NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఏపీ కేబనెట్‌ భేటీ.. కీలక అజెండాపై చర్చ
ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం ఇవాళ జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు, పథకానికి అర్హుల ఎంపిక, ఆర్థిక భారం వంటి అంశాల పైన చర్చించి అర్హుల ఎంపికపైన తుది నిర్ణయం తీసుకోనుంది. చెత్త పన్ను రద్దుపైన ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ నిర్ణయం అమలుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

నేడు గుంటూరు, కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు గుంటూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు.. ముందుగా గుంటూరు జిల్లా తెనాలిలోని సహన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గుంటూరు నుంచి హెలికాప్టర్‌లో ఆయన బద్వేల్ కు చేరుకుంటారు. బద్వేల్ లోని రామాంజనేయ నగర్ లో ఉన్న బాలిక కుటుంబ సభ్యులను ఆయన కలవనున్నారు. వారిని పరామర్శించి, ఓదార్చనున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందులకు చేరుకుంటారు. రాత్రి పులివెందులలో బస చేస్తారు.

దానా తుఫాన్‌ ఎఫెక్ట్.. ఈ రోజు ఈ రైళ్లు రద్దు..
బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రేపు దానా తుఫాన్‌ తీరం దాటనుంది. ఏపీ సహా మూడు రాష్ట్రాలపై తుఫాన్‌ ఎఫెక్ట్ ఉండబోతోంది. దానా తుఫాన్ ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని… ఈదురు గాలుల తీవ్రత 140 నుంచి 160 కిలోమీటర్ల వరకూ పెరిగడానికీ అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక, దీని ప్రభావం వల్ల ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. తీరానికి సమీపించే కొద్దీ మూడు రాష్ట్రాలపై దానా తుఫాన్ ప్రభావం ఉధృతంగా ఉంటుంది. నేటి నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది ఐఎండీ. దానా తుఫాన్‌ ఎఫెక్ట్‌తో మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు.. ఈ రోజు, రేపు, ఎల్లుండి మొత్తంగా 41 రైళ్లు రద్దు చేశారు.. సికింద్రాబాద్-భువనేశ్వర్‌, కన్యాకుమారి-దిబ్రూగఢ్‌, చెన్నై సెంట్రల్-షాలిమార్, ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్, హైదరాబాద్-హౌరా ఈస్ట్ కోస్ట్, బెంగళూరు-హౌరా తదితర రైళ్లు రద్దు చేసినవాటిలో ఉన్నాయి.. ఈ రోజు సికింద్రాబాద్ – భువనేశ్వర్, హైదారాబాద్ – హౌరా, సికింద్రాబాద్ – హౌరా, సికింద్రాబాద్ – మల్దాటౌన్ రైళ్లను రద్దు చేసింది సౌత్‌ సెంట్రల్ రైల్వే.. ఇక, రేపు హౌరా – సికింద్రాబాద్, షాలిమార్ – హైదారాబాద్, సిల్చార్ – సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. మరోవైపు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తం అయింది. ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు ప్రయాణికులను అలర్ట్ జారీ చేసింది. ఈనెల 23, 24, 25 తేదీల్లో మొత్తంగా 198 రైలు సర్వీసులను ఈస్ట్ కోస్ట్ రైల్వే క్యాన్సిల్ చేసింది.

వైసీపీకి మరో షాక్‌.. పార్టీకి మరో కీలక నేత గుడ్‌బై..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేజారిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు.. ఇలా పార్టీని వీడారు.. అంతేకాదు.. మరికొంతమంది చూపు.. టీడీపీ, జనసేన, బీజేపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, ఈ తరుణంలో మరో కీలక నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.. వైసీపీకి ఇవాళ రాజీనామా చేయనున్నారు వాసిరెడ్డి పద్మ.. గ న్నికల్లో జగ్గయ్యపేట సీటు ఆశించారు వాసిరెడ్డి పద్మ.. అయితే, ఇటీవల తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్టానం.. ఇక, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వాసిరెడ్డి పద్మ ఈ నిర్ణయానికి వచ్చారనే చర్చ సాగుతోంది.. కాగా, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో.. మనస్థాపానికి గురైన వాసిరెడ్డి పద్మ.. ఏపీ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే.. పార్టీలో యాక్టివ్‌గా పనిచేసేందుకు తాను రాజీనామా చేశానని ప్రకటించిన ఆమె.. ఆ ఎపిసోడ్‌ తర్వాత వైసీపీలో ఉన్నప్పటికీ యాక్టివ్‌గా కనిపించడంలేదు. ఇక, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలోతో పాటు.. అంతకుముందు వైసీపీ తరపున తన గొంతును వినిపిస్తూ వచ్చిన వాసిరెడ్డి పద్మ.. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా.. ఏ ఇష్యూపైనా పెద్దగా స్పందించింది లేదు.. ప్రస్తుతం ఏపీలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా.. ఇప్పుడు వైసీపీకి గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారట.. అయితే, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజారాజ్యం పార్టీలో ప్రారంభించిన వాసిరెడ్డి పద్మ.. ఆ పార్టీ అధికారప్రతినిధిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం.. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో.. వైసీపీలో చేరారు.. ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇక, గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సేవలందించారు.. ఎన్నికల ముంగిట ఆ పదవికి రాజీనామా చేసిన ఆమె.. ఇప్పుడు పార్టీకి గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. మరి వాసిరెడ్డి పద్మ అడుగులు ఏ పార్టీ వైపు పడతాయో చూడాలి..

ఎంఎస్ ధోనీ కాదు.. సీఎం చంద్రబాబుకు ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే?
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 25 నుంచి అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలుకానుంది. మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఇటీవలే చంద్రబాబుపై షూట్ పూర్తి కాగా.. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా విడుదల చేసింది. 5 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉన్న ప్రోమోలో బావా బామ్మర్దులైన చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. రాజకీయం నుంచి.. వ్యక్తిగత వరకు బాలయ్య బాబు అడిగిన ప్రశ్నలకు సీఎం తనదైన శైలిలో బదులిచ్చారు. ఈ క్రమంలోనే బాబు తనకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ అని తెలిపారు. ప్రముఖుల ఫోటోలను స్క్రీన్‌పై చూపిస్తూ.. వీరిలో ఎవరు ఇష్టం అంటూ బాలయ్య.. చంద్రబాబుని ప్రశ్నించారు. ఎంఎస్ ధోనీ, కోహ్లీ ఫోటోలను చూపిస్తూ.. ‘బావ మీరేమో ధోనీ లాంటి లీడర్.. నేనేమో కోహ్లీ లాంటి ఆటగాడిని’ అని అన్నారు. ‘నేను ఎప్పుడూ కోహ్లీని ఇష్టపడుతాను’ అని బాబు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మంత్రి కొండా సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్‌ వాంగ్మూలం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ (బుధవారం)ప్రజా ప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువునష్టం క్రిమినల్ కేసులో.. ఆయన కోర్టుకు హాజరుకానున్నారు. మేజిస్ట్రేట్ శ్రీదేవి ఆదేశాల మేరకు.. ఫిర్యాదుదారులైన కేటీఆర్‌తో పాటు సాక్షులుగా వున్న తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్ వాంగ్మూలాలను కూడా కోర్టులో నమోదు చేయనున్నారు. తనపై దాఖలైన ఆరోపణలపై కోర్టుకు హాజరై వివరణ ఇచ్చేందుకు మంత్రి కొండా సురేఖకు అవకాశం కల్పిస్తూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు బుధవారం కోర్టుకు హాజరుకావాలని లంగర్‌హౌస్ పోలీసులు ఆమెకు సమన్లు ​​జారీ చేశారు.

తెలంగాణలో మూడో రోజు గ్రూప్-1 పరీక్ష..
నేడు తెలంగాణలో మూడో రోజు గ్రూప్‌-1 పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. రెండు రోజులు ప్రశాంతంగా కొనసాగిన గ్రూప్‌ 1 పరీక్షలు. నేటితో మూడోరోజుకు చేరింది. కాగా..తెలంగాణలో తొలిరోజు నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగియగా, తొలిరోజు పరీక్షకు 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష హాలులోకి అనుమతించాలని అధికారులు స్పష్టం చేశారు. రెండురోజులు 22 వేల 744 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా… మొత్తం 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొదటి రోజు కొంతమంది విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనందున పరీక్షకు అనుమతించలేదు అధికారులు. దీంతో మొదటి రోజు అభ్యర్థులు రాయలేకపోయారు. పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించకపోవడమే తప్ప ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలు లేవని టీజీపీఎస్పీ పేర్కొంది. హైదరాబాద్‌లో 5 వేల 613 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 87.23 శాతం మందికి గాను 4 వేల 896 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాశారు. మరో 717 మంది గైర్హాజరయ్యారు. రంగారెడ్డి పరిధిలో 8 వేల 11 మందికి గాను 5 వేల 854 మంది పరీక్ష రాశారు. మరో 2 వేల 157 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఈ నెల 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ కొనసాగనున్న నేపథ్యంలో అన్ని పరీక్షలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని టీజీపీఎస్పీ భావిస్తోంది.

దానా తుఫాన్ ప్రభావం.. ఏపీ సహా మరో మూడు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
వాయుగుండం ఈరోజు తుఫానుగా బలపడే అవకాశం ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో గంటకు 6 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతుంది వాయుగుండం. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ‘దానా’ తుఫానుగా నామాకరణం చేసినట్లు ఐఎండీ తెలిపింది. ఇక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ దగ్గర ఈ వాయుగుండం తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45- 65 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ఎఫెక్ట్ తో విజయనగరం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో నాలుగు రోజులు భారీగా వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది. ఇక, మరోవైపు పశ్చిమ బెంగాల్ లోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. పుర్బా, తూర్పు మిడ్నాపూర్‌, పశ్చిమ్ మెదినీపూర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడంతో బెంగాల్ సర్కార్ అలర్ట్ అయింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన 24×7 పరిస్థితిని అంచనా వేయాలని సీఎం మమతా బెనర్జీ తెలిపింది. అలాగే, తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడం మానుకోవాలని భారత వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే వర్ష సూచనలు ఉన్న జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చారు.

హెజ్‌బొల్లా రాకెట్లతో దాడి.. కూల్చేసిన ఇజ్రాయెల్‌
ఇజ్రాయెల్‌ మధ్య ప్రాంతంపై హెజ్‌బొల్లా మంగళవారం రాకెట్లతో దాడికి దిగింది. ఇక, వాటిని ఇజ్రాయెల్‌ సైన్యం అడ్డుకుంది. ఒక రాకెట్‌ నిర్మానుష్య ప్రాంతంలో పడగా.. ఒక రిజర్విస్టు సైనికుడు మరణించినట్లు వెల్లడించారు. ఈ దాడుల నేపథ్యంలో 10 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు సురక్షిత బంకర్లలోకి వెళ్లి పోయారు. అలాగే, విమాన సేవలకు కొంతమేర అంతరాయం కూడా కలిగింది. మరోవైపు సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో 13 మంది లెబనాన్‌ వాసులు చనిపోయారు. ఇటు పశ్చిమాసియాలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌.. కాల్పుల విరమణకు అవకాశం తక్కువగా ఉందన్నారు. హెజ్‌బొల్లా మంగళవారం ఇజ్రాయెల్‌లోని జన సమర్థ ప్రాంతాలపై రాకెట్‌ దాడులు చేసినప్పటికి.. ఎలాంటి నష్టం జరగలేదని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌కు రావడానికి కొద్ది గంటల ముందు ఈ దాడులు కొనసాగాయి. ఇక, లెబనాన్‌ నుంచి హెజ్‌బొల్లా గ్రూప్ 5 ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించింది. వాటిలో ఒక్కటి మినహా అన్నింటినీ క్షిపణి రక్షణ వ్యవస్థ అడ్డుకుందని ఇజ్రాయెల్‌ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఒకటి నిర్మానుష్య ప్రాంతంలో పడగా.. దీని కారణంగా బెన్‌ గురియన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. బీరుట్‌లోని ప్రధాన ఆసుపత్రి ప్రాంతంలో సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 13 మంది చనిపోయారని లెబనాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 57 మంది గాయపడ్డారని చెప్పుకొచ్చింది.

దాచడానికేమీ లేదు.. రాహుల్-సర్ఫరాజ్‌ మధ్య పోటీ ఉంది: కోచ్‌
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండో టెస్టులో విజయం సాధించాలని చూస్తోంది. పూణేలో గురువారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తుది జట్టులో స్థానం కోసం సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్, యువ ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ల మధ్య గట్టి పోటీనెలకొంది. ఇది వాస్తవమేనని, అందులో దాచడానికి ఏమీ లేదని టీమిండియా సహాయ కోచ్‌ ర్యాన్ టెన్‌ డస్కాటె తెలిపాడు. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టెన్‌ డస్కాటె మాట్లాడుతూ… ‘నిజమే.. మిడిల్ ఆర్డర్‌లో గట్టి పోటీ నెలకొంది. దాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదు. బెంగళూరు టెస్ట్ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. లోకేష్ రాహుల్‌ విషయంలో మాకు ఆందోళనేమీ లేదు. అతడు బాగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. రాహుల్ మానసిక స్థితి కూడా బాగుంది. అయితే రెండో టెస్ట్ మ్యాచ్‌కు ఉన్న ఆరు బ్యాటింగ్‌ స్థానాల్లో ఏడుగురి నుంచి ఎలా సర్దుబాటు చేయాలో చూడాలి. పిచ్‌ని పరిశీలించి.. జట్టుకు ఉపయోగపడే మంచి నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నాడు. మెడ నొప్పి కారణంగా తొలి టెస్టుకు యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ దూరం కావడంతో.. సర్ఫరాజ్‌ ఖాన్ జట్టులోకి వచ్చాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగుల టాప్ క్లాస్ ఇన్నింగ్స్‌ ఆడాడు. మరోవైపు కేఎల్ రాహుల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 0, 12 రన్స్ చేశాడు. బెంగళూరు టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో.. రాహుల్‌ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. పూణే టెస్టుకు గిల్‌ అందుబాటులోకి వస్తే.. రాహుల్‌పై వేటు వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఆస్ట్రేలియా లాంటి కీలక సిరీస్ ఉన్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

KGF – 3 ఫిక్స్.. యశ్ కీలక వ్యాఖ్యలు
కన్నడ స్టార్ హీరో యశ్‌ నటించిన పాన్ ఇండియా హిట్ సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎవరికీ అంతగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ రోజు మొదటి ఆట ముగిసే నాటికి కేజీఎఫ్‌ మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఎవరు ఊహించని వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. మొదటి భాగానికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్‌ -2 కూడా ఫస్ట్ పార్ట్ కంటే పెద్ద సక్సెస్ సాదించింది. ఈ సినిమా తర్వాత అటు హీరో యశ్‌ ఇటు దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం యశ్‌ టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే కేజీఎఫ్ -2 ఎప్పుడు వస్తుందని ఫాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య చిత్ర నిర్మాణ సంస్థ ‘కేజీఎఫ్‌3’పై స్పష్టత ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘‘రాఖీ భాయ్‌ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు?’’ అంటూ విడుదలైన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాజాగా హీరో యాష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీఎఫ్‌ – 3 గురించి ఎప్పుడు వస్తుందంటూ ప్రశ్నించారు. అందుకు సమాధానం గా యష్ బదులిస్తూ “మేము వాగ్దానం చేసినట్లుగా కేజీఎఫ్‌ – 3’ ఖచ్చితంగా జరుగుతుంది. మాకు ఒక ఆలోచన ఉంది, సరైన సమయం వచ్చినప్పుడు దాని గురించి వెల్లడిస్తాం, కేజీఎఫ్‌- 3 అది భారీగా ఉంటుంది. ప్రేక్షకులు గర్వపడే విధంగా మేము చేస్తాము, ఎందుకంటే ఇది ఒక కల్ట్. నేను మరియు ప్రశాంత్ నీల్ దానిపై చర్చిస్తున్నాము” అని న్నారు.

NTR పడిన కష్టానికి ఆడియెన్స్ ‘లాల్ సలామ్’
యంగ్ టైగర ఎన్టీఆర్ నటించిన దేవర ఇటీవల విడుదలై వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చిన కూడా అవేమి పట్టించుకోకుండా ఎన్టీఆర్ సినిమా ఎలా ఉన్న చూడాలి అనే ఆడియెన్స్ ఫిక్స్ అయి దేవరను ఎగబడి చూసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించాయి.ఇప్పటికి థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమా నుండి వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చిత్ర విజయంలో భాగమైన ఆయుధపూజ వీడియో సాంగ్ ను ఈ మంగళవారం రిలీజ్ చేయగా రికార్డు వ్యూస్ రాబడుతోంది. అయితే ఈ పాట లోని తారక్ డాన్స్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేతికి బలమైన గాయం అయింది. అప్పట్లో చేతికి కట్టుకట్టు ఉన్న ఫొటోస్ కూడా నెట్టింట రిలీమ్ అయ్యాయి. అయితే గాయం ఆయుధపూజ సాంగ్ లోనే అయిందని అయినా సరే షూటింగ్ ఆగకూడదు అని భావించి దెబ్బతగిలిన ఎడమ చేతికి కట్టుకట్టుకుని కనిపించకుండా వెనుకకు ఎన్టీఆర్ డాన్స్ చేసాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియో సాంగ్ లో అది క్లియర్ గా కనిపించింది. ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే ఎంతటి కష్టమైన, ఎంతటి భాదనైన తట్టుకుని టేక్ అయ్యేవరకు పని చేయాలని ఎన్టీఆర్ మరోసారి ప్రూవ్ చేసారు. తారక్ డెడికేషన్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఆది సమయంలోను ఎన్టీఆర్ చేతికి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.