Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

విశాఖలో భూ కేటాయింపులపై కొత్త వివాదం..!
విశాఖలో ఎంత మారుమూలకు వెళ్లిన ఎకరం భూమి విలువ కోటి రూపాయలకు తక్కువ ఉండదు. లక్షల్లో దొరికితే లక్కీ చాన్స్ .. అటువంటిది 99పైసలకే లభిస్తే బంపర్ ఆఫర్ కిందే లెక్క. సరిగ్గా ఏపీ సర్కార్ ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకుని ఐటీ పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతోంది. మొన్న టీసీఎస్., ఆ తర్వాత ‘ఉర్సా’ ఇలా ఒక్కొక్కటిగా సాఫ్ట్వేర్ కంపెనీలకు అడిగిందే తడవుగా భారీ భూ కేటాయింపులు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐతే, ఇదేమీ కొత్త విధానం కాదని పెట్టుబడులను ఆకర్షించేందుకు గుజరాత్ వంటి రాష్ట్రాలు ఎప్పుడో అమలు చేసి సక్సెస్ అవ్వడాన్ని ఉదాహరణగా చూపిస్తోంది. విశాఖను ఐటీ డెస్టినేషన్ గా తీర్చిదిద్దే ప్రయత్నం రెండు దశాబ్దాల క్రితమే మొదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో సాధ్యం కాలేదు. రుషికొండ ఐటీ సెజ్ పరిధిలోని హిల్ నెంబర్ 1,2,3తో పాటు నగరంలో ప్రముఖ ప్రాంగణాల్లో సాఫ్ట్వేర్ సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్ జరుగుతుండగా.. దానిని 40 వేల కోట్లకు పెంచాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఈ దిశగా ఐటీ పాలసీని అనుసరించి పెట్టుబడులతో వచ్చే సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఐటీ కంపెనీTCS భారీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కోసం ముందుకు వచ్చింది. 1370కోట్ల రూపాయల పెట్టుబడులతో అభివృద్ధి కేంద్రం ఏర్పాటు ద్వారా 12వేల మందికి అవకాశాలు మెరుగుపడతాయని అంచనాలు వున్నాయి. ఇందు కోసం 99పైసల లీజు చొప్పున ఐటీ హిల్ 3 మీద 21.16ఎకరాలను కేటాయించింది. సెజ్ పరిధిలో ఉన్న మిలీనియం టవర్స్ ను డీ నోటిఫై చేసింది. ఇక్కడ TCS తాత్కాలిక కార్యకలపాలు ప్రారంభించినుంది. అలాగే, ఉర్సా కంపెనీ కోసం సుమారు 60ఎకరాలు కేటాయించేందుకు ఆమోదం లభించడం విమర్శలకు కారణం అయింది. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టాటా మోటార్స్‌కు 99 పైసలకే భూమిని కేటాయించిన విధానాన్నే చంద్రబాబు ప్రభుత్వం కూడా అనుసరించి నట్టు కూటమి పార్టీలు చెబుతున్నాయి. మోదీ తీసుకున్న నిర్ణయం గుజరాత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడింది. ఇప్పుడు ఏపీ సర్కార్ చర్య విశాఖపట్నాన్ని ఒక ప్రధాన ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్ ఐటీ పెట్టుబడులను ఆకర్షించడంలో తీవ్రంగా ఉందని, పరిశ్రమకు సంకేతం ఇవ్వడానికి ఇది సాహసోపేతమైన నిర్ణయం చెబుతున్నారు. 99పైసల కే భూ కేటాయింపులపై రాజకీయ ఆలోచనలు ఎలా ఉన్నా ఐటీ అభివృద్ధి ప్రణాళికలో కీలకం అనేది ఇండస్ట్రీ వర్గాలు ఆలోచన.

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మరిన్ని అరెస్ట్‌లు..!
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు లిక్కర్‌ కేసు హాట్‌టాపిక్‌గా సాగుతోంది.. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్‌.. ఓవైపు కీలకంగా భావిస్తోన్న రాజ్‌ కేసిరెడ్డి విచారణపై దృష్టి పెడుతూనే.. మరోవైపు.. అరెస్ట్‌లపై ఫోకస్‌ పెట్టింది.. ఏపీ లిక్కర్‌ కేసు విచారణలో భాగంగా రాజ్‌ కేసిరెడ్డి కస్టడీ కోరుతూ సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.. కేసు విచారణలో భాగంగా వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది సిట్‌.. ఇక, ఏపీ లిక్కర్ స్కాం లో ఇవాళ కూడా అరెస్టులు జరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు అధికారులు.. ఇప్పటికే కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డి, ఏ8 చాణక్యలను అరెస్టు చేసిన సిట్.. ఇవాళ మరొకరిని అరెస్టు చేస్తుందని ప్రచారం సాగుతోంది.. కేసులో ముడుపులు ఎక్కడ నుంచి ఎలా వెళ్లాయనే విషయాల విచారణ కోసం ఏ1 రాజ్ కేసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్‌ వేయగా.. నేడు కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగే ఛాన్స్ ఉంది.. అయితే ఈ కేసులో సుమారు 3,200 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు.. అలాగే హవాలా రూపంలో షెల్‌ కంపెనీల ద్వారా భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని గుర్తుచేశారు.

మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్..
మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ అయ్యారు.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది. కాగా.. మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజని వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. ఆమె మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.

నా పేరు భరత్.. నేను హిందువుని అనగానే తూటాల వర్షం.. బెంగళూరు టెక్కీ విషాదగాధ
పహల్గామ్  మారణహోమం.. ఎన్నో కుటుంబాల్లో చీకటి మిగిల్చింది. ఒక్కో కుటుంబానికి సంబంధించిన ఒక్కో విషాదగాధ వెలుగులోకి వస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు.. కుటుంబాలకు ఆధారమైన ఎందరో భాగస్వాములను కోల్పోవడంతో బాధితులంతా పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. బెంగళూరుకు చెందిన టెక్కీ భరత్ భూషణ్ (35) భార్య సుజాత, కుమారుడితో కలిసి పహల్గామ్‌కు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం కుమారుడిని ఎత్తుకుని భరత్ ఫొటో దిగుతున్నారు. భార్య సమీపంలో ఉండి ఫొటో తీస్తోంది. ఇంతలోనే ఉగ్రవాదులు వచ్చారు. కౌగిల్లో ఉన్న బిడ్డను ఇవ్వమని అడిగారు. అనంతరం పేరు.. మతం అడిగారు. తన పేరు భరత్.. తాను హిందువునని అని చెప్పాడు. ముస్లిం కాదని తెలియగానే తుపాకీ తలపై గురిపెట్టి.. భార్య, కుమారుడి ముందే భరత్‌ను కాల్చేశారు. భరత్ భూషణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. భార్య సుజాత.. బెంగళూరు రామయ్య ఆస్పత్రిలో పిల్లల వైద్యురాలిగా పని చేస్తోంది. భర్త కళ్ల ముందే చనిపోవడంతో మూడేళ్ల కుమారుడితో ఆమె గజగజ వణికిపోయింది.

ప్రొఫెసర్ ప్రాణాలు కాపాడిన ‘కల్మా’ శ్లోకం
పహల్గామ్ భయానక ఘటన దేశ ప్రజలను హడలెత్తిస్తోంది. బాధిత కుటుంబాలకైతే ఇంకా కళ్ల ముందే మెదలాడుతున్నాయి. ఎవరిని కదిపినా.. భీతిల్లిపోతున్నారు. మంగళవారం జరిగిన మారణహోమం యావత్తు దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. కళ్ల ముందే ఆప్తులను కోల్పోయిన దృశ్యాలు.. ఇంకా అందరి కళ్ల మెదలాడుతూనే ఉన్నాయి. మంగళవారం బైసారన్ పచ్చిక బయళ్ల దగ్గర ఐదుగురు ఉగ్రవాదుల బృందం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ప్రతి ఒక్కరి మతం అడిగి.. పేరు అడిగి కాల్చి చంపేశారు. ఒకవేళ అబద్దం ఆడితే ప్యాంట్ ఇప్పించి చూశాక చంపేశారు. ఇలా దాడి చేస్తుండగా ఒక సమూహం ఇస్లామిక్ శ్లోకం ‘కల్మా’ పఠిస్తున్నారు. అక్కడే అస్సాం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ దేబాసిష్ భట్టాచార్య ఉన్నారు. సిల్చార్‌లోని అస్సాం విశ్వవిద్యాలయంలో బెంగాలీ బోధిస్తారు. ఆయనకు ఇస్లామిక్ శ్లోకం కల్మా రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ శ్లోకాన్ని పఠించని వ్యక్తులను మాత్రం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. తన వంతు వచ్చినప్పుడు భట్టాచార్య బిగ్గరగా కల్మా శ్లోకాన్ని పఠించారు. దీంతో ఉగ్రవాదులు భట్టాచార్య కుటుంబాన్ని ఏమీ చేయకుండా వదిలిపెట్టేశారు. అలా భట్టాచార్య కుటుంబం ప్రాణాలతో బయటపడింది. ఆ భయంకరమైన సంఘటనను తలుచుకుని దు:ఖ పర్యంతం అవుతున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి పట్టణానికి వచ్చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక భట్టాచార్య కుటుంబాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు అస్సాం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అస్సాం సీఎంవో ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొంది.

టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు!
టీ20 క్రికెట్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయుడిగా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై (70; 46 బంతుల్లో 8×4, 3×6) హాఫ్ సెంచరీ బాదడంతో ఈ మైలురాయిని సాధించాడు. జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (13,208) హిట్‌మ్యాన్ కంటే ముందున్నాడు. మొత్తంగా టీ20 క్రికెట్‌లో 12 వేల పరుగులు చేసిన ఎనిమిదవ ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. పొట్టి ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 456 టీ20లలో 12,056 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 79 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (14,562) ముందున్నాడు. అలెక్స్ హేల్స్ (13,610), షోయబ్ మాలిక్ (13,571), కీరన్ పొలార్డ్ (13,537), విరాట్ కోహ్లీ (13,208), డేవిడ్ వార్నర్ (13,019), జోస్ బట్లర్ (12,469) తరువాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 159 మ్యాచ్‌లు ఆడి 4231 రన్స్ చేశాడు. ఇందులో 5 శతకాలు, 32 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 265 ఐపీఎల్ మ్యాచ్‌లలో 6856 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో హిట్‌మ్యాన్ 2 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు బాదాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ (8326) రోహిత్ అగ్ర స్థానంలో ఉన్నాడు.

పవర్‌ఫుల్ విలన్‌ని సెట్ చేసిన పూరి జగన్నాధ్..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో పడిలేచిన కెరటం అంటే దర్శకుడు పూరీ జగన్నాథ్. ఆయన డైరెక్షన్ తో దాదాపు అందరు స్టార్ హీరోలకు మంచి కంమ్ బ్యాక్ ఇచ్చాడు పూరి. కానీ ప్రస్తుతం పూరి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. మామూలుగా చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. వెంటనే తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టేస్తుంటాడు పూరి. కానీ ఈసారి మాత్రం ఇబ్బంది తప్పలేదు. ఇటు టాలీవుడ్ హీరోలు కూడా ఎవ్వరూ ఆయనతో సినిమా చేయడానికి రెడీగా లేని పరిస్థితి. ఎలాగో అలా కష్టపడి మొత్తానికైతే.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడికి కథ చెప్పి.. మెప్పించడం తో పూరి మళ్లీ ప్రేక్షకులతో పాటు నిర్మాతల దృష్టిలో పడ్డాడు. ఈ కలయికలో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇక ఈ మూవీలో నటీనటుల గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్నప్పటికి. ఇప్పటికే సీనియర్ నటి టబు ఓ పవర్ ఫుల్ పాత్రలో ఓకే కాగా. హీరోయిన్ రాధిక అప్టే కూడా కన్‌ఫామ్ అయింది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో విలన్ పాత్ర గురించి ఓ అప్‌డేట్ వైరల్ అవుతుంది. అయితే, ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందట. దీంతో ఈ పాత్రలో సాలిడ్ యాక్టర్‌ ఫహాద్ ఫాజిల్ అయితే బాగుంటుందని భావించి. ఇప్పటికే పూరి ఆయనకు కథను కూడా వినిపించాడని తెలుస్తోంది. కానీ ‘పుష్ప’ మూవీ ఫేమ్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఫహాద్. ఇక పూరి కథ నచ్చినప్పటకి ఆయన బిజీ షెడ్యూల్ వల్ల డేట్లు అడ్జస్ట్ చేయలేకపోతున్నారట. దీంతో పూరి వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా, ఫహాద్ కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తోంది.

కోలీవుడ్ ఎంట్రీ కి సిద్ధం అయిన జాన్వీ కపూర్ ..?
బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ధడక్’ మూవీతో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది జాన్వీ. తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసినప్పటికి.. పాపులారిటి.. ఫేమ్ అయితే వచ్చింది కానీ, కెరీర్ లో అనుకున్నంతగా గట్టి హిట్ మాత్రం పడలేదు. కానీ అతిలోక సుందరి వారసురాలిగా దక్షిణాదీతో తొలి చిత్రం ‘దేవర’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్, ఎన్టీఆర్ సరసన తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టింది. దీంతో తెలుగులో మరో రెండు బడా ప్రాజెక్టులు నటిస్తుంది జాన్వీ కపూర్. అయితే తాజాగా ఇప్పుడు ఈ అమ్మడు మరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది.. అవును సమాచారం ప్రకారం జాన్వీ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందట. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ జాన్వీ కపూర్‌తో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ సామాజిక అంశాలపై నడుస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ వెబ్ సిరీస్‌లో జాన్వీ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ లో అణచివేత, సామాజిక సమస్యలే ప్రధాన కథాంశంగా ఉండనున్నాయి. జులైలో షూటింగ్ పనులు మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా జాన్వీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version