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, రైల్వే అధికారులు స్పందించలేదని తోటి ప్రయాణికులు మండిపడుతున్నారు..

రాజోలులో భూ వివాదం.. సర్పంచ్, వార్డు మెంబర్లపై రాపాక తోడల్లుడు దాడి..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఘర్షణ చోటు చేసుకుంది.. మల్కీపురం మండలం అడవిపాలెం గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో గ్రామ సర్పంచ్, ఆమె భర్త, వార్డు మెంబర్లపై దాడి జరిగింది.. 2021లో నూతనంగా ఏర్పడింది అడవిపాలెం పంచాయతీ.. అయితే, నూతన పంచాయతీకి భవనం లేకపోవడంతో 1 ఎకరం 96 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమిని సర్వే చేస్తున్న సమయంలో రగడ మొదలైంది.. కొంత మంది దళితులు 1 ఎకరం 96 సెంట్లు భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఇక, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు స్వయానా తోడల్లుడు ఎకరం 96 సెంట్లు భూమిలో కొంత భూమిని కబ్జా చేసి.. డూప్లెక్స్ భవన నిర్మాణం చేశారని.. ఎంపీ నిధులతో తన ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేయించారని విమర్శలు ఉన్నాయి.. అయితే, పంచాయతీ.. బోర్డు నెంబర్లు తీర్మానం మేరకు ప్రభుత్వ భూమి ఎకరం 96 సెంట్లు భూమిని సర్వే చేస్తున్న సమయంలో రగడ మొదలైంది.. సర్వేయర్‌కి సమీపంలో నిలబడి ఉన్న సర్పంచ్, ఆమె భర్త, వార్డు నెంబర్లపై మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తోడల్లుడు, అనుచరులు దాడి చేశారని చెబుతున్నారు.. ఈ ఘటనలో ఒకరికి తలకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.. క్షతగాత్రులను రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు..

గుస్సాడీ కనకరాజు మృతి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన కనకరాజు అసామాన్యుడు.. ఆయన మరణం తీరని లోటని తెలిపారు. గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించటంలోనూ కనకరాజు తన విశేష సేవలు అందించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న ఆదివాసీల కళను దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన కళాకారుడని.. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా, గుస్సాడీ కనకరాజుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల కోసం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ కనకరాజు(70) శుక్రవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. నేడు (శనివారం) మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రతి ఏటా దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అందరినీ అలరించే కనకరాజు ఈసారి పండగ ముందే మరణించడంతో ఆదివాసీ గూడెల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి గానూ 2021లో కనగరాజుకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డును ప్రదానం చేసింది.

ప్రయాణికులకు శుభవార్త.. 4 గంటల్లోనే శంషాబాద్ టూ వైజాగ్
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలక దశకు చేరుకుంది. శంషాబాద్‌- వైజాగ్ మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఫిక్స్ అయింది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ను నిర్మించబోతున్నారు. ఇది విశాఖ నుంచి ప్రారంభమై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌ కర్నూల్‌ మీదుగా కర్నూలుకు చేరుకుంటుంది. వీటి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్‌ సర్వే చివరి దశకు చేరకుంది. ఈ సర్వే నివేదికను నవంబరులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నట్లు తెలుస్తుంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ఇదే. ఈ మార్గంలో శంషాబాద్, రాజమండ్రి ఎయిర్ పోర్టులను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందిస్తుండటం మరో విశేషం. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్‌ రైళ్లలో స్వస్థలాలకు త్వరగా చేరుకునేలా రైల్వేశాఖ ప్లాన్ చేస్తుంది. గంటకు 220 కిలో మీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు కేవలం నాలుగు గంటల్లోపే చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. అలాగే, వందే భారత్‌ 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటోంది.

తమిళనాడు రాష్ట్ర గీతంపై మళ్లీ వివాదం.. డిప్యూటీ సీఎం కార్యక్రమంపై ప్రశ్నలు
తమిళనాడు రాష్ట్ర గీతం ‘తమిళ థాయ్ వాల్తు’పై మళ్లీ వివాదం నెలకొంది. ఈసారి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి సంబంధించిన అంశం. రాష్ట్ర గీతాన్ని తప్పుగా ఆలపించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ డిప్యూటీ సీఎంకు తమిళ తల్లి గుణపాఠం చెప్పిందని అన్నారు. అయితే ఈ ఆరోపణలను ఉదయనిధి తోసిపుచ్చారు. మైక్రోఫోన్ సరిగా పనిచేయడం లేదన్నారు. సాంకేతిక లోపం ఏర్పడింది. సచివాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఫెలోషిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి బ్యాచ్‌కు చెందిన 19 మంది ట్రైనీలకు కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు అందజేసారు (పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్) తొలిసారిగా తమిళ గీతం ఆలపించినప్పుడు అందులో లోపాలున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్‌.మురుగన్‌ చెప్పారు. రెండోసారి ప్రారంభించినప్పుడు కూడా తప్పుగా పాడారు. ఓవరాల్ గా ‘తమిళ థాయ్ వాల్తు’ కార్యక్రమంలో సరిగ్గా పాడలేదు.

వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలు పటిష్టం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశంలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. దీపావళి, చలి కారణంగా మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దీనిని ఎదుర్కొనేందుకు తమ సన్నాహాలను పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కాలుష్య సమస్య నుంచి సామాన్య ప్రజానీకానికి ఉపశమనం కలిగేలా ఆరోగ్య కార్యకర్తల సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం కూడా నొక్కి చెప్పింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖలకు రాసిన లేఖలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ.. ఇటీవల వాయు కాలుష్యం తీవ్రమైన ఆరోగ్య సవాలుగా మారిందని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గాలి నాణ్యత సూచిక మధ్యస్థం నుండి పేలవమైన స్థాయికి చేరుకుంది. రాబోయే పండుగల సీజన్, శీతాకాలం ప్రారంభాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ పరిస్థితి మరింత దిగజారవచ్చు. వాయుకాలుష్యం వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధులను డాక్టర్ గోయల్ తన లేఖలో ప్రస్తావించారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని, శ్వాసకోశ, గుండె, మెదడుకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతాయన్నారు. ఈ దీర్ఘకాలిక వ్యాధులు తరచుగా వాయు కాలుష్యానికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల అకాల మరణాలు పెరుగుతాయి. కాలుష్యం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే సమూహాల గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్ర ఆరోగ్య శాఖలు, ఆరోగ్య సౌకర్యాలు వారి సంసిద్ధతను పెంచాలని కోరారు. వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యంపై జాతీయ కార్యక్రమం కింద ప్రజల్లో అవగాహన ప్రచారాలను తీవ్రతరం చేయడం, స్థానిక భాషల్లో సందేశాలను వ్యాప్తి చేయడం, ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, వాయు కాలుష్య సంబంధిత వ్యాధుల కోసం నిఘా వ్యవస్థలలో పాల్గొనడం వంటివి ఇందులో ఉండాలి.

సమ్మర్ కు మైత్రీ మూవీస్ సినిమా వాయిదా..?
మైత్రీ మూవీస్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళుతోంది. అటు స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలను పంపిణీ చేస్తూ దూసుకెళుతోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. అందులో భాగంగా తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ తో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ (GBA) అనే సినిమాను చేస్తోంది. మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ సినిమా అందించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన అజిత్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా, సినిమాను మైత్రి నిర్మాతలు 2025 పొంగల్ కురిలిజ్ చేయాలని భావించారు. అందుకు అనుగుణంగా షూటింగ్ చక చక చేస్తోంది యూనిట్. తాజా సమాచారం ప్రకారం పొంగుల్ రేస్ నుండి గుడ్ బ్యాడ్ అగ్లీ తప్పుకుంది. అజిత్ కుమార్ మగిజ్ తిరుమేని దర్శకత్వంలో విదాముయార్చి అనే సినిమా కూడా  చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల 2024 చివరిలో లేదా 2025 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో రెండు సినిమాలు ఒకేసారి విడుదలకు అజిత్ సుముఖంగా లేడని అందుకోసమే రెండు రిలీజ్‌ల మధ్య గ్యాప్ మెయింటెయిన్ చేసేందుకు గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలు విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ విదాముయార్చి సంక్రాంతికి   విడుదలైతే, మైత్రీ మూవీస్ నిర్మించే  గుడ్ బ్యాడ్ అగ్లీ మూడు నెలల గ్యాప్ తర్వాత  వచ్చే ఏడాది సమ్మర్  లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లిట్ అవుతుంది.

అమరన్ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ ను టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని విడుదల చేసారు. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేసారు. ఈ రోజు సాయంత్రం 6 హైదరాబాద్ లోని ITC ఖోహినూర్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ వేడుకలో చిత్ర హీరోయిన్ సాయి పల్లవి హాజరుకానుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇటీవల కల్కి వంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా రానున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ మరియు ఎమోషన్ మిళితమై, “అమరన్” ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన  ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు అద్భుత స్పందన లభించింది. తెలుగులో ఈ సినిమాను యంగ్ హీరో నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ ద్వారా రిలీజ్ కానుంది. మేజర్ ముకుందన్ కు ఈ సినిమా ఘనమైన నివాళిగా యూనిట్ చెప్తోంది.

Show comments