NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రాజమండ్రి సమీపంలో ట్రావెల్స్‌ బస్సు బోల్తా..
రాజమండ్రి సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైజాగ్ కు చెందిన యువతి మృతి చెందగా… 20 మంది వరకూ గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ కు గత రాత్రి బయలుదేరిన కావేరి ట్రావెల్ బస్సు అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి గామన్ వంతెన రహదారిపై బోల్తా పడింది. బస్సు బోల్తాపడిన విషయం తెలిసేసరికి జాప్యం జరగడం, పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు క్షతగాత్రుల గంటపాటు విలవిల్లాడారు. రాజమహేంద్రవరం నుంచి ఆరు అంబులెన్సులు కాతేరు- కొంతమూరు మధ్య వంతెనపై ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం జీజీహెచ్ తరలించారు. వీరంతా విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది. వీరిలో 25 ఏళ్లలోపు విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. క్రేన్ సాయంతో రాత్రి ఒంటి గంట సమయంలో బోల్తాపడిన బస్సును తొలగించి కింద ఉన్న మరికొంతమందిని రక్షించారు. వారంతా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుక్కోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం పరీక్ష రాస్తే ఎందుకు వెళ్తున్న విశాఖకు చెందిన కళ్యాణి అనే యువతి ఘటనా స్థలంలోని మృతి చెందడంతో తీవ్ర విషాదంగా మారింది. ఘటనపై రాజమండ్రి టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏప్రిల్‌ కోటా టికెట్ల విడుదల
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్‌.. ఇప్పటికే మార్చి నెల వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడం.. అవి పూర్తిస్థాయిలో భక్తులు బుక్‌ చేసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఏప్రిల్‌ నెలకు సంబంధించి వివిధ దర్శనాల టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు.. దర్శనాలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయబోతున్నారు.. ఇవాళ ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టిక్కెట్లు పెట్టబోతున్నారు.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేస్తారు.. మరోవైపు రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ..

దావోస్‌లో బిజీబిజీ.. లోకేష్‌ వరుస భేటీలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దావోస్‌ వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సీఎం చంద్రబాబుతో కలిసి వివిధ సంస్థల భేటీల్లో పాల్గొంటున్న ఆయన.. మరోవైపు.. అవకాశం దొరికొనప్పుడు ఇతర సంస్థలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మాథ్యూ ఉక్ చాంగ్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలతో కలసి పరిశోధనా కార్యక్రమాలకు సహకరించమని కోరారు.. వ్యవసాయం, బయోటెక్నాలజీ, ఇతర స్థిరమైన పద్ధతులకు సంబంధించిన ప్రాజెక్టులపై సహకారం అందించాలన్నారు లోకేష్.. ఏపీ విశ్వవిద్యాలయాలతో కలసి రాష్ట్రంలో ఉమ్మడి పరిశోధన ప్రయోగశాలలను ఏర్పాటు చేయమన్నారు. స్థానిక పరిశోధకులు, విద్యార్థుల కోసం సింథటిక్ బయాలజీలో శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లను నిర్వహించాలని సూచించారు.. స్థానిక బయోటెక్ కంపెనీలు, NCEB భాగస్వామి నెట్‌వర్క్ మధ్య సహకారాన్ని సులభతరం చేయాలని.. ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు సమీపంలోఇన్నొవేషన్ హబ్, ఆర్‌ అండ్‌ డీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి నాలెడ్జ్ సపోర్ట్ అందించాలని మంత్రి లోకేష్ కోరారు..

వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్.. దావోస్‌లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
దావోస్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వాళ్లు వెరీ రిచ్‌.. మేం వెరీ పూర్ అంటూ.. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. తమ రాష్ట్రాల్లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్నారు భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్‌ వెళ్లి.. వివిధ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో సమావేశమై.. తమ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు.. తమ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలికసదుపాయాలు వివరిస్తూ.. పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు.. అయితే, దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు.. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పాల్గొన్నారు.. ఇక, గ్రీన్‌ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రాగా.. గ్లోబల్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం.. రాష్ట్రాల ఆకాంక్ష ఏ విధంగా ఉంది అనే అంశాలపై చర్చించారు.. అయితే, ఈ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు బదులిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు.. వాళ్లు వెరీ రిచ్‌.. మేం వెరీ పూర్ అంటూ.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చూయిస్తూ కామెంట్లు చేశారు.. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. తెలంగాణ స్టేట్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ఇండియా అని పేర్కొన్న చంద్రబాబు.. వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్ అంటూ చమత్కరించారు.. దీంతో, ఈ కార్యక్రమంలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి..

నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లో జరిగిన అక్రమాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. ఎంక్వైరీలో భాగంగా ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, అధికారులను కమిషన్ క్వశ్చన్ చేసింది. ఈ క్రమంలోనే ఈరోజు (జనవరి 23) కమిషన్ ఎదట కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు చేపట్టిన ఏజెన్సీ సంస్థల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీని ఎల్ అండ్ టీ నిర్మించగా, అన్నారం బ్యారేజీని ఆప్కాన్స్ నిర్మాణం చేపట్టింది. ఇక, సుందిళ్ళ ప్రాజెక్టును నవయుగ సంస్థ నిర్మాణ పనులు చేపట్టింది. దీంతో ఈ మూడు నిర్మాణ సంస్థలు కమిషన్ ముందుకు విచారణకు రానున్నాయి. నేడు నవయుగ కన్‌స్ట్రక్షన్, రేపు ఎల్ అండ్ టీ, శనివారం నాడు అఫ్కాన్ సంస్థ ప్రతినిధులు విచారణకు హాజరు కానున్నారు. అయితే, నిన్న జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్‌ ను కాళేశ్వరం కమిషన్ విచారించింది. అంతకుముందు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా పని చేసిన రామకృష్ణా రావును కూడా కమిషన్ ఎంక్వైరీ చేసింది. ఆయన ఇచ్చిన అఫిడవిట్‌, కాగ్ స్టేట్‌మెంట్ ఆధారంగా జస్టీస్ పీసీ చంద్రఘోష్ క్వశ్చన్ చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలు, ప్రాజెక్ట్ డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.

నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. మేయర్‌పై బీఆర్‌ఎస్‌ అవిశ్వాసం..?
ఈరోజు (జనవరి 23) జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అందులో హైదరాబాద్ నగరంలో చేపట్టాల్సిన పనులపై ప్రధానంగా చర్చించనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, రోడ్ల అభివృద్ధికి సిద్ధం చేసిన ప్లాన్ కి స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే, కేబీఆర్ పార్క్ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచే అంశంపై కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు, కారు పార్టీ నుంచి గెలిచిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసం పెట్టడానికి బీఆర్ఎస్ సిద్దం అయింది. తాజాగా గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అవిశ్వాసంపై చర్చకు వచ్చింది. కాగా, నాలుగేళ్ల వరకు అవిశ్వాసం ప్రవేశ్ పెట్టొద్దని ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ నాలుగేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 11వ తేదీన ముగుస్తుంది.. ఆ తర్వాత తీర్మానం చేసేందుకు బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. అయితే, జీహెచ్ఎంసీలోని 196 సభ్యులలో 50 శాతం మద్దతు కావాలి. ఈ తీర్మానానికి 98 మంది సభ్యుల సంతకాలు చేయాల్సి ఉంది. ఆ తరువాత ఈ తీర్మానాన్ని హైదరాబాద్ కలెక్టర్ కు ఇచ్చి.. ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసి ఆమోదించాల్సి ఉంటుంది.

నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు (జనవరి 23) ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి, హైదర్‌ సాయిపేట, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, పడమటి తండాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, మధ్యాహ్నం 12:30 గంటలకు జోగులపాడులోని గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, ఆ తర్వాత చంద్రు తండా, మహ్మదాపురంలోనూ సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇక, నిన్న ఇల్లందులో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే మహాలక్ష్మీ, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్‌ లాంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లాంటి మరో నాలుగు పథకాలను సైతం అమలు చేయబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి.. ఈ విషయంలో ఎవరూ ఆందోళన పడొద్దు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

పుష్పక్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మోదీ.. ఏమన్నారంటే ?
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఒక విషాద సంఘటన జరిగింది. ముంబై వైపు వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులలో మంటలు చెలరేగాయని తప్పుడు పుకారు వ్యాపించడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు భయాందోళనకు గురై రైలు నుంచి దూకగా, ఎదురుగా వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పశ్చిమ మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని పచోరా పట్టణానికి సమీపంలో ఉన్న మహేజీ, పార్ధడే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఒక ప్రయాణీకుడు చైన్ లాగడం వల్ల పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఆగిపోయింది. సాయంత్రం 4:45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. భయాందోళనకు గురైన ప్రయాణికులు ఇతర పట్టాలపైకి దూకి బెంగళూరు నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ కింద పడ్డారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేస్తూ, “మహారాష్ట్రలోని జల్గావ్‌లో రైల్వే ట్రాక్‌పై జరిగిన ఈ విషాద ప్రమాదం నన్ను బాధించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

లాస్ ఏంజిల్స్‌లోని శాంటా క్లారిటాలో మంటలు.. ఇళ్లను వదిలిపెట్టిన 19 వేల మంది ప్రజలు
ఇటీవల అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. దీని కారణంగా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. దీని తరువాత ఈ మంటలు ఇప్పుడు ఉత్తర లాస్ ఏంజిల్స్‌కు వ్యాపించాయి. శాంటా క్లారిటా వ్యాలీలో మంటలు పెరుగుతున్నాయి. అగ్నిప్రమాదం కారణంగా వేలాది మంది తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. కాస్టాయిక్ సరస్సు సమీపంలోని కొండలలో అగ్నిప్రమాదం భయంకరమైన జ్వాలలు వ్యాపిస్తున్నాయి. రెండు గంటల్లోనే మంటలు 5,000 ఎకరాలకు (2,000 హెక్టార్లు) వ్యాపించాయి. ఇప్పుడు మంటలు ఎలా ప్రారంభమయ్యాయనే ప్రశ్న తలెత్తుతుంది.. సమాధానం ఏమిటంటే శాంటా అనా పొడి గాలుల కారణంగా మంటలు చెలరేగాయి. ఆ తరువాత ఆ ప్రాంతమంతా వేగంగా వ్యాపించాయి. ఉత్తర లాస్ ఏంజిల్స్‌లోని శాంటా క్లారిటాలోని కాస్టాయిక్ సరస్సు సమీపంలో మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు సరస్సు దగ్గర నివసిస్తున్న 19 వేల మందికి ఇళ్ళు ఖాళీ చేయమని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి, “నా ఇల్లు ఈ అగ్నిప్రమాదంలో కాలిపోకూడదని నేను ప్రార్థిస్తున్నాను. పాలిసేడ్స్, ఈటన్ మంటల వల్ల జరిగిన విధ్వంసాన్ని మేము చూశాము. తరలింపు ఆదేశాలు అందిన తర్వాత కూడా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్ళలేదు. నేను ఇక్కడ అలాంటి విధ్వంసం చూడాలనుకోవడం లేదు. ఇంటిని ఖాళీ చేయమని ఆర్డర్ అందితే వెంటనే ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది.” అని అన్నాడు.

అందరి కళ్లు రోహిత్‌పైనే.. ఎలా ఆడతాడో మరి!
ఇటీవల టెస్టుల్లో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్లు రంజీ బాట పట్టారు. సీనియర్ బ్యాటర్ అయినా సరే దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందే అని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజా సహా మరికొందరు రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దమయ్యారు. చాలా ఏళ్ల నుంచి స్టార్ ప్లేయర్స్ రంజీలు ఆడడం లేదు కాబట్టి.. ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటి నుంచి జమ్ము కశ్మీర్‌తో ముంబై రంజీ మ్యాచ్‌ మొదలవనుంది. అజింక్య రహానే సారథ్యంలో ముంబై తరఫున రోహిత్‌ శర్మ బరిలోకి దిగనున్నాడు. ముంబై జట్టులో యశస్వి జైశ్వాల్‌ కూడా ఉన్నాడు కాబట్టి.. అతడితోనే రోహిత్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. ఇటీవల పేలవ ఫామ్ నేపథ్యంలో హిట్‌మ్యాన్ ఎలా ఆడుతాడో అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఉన్న నేపథ్యంలో అతడు ఫామ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్ రాకతో ఈ రంజీ మ్యాచ్‌కు క్రేజ్ పెరిగింది. 10 ఏళ్ల తర్వాత రంజీలో హిట్‌మ్యాన్ ఆటను చూసేందుకు స్థానికి అభిమానులు పోటెత్తనున్నారు.

ఆగిపోయిన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన విక్రమ్..
చియాన్ విక్రమ్.. హిట్లు..ఫ్లాపులకు సంబంధం లేకుండా సాగుతుంది ఈ హీరో కెరీర్. విక్రమ గతేడాది తంగలాన్ అనే సినిమాను రిలీజ్ చేసాడు. విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన విజయం దక్కించులేదు. ఈ సినిమాతో పాటు ధ్రువ నక్షత్రం, వీర ధీర సూరన్ – 2 అనే రెండు సినిమాలు కూడా చేసాడు. ధ్రువ నక్షత్రం షూటింగ్ ఫినిష్ చేసుకుని మూడేళ్లు అవుతుంది కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఇక వీర ధీర సూరన్ ఇదే పరిస్థితి. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఎస్‌‌యు అరుణ్ కుమార్‌తో చేసిన ‘వీర ధీర సూరన్-2’ మొదట సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ గేమ్ ఛేంజర్, బాల డైరెక్షన్‌లో వస్తోన్న‌వనంగాన్, అజిత్ విదాముయర్చి పొంగల్ రేసులోకి వచ్చేయడంతో విక్రమ్ సైడయ్యాడు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వస్తోన్న వీర ధీర శూరన్‌లో దుషారా విజయన్ హీరోయిన్. ఎస్ జే సూర్య కీ రోల్ ప్లే చేస్తుండగా మాలీవుడ్ స్టార్ హీరో సూరజ్ వెంజరమూడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. జీవీ ప్రకాష్ స్వరాలు సమకూరుస్తోన్న ఈ మూవీ పొంగల్ దంగల్ నుండి తప్పుకుని  జనవరి 24న వచ్చేందుకు ఫిక్సైంది. కానీ ఇప్పడు అక్కడ కూడా రిలీజ్ అడ్డంకులు రావడంతో మరోసారి డేట్ మారింది. ఈ సారి ఏకంగా మరో రెండు నెలలు వెనక్కి వెళుతూ మర్చి 27న వస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. కానీ అదే రోజు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లుసిఫెర్ సీక్వెల్ ఎంపురన్ నుండి పోటీ ఎదుర్కోనుంది వీర ధీర సూరన్ 2 .

రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్న.. రష్మిక కామెంట్స్ వైరల్ !
ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన. అనతి కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది గత రెండు, మూడేళ్లుగా వరుస భారీ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. ‘యనిమల్’, ‘పుష్ప’.. ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌నే మార్చేశాయి. బాష తో సంబంధం లేకుండా ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాలో ‘ఛావా’ ఒకటి. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుండ‌గా. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో రష్మిక మహారాణి యేసు బాయి గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. కాగా ఈ ఈవెంట్‌ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి వీల్ చైర్ మీద బయలుదేరి వెళ్లింది రష్మిక మంధాన. ఇందులో భాగంగా రష్మిక మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.. ఈ చిత్రంలో నటించడం ద్వారా తాను ఎంత సంతృప్తి చెందిందో తెలియజేసింది..‘నా కెరీర్‌లో మహారాణి యేసుబాయి పాత్ర చాలా చాలా స్పెషల్. ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం. నేను బాగా నటించానని అనుకుంటున్నా. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మీకు కూడా నా నటన నచ్చుతుందని అనుకుంటున్నాను… ‘ఛావా’ చూస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ మూవీ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత నొప్పినైనా భరిస్తాను.. ఈ పాత్ర చేయడం వల్ల నేను ఈ మరాఠా కుటుంబంలో సభ్యురాలిగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న పర్వాలేదు. సంతోషంగా తీసుకుంటా’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న నయనతార మూవీ..?
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు.ఈ మళయాళి కుట్టి అనతి కాలంలో తెలుగు, తమిళ, కన్నడ లోని టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.  అభినయంలో ఈ అమ్మడు తనకు తానే సాటి. అందుకే ఆమె నటించే సినిమా అంటే చాలు భాషతో సంబంధం లేకుండా అందరు ఆదరిస్తారు, ఖచ్చితంగా సౌత్‌లోని అన్ని భాషల ఆడియెన్స్ చూస్తారు. ముఖ్యంగా నయన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల్లో సాలిడ్ క్రేజ్‌ను ధక్కించుకుంది. కాగా తాజాగా ఇప్పుడు ఆమె నటిస్తున్న ఓ సినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ థ్రిల్లర్ మూవీ ‘టెస్ట్’. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాలో నయనతార లీడ్ రోల్‌లో నటిస్తోండగా, ఆమెతో పాటు మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందట. దీనికి సంబంధించిన ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రానుంది. కాగా ఇప్పటికే విడుదలైన అప్ డెట్స్‌కి మంచి ఆదరన లభించగా.. ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని.. అందుకే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. జనాలు కూడా వీక్ ఎండ్ వచ్చింది అంటే చాలా OTTలో కొత్త మూవీస్ కోసం చూస్తున్నారు. ఈ లెక్కన ఈ ‘టెస్ట్’ మూవీ కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రెయిట్ ప్లాట్ ఫామ్.. రిలీజ్‌ డెట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.