NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. కాసేపట్లో నవంబర్‌ కోటా విడుదల..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి.. రోజుల తరబడి వేచిచూసే అవసరం లేకుండా.. టీటీడీ వివిధ సేవలు, దర్శనానికి సంబంధించిన టికెట్లనో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న విషయం విదితమే కాగా.. నవంబర్ కోటాకు సంబంధించిన వివిధ టికెట్లను విడుదల చేస్తూ.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త చెబుతూ వస్తున్న టీటీడీ.. ఈ రోజు ఆన్‌లైన్‌లో నవంబర్‌ నెల దర్శన టికెట్లు విడుదల చేయబోతోంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. తిరుమల, తిరుపతిలో నవంబరు నెల గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మరోవైఉ.. ఈ నెల 27వ తేదీన శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.. ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే వెలుసులుబాటు ఉన్న విషయం విదితమే.. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.. ఇక, నిన్న శ్రీవారిని 69,098 మంది భక్తులు దర్శించుకోగా.. 34,707 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.56 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.

తిరుపతిలో దారుణం.. అనాథ బాలికపై అఘాయిత్యం.. ఆపై..!
ఆడ పిల్లలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. పసికూనలు, బాలికలు, యువతులు. మహిళలు, వృద్ధురాలు.. ఇలా తేడా లేకుండా.. కామాంధులు వారి పశువాంఛను తీర్చుకుంటున్నారు.. తాజాగా, తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ బాలికల పరిశీలన గృహం(జువైనల్ హోమ్) లో ఉండే బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నగరంలో అనాథ బాలికలతో పాటు నేర చరిత్ర ఉన్న బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఉంది. ఈ వసతి గృహంలో ఉండే బాలికలు వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గృహంలో ఉంటూ స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. అయితే, గతంలో ఈ బాలిక ఉన్న సత్యవేడులో హోమ్ వద్ద రిషి అనే యువకుడు ఈ నెల 21న నెహ్రూ మున్సిపల్ స్కూల్ వద్దకు వచ్చి స్టడీ అవర్‌లో బాలికపై అత్యాచారయత్నంకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఒంటిపై గాయాలతో సాయంత్రం హోమ్‌కి వెళ్లిన బాలికను తోటి విద్యార్థులతో పాటు సిబ్బంది ప్రశ్నించారు. దీంతో బాలిక జరిగిన విషయం తెలిపింది. అయితే ఈ విషయం బయటకు రాకుండా జువైనల్‌ హోమ్ సూపరింటెండెంట్‌ నయోమి దాచిపెట్టారు. హోమ్ లో ఉండే డాక్టర్ బాలికల సంక్షేమ శాఖ అధికారులకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారుల సూచనలతో జరిగిన ఘటనపై జువైనల్‌ హోమ్‌ సూపరింటెండెంట్‌ వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి.. బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

టీపీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణపై త్వరలోనే అధికారిక ప్రకటన
టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ట్రై చేస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశం అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపా దాస్‌మున్షీలతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సుమారు గంటకు పైగా సమావేశమై చర్చించారు. ఈ ఉమ్మడి మీటింగ్ తర్వాత.. పార్టీ పెద్దలు నలుగురూ.. రాష్ట్ర నాయకులు ముగ్గురితో విడివిడిగా కూడా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు టాక్. కాగా, పీసీసీ అధ్యక్షుడిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలని రాష్ట్ర నాయకత్వం కోరినట్లు సమాచారం. ఆ తర్వాత రాత్రి మరోసారి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో రేవంత్, భట్టి, ఉత్తమ్ కుమార్ వేర్వేరుగా సమావేశం అయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి.. మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పులు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేసిన అనంతరం మంత్రి పదవులకు పేర్లు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన కొలువుదీరిన మంత్రివర్గంలో 12 మందికే పదవులు దక్కాయి.. మరో ఆరుగురికి చోటు కల్పించే ఛాన్స్ ఉంది. ఆశావహుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో.. సామాజికవర్గాల మధ్య సమతౌల్యం పాటిస్తూ ఒకేసారి పీసీసీ అధ్యక్ష నియామకం, మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత..
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్​ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చి వేస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్​ కన్వెన్షన్ ను అధకారులు కూల్చివేస్తున్నారు. తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి ఎన్​ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తుమ్మిడి కుంట చెరువులోని మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్​ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఇక, తుమ్మిడి కుంట చెరువు ఎఫ్ టీఓల్ లో ఎన్​ కన్వెన్షన్ నిర్మించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా ఎన్​ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చి వేస్తుంది. కాగా, దీంతో పక్కా ఆధారాలతో ఈరోజు (శనివారం) తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత కొనసాగిస్తున్నారు. అయితే, మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసి వేశారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లడానికి మీడియాకు అనుమతి లేదంటూ భారీకేడ్లను ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించడానికి మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు.

‘నూరి’తో పోజులిచ్చిన సోనియా గాంధీ.. తల్లి ఫోటో షేర్ చేసిన రాహుల్
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వివిధ వర్గాల వారిని కలుసుకోవడం, వారితో మాట్లాడడం వంటి చిత్రాలు తరచూ వైరల్ అవుతున్నాయి. అయితే, ఈసారి రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన కుక్క నూరి చిత్రాన్ని పోస్ట్ చేశారు. అందులో అతని తల్లి సోనియా గాంధీ కూడా కనిపిస్తారు. గత ఏడాది ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి నూరి అనే కుక్కను బహుమతిగా ఇచ్చారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు, అందులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన భుజంపై కుక్కను కట్టివేశారు. ఇది తన తల్లికి ఇష్టమైన కుక్క అని రాహుల్ గాంధీ ఈ చిత్రంతో రాశారు. రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీతో కలిసి ఉన్న నూరి చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెంటనే, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ తన పోస్ట్‌కి మా అమ్మకు ఇష్టమైనది ఎవరో తెలుసా? అని క్యాప్షన్ ఇచ్చారు. ఒక సంవత్సరం క్రితం రాహుల్ గాంధీ ఈ కుక్కను గోవా నుండి తీసుకువచ్చారు. రాహుల్ దానిని తన తల్లికి బహుమతిగా ఇచ్చాడు. ఇది గోవాకు చెందిన జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్క, దీనిని రాహుల్ గాంధీ కుక్కల పెంపకందారుడు షర్వాణి పిత్రే, ఆమె భర్త స్టాన్లీ బ్రగాంక నుండి తీసుకొని ఢిల్లీలోని తన ఇంటిలో ఉంచారు. అప్పటి నుంచి గాంధీ కుటుంబానికి ప్రియ తోడుగా మారింది. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేశారు.

భారీగా తగ్గిపోయిన టమాటా ధర.. బోరున విలపిస్తున్న రైతులు
ఆరుగాలం కష్టపడి లక్షల రూపాయల ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాటా రైతుల ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే టైంలో గిట్టుబాటు ధరలు లభించక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంటకు తెగుళ్లు సోకి, ఊజీ ప్రభావంతో దిగుబడులు తగ్గిపోయాయి.. వచ్చిన కాస్తా పంట నాణ్యత లోపించడంతో పాటు 15 కిలోల పెట్టె జూన్‌లో రూ.800- రూ.1000 మధ్య పలికితే.. ప్రస్తుతం రూ.250- రూ.300 మాత్రమే వస్తోంది అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, టమాటా సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఎకరాకు రూ.1.50 లక్షల – రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోంది అని అన్నదాతల అంటున్నారు. మూడేళ్ల కిందట ఇందులో సగం ఖర్చులే వచ్చేవి.. అప్పుడున్న ధరలే ప్రస్తుతం మార్కెట్‌లో కొనసాగుతున్నాయన్నారు. వాతావరణ పరిస్థితులన్నీ సహకరిస్తే 15 నుంచి 19 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది.. కానీ, ప్రస్తుతం వివిధ కారణాలతో 10 క్వింటాళ్లకు మించడం లేదంటున్నారు రైతుు. టమాటా కోతలు, మార్కెట్‌కు తరలింపు, రవాణా, ఎగుమతి దిగుమతి ఖర్చులు లెక్కిస్తే ఒక్కో బాక్సుకు 40 రూపాయల వరకు వ్యయమైతుంది. ఒక్కో బాక్సుకు కమీషన్‌ 10 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఇలా అన్నింటిని భరించి విక్రయించినా ప్రస్తుత ధరలతో రైతుకు భారీ నష్టమే మెలుగుతుంది అన్నారు.

నేపాల్ బస్సు ప్రమాదంలో 27 మంది భారతీయులు మృతి.. నేడు మహారాష్ట్రకు 24 మృతదేహాలు
నేపాల్‌లో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 27కి చేరింది. హైవే మీదుగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి మర్స్యంగాడి నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో 24 మంది మృతదేహాలను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. ఇప్పుడు ఈ మృతదేహాలన్నింటినీ శనివారం భారత వైమానిక దళ విమానం ద్వారా మహారాష్ట్రకు తీసుకువెళతారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ధృవీకరించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, విపత్తు సహాయ..పునరావాస శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర అధికారులతో మాట్లాడారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు నోడల్ అధికారిని కూడా నియమించారు. హోంమంత్రి జోక్యంతో ఇప్పుడు భారత వాయుసేన విమానం కోసం ఏర్పాట్లు చేశామని, శనివారం మృతదేహాలను ఉత్తరప్రదేశ్ నుండి మహారాష్ట్రకు తీసుకువెళతామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘటనలో బాధితులు ముంబైకి 470 కి.మీ దూరంలోని జల్గావ్ జిల్లాలోని వరంగావ్, దరియాపూర్, తల్వెల్, భుసావల్‌కు చెందినవారు. మృతదేహాలను, గాయపడిన ప్రయాణికులను ఆగస్టు 24 సాయంత్రం గోరఖ్‌పూర్‌కు తీసుకువస్తామని, అయితే వాణిజ్య విమానాల ద్వారా మహారాష్ట్రకు తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని మహారాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ లాహు మాలీ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తెలిపారు. అందుకే ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. గోరఖ్‌పూర్‌ నుంచి నాసిక్‌కు విమానానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన గబ్బర్..
భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అవుతున్నానని తన అభిమానులకు తెలియజేయడానికి శిఖర్ ధావన్ శనివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ను ఎంచుకున్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధావన్.. ఆటకు వీడ్కోలు సమయంలో తన కోచ్లు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. తాజా వీడియోలో భావోద్వేగానికి గురైన ధావన్, భారతదేశం కోసం ఆడటం తన కల నిజమైందని, ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి, డీడీసీఏకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ అన్ని ఫార్మాట్లలో అనుభవజ్ఞుడైన శిఖర్ ధావన్ టీం ఇండియాకు అత్యంత ఉత్తమ ఓపెనర్లలో ఒకడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు కలిసి అనేక మ్యాచ్ లలో ప్రత్యర్థి బౌలర్లపై మెరుపుదాడి చేశారు.

అంతర్జాతీయ క్రికెట్‭లో శిఖ‌ర్ ధావ‌న్ సాధించిన రికార్డ్స్ ఇవే..
టీమిండియా స్టార్ బాట్స్మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు ఈ విషయాన్ని తన X ఖాతా ద్వారా వీడియో రూపంలో తెలిపాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భావోద్వేగానికి గురి అయ్యాడు. భారతదేశం కోసం ఆడటం తన కల నిజమైందని, ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని., తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి, డీడీసీఏకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే శిఖర్ ధావన్ టీమిండియా తరపున 34 టెస్టులలో 2315 రన్స్, 167 వన్డేలలో 6793 రన్స్, 68 టీ20 లలో 1759 రన్స్ సాధించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌ గా ఉన్న శిఖ‌ర్ ధావ‌న్.. రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. భుజం గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ధావన్ స్థానంలో సామ్ క‌ర‌న్‌కు కెప్టెన్సీ చేసాడు. గాయం నుంచి కోలుకున్నా ధావన్ ను పక్కన పెట్టింది మేనేజ్మెంట్. 222 ఐపీఎల్ మ్యాచులు ఆడిన ధావన్ 6768 రన్స్ చేశాడు. ధావన్ కెరీర్ లో మొత్తంగా 17 వన్డే సెంచరీలు.., 7 టెస్ట్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 190 అత్యధిక స్కోరు. వన్డేలో 143. టీ20 ల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఇక ఐపీఎల్ లో 2 సెంచరీలు చేసాడు. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్‭లో 10887 పరుగులు చేయగా.. ఐపీఎల్ లో 6769 పరుగులు చేసాడు.

పుష్ప -2 పోస్ట్ పోన్ పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. అంతమాట అనేశాడేంటి..?
సినిమాలు పోస్ట్ అవడం అనేది సహజం. ఇతర నటీనటుల డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడమో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండడం, విఎఫెక్స్ ఆలస్యం ఇలా రకరకాల కారణాలతో సినిమాల రిలీజ్ వాయిదా వేయడం అనేది తరచూ చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా టాలీవుడ్ లో వాయిదాల పర్వం ఎక్కువగా నడుస్తుంటుంది. ఇటీవల తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు ఏవి అనుకున్న టైమ్ కి రిలీజ్ కాలేక పోస్ట్ పోనే అవుతూ వస్తున్నాయి. ఈ వాయిదాల పర్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు నేచురల్ స్టార్. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 ఆగస్టు 15న రిలీజ్ కావాల్సింది కానీ డిసెంబర్ 6కి వాయిదా వేయాల్సి వచ్చింది. అలాగే న జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న దేవర ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడు సెప్టెంబరు 27న రిలీజ్ అవుతోంది. ఇలా భారీ బడ్జెట్ సినిమాలు పోస్ట్ పోన్ అవుతుండడంపై నాని సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ” క్లారిటీ లేకుండా రిలీజ్ డేట్ ప్రకటించడం వలన చాలా మంది నష్టపోతున్నారు ఓక డేట్ వేసేద్దాం, సినిమా రెడీ అయితే ఆ డేట్ కు వద్దాం లేదంటే తర్వాత చూసుకుందాం అనే ఆటిట్యూడ్ కకరెక్ట్ కాదు” అని అన్నాడు. నాని చేసిన ఈ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. పుష్ప ఆగస్టు కి వచ్చేస్తున్నారని డిసెంబర్ లో తండేల్, రాబిన్ హుడ్, కన్నప్ప వంటి సినిమాలు డిసెంబర్ రిలీజ్ డేట్ వేసారు. తీరా ఇప్పడు పుష్ప డిసెంబర్ అనడం తో ఈ సినిమాల రిలీజ్ పై తర్జన భర్జన మొదలైంది. ఏది ఏమైనా నాని చెప్పిన నూటికి నూరుపాళ్లు నిజం.

కాంతార కోసం ఎవరూ చేయని పని చేస్తున్న రిషబ్ శెట్టి.. ?
కన్నడలో గతేడాది వచ్చిన ‘కాంతార’ ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం చేసిన కాంతార చడీచప్పుడు లేకుండా వచ్చి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను రూ.16 కోట్ల‌తో నిర్మించింది. కన్నడతో పాటు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయి ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో కన్నడ ఉత్త‌మ న‌టుడిగా రిష‌బ్ శెట్టి అవార్డ్ సాధించాడు. ప్రస్తుతం కాంతారకు ప్రిక్వెల్ నిర్మిస్తున్నాడు రిషబ్. ‘కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1’ ను భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ‘కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1’ షెడ్యూల్ ఈ నెలాఖ‌రు నుంచి స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో కత్తి యుద్దానికి రిలేటెడ్ సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రిష‌బ్ శెట్టి క‌ల‌రిప‌య‌ట్టు విద్య‌ను, గుర్రపు స్వారీ వంటి వాటిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. . క‌దంబ యుగంలో సాగే క‌థ‌నంతో కాంతార ఏ లెజెండ్ చాప్టర్ – 1 రాబోతున్నారు తెలుస్తోంది. అతి త్వరలో ఈ చిత్ర షూటింగ్ ముగించి విఎఫెక్స్ కోసం ఆరు నెల‌ల స‌మ‌యం తీసుకుంటున్నార‌ని టాక్‌. 2025 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. కాంతార మొదటి భాగం నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ రాబోతున్న ప్రిక్వెల్ ను నిర్మించనుండగా అజనీష్ లోకానాథ్ సంగీతం  అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.