NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతూనే ఉన్నాయి.. తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. పగలంతా ఎండలు.. ఉక్కపోత ఉంటే.. సాయంత్రం నుంచి తెల్లవారాజాము వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది.. ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.. కాగా.. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో.. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందంటోంది వాతావరణ శాఖ.. ఇక, ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్త నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు.. మరోవైపు.. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది అమరావతి వాతావరణ కేంద్రం.. ఇక, ఇన్న విజయనగరం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, శ్రీసత్యసాయి, ప్రకాశం, పార్వతీపురం మన్యం, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షం కురిసింది.. అత్యధికంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 79.25 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

శ్రీవారి భక్తులకు అలర్ట్..
తిరుమల శ్రీవారి భక్తులకు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఈ రోజు, రేపు వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో డిసెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు సంబంధించిన దర్శన టిక్కెట్ల కోటాను విడుదల చేయనున్నారు.. మరోవైపు.. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇక, రేపు మధ్యహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుద చేయనున్నారు..

శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం..
శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం శాస్రోక్తంగా ప్రారంభమైంది. లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో.. అందుకు అనుగుణంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలో మహా శాంతి యాగాన్ని నిర్వహిస్తున్నారు అర్చకులు. శ్రీవారికి ఉదయం నైవేద్య సమర్పణ జరిగిన అనంతరం బంగారు వాకిలి సమీపంలో ఉన్న యాగశాలలో మూడు యజ్ఞ కుండాలలో మహా శాంతి యాగ క్రతువు ప్రారంభించారు అర్చకులు. ముందుగా పుణ్యా వచన కార్యక్రమాన్ని నిర్వహించి అటు తరువాత మహా శాంతి యాగాన్ని ప్రారంభించారు. చివరగా వాస్తు హోమం నిర్వహించి అనంతరం పంచగవ్య పదార్థాలైన పాలు, పెరుగు, నెయ్యి, పేడ, గోమూత్రంతో అన్నప్రసాద పోటు, లడ్డూ పోటులో సంప్రోక్షణ చేయడంతో మహా శాంతి యాగం ముగియనుంది. 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమపండితులుతో పాటు ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.

అయ్యయ్యో.. 15 సంవత్సరాలుగా పక్కింటి వారి విద్యుత్ బిల్లును కడుతున్న వ్యక్తి..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. కాలిఫోర్నియా నివాసి తన పక్కింటి వారి విద్యుత్ బిల్లును 15 సంవత్సరాలకు పైగా చెల్లిస్తున్నట్లు కనుగొన్నాడు. కెన్ విల్సన్ 2006 నుండి వాకావిల్లేలోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఒంటరిగా నివసిస్తున్నాడు. లైట్ల వినియోగం పరిమితంగా ఉన్నప్పటికీ, అతని లైట్ బిల్లు పెరుగుతూ ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది. వారు విచారించగా, స్థానిక విద్యుత్ సంస్థ చేసిన షాకింగ్ తప్పును కనుగొన్నారు. విచారణలో 15 ఏళ్ల ఓ తప్పిదం బయటపడింది. విద్యుత్ సంస్థ కారణంగా, విల్సన్ తన పొరుగువారి విద్యుత్ బిల్లును చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయంలో విల్సన్ లైట్ల వినియోగాన్ని కూడా తగ్గించాడు. అలాగే అతని ఎలక్ట్రిక్ వస్తువుల వాటేజీని ట్రాక్ చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, అతని బ్రేకర్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా అతని మీటర్ బిల్లు పెరుగుతూనే ఉంది. ఈ సందర్బంగా.. నేను విద్యుత్తును ఆదా చేయడానికి నా ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని విల్సన్ స్థానిక టీవీ స్టేషన్ తో అన్నారు. పవర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా, నేను నా మీటర్‌ను తనిఖీ చేయడానికి బయటికి వెళ్లాను. అది ఇంకా నడుస్తోంది. ఆ తర్వాతే నాకు అనుమానం వచ్చింది. అనుమానంతో, అతను దర్యాప్తు చేయడానికి పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ (PG&E)ని సంప్రదించాడు. అందుకు సంబంధించిన దర్యాప్తు వివరాలను అందించాడు. PG&E దర్యాప్తు ప్రారంభించింది. చివరికి అతని అనుమానాలను కంపెనీ ధృవీకరించింది. అతను తన అపార్ట్‌మెంట్‌లోకి మారిన మూడేళ్ల తర్వాత నుండి తన పొరుగువారి కరెంటు బిల్లును తెలియకుండానే చెల్లిస్తున్నట్లు కనుగొనబడింది.

బంగాళాఖాతంలో ఆవర్తనం.. గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్‌ హెచ్చరికలు జారీ..
ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. ఎగువ వాయుగుండం కొనసాగుతుంది. ఈ ప్రభావం కారణంగా, దిగువ ట్రోపో వాతావరణంలో గాలులు వీస్తాయి. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని గంటకు 30 నుంచి 40 కి.మీ. గాలులు వేగంగా వీస్తాయని తెలిపింది. గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో గంటకు 8-10 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. మరో మూడు, నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై, ఎప్పుడైనా వర్షం కురుసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కాగా.. ఆదివారం రాత్రి 9గంటల వరకు ఉప్పల్‌ బండ్లగూడలో అత్యధికంగా 2.15సెం.మీలు, లింగోజిగూడలో 1.78, నాగోల్‌లో 1.75 , వనస్థలిపురంలో 1.40సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్‌ అధికారులు వెల్లడించారు.

నేడు జమ్మూ&కాశ్మీర్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం..
లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ రోజు (సోమవారం) జమ్మూ అండ్ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారు. కాంగ్రెస్, కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం 11 గంటలకు పూంచ్‌లోని సురాన్‌కోట్ కు చేరుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి షానవాజ్ చౌదరికి మద్దతుగా ఆయన పబ్లిక్ ర్యాలీలో పాల్గొంటారు. షానవాజ్ చౌదరి ఏఐసీసీ కార్యదర్శిగా, ఒడిశా కో-ఇన్‌చార్జిగా కూడా పని చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా షానవాజ్ ఎన్నికల బరిలో నిలిచారు. కాగా, రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా శ్రీనగర్‌లోని సురాన్ కోటలోనూ ఈరోజు పర్యటిస్తారు. షాల్టెంగ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన సభా ప్రదేశానికి చేరుకుంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికల్లోనూ బనిహాల్‌లోని సంగల్దాన్, సౌత్ కశ్మీర్‌లోని దూరు ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ ప్రచారం చేశారు. రెండో విడత పోలింగ్‌కు ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 25వ తేదీన పోలింగ్ జరుగనుంది.

నేడు శ్రీలంక అధ్యక్షుడిగా అనురా దిసనాయకే ప్రమాణ స్వీకారం
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్టు( లెఫ్ట్ పార్టీ) నేత అనుర కుమార దిసానాయకే గెలిచారు. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత అనుర కుమార దిసనాయకేను విజేతగా ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం అనూర కుమార దిసానాయకే ఈరోజు (సోమవారం) శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన శ్రీలంకకు తొమ్మిదవ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీకి చెందిన నేషనల్ పీపుల్స్ పవర్ నేత, 56 ఏళ్ల అనుర కుమార తన సమీప ప్రత్యర్థి అయినా సమిత్ జన బలవేగయ పార్టీకి చెందిన సాజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు. కాగా, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచారు. కానీ ఆయన కౌంటింగ్‌ జరిగిన తొలి రౌండ్‌లోనే పోటీలో నుంచి నిష్క్రమించిపోయారు. సుమారు రెండేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన తిరుగుబాటు తర్వాత పార్లమెంటు ద్వారా రణిల్ విక్రమసింఘేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రణిల్ విక్రమసింఘే గత రెండేళ్లుగా ఆర్థిక సంస్కరణలపై ఒత్తిడి తెచ్చి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీలో నిలిచినా.. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత రణిల్ విక్రమసింఘే శ్రీలంక అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. దీంతో ఈరోజు అనుర కుమార దిసానాయకే ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు.

ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరం లేదు: అశ్విన్‌
సిరీస్‌ల మధ్య విరామాలు తీసుకోవాలని, అప్పుడే ఫిట్‌గా ఉండొచ్చని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్ అన్నాడు. నైపుణ్యం కంటే శారీరకంగా ఫిట్‌గా ఉంటూ సీజన్‌ను పూర్తి చేయడమే అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. జట్టులో కొనసాగాలంటే నిరంతరం ప్రాక్టీస్‌లోనే ఉండాల్సిన అవసరం లేదని యాష్ పేర్కొన్నాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న అనంతరం రవిచంద్రన్‌ అశ్విన్ మాట్లాడుతూ… ‘రానున్న నెలల్లో చాలా టెస్టులు ఆడాల్సి ఉంది. సుదీర్ఘ సీజన్ అనే చెప్పాలి. కఠినమైంది కూడా. కొన్నిసార్లు భవిష్యత్తు తలచుకుంటే కష్టంగా అనిపిస్తుంటుంది. 3-4 నెలల్లో 10 టెస్టులు ఆడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడమే మంచిది. సిరీస్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే ఫిట్‌గా ఉండొచ్చు. నైపుణ్యం కంటే శారీరకంగా ఫిట్‌గా ఉంటూ సీజన్‌ను పూర్తి చేయడమే నా లక్ష్యం. అందుకే రెండు సిరీస్‌ల మధ్య విరామం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటా’ అని చెప్పాడు.

అభిమాని గృహప్రవేశానికి బాలయ్య.. వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ అభిమానులు ముద్దుగా బాలయ్య, బాల అని పిలుస్తుంటారు. ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించి టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బాలయ్య గోల్డెన్ ఎరా నడుస్తుందని చెప్పాలి. ఒకవైపు వరుస సూపర్ హిట్ సినిమాలు, మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోను తన భుజస్కందాలపై నడిపిస్తూ మిగతా హీరోలతో కూడా జై బాలయ్య అనేలా ఆయన జర్నీ కొనసాగుతుంది. మరోవైపు హిందూపురం శాసన సభ్యుడిగా ప్రజలకు విశేష సేవలందిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు బాలయ్య. ఇదిలా ఉండగా తాజాగా బాలయ్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో చుసిన ప్రతి ఒక్కరు బాలయ్య మనసు బంగారం, తండ్రికి తగ్గ తనయుడు, మా మంచి ముద్దులమావయ్య మా బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకి ఆ వీడీయోలో ఏముందంటే ఇటీవల నందమూరి బాలకృష్ణ అయన ఒక అభిమాని ఇంటి గృహప్రవేశానికి వెళ్లారు. ఎక్కడో చిన్న పరిచయం ద్వారా బాలయ్యను వారి ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానించగా అభిమాని కోరిక మేరకు ఆ కార్యక్రమానికి హాజరయి, దంపతులను ఆశీర్వదించి, అభిమాని కుటుంబ సభ్యులతో దాదాపు 3 గంటల సమయం అక్కడే ఉండి వారితో పాటు భోజనం చేసి, ఫోటోలు దిగారు. ఆయన బిజీ షెడ్యూల్ లో కూడా తమకోసం వచ్చిన బాలయ్య గొప్ప హృదయానికి ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఇంత డౌన్ టూ ఎర్త్ పర్సన్ ను మా జీవితంలో చూడలేదు, బాలయ్య మంచి మనసుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వీడియో రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..

మెగాస్టార్ గిన్నిస్ రికార్డ్ పై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?
22 సెప్టెంబర్ 2024న భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ చలనచిత్ర నటుడిగా, డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి కొణిదెలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. 1978 సెప్టెంబరు 22న మెగాస్టార్ చిత్ర పరిశ్రమకు అరంగేట్రం చేసారు. నేడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు చేసిన రోజు కూడా సెప్టెంబర్ 22 కావడం చిరుకు ఎంతో ప్రత్యేకం.  మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో అయన నటించిన  156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేశారు.  ఇందుకు గాను గిన్నీస్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన  ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు అమిర్‌ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ‘గిన్నిస్ రికార్డ్ నన్ను వరిస్తుందని నా కలలో కూడా ఊహించలేదు. నేను ఎదురుచూడని ఒక గొప్ప గౌరవం లభించినందుకు భగవంతునికి, దర్శక నిర్మాతలకు, అభిమానులకు రుణపడి ఉంటాను’ అని అన్నారు. ఇదిలా ఉండగా అన్నయ్య పేరు గిన్నిస్ రికార్డుల్లో లిఖితం కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ” అన్నయ్య చిరంజీవి గారికి సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదు. ఈ రోజు అన్నయ్య గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు,  537 పాటలు, 24 వేల స్టెప్స్ తో అలరించిన నటుడిగా చిరంజీవి గారి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. ‘ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా’ అని గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుంది. అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను” అని లేఖ విడుదల చేసారు తమ్ముడు పవన్ కళ్యాణ్.

తెలుగు ప్రేక్షకులకు ప్రేమతో.. మీ జాన్వీ కపూర్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన  పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో అలనాటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మరొక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన సాంగ్స్ విశేషంగా అలరించగా ఇటీవల రిలీజ్ అయిన దేవర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించాలకున్న ఈవెంట్ భారీగా అభిమానులు తరలిరావడంతో రద్దు చేసారు.దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవడంపై భాదపడుతూ అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేసారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ మరొక వీడియో రిలీజ్ చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయి తెలుగు పేక్షకులకు చెప్పాలనుకున్న వ్యాఖ్యలను వీడియో రూపంలో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఏముందంటే ‘ అందరికీ నమస్కారం.ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి, నా మీద ఎంతో ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ కు, అలాగే నన్ను జాను పాప అని పిలుస్తున్న జూనియర్ ఎన్టీయార్ సార్ ఫ్యాన్స్ కు అందరికి నా ధన్య వాదాలు, మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు.అలాగే అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా. నన్ను ఇంతలా సపోర్ట్ చేసేలా మీరందరు గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. దేవర నా స్టెప్. దర్శకులు శివ సార్, ఎన్టీయార్ సార్ ఈ సినిమాకు నన్ను ఎంపిక చేయడం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. యూనిట్ అందరికి థాంక్యూ” అని అన్నారు