NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మాగుంట కుటుంబంలో విషాదం.. మాగుంట పార్వతమ్మ కన్నుమూత..
టీడీపీ నేత, ఒంగోలు లోక్‌సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. ఒంగోలు మాజీ ఎంపీ, దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందారు.. దీంతో ఎంపీ మాగుంట ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.. కాగా, మాగుంట పార్వతమ్మ కావలి శాసనభ్యురాలిగా కూడా పనిచేశారు. చాలా సున్నితమైన స్వభావం కలిగిన నేతగా.. అందరని ఆదుకునే మనిషిగా గుర్తింపు పొందారు. అయితే, ఇటీవలే మాగుంట సుబ్బారామిరెడ్డి కుమారుడు కన్నుమూశాడు.. ఇప్పుడు మాగుంట పార్వతమ్మ చనిపోవడంతో.. ఆ కుటుంబంలో వరుస మరణాలు సంభవించి.. విషాదం నెలకొంది..

నేడు ఏపీ హైకోర్టులో కీలక కేసుల విచారణ..
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఈ రోజు ఓ కీలక కేసులో తీర్పు వెలువరించడంతో పాటు.. పలు కీలక పిటిషన్లపై విచారణ చేపట్టనుంది.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు.. కాగా, సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు తేలిపోయింది. తన కేసు కొట్టి వేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ క్వాష్‌ పిటిషన్‌ విచారణలో బాధితురాలు అయిన వరలక్ష్మి కూడా ఇంప్లీడ్‌ అయి తాము రాజీకీ వచ్చామని కేసు అవసరం లేదని చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. అయితే ఈ కేసులో ఈ రోజు తీర్పు ఇవ్వనుంది హైకోర్టు.. మరోవైపు.. సంచలనం సృష్టించిన ముంబై సినీ నటి జిత్వానీ కేసులోనూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.. హైకోర్టులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.. జిత్వానీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు గున్ని.. ఆ పిటిషన్‌ నేడు హైకోర్టులో విచారణకు రానుంది.. ఇక, ఏపీ హైకోర్టులో జోగి రమేష్ బాబాయ్ జోగి వేంకటేశ్వర రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏ1గా ఉన్న జోగి వేంకటేశ్వర రావు వేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేయనుంది హైకోర్టు.. అయితే, జోగి రాజీవ్ ను అరెస్టు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్నారు జోగి వేంకటేశ్వర రావు.. మరోవైపు.. హైకోర్టులో సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ, సీఐడీ కేసుల్లో నిందితుడుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు.. ఆ పిటిషన్లపై కూడా నేడు విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు..

ఒంగోలు కలకలం.. మాజీ మంత్రి బాలినేని ఫ్లెక్సీల చించివేత..
ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలకలం రేగింది.. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. అయితే, ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.. ఇప్పటికే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిగిన బాలినేని.. రేపు పవన్ కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు.. ఇక, బాలినేని జనసేనలో చేరిక సందర్భంగా నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బాలినేని అభిమానులు.. కానీ, తెల్లవారేసరికి నాలుగైదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.. అయితే, జనసేన ఫ్లెక్సీల చింపివేతపై ఆ పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి సంస్కృతి మంచిది కాదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..

నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క..
నేడు మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ములుగు గడిగడ్డ ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్ ను పరిశీలించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఏటూరునాగారంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చల్పాక గ్రామం, ఏటూరునాగారంలలో పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు ములుగు కలెక్టరేట్ లో మేడారం మినీ జాతరపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇక, సాయంత్రం 5:00 గంటలకు ములుగు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించనున్నారు. చివరగా సాయంత్రం. 6 గంటలకు జాకారం గ్రామంలోని వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు మంత్రి సీతక్క బహుమతులు ప్రదానం చేయనున్నారు.

గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం..
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో జంట జలాశయాలు నిండు కుండలుగా కనిపిస్తున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. గండిపేట (ఉస్మాన్ సాగర్) ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789.90 అడుగులుగా ఉంది. శంకర్ పల్లి, పొద్దుటూర్, చేవెళ్ళ, మొయినాబాద్, మోకిలా ప్రాంతాల నుంచి భారీ వరద నీరు గండిపేట జలాశయానికి వచ్చి చేరుతుంది. కాగా, హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.60 అడుగుల వద్ద కొనసాగుతుంది. తాండూర్, వికారాబాద్, షాబాద్, వెంకటాపూర్ నుంచి భారీగా వరద ప్రవాహం హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ కు చేరుతుంది. గండిపేట జలాశయంకు భారీగా వరద నీరు రావడంతో రెండు క్రస్ట్ గేట్లు ఫీట్ వరకు ఎత్తి నీటిని దిగివకు విడుదల చేసిన జల మండలి అధికారులు.

నేడు హర్యానాలో ఎన్నికల పోరులోకి దిగనున్న మోదీ… గోహనాలో ర్యాలీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. దీనికి ముందు ప్రతి పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈరోజు హర్యానాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ ఈ సమాచారం ఇస్తూ బుధవారం (సెప్టెంబర్ 25) గోహనాలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ ఉంటుందని, ఇందులో 22 అసెంబ్లీలకు చెందిన కార్యకర్తలు, అభ్యర్థులు పాల్గొంటారని తెలిపారు. ప్రధాని మోదీ 22 అసెంబ్లీలలో ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ర్యాలీలో కార్యకర్తలు, అభ్యర్థులు పాల్గొంటారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్‌లో కూడా పోస్ట్ చేశారు. బుధవారం 12 గంటలకు ర్యాలీ నిర్వహిస్తామని మంగళవారం ఎక్స్ రాశారు. ‘హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని గట్టిగా నిర్ణయించుకుంది’ అని ప్రధాని మోదీ రాశారు. ప్రజాస్వామ్య వేడుకల్లో ఈ ఉత్సాహ వాతావరణం మధ్య రేపు మధ్యాహ్నం 12 గంటలకు సోనిపట్‌లో జరిగే ర్యాలీలో ప్రజల మన్ననలు పొందే భాగ్యం మనకు కలుగుతుంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసిన వెంటనే ఈ ర్యాలీ జరగనుంది. హర్యానా ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.

పూరీ ఆలయంలో నెయ్యి నాణ్యత పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో ప్రసాదం వ్యవహారం పతాక శీర్షికల్లో నిలుస్తోంది. ప్రసాద్ లడ్డూలలో కొవ్వు పదార్థాన్ని ఉపయోగించడం పట్ల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాలు కూడా వేగంగా సాగుతున్నాయి. పూరీ జగన్నాథ ఆలయంలో ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించనున్నారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి దేవస్థానంలాగా ఇక్కడ ఎలాంటి ఆరోపణలు చేయలేదని పూరీ డీఎం సిద్ధార్థ్ శంకర్ స్వైన్ తెలిపారు. కానీ, 12వ శతాబ్దానికి చెందిన ఆలయంలో భోగ్ తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతను అధికారులు తనిఖీ చేస్తారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఒడిశా మిల్క్ ఫెడరేషన్ (OMFED) పూరీ ఆలయంలో ఉపయోగించే నెయ్యి సరఫరాదారు. సిద్ధార్థ్ శంకర్ స్వైన్ మాట్లాడుతూ.. కల్తీకి సంబంధించిన ఏదైనా అవకాశాన్ని తొలగించడానికి, OMFED ద్వారా సరఫరా చేయబడే నెయ్యి ప్రమాణాన్ని తనిఖీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. OMFEDతో పాటు, ‘ప్రసాదం’ సిద్ధం చేసే ఆలయ సేవకులతో కూడా చర్చ ఉంటుంది. మరోవైపు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రసాదంలో కొవ్వు కూరుకుపోయిందన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

చెపాక్‌లో ఎన్నడూ చూడని దృశ్యాలు.. మరి కాన్పూర్‌ పిచ్‌ సంగతేంటి?
సాధారణంగా చెన్నైలోని చెపాక్‌ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంటుంది. స్పిన్నర్లు చెపాక్‌లో పండగ చేసుకుంటారు. అయితే భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో మాత్రం బంతి బాగా బౌన్స్‌ అయింది. ఎన్నడూ లేనివిధంగా పేసర్లు ప్రమాదకరంగా మారారు. తొలి రెండు రోజులు పేసర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు పెను సవాలుగా మారింది. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఆలస్యంగా మొదలైంది. చెన్నైలో పేసర్లు అంత జోరు చూపించడం ఆటగాళ్లకే కాదు అభిమానులకూ ఆశ్చర్యాన్ని కలిగించింది. చెపాక్‌లో ముంబై నుంచి ఎర్రమట్టి తెచ్చి కొత్తగా ఓ పిచ్‌ను తయారు చేయడమే ఇందుకు కారణం. ఇక రెండో టెస్టుకు వేదిక కానున్న కాన్పూర్‌లో వికెట్‌ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. రెండో టెస్టు కోసం భారత్, బంగ్లాదేశ్‌ జట్లు కాన్పూర్‌ చేరుకున్నాయి. ఇరుజట్లు గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తాయి. 27న టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుంది. కాన్పూర్‌ పిచ్‌ సంప్రదాయ శైలిలోనే స్పందిస్తుందని తెలుస్తోంది. ఎప్పట్లాగే బ్యాటర్ల హవా నడుస్తుందని, పరుగుల వరద పారుతుందట. మ్యాచ్‌ సాగే కొద్దీ స్పిన్నర్ల ప్రభావం పెరుగుతుంది. కాన్పూర్‌లో పిచ్‌ నల్లమట్టితో కూడి ఉంటుంది. ఈ పిచ్‌పై బంతి ఎక్కువగా బౌన్స్‌ కాదు. దీంతో బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్ ఆడొచ్చు. అయితే మ్యాచ్‌ సాగేకొద్దీ బంతి బాగా తిరుగుతుంది. చివరి రెండు రోజులు స్పిన్నర్లకు సహకరిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వానికి దేవర నిర్మాతల దరఖాస్తు.. ఎందుకోసమంటే..?
నందమూరి తారక రామారావు, జాన్వీ కపూర్ జోడిగా నటిస్తున్న చిత్రం దేవర. మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో దిగబోతోంది. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ స్టార్ట్ చేసారు. బుకింగ్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధిక ధరలకు టికెట్స్ అమ్ముకునేలాగా ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. తెలంగాణలో మొదటి రోజు ముల్టీప్లెక్స్ లో రూ. 413 రెండవ రోజు నుండి రూ. 354, ఇక సింగిల్ స్క్రీన్స్ లో రూ. 295, రెండవ రోజు నుండి రూ. 206.5 ఉండేలా అలాగే మొదటి రోజు 7 షోలు ప్రదర్శించేలా అనుమతులు పొందారు మేకర్స్. అటు ఆంధ్రాలోను మల్టిప్లెక్స్ లో రూ. 135, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 100 టికెట్స్ ధరలు పెంచుతూ జిఓ విడుదల చేసారు అధికారులు. కాగా తెలంగాణ ప్రభుత్వానికి దేవర నిర్మాతలు మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. రెండో రోజు నుంచి ఇచ్చిన రేట్లు చాలవని, పెంచమని మళ్లీ ప్రభుత్వాన్ని కోరారు. నిర్మాతలు. దాదాపు అనుకూలంగా జీఓ వచ్చే వీలుంది. హైదరాబాద్ సిటీ మల్టీ ప్లెక్స్ లు అన్నింటిలో పది రోజుల పాటు రూ. 100 రూపాయల అదనపు పెంపు ఉందనున్నట్టు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్ లు మాత్రం మొదటి రోజు మాత్రం 100 రూపాయల అదనపు పెంపు వుంటుంది. ఒంటి గంట స్పెషల్ షోలకు ప్రభుత్వం నుంచి వేరే రేట్ లేదు అవి ఫ్యాన్స్ షోలు కాబట్టి వారికి నచ్చినట్టు వారు అమ్ముతున్నారు. ప్రస్తుతం బుకింగ్స్ ట్రెండ్స్ మాత్రం అన్ని ఏరియాలలో భారీ ఎత్తున జరుగుతున్నాయి.

ఏపీ / తెలంగాణ దేవర అడ్వాన్స్ సేల్స్ వివరాలు..
యంగ్ టైగర్ ఎన్టీయార్ మరోరెండు రోజుల్లో థియేటర్లలో దిగబోతుంది.  ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అటు ఆంధ్రాలోనూయి దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన  దేవర బుకింగ్స్ ను ఒకేసారి పరిశీలిస్తే
1. దేవర Bookmyshow లో ఇప్పటివరకు బుక్ అయిన టికెట్స్ ట్రాకింగ్ గమనిస్తే
Sept 22 : 36.29K+
Sept 23 : 106.92K+
Sept 24 : 363.12K+
మొత్తం బుక్ అయిన టికెట్స్ – 506.33K+
2. Hyderabad అడ్వాన్స్ సేల్స్
మొత్తం షోస్  – 1168
గ్రాస్ – 11.08 Cr
ఆక్యుపెన్సీ – 76%
3. నైజాం మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్
మొత్తం షోస్ – 1416
గ్రాస్ -రూ. 12. 53 కోట్లు
ఆక్యుపెన్సీ – 69%
4. ఆంధ్ర, తెలంగాణ మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ చుస్తే
మొత్తం షోస్ – 2887
గ్రాస్ – 21.61 Cr
ఆక్యుపెన్సీ – 70%
5. హైదరాబాద్ టాప్ – 4 అడ్వాన్స్ సినిమాల ఇవే
Kalki2898AD – 17.6 Cr – 1608 షోస్ – 93%
సలార్ – 12.5 కోట్లు – 1105  షోస్ – 94%
దేవర – 11.08 Cr – 1168 షోస్ – 76%
గుంటూరు కారం – 11.06 Cr – 1314 షోస్  – 72%