Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

చెవిరెడ్డికి స్వల్ప ఊరట.. ఏసీబీ కోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై.. విజయవాడ జిల్లా జైలులో 220 రోజులుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది.. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో చికిత్స చేసుకునేందుకు చెవిరెడ్డికి అనుమతించింది ఏసీబీ కోర్టు.. ఆరోగ్య పరంగా తనకు మంతెన ఆశ్రమంలో చికిత్స చేసుకునేందుకు అనుమతించాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై న్యాయాధికారి భాస్కర్‌రావు విచారణ జరిపి 15 రోజుల పాటు ఆశ్రమంలో ఆయుర్వేద చికిత్స చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు ఆశ్రమంలో వైద్య సేవలు అందించేందుకు అనుమతించారు. గతంలో వెన్నునొప్పి బాధపడుతున్న ఆయనకు మంతెన ఆశ్రమంలో తీసుకున్న చికిత్స వల్ల కాస్త తగ్గిందని, ఇప్పుడు కూడా అదే బాధతో ఇబ్బందులు పడుతున్నందున కోర్టుకు ఆ విషయాన్ని తెలియ పరచడంతో అందుకు అనుమతించింది.

అధికారులపై హైకోర్టు ఆగ్రహం.. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా..?
అధికారుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాంసం, చేపల దుకాణాల కేటాయింపుకు చేపట్టిన ఈ-వేలం విధానంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అధికారులు ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోర్టు తీవ్రంగా మండిపడింది. చిరు వ్యాపారులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతవరకు ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఏ డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి, ఎలా చేయాలి అన్న అవగాహన వారికి ఎలా ఉంటుందంటూ వ్యాఖ్యానించింది. చాలామంది చిరు వ్యాపారులు చదువు రాని వారే ఉంటారని, అలాంటి వారు ఈ-వేలంలో ఎలా పాల్గొంటారని కోర్టు ప్రశ్నలు సంధించింది. సాంప్రదాయ బహిరంగ వేలం విధానమే చిరు వ్యాపారులకు అనుకూలమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీ రూముల్లో కూర్చుని తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజల సమస్యలను గమనించకుండా యాంత్రికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో దుకాణాల కేటాయింపుకు సంబంధించి జారీ చేసిన ఈ-వేలం నోటిఫికేషన్ అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.

ట్రాఫిక్‌ క్లియర్‌ చేసి అడ్డంగా దొరికిపోయిన మహిళా కానిస్టేబుల్‌.. తీవ్ర వివాదం..!
రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.. చంటి బిడ్డను ఎత్తుకుని.. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన ఓ వీడియో బయటకు రావడంతో.. ఆమె వైరల్‌గా మారిపోయింది.. ఆమెకు మద్దతుగా ఎంతోమంది పోస్టులు పెట్టారు.. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఆమెను అభినందించారు.. అంతేకాదు.. హోం మంత్రి అనిత.. ఆమెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరి సన్మానించారు.. కానీ, ఇప్పుడు అసలు కథ బయటకు రావడంతో దుమారమే రేగుతోంది.. అయితే, గత ఏడాది జరిగిన డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందింది జయశాంతి.. కానిస్టేబుల్ గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది.. విచారణ చేసి డీఎస్సీ ఉద్యోగం రద్దు చేశారు విద్యాశాఖ అధికారులు.. ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేశారు కాకినాడ డీఈవో.. ఇక, నకిలీ ఐడీ కార్డుతో ఎస్సై గా చలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ కి సహకారం అందించారు జయశాంతి, ఇటీవల చంటి బిడ్డను ట్రాఫిక్ క్లియర్ చేసి వార్తలలో నిలిచారు.. అది కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్ కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యారు.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్ కు జయశాంతిని బదిలీ చేశారు.. భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవడం, డీఎస్సీలో తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించడంతో విమర్శలు రావడంతోనే చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేసిందని విమర్శలు వస్తున్నాయి.. తన పరిధి కాకపోయినా చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారని ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను సన్మానించారు హోంమంత్రి అనిత.. ఇప్పుడు వివాదం బయటకు రావడంతో.. ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..

ప్రియుడ్ని పెట్టెలో దాచిన కోడలు.. అత్త ఏం చేసిందంటే..!
భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సమాజం ఏమనుకుంటుందన్న ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలించింది. ఇంతలో అత్త గారు రావడంతో ఉక్కిరి బిక్కిరి అయింది. ఎన్ని డ్రామాలు ఆడినా.. స్కెచ్ ఫలించలేదు. చివరికి అడ్డంగా బుక్కైంది. అసలేమైందంటే..! ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో వాళ్లంతా పనుల కోసం బయటకు వెళ్లిపోయారు. అలా వెళ్లారో.. లేదో ప్రియురాలు ఇంటికి రావాలని ప్రియుడికి ఫోన్ చేసి కోరింది. ఏడు ఇళ్ల దూరంలో ఉన్న యువకుడు మధ్యాహ్నం సమయంలో ప్రేయసి ఇంటికి వచ్చాడు. పక్క భవనంలోనే నివసించే అత్తకు ఏదో శబ్దం వచ్చినట్లు అనిపించడంతో కోడలు దగ్గరకు వచ్చింది. తలుపు తీయమని అడిగితే కంగారు పడిపోయింది. చాలా సేపు తీయలేదు. ఇంతలో ప్రియుడిని ట్రంకు పెట్టెలో దాచి పెట్టేసింది.

కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్ అరెస్ట్
ముంబైలోని ఓషివారా కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం విచారణకు పిలిచి.. అనంతరం అధికారికంగా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. శనివారం న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు. ఈ వారం ప్రారంభంలో ముంబైలోని నలంద సొసైటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు, నాలుగు అంతస్థులో బుల్లెట్లు రికవరీ చేసుకున్నారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం సాయంత్రం కమల్ ఆర్ ఖాన్‌ను ఓషివారా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. మొత్తానికి విచారణలో లైసెన్స్ పొందిన తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా అంగీకరించాడు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పత్రాలను పరిశీలిస్తున్నారు. అయితే నలంద సొసైటీలో ఉన్న ఒక ఫ్లాట్ రచయిత-దర్శకుడిది కాగా.. ఇంకో ఫ్లాట్ మోడల్‌దిగా చెబుతున్నారు. అయితే ఎందుకు తుపాకీ ఉపయోగించాల్సి వచ్చింది.. ఎలాంటి ఘర్షణ చోటుచేసుకుందో మాత్రం తేల్చలేదు.

భారీ ఎన్‌కౌంటర్.. సెంట్రల్ కమిటీ సభ్యుడు సహా 17 మంది మావోయిస్టులు మృతి!
ఏడాది మార్చి వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో నక్సలైట్లను తుదముట్టిస్తున్నారు. కొంద మంది లొంగిపోగా.. మరి కొందరు మాత్రం తుపాకులకు బలవుతున్నారు. తాజాగా భద్రతా దళాలు నిర్వహించిన భారీ సంయుక్త యాంటీ–నక్సల్ ఆపరేషన్‌లో సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు, అత్యంత వాంటెడ్ నక్సలైట్ పటీరామ్ మాఝీ అలియాస్ ‘అనల్ దా’ హతమయ్యాడు. ఝార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్ మేఘబురు’ పేరుతో గురువారం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో మొత్తం 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. 209 కోబ్రా బెటాలియన్, చైబాసా జిల్లా పోలీసులు, ఝార్ఖండ్ జాగ్వార్ బలగాలు కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. రెండు రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఎదురుకాల్పుల్లో రూ.1 కోటి బహుమతి ఉన్న అనల్ దాతో పాటు మరో 14 మంది మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోయారు. శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ సమయంలో మరో రెండు మృతదేహాలు లభించడంతో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరింది. అనల్ దా సీపీఐ (మావోయిస్టు)లో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీ సభ్యుడు. ఝార్ఖండ్‌లో అతనిపై 149కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ను భద్రతా దళాలు కీలక విజయంగా భావిస్తున్నాయి. ఈ అంశంపై కిరిబురు ఎస్డీపీఓ అజయ్ కర్కెట్టా మాట్లాడుతూ.. “దాదాపు రెండు రోజుల పాటు కొనసాగిన ఎదురుకాల్పులు ఇప్పుడు ముగిశాయి. అయితే పగటి వేళల్లో సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తాం” అని తెలిపారు. ఇదిలా ఉండగా, శుక్రవారం కూడా సారండా అటవీ ప్రాంతంలో మరో నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ రెండో రోజుకు చేరుకున్న సమయంలో కొన్నిచోట్ల చెదురుమదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

అలర్ట్.. మీతో ఈ యమహా స్కూటీలు ఉన్నాయా? వెంటనే షోరూంకి తీసుకెళ్లండి!
యమహా స్కూటర్లు వాడుతున్న వారికి అలర్ట్. యమహా కంపెనీ తమ 125 సీసీ హైబ్రిడ్ స్కూటర్లపై స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. భద్రతకు ఎలాంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మూడు లక్షలకుపైగా స్కూటర్లను తనిఖీ చేయనుంది. యమహా రే జెడ్ ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, ఫాస్సినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ మోడళ్లను రీకాల్ ప్రకటించింది. ఈ రెండు స్కూటర్ల డిజైన్ వేరైనా లోపల ఉండే ముఖ్య భాగాలు మాత్రం ఒకటే. 2024 మే 2 నుంచి 2025 సెప్టెంబర్ 3 మధ్య తయారైన స్కూటర్లు రీకాల్ జాబితాలో ఉన్నాయి. మొత్తం 3,06,635 స్కూటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని యమహా తెలిపింది. రీకాల్‌కు కారణం స్కూటర్ ముందు బ్రేక్ సిస్టమ్. ముందు బ్రేక్ కాలిపర్ సరిగా పనిచేయడం లేదని యమహా గుర్తించింది. ప్రతి స్కూటర్‌లో ఈ సమస్య ఉండకపోవచ్చు. అయినా వినియోగదారుల భద్రతే ముఖ్యమని భావించి, ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకుంది. ఈ రీకాల్‌లో భాగంగా యమహా అధికృత సర్వీస్ సెంటర్లలో స్కూటర్‌ను పూర్తిగా తనిఖీ చేస్తారు. అవసరమైతే.. పాడైన పార్ట్స్‌ను ఉచితంగా మారుస్తారు. వినియోగదారులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. స్కూటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సర్వీస్ సెంటర్‌కు వెళ్లే ముందు అపాయింట్‌మెంట్ తీసుకోవాలని యమహా సూచిస్తోంది. మీ స్కూటర్ ఈ రీకాల్‌లో ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులువు. యమహా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ‘వాలంటరీ రీకాల్ క్యాంపెయిన్’ పేజీకి వెళ్లి మీ స్కూటర్ ఛాసిస్ నంబర్ నమోదు చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. అంతేకాదు, దగ్గరలోని యమహా షోరూమ్‌ను సంప్రదించవచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్ ద్వారా ఆన్‌లైన్ సపోర్ట్ తీసుకోవచ్చు.

రూ. 5.59 లక్షలకే Tata Tigor పెట్రోల్ వెర్షన్‌ రిలీజ్.. టాక్సీలకు బెస్ట్ ఛాయిస్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పాసింజర్స్‌ వాహనాల పోర్టుఫోలియోను విస్తరిస్తోంది. ఈ ఇందులో భాగంగా తాజాగా టాక్సీలకు సరిపోయేలా టాటా ఎక్స్‌ప్రెస్‌ను నూతన హంగులతో విడుదల చేసింది. ఎక్స్‌ప్రెస్ టిగోర్ టాక్సీ సెడాన్ను ఇప్పుడు పెట్రోల్, ట్విన్–సిలిండర్ CNG వేరియంట్లలో విడుదల చేసింది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎక్స్‌ప్రెస్ రేంజ్, ఇకపై ICE ఆప్షన్లతోనూ మార్కెట్లోకి వచ్చింది. ఇది ఫ్లీట్ ఆపరేటర్ల కోసం టాటా మల్టీ–పవర్‌ట్రెయిన్ వ్యూహానికి అనుగుణంగా ఉంది. ఎక్స్‌ప్రెస్ టిగోర్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండగా, CNG వేరియంట్ ధర రూ.6.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధరలు ఫ్లీట్ సెడాన్ విభాగంలో పోటీగా ఉన్నాయని టాటా తెలిపింది. పెట్రోల్, CNG మోడళ్ల రెండింటికీ 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించింది. ఇది 86 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ కిట్‌కు సంబంధించిన పవర్ గణాంకాలను టాటా ఇంకా వెల్లడించలేదు. ఈ వాహనాలు ప్రధానంగా కమర్షియల్ వినియోగానికి అనుకూలంగా డ్యూరబిలిటీ, నమ్మకత్వం, తక్కువ ఆపరేటింగ్ ఖర్చులపై దృష్టి సారించి రూపొందించారు. పెట్రోల్ వేరియంట్‌లో 419 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంది. సీఎన్‌జీ మోడల్ బూట్ స్పేస్ వివరాలను వెల్లడించకపోయినా, ఇందులో 70 లీటర్ల వాటర్ కెపాసిటీ కలిగిన ట్విన్ సిలిండర్లు అమర్చారు. ఇది సింగిల్ పెద్ద సిలిండర్‌తో పోలిస్తే తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది.

పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్.. మరో 28 బంతులు మిగిలి ఉండగానే!
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. అయితే, ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్‌, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఈజీగా చేధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక, జాతీయ జట్టుకు రెండేళ్లకు పైగా విరామం తర్వాత తుది టీంలోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన రీఎంట్రీని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. కేవలం 32 బంతుల్లో 76 పరుగులు చేయగా.. అందులో 11 ఫోర్లు, 4 సిక్సులతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక, తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన కిషన్, పుల్ షాట్లు, పిక్-అప్ షాట్లు, రివర్స్ స్వీప్‌లతో స్టేడియంలోని ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాడు. ఇక, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 23 ఇన్నింగ్స్‌ల తర్వాత తన తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. 37 బంతుల్లో 82 పరుగులు (నాటౌట్) చేసి అసాధారణ ఇన్సింగ్స్ ఆడాడు. అతడితో పాటు శివమ్ దూబే కూడా 18 బంతుల్లో 36 రన్స్ చేసి అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వీరి భాగస్వామ్యం మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపుకు తిప్పేసింది. చేజింజ్ ప్రారంభంలో భారత్‌కు షాక్‌లు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ రెండో ఓవర్‌కే ఔట్ కావడంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. అయితే, ఆ తర్వాత ఇషన్ కిషన్ చేసిన కౌంటర్ అటాక్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఇషన్ ఈ ప్రదర్శన సంజూ శాంసన్ స్థానంపై మరింత ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉంది. ఫిట్‌నెస్ సాధించిన తర్వాత తిలక్ వర్మ తిరిగి జట్టులోకి వస్తే 3వ నంబర్ స్థానంలో బ్యాటింగ్ కోసం పోటీ మరింత పెరగనుంది.

నిర్మాత కోసం రెమ్యూనరేషన్ వదులుకున్న శర్వా!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా తనలోని గొప్ప మనసును చాటుకున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో శర్వానంద్ మాట్లాడుతూ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన విజయాన్ని అందించిన నిర్మాత అనిల్ సుంకరపై ప్రశంసలు కురిపించారు. ఒక నిర్మాతగా అనిల్ సుంకర తనకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనని, అందుకే ఆయనతో చేసే తన తదుపరి సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోనని స్టేజ్ మీద ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. సినిమా సక్సెస్‌లో హీరో ఎంత కష్టపడతారో, నిర్మాత అంతకంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటారని శర్వానంద్ అభిప్రాయపడ్డారు. “విజయం విలువ నాకు బాగా తెలుసు, అందుకే నిర్మాతకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా హిట్టు వస్తే రెమ్యూనరేషన్ పెంచే హీరోలున్న ఈ రోజుల్లో, శర్వానంద్ ఇలా తన పారితోషికాన్ని వదులుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. హీరో, నిర్మాత మధ్య ఇలాంటి మంచి అనుబంధం ఉంటే పరిశ్రమకు మేలు జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

‘ఎల్లమ్మ’లో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..
మ్యూజిక్ డైరెక్టర్‌గా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ (DSP), ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంతో డీఎస్పీ నటుడిగా తెరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇందులో దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్షి’ అనే డప్పు కళాకారుడి పాత్రలో పరిచయం చేశారు. మునుపెన్నడూ చూడని విధంగా పొడవాటి జుట్టు, గడ్డం, మాస్ లుక్‌లో దేవిశ్రీ కనిపిస్తున్న తీరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమా కథ ప్రధానంగా తెలంగాణ సంస్కృతిలో భాగమైన ‘రేణుక ఎల్లమ్మ’ గ్రామ దేవత చుట్టూ, జానపద కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగనుంది. వేణు యెల్దండి సుమారు మూడేళ్ల పాటు శ్రమించి ఈ ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేశారు. గతంలో నాని, నితిన్ వంటి హీరోల పేర్లు వినిపించినా, చివరికి దేవిశ్రీ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో దేవిశ్రీ ప్రసాద్ క్యారెక్టర్ మునుపెన్నడూ చూడని విధంగా, చాలా షాకింగ్‌గా ఉంటుందట. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జానపద కళలను, సామాజిక అంశాలను గుండెకు హత్తుకునేలా చూపిస్తూ ‘బలగం’ మ్యాజిక్‌ను వేణు మళ్ళీ రిపీట్ చేస్తారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version