ఒంగోలులో అర్ధరాత్రి భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా కంపించింది భూమి.. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్టు చెబుతున్నారు.. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో భూమి కనిపించినట్లు చెబుతున్నారు స్థానికులు.. అయితే, రాత్రి సమయం కావటంతో స్థానికులు గుర్తించేలోపే భూ ప్రకంపనల తీవ్రత తగ్గినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు.. స్థానికుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు.. కాగా, ప్రకాశం జిల్లాలో గతంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం విదితమే.. ఈ ఏడాది మే నెలలో ఓసారి.. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఓసారి ప్రకాశం జిల్లా ప్రజలను భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి..
నేడు వైఎస్ జగన్ కీలక సమావేశం..
గత సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ గేరు మార్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఫలితాలు వచ్చిన తొలి నెల నుంచే పార్టీ కేడర్ తో పాటు లీడర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. కార్యకర్తల నుంచి కీలక నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.. ఈ క్రమంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరగనుంది.. సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరుకానున్నారు.. ఇప్పటికే వరుసగా సమావేశాలు.. మరోవైపు జిల్లా పర్యటనలతో పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్న వైఎస్ జగన్.. ఇంకా వైపు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కూడా ఉధృతం చేశారు.. మీకు అండగా నేను ఉంటానంటూ జగన్ 2.0ను పరిచయం చేశారు జగన్..
దసరా ఉత్సవాలు 3వ రోజు.. అన్నపూర్ణాదేవిగా బెజవాడ దుర్గమ్మ..
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఇక, మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. నేడు మూడవ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతోంది. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. ఈ రోజు అమ్మవారికి నైవేధ్యంగా పరమాన్ణం, బూరెలు సమర్పిస్తారు..
మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత.. తెలంగాణకు భారీగా వరద నీరు
తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రధాన జలాశయాలకు ఎగువ ప్రాంతాల వర్షాల కారణంగా భారీగా నీరు చేరుతున్నాయి. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నదిలోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. దీనితో అధికారులు 40 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 2,15,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,51,000 క్యూసెక్కులు నమోదయ్యాయి. పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1086.10 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 66.937 టీఎంసీల నిల్వ ఉంది. అలాగే సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. ఎగువ వర్షాల కారణంగా అధికారులు 7 స్పిల్ వే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 59,067 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 58,870 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 16.624 టీఎంసీలుగా ఉంది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీనితో అధికారులు 13 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 56,289 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,01,351 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1402.34 అడుగుల వద్ద నీటి మట్టం నిల్వ ఉంది. పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.123 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పాట్నాలో నేడు సీడబ్ల్యూసీ మీటింగ్.. ఓట్ల చోరీ.. ఎన్నికల వ్యూహంపై చర్చ
బీహార్ ఎన్నికల నేపథ్యంలో పాట్నాలో తొలిసారి కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల వ్యూహం, ఓట్ల చోరీ, ట్రంప్ సుంకాలు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. స్వాతంత్య్రానంతర కాలంలో బీహార్‌లో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి అని ఆ పార్టీ నాయకులు తెలిపారు. పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో బుధవారం ఉదయం 10 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శులు దీపా దాస్ మున్షీ, సయీద్ నాసిర్ హుస్సేన్ సహా అగ్ర కాంగ్రెస్ నాయకుంతా ఈ సమావేశానికి హాజరవుతారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉందని పేర్కొంది.
తైవాన్, చైనాలో తుఫాన్ విధ్వంసం.. 17 మంది మృతి
రాగస తుఫాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు 200 కి.మీ వేగంతో గాలులు వీచడంతో ప్రధాన పట్టణాలన్నీ అతలాకుతలం అయ్యాయి. తుఫాన్ కారణంగా తైవాన్‌లో 14 మంది, ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. వసతులు ఏర్పాటు చేశారు. ఇక హాంకాంగ్‌లో అనేక పాఠశాలలు మూసివేయబడ్డాయి. అలాగే విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. అనేక దుకాణాలు మూసేశారు. నిత్యవసర వస్తువులు స్తంభించిపోయాయి. అలాగే జనజీవనం కూడా అస్తవ్యస్థంగా మారింది. ఈ మధ్య కాలంలో ఇదే అత్యంత శక్తివంతమైన తుఫాన్‌ల్లో రాగస తుఫాన్ ఒకటి అని అధికారులు పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున హాంకాంగ్ విహార ప్రదేశాలపై దీపస్తంభాల కంటే ఎత్తైన అలలు ఎగసిపడ్డాయి. అలాగే తైవాన్, ఫిలిప్పీన్స్‌లో కూడా తీవ్ర విధ్వంసం సృష్టించింది.
ట్రంప్, మెలానియాకు అవమానం! సడన్‌గా ఆగిన యూఎన్ ఎస్కలేటర్ రైడ్.. వైట్‌హౌస్ సీరియస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియాకు ఐక్యరాజ్యసమితిలో షాకింగ్ పరిణామం ఎదురైంది. యాదృచ్ఛికమో.. లేదంటే కావాలనే జరిగిందో తెలియదు గానీ.. యూఎన్ కార్యాలయంలో ట్రంప్, మెలానియా ఎస్కలేటర్ ఎక్కగానే హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో ట్రంప్, మెలానియా ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఏమైంది? అంటూ ట్రంప్ ప్రశ్నించారు. ఇంకా చేసేదేమీలేక మెలానియా నడుచుకుంటూనే పైకి వెళ్లిపోయారు. మెలానియా వెంట ట్రంప్ కూడా నడుచుకుంటూ పైకి వెళ్లిపోయారు. ఎస్కలేటర్ దిగగానే ట్రంప్ ఏమైందంటూ మరోసారి చేతి సైగలు చేశారు. అయితే ఈ పరిణామంపై వైట్‌హౌస్ సీరియస్ అయింది. ఉద్దేశపూర్వకంగా జరిగిందంటూ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 23 (మంగళవారం) నుంచి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు మెలానియాతో కలిసి ట్రంప్ యూఎన్‌కు వచ్చారు. ఇద్దరూ కలిసి ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్లబోతుండగా సడన్‌గా ఆగిపోయింది. దీంతో ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. అయితే యూఎన్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
USA క్రికెట్ బోర్డు సభ్యత్వం సస్పెండ్.. ICC కీలక నిర్ణయం
అమెరికా (USA) క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తక్షణమే సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 23న వర్చువల్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ఐసీసీ కమిటీ. 2024లో జరిగిన T20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను ఓడించి అద్భుత ఆరంభం చేసిన అమెరికా జట్టుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గట్టి షాక్ ఇచ్చింది. అయితే, ఈ చర్యతో చేపట్టినా USA జట్టు వచ్చే ఏడాది జరగనున్న T20 వరల్డ్ కప్‌లో మాత్రం ఆడనుంది. అందిన నివేదిక ప్రకారం, ఐసీసీ సభ్యుడిగా USA క్రికెట్ తన బాధ్యతలను పదేపదే విస్మరించడం వల్ల ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా USA క్రికెట్‌పై అనేక ఫిర్యాదులు ఐసీసీ దృష్టికి వచ్చాయి. గత సంవత్సరం శ్రీలంకలో జరిగిన వార్షిక సమావేశంలోనే ఐసీసీ USA క్రికెట్ బోర్డుకు నోటీసు ఇచ్చింది. ఈ ఏడాది సింగపూర్‌లో జరిగిన సమావేశంలో USA క్రికెట్‌ను సరిదిద్దుకోవడానికి మూడు నెలల గడువు ఇచ్చారు. కానీ, సరైన నిర్మాణం తీసుకురావడంలో విఫలమవడంతో ఐసీసీ చివరికి సభ్యత్వం రద్దు చేసింది.
బెజవాడలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన OG
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను DVV బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనకాపల్లి నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన OG హైప్ నడుస్తోంది. ఈ రోజు రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది OG. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోస్ కు సంభందించి అడ్వాన్క్ బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి OG టికెట్స్. అయితే సినిమాలకు కీలకమైన విజయవాడలో పవర్ స్టార్ OG కేవలం ప్రీమియర్స్ తోనే ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. విజయవాడలోని మొత్తం 8 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో OG రిలీజ్ కానుంది. అన్నిథియేటర్స్ లో ఓజి ప్రీమియర్స్ వేయబోతున్నారు. మొత్తం ఎనిమిది థియేటర్స్ కు గాను 4286 టికెట్స్ బుక్ అవగా రూ. 42,64,570/- కలెక్ట్ చేసింది. ఈ రేంజ్ వసూళ్లు విజయవాడ హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లు అని చెప్పాలి. ఇదిలా ఉండగా విజయవాడ చుట్టుపక్కల కలిపి మొత్తం 64 ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. కేవలం ప్రీమియర్స్ తో రూ. 1.60 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ప్రీమియర్స్ కే ఈ స్థాయి వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది OG. ఈ లెక్కన మొదటి రోజు కూడా భారీ స్థాయి వసూళ్లు రాబడుతుందని గత చిత్రాల తాలూకు రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ టాక్.
తీవ్ర జ్వరంతో భాదపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రార్థనలు చేస్తున్న ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం OG. ఇటీవల వచ్చిన పవర్ స్టార్ సినిమా హరిహర వీరమల్లు నిరాశపరచడంతో OGపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన OG ట్రైలర్ ఓ రేంజ్ లో అంచనాలను పెంచేసింది. భారీ హైప్.. భారీ బడ్జెట్ తో పాటు అంతే స్థాయి ఎక్స్పెక్టేసన్స్ తో వస్తున్న OG ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్ షోస్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మరోవైపు పవన్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో భాదపడుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నారని, ఆ జ్వరంతోనే నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిన్న రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగిందని, వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నాయి. విశ్రాంతి అవసరమని సూచించారని వివరించాయి. ఫీవర్ కారణంగా ఈ పవర్ స్టార్ నేడు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు పవర్ స్టార్ అభిమానులు OG సెలెబ్రేషన్స్ ను భారీగా నిర్వహిస్తున్నారు. థియేటర్స్ వద్ద జనసైనికుల హడావిడి మాములుగా లేదు. నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో హంగామా చేస్తున్నారు. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా ఆంధ్ర నుండి అమెరికా వరకు పవర్ స్టార్ ఫ్యాన్స్ OG సినిమా రిలీజ్ ను ఫెస్టివల్ గా నిర్వహిస్తూ తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
ఓజీ’లో తన పాత్రపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన శ్రియా రెడ్డి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా “ఓజీ” రేపటి నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించగా, సలార్ ఫేమ్ శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆమె తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నా పాత్రలో భావోద్వేగాలు, శక్తి రెండూ కలిపి ఉంటాయి. దాంతో వచ్చే ఇంపాక్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ రోల్‌లో ఉన్న లోతు దానిని మరింత రా, ఇంటెన్స్‌గా మార్చింది. ముఖ్యంగా నేను పూర్తిగా మేకప్ లేకుండా నటించాను. ఇది సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ ఆలోచన. ఆయన పాత్ర సహజంగా, రియలిస్టిక్‌గా కనిపించాలని కోరుకున్నారు. నాకు కూడా ఆ విజన్ నచ్చడంతో వెంటనే అంగీకరించాను” అని శ్రియా తెలిపారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన అనుభవం గురించి మాట్లాడుతూ.. “ఆయన చాలా తక్కువ మాటలు మాట్లాడుతారు. నేను అలానే ఉంటాను. ఆయన రాజకీయ పనులు పక్కనబెట్టి షూటింగ్‌కి వస్తారని నాకు తెలుసు. అందుకే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా నా పని పైన దృష్టి పెట్టాను. అయితే సెట్‌లో సినిమాకి సంబంధం లేని అనేక విషయాలు మేము చర్చించుకున్నాం. ఆయనతో పనిచేయడం నాకు ఒక మంచి అనుభవం” అని ఆమె అన్నారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
