NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. నేడు మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాసేపట్లో వాజపేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశానికి హాజరుకానున్నారు చంద్రబాబు.. అటు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విడివిడిగా భేటీ కానున్నారు. ఆతర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌తో రాష్ట్ర అంశాలపై చర్చించనున్నారు. ఇటీవలే ఏపీ రాజధాని కోసం మంజూరైన రైలుమార్గం పనులు.. వీలైనంత వేగంగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని.. రైల్వేమంత్రిని కోరనున్నారు చంద్రబాబు. అటు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ఆర్థిక తోడ్పాటుతో పాటు పెండింగ్ నిధుల విడుదలపైనా.. కేంద్ర ఆర్థికమంత్రితో చర్చించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. కాగా, రెండు రోజుల దేశ రాజధాని పర్యటన కోసం నిన్న రాత్రే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్న విషయం విదితమే..

మరో 3 రోజులు ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాలో భారీవర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని వాతావరణశాఖ చెబుతోంది. ఉత్తర భారతం మీదుగా వెళుతున్న పశ్చిమ ద్రోణి అల్పపీడనాన్ని, తేమను తనవైపు లాగడానికి ప్రయత్నిస్తోంది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలకు అవకాశం ఉంది. శనివారం నుంచి వర్షాలు తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడా జల్లులు కురుస్తాయి. ఇక అల్పపీడనం కారణంగా ఏపీలోని అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అల్పపీడనం తీరానికి సమీపంలో ఉండటంతో తీర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఏపీలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి.

అమరావతికి రైల్వే లైన్‌.. ఫోకస్‌ పెట్టిన ఏపీ సర్కార్‌..
అమరావతి కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటుకు భూ సేకరకణ కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రతిపాదిత భూ సేకరణపై ఏమైనా అభ్యంతరాలుంటే 2025 జనవరి 16వ తేదీలోపు తెలపాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వేలైను కోసం.. 297 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల, పరిటాల, వీరులపాడు మండలం పెద్దాపురం, గూడెం మాధవరం, జుజ్జూరు, నరసింహారావుపాలెం, చెన్నారావుపాలెం, అల్లూరులోభూ సేకరణ జరపనున్నారు. అయితే, రైల్వే లైను ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూముల్లో 99 శాతం ప్రైవేటు భూములే ఉన్నాయి. ఇందులో ఒకటి రెండు దేవదాయ భూములు ఉన్నాయి. మరోవైపు నోటిఫికేషన్ తర్వాత న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న వాటిని పరిష్కరించటం కోసం అధికారులు మార్గాలు వెతుకుతున్నారు. ఇటు భూములను గుర్తించి నోటిఫికేషన్ కూడా ఇవ్వటంతో ఇకపై గ్రామ సభలను ఏర్పాటు చేసి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. మొత్తం ప్రక్రియకు ఆరు నెలలు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది..

నేడు మెదక్‌ జిల్లాలో ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్‌, సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
నేడు మెదక్ జిల్లాలో పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. ఇవాళ వేర్వేరు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో కొల్చారం సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. సీఎం రేవంత్ తో పాటు హెలికాప్టర్ లో మెదక్ కి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ రానున్నారు. అక్కడి నుంచి వాహనంలో ఏడు పాయల ఆలయానికి వెళ్లి అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మెదక్ క్యాథెడ్రిల్ చర్చిలో వందేళ్ల వేడుకలో పాల్గొని క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఒంటిగంటకు తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ పయనం కానున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌ మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో తునికి కృషి విజ్ఞాన కేంద్రానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకోనున్నారు. ఉప రాష్ట్రపతికి మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ స్వాగతం పలకనున్నారు. సేంద్రియ పంటలు పండిస్తున్న 500 మంది రైతులు, ఆసక్తి ఉన్న మరో 300 మందితో ఉపరాష్ట్రపతి మాట్లాడుతారు. సేంద్రియ పంటలు పండిస్తున్న విధానాన్ని పరిశీలించి ఎగ్జిబిషన్ తిలకించనున్నారు. సాయంత్రం 4.20 గంటలకు మెదక్ పర్యటన ముగించుకొని ఉపరాష్ట్రపతి తిరిగి హైదరాబాద్ పయనం కానున్నారు.

వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య..
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఘటన నగరంలో కలకలం రేపుతుంది. వరంగల్ నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో శ్రీదేవి (16) అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుకుంటుంది. ఏకశిలా గర్ల్స్ హాస్టల్ లోనే శ్రీదేవి ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి శ్రీదేవి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీదేవి ఎంత సేపటికి గది తలుపులు తెరవక పోవడంతో రూమ్మేట్స్ ఏకశిలా గర్ల్స్ హాస్టల్ యాజమాన్యానికి తెలిపారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం గది తలుపులు తెరిచి చూడగా శ్రీదేవి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. అయితే శ్రీదేవిని కిందికి దించగా అప్పటికే మృతిచెందింది. దీంతో యాజమాన్యం శ్రీదేవి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే శ్రీదేవి మృతి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియడంతో హాస్టల్‌ వద్దకు వచ్చి యజమాన్యానికి నిలదీశారు.

నేడు ఎన్డీఏ కూటమి కీలక భేటీ.. అమిత్‌షా వ్యాఖ్యలతో ప్రాధాన్యత..!
ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ భేటీ జరగనుంది.. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు మిగతా ఎన్డీఏ పక్షాల నేతల కూడా ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు.. ప్రతి ఏడాది మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఎన్డీఏ కూటమి పక్షాలు సమావేశం కావడం మామూలే అంటున్నాయి బీజేపీ వర్గాలు.. ప్రతి ఏడాది లాగానే, ఈ ఏడాది కూడా, వాజ్‌పేయి శతజయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన “ప్రార్ధనా కార్యక్రమానికి” హాజరు కావాలని ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలను ఆహ్వానించామని బీజేపీ వర్గాలు చెబుతున్నమాట.. కానీ, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయాన్ని మరింతగా దృఢతరం చేసేందుకు జరుగుతున్న సమావేశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. బాబా సాహెబ్ అంబేద్కర్ పై కేంద్రహోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన నేపథ్యంలో, ఈరోజు జరుగుతున్న ఎన్డీఏ పక్షాల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలకు భాగస్వామ్యపక్షాల నేతల మద్దతు పూర్తిగా ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.. అలాగే, ఈరోజు జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు ప్రతిష్ఠాత్మక బిల్లులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది..“వక్ఫ్ సవరణ బిల్లు”, “ఒకే దేశం, ఒకే ఎన్నిక” “129 వ రాజ్యాంగ సవరణ బిల్లు”పై భాగస్వామ్యపక్షాల నేతలతో అధికార ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ చర్చించబోతోంది.

రాత్రికి రాత్రే ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్.. 15 మంది మృతి
ఇటీవల ఉగ్రదాడి ఘటనలతో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు తాజా పరిణామంలో ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. మీడియా కథనాల ప్రకారం మంగళవారం రాత్రి ఈ దాడి జరిగింది. పాకిస్తాన్ చేసిన ఈ వైమానిక దాడిలో ఇప్పటివరకు 15 మంది మరణించారు. వీటిలో చాలా మంది మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తలదాచుకున్న పాకిస్థానీ తెహ్రీక్-ఏ-తాలిబాన్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో లామన్‌తో సహా ఏడు గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ వైమానిక దాడి తర్వాత భారీ నష్టం జరిగింది. ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ మంగళవారం అరుదైన వైమానిక దాడుల్లో పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక అనుమానిత పాకిస్తానీ తాలిబాన్ లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. వారి శిక్షణా కేంద్రాలలో ఒకదానిని పూర్తిగా ధ్వంసం చేసింది. కొంతమంది తిరుగుబాటుదారులను చంపింది. బాంబు దాడికి పాకిస్థాన్ జెట్ విమానాలను ఉపయోగించారు. పాకిస్థాన్ సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న అతను అరబ్ న్యూస్‌తో ఈ విషయాలు చెప్పాడు. మార్చి తర్వాత పాకిస్థాన్ తాలిబాన్ స్థావరాలపై దాడి చేయడం ఇది రెండోసారి. మార్చిలో ఆఫ్ఘనిస్తాన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లోని తాలిబాన్ స్థానాలపై దాడి చేసినట్లు పాకిస్తాన్ అంగీకరించింది.

ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పను: రోహిత్‌ శర్మ
బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా కాకుండా.. మిడిలార్డర్లో ఆడుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో కేఎల్ రాహుల్‌ రాణించడంతో.. హిట్‌మ్యాన్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లో రోహిత్ విఫలమయ్యాడు. మిడిలార్డర్లో హిట్‌మ్యాన్ విఫలమవుతుండడంతో తిరిగి ఓపెనర్‌ అవతారం ఎత్తుతాడా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. దీనిపై రోహిత్‌ను ప్రశ్నిస్తే.. తాను జవాబు చెప్పను అని తెలిపాడు. గురువారం ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ విలేకరులతో మాట్లాడాడు. మీరు మరలా ఓపెనర్‌గా ఆడుతారా? అనే ప్రశకు రోహిత్‌ శర్మ మాట్లాడుతూ… ‘జట్టులో ఎవరు ఎక్కడ ఆడతారు అనే దానిపై చింత అక్కర్లేదు. దాని గురించి ఇక్కడ చర్చ అనవసరం. మేం అంతర్గతంగా మాట్లాడకుంటాం, జట్టుకు ఏది ఉత్తమమో మాకు తెలుసు. ఇక్కడ ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పను’ అన్నాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడే బంతులను విరాట్ కోహ్లీ వెంటాడి ఔటవడంపై హిట్‌మ్యాన్ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ ఆధునిక దిగ్గజం అని మీరే అంటున్నారు కదా. అలాంటి గొప్ప ప్లేయర్ తమ సమస్యను తామే పరిష్కరించుకోగలడు. అతడిపై నమ్మకం ఉంది. విరాట్ పరుగులు చేస్తాడు’ అని ధీమా వ్యక్తం చేశాడు.

కనులవిందుగా సింధు, సాయి రిసెప్షన్.. అతిథులుగా అగ్ర తారలు!
భారత బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయిల వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌ సాగర్‌ సరస్సులో ఉన్న రఫల్స్‌ హోటల్‌లో డిసెంబర్ 22 రాత్రి 11.20కి సింధు, సాయిలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. మంగళవారం పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్ ఘనంగా జరిగింది. రాజకీయ, సినిమా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వివాహ విందుకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. హైదరాబాద్ ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ సమీపంలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన రిసెప్షన్‌కు తెలంగాణ సీఎం సీఎం రేవంత్‌ రెడ్డి హాజరై నూతన జంట సింధు, సాయిలను ఆశీర్వదించారు. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ కొత్త జంటకు ఆశీస్సులు అందించారు. భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా.. బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు గురుసాయి దత్.. షట్లర్లు ప్రణయ్, చిరాగ్‌ శెట్టిలు పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్‌కు హాజరయ్యారు. సినీ తారలు చిరంజీవి, నాగార్జున, అజిత్‌, ఆలీ, అర్జున్, మృణాల్‌ ఠాకూర్ తదితరులు నూతన జంటను ఆశీర్వదించారు. హరీష్‌ రావు, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, సుజనా చౌదరి, ఏపీ జితేందర్‌రెడ్డి, చాముండేశ్వరీనాథ్, శైలజా కిరణ్‌, బృహతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సూర్య కల్ట్ టైటిల్ రివీల్ చేసేందుకు టైం ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను రీసెంటుగా నటించిన సినిమా కంగువ. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ నుంచి సూర్య బయటకు వచ్చాడు. శివ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కంగువ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. సినిమాకు అన్ని చోట్ల తగిన రెస్పాన్స్ రాలేదు. తమిళ తంబీలు ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్నా కూడా అవి ఏ మాత్రం నెరవేరలేదు. కంగువ తర్వాత సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సూపర్ బజ్ ఏర్పడింది. కార్తీక్ సుబ్బారాజ్ మేకింగ్ స్టైల్ కి కోలీవుడ్ లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అతని సినిమా ల్లో మాస్ యాక్షన్ కూడా బలమైన ఎమోషన్ ఉంటుంది. సూర్య 44 సినిమాకు కూడా అదే ప్లస్ అయ్యేలా ఉందంటున్నారు. సూర్య 44 సినిమా కు టైటిల్ గా రెండు పేర్లు ఫైనల్ చేసి పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ రెండు టైటిల్స్ కూడా మీడియాకు లీక్ అయ్యాయి. సూర్య 44 సినిమాకు కార్తీక్ మొదటగా జానీ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. జానీ అంటే రజిని ఒకప్పటి సూపర్ హిట్ సినిమా.. అంతేకాదు పవర్ స్టార్ కూడా ఆ టైటిల్ తో సినిమా తీశాడు. ఒకవేళ అది కాదు అనుకుంటే మాత్రం కల్ట్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. జానీ, కల్ట్ రెండు టైటిల్స్ సూర్య ఫ్యాన్స్ కి నచ్చేశాయ్ అయితే.. ఫ్యాన్స్ ఎక్కువ మంది మాత్రం మెజారిటీ గా కల్ట్ టైటిల్ కి ఓకే చెబుతున్నారట. సూర్య కార్తీక్ సుబ్బరాజు కాంబో సినిమాకు కల్ట్ టైటిల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ సినిమా లో సూర్య వింటేజ్ మాస్ లుక్ తో ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ అందిస్తారని తెలుస్తుంది. సినిమా లో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో అమ్మడు గ్లామర్ పరంగా కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందని టాక్. మరి సూర్య కల్ట్ బొమ్మ చూసేందుకు ఫ్యాన్స్ అంతా రెడీ గా ఉన్నారు. సినిమా అంచనాలకు మించి ఇచ్చేందుకు వాళ్లు రెడీ అవ్వాల్సి ఉంటుంది. సూర్య 44 టైటిల్ ని క్రిస్మస్ కానుకగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మళ్లీ తెరపైకి ఆటోజానీ.. సెకండ్ ఆఫ్ ఛేంజ్ చేస్తున్న పూరీ
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు పదేళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఆయన కంబ్యాక్ వాస్తవానికి డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో జ‌ర‌గాల్సింది. కానీ అప్పుడ‌ది వీలుకాలేదు. పూరి వ‌ద్ద స‌రైన క‌థ సిద్దంగా లేక‌పోవ‌డంతో ఆ అవకాశం ఖైదీ నం.150తో వి.వి.వినాయ‌క్ కు వెళ్లిపోయింది. అప్పటి నుంచి చిరంజీవితో సినిమా చేసేందుకు పూరి వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఆటోజానీ’ స్టోరీ వినిపించారు. ప్రధ‌మార్ధం క‌థ వ‌ర‌కూ ఒకే ..కానీ సెకండాఫ్ బాగోలేదని చిరంజీవి మార్పులు సూచించారు. కానీ ఆ మార్పుల‌తో పూరి మ‌ళ్లీ అప్రోచ్ అవ్వలేదు. అలా సంవత్స‌రాల కాలం గ‌డిచిపోయింది. ఈ ప్రాసెస్ లో చిరంజీవి చాలా మంది డైరెక్టర్ల‌తో సినిమాలు చేసారుగానీ పూరి తో మాత్రం సినిమా చేయలేకపోయారు. చివరికి చిరంజీవి కోర‌డంతో గాడ్ ఫాద‌ర్ సినిమాలో పూరి నే ఓ చిన్న గెస్ట్ రోల్ చేశారు. అన్నయ్య మాట కాద‌న‌లేక పూరి తొలిసారి ఓ సినిమాలో గెస్ట్ అపీరియ‌న్స్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మ‌ధ్య ఆ బాండింగ్ అలాగే ఉంద‌ని అభిమానుల‌కు అర్థం అయింది. అయితే పూరి ఇప్పుడు మ‌ళ్లీ ‘ఆటోజానీ’ని తెర‌పైకి తెస్తున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం. మెగాస్టార్ కోరిక మేర‌కు ‘ఆటోజానీ’ క‌థ సెకండాఫ్ లో పూర్తి మార్పులు చేస్తున్నారట పూరీ. ఇటీవ‌లే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప‌నులు ప్రారంభించారట. తొలుత గోపీచంద్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ క‌థ రెడీగా ఉందట. కానీ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందట. ఈ గ్యాప్ లో ‘ఆటోజానీ’ క‌థ‌లో మార్పుల‌కు క‌లం ప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూరి ఫోక‌స్ అంతా ఆ సినిమాపైనే ఉంద‌ంటున్నారు. స్టోరీలు రాయ‌డంలో పూరి వెరీ ఫాస్ట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయ‌న ఎక్కువ‌గా స‌మ‌యం తీసుకుని రాసినా? తీసుకోకుండా రాసినా? స‌రైన లైన్ దొరికిందంటే ఇట్టే కథ అల్లేస్తారు. మెగాస్టార్ తో పూరి సినిమా అన్నది ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నారు. 150 కాక‌పోతే 160 అని..క‌చ్చితంగా అన్నయ్యతో సినిమా తీసి తీరుతాన‌ని అప్పట్లోనే స‌వాల్ విసిరారు. అందుకు స‌మ‌యం ఇప్పుడు ఆసన్నమైంది. పూరి కంబ్యాక్ ‘ఆటో జానీ’తో గ్రాండ్ గా ఉంటుంద‌ని తన స‌న్నిహితులు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు.

Show comments