NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

దేశంలోనే తొలిసారి.. ఏపీలో ఒకేరోజు 13,326 గ్రామ సభలు..
ఆంధ్రప్రదేశ్‌లో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది కూటమి సర్కార్‌. ఇవాళ అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి సభలు నిర్వహించబోతోంది. ఉపాధి హామీ పనులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభల ద్వారా ఆమోదం పొందేందుకు ఒకేసారి ఈ కార్యక్రమం చేపడుతోంది. కోనసీమలో బాబు, రాయలసీమలో పవన్‌ పర్యటించనున్నారు. ఐదేళ్ల కాలంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించాయి కూటమి పార్టీలు. అధికారంలోకి వస్తే పంచాయతీ రాజ్ సంస్థలను గాడిలో పెడతామని హామీ ఇచ్చాయి. చెప్పినట్టుగానే స్థానిక సంస్థలకు సుమారు 2 వేల కోట్ల రూపాయలకు మేర ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులను ఆయా ఖాతాల్లో జమ చేసింది. అలాగే గ్రామాల్లో ఆస్తుల కల్పనకు.. వ్యవసాయ అనుబంధ పనులకు ఉపాధి హామీ పనులను సక్రమంగా వినియోగించుకునే దిశగా కొంత కాలంగా కసరత్తు చేస్తోంది సర్కార్‌. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. ఒత్తిడితో కేంద్రం కూడా అదనంగా ఉపాధి హామీ నిధులను కేటాయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ఓ క్రమపద్దతిలో నిర్వహించాలని సర్కార్‌ డిసైడ్‌ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి.. నరేగా పనులకు ఆమోదం తెలిపేలా ఓ మెగా ప్రొగ్రాం నిర్వహించబోతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజున 13 వేల 326 పంచాయతీల్లో సభలు నిర్వహించి రికార్డు సృష్టించబోతోంది సర్కార్‌. ఉపాధి హామీ పధకంలో ప్రతి కుటుంబానికీ సంవత్సరంలో 100 రోజుల పని దినాలను కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఒకే రోజున నిర్వహిస్తున్న ఈ గ్రామ సభల్లో 4 వేల 500 కోట్ల రూపాయల మేర పనులకు ఆమోదం తీసుకోనున్నారు. మరోవైపు ఈ గ్రామసభల నిర్వహణ కార్యక్రమం రాజకీయంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కోనసీమ జిల్లా వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అలాగే అన్నమయ్య జిల్లా మైసూరివారిపల్లె గ్రామసభలో పపన్ కల్యాణ్‌ పాల్గొంటున్నారు.

నేడు కోనసీమకు సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 13 వేల 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించబోతోంది ఏపీ సర్కార్‌. ఉపాధి హామీ పధకంలో ప్రతి కుటుంబానికీ సంవత్సరంలో 100 రోజుల పని దినాలను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా.. ఒకే రోజున నిర్వహిస్తున్న ఈ గ్రామ సభల్లో 4 వేల 500 కోట్ల రూపాయల మేర పనులకు ఆమోదం తీసుకోనున్నారు. కోనసీమ జిల్లా వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. కోనసీమ పర్యటన కోసం ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి అయినవిల్లిలో టీటీడీ కళ్యాణమండపం వద్ద హెలిపాడ్ లో 11.40కి దిగుతారు సీఎం చంద్రబాబు.. అక్కడ అధికారులు, నేతలతో కొద్దిసేపు మాట్లాడతారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వానపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభాస్థలికి చేరుకుంటారు.. వానపల్లి గ్రామదేవత పళ్లాలమ్మను దర్శించుకుంటారు.. మధ్యాహ్నం 12 గంటల నుండి రెండు గంటలపాటు గ్రామసభలో పాల్గొంటారు.. అనంతరం పదినిమిషాల పాటు స్థానిక నేతలతో ముచ్చటించనున్న సీఎం చంద్రబాబు.. అనంతరం వానపల్లి నుంచి రోడ్డు మార్గాన తిరిగి అయినవిల్లి హెలిపాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్ లో రాజమండ్రి కి వెళ్లి.. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ కు వెళ్లనున్నారు.

కాసేపట్లో అన్నమయ్య జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొనబోతున్నారు.. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు.. రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇక, భారీ బందోబస్తు మధ్య ఆయన పర్యటన కొనసాగనుంది..

అనకాపల్లికి వైఎస్‌ జగన్‌.. అచ్యుతాపురం బాధితులకు పరామర్శ
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.. అచ్యుతాపురం సెజ్‌ ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని పరామర్శించనున్నారు మాజీ సీఎం.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డుమార్గాన అనకాపల్లి ఉషా ప్రైమ్‌ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పనున్నారు.. అచ్యుతాపురం ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు.. మెడికవర్ ఆసుపత్రిలో ఏడుగురు బాధితులు, కిమ్స్ లో ఐదుగురు బాధితులు.. ఉష ప్రైమ్ ఆస్పత్రిలో 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.. ప్రమాదంలో ఇప్పటికే 17 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఈ రోజు అనకాపల్లిలో బాధితులను పరామర్శించనున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..

ఆదిలాబాద్లో ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్..
ఆదిలాబాద్ జిల్లాలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో నష్టపోయిన ఓ ప్రైవేట్ టీచర్ అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎరోడ్రం సమీపంలో ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్ లైన్ లో జూదం, పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైన సదరు ప్రైవేట్ ఉపాద్యాయుడు.. సుమారు 20 లక్షల రూపాయల వరకు అప్పు చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చేసిన అప్పుల భారంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ప్రభాకర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇక, ఈ సంఘటన ప్రదేశానికి చేరుకున్న ఆదిలాబాద్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. యువత ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

నేడు పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై తుది నిర్ణయం..
తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కసరత్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ ( శుక్రవారం ) ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇంత వరకు పీసీసీ పదవిని ఎస్టీలకు ఇవ్వలేదనే వాదనపై కూడా సమావేశంలోజరగనున్న చర్చ జరగనుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు నియామకంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఈరోజు తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే.. కొత్త అధ్యక్షుడు నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. కాగా, పీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కీలక సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ పాల్గొననున్నారు. ఇక, పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది. సామాజిక సమీకరణలు, ఇతరత్రా రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

త్రిపురలో వర్ష బీభత్సం.. 22 మంది మృతి, 17 లక్షల మందిపై వరుణుడి ప్రభావం
గత కొద్దిరోజులుగా త్రిపురలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 22 మంది మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లు దెబ్బతినడంతో రాష్ట్రంలోని 450 సహాయ శిబిరాల్లో 65,400 మంది తలదాచుకున్నారని అధికారి తెలిపారు. శాంతిర్‌బజార్‌లోని అశ్వని త్రిపుర పారా, దేబీపూర్‌లలో కొండచరియలు విరిగిపడటంతో పది మంది శిథిలాల కింద సమాధి అయ్యారని ముఖ్యమంత్రి మాణిక్ సాహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌లో రాశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని అన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. అంతకుముందు రెవెన్యూ శాఖ కార్యదర్శి బ్రిజేష్ పాండే మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలకు 22 మంది మరణించారని తెలిపారు. ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గల్లంతయ్యారని తెలిపారు. ప్రాథమిక నివేదికలు భౌతిక మౌలిక సదుపాయాలు, వ్యవసాయ పంటలతో పాటు గృహాలు, పశువులకు భారీ నష్టం వాటిల్లింది.

పాకిస్థాన్‌లో పోలీసు వాహనాలపై రాకెట్ దాడి, 11 మంది పోలీసులు మృతి
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గురువారం పోలీసులపై రాకెట్‌లతో దాడి చేశారు, ఇందులో కనీసం 11 మంది సైనికులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. లాహోర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో మచా పాయింట్ వద్ద రెండు పోలీసు వ్యాన్‌లు బురదలో చిక్కుకున్నప్పుడు పలువురు పోలీసులను కూడా బందీలుగా పట్టుకున్నారు. ఇంతలో దొంగలు అక్కడికి చేరుకుని రాకెట్లతో దాడి చేశారని పంజాబ్ పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. ఈ దాడిలో కనీసం 11 మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా, వారిలో కొందరు బందీలుగా ఉండగా, మిగిలిన వారు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

గిన్నిస్‌ రికార్డుల సంఖ్య.. సచిన్‌ను అధిగమించిన ఢిల్లీ వాసి!
క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను మాజీ జేఎన్‌యూ ఉద్యోగి, కంప్యూటర్‌ ట్రైనర్ వినోద్‌ కుమార్‌ చౌధరి (43) అధిగమించారు. గిన్నిస్‌ రికార్డుల సంఖ్యలో సచిన్‌ను వినోద్‌ చౌధరి వెనక్కి నెట్టారు. ఢిల్లీకి చెందిన వినోద్‌.. టైపింగ్‌లో ఏకంగా 20 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో 19 గిన్నిస్‌ రికార్డులను కలిగి ఉన్న సచిన్‌ను అతడు దాటేశారు. ఢిల్లీలోని కిరారి సులేమాన్ నగర్ గ్రామంలో వినోద్‌ కుమార్‌ చౌధరి నివాసం ఉంటున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని అత్యంత వేగంగా టైపింగ్‌ చేయడం, నోటి పుల్ల (మౌత్‌ స్టిక్‌)తో టైపింగ్ చేయడం, ఆంగ్ల వర్ణమాలను ముక్కుతో వేగంగా టైప్‌ చేయడం వంటి వాటికి ప్రసిద్ధి చెందారు. ఇప్పటికే 19 గిన్నిస్‌ రికార్డులతో సచిన్‌ను సమం చేశారు. తాజాగా కళ్లకు గంతలు కట్టుకుని అంగ్ల అక్షరాలను కేవలం ఐదు సెకన్లలో జెడ్‌ నుంచి ఏ వరకూ (వెనక్కు) టైపింగ్‌ చేసి రికార్డు సృష్టించాడు. దాంతో క్రికెట్ దిగ్గజంను అధిగమించారు. సచిన్‌ టెండూల్కర్‌కు తాను పెద్ద అభిమానిని అని, క్రికెట్ దిగ్గజం చేతుల మీదుగా 20వ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను అందుకోవాలనుకుంటున్నా అని వినోద్‌ కుమార్‌ చౌధరి తెలిపారు. ‘నేను సచిన్ టెండూల్కర్‌ని చూస్తూ పెరిగాను. సచిన్ లాగా నా దేశం గర్వపడేలా చేయాలనుకుంటున్నా. ఓ భారతీయుడు తన రికార్డును అధిగమించినందుకు సచిన్ ఖచ్చితంగా గర్వపడతాడని నేను అనుకుంటున్నా’ అని వినోద్‌ చెప్పుకొచ్చారు. వినోద్‌ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌ను రన్ చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఆయన శిక్షణ ఇస్తుంటారు.

ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన రొనాల్డో.. మైదానంలో మాత్రం కాదు!
ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో ​​రొనాల్డోకు రికార్డులు కొత్తేమీ కాదు. మైదానంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ యోధుడు యూట్యూబ్‌లో కూడా ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించిన 24 గంటల్లోనే ఏకంగా 25 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను సంపాదించాడు. ఇది ఓ ప్రపంచ రికార్డు. ప్రస్తుతం రొనాల్డో యూట్యూబ్‌ ఛానెల్‌కు 28 మిలియన్ల సబ్‌స్కైబర్లు ఉండడం విశేషం. కంటెంట్‌ క్రియేటర్‌గా మారదామనే ఆలోచనతో ‘యుఆర్‌ క్రిస్టియానో’ పేరుతో రొనాల్డో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించాడు. ఈ ఛానెల్‌ మొదలుపెట్టిన గంటలోపే 10 లక్షల మంది సబ్‌స్కైబర్లు రొనాల్డో ఖాతాను అనుసరించారు. దాంతో అత్యంత వేగంగా మిలియన్‌ సబ్‌స్కైబర్ల ప్రపంచ రికార్డు బద్దలైంది. ఇక 24 గంటల్లో యుఆర్‌ క్రిస్టియానో ఛానెల్‌ను సబ్‌స్కైబ్‌ చేసుకున్న వారి సంఖ్య రెండు కోట్లకు చేరింది. ఇది కూడా ఓ ప్రపంచ రికార్డే. ఒక్కరోజు వ్యవధిలోనే గోల్డెన్‌ ప్లే బటన్‌ (ఛానెల్‌ను 10 లక్షల ఖాతాదారులు అనుసరిస్తున్నందుకు) పోర్చుగల్‌ వీరుడు అందుకున్నాడు.

ఒక్క హిట్టు కూడా లేని ఫ్లాప్ దర్శకుడితో.. ఫ్లాప్ హీరో సినిమా..?
అతడో స్టైలిష్ దర్శకుడు. ఆ దర్శకుడి సినిమాలో హీరో లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్, సాంగ్స్ అన్ని చాల బాగుంటాయ్ కానీ కథ మాత్రమే ఉండదు. ఏవో నాలుగు సన్నివేశాలు రాసుకుని సినిమా తీసినట్టు ఉంటుంది ఇతగాడి టేకింగ్. పోనీ అలాని హిట్టు ఇస్తాడా అంటే అది లేదు. చేసిందే రెండు రెండు సినిమాలు రెండు దారుణ పరాజయాలు. అయిన సరే మనోడికి అవకాశాలు వస్తున్నాయి. కాదు వాళ్ళే ఇస్తున్నారు. ఇంతకీ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా అతడే రాధాకృష్ణ. జిల్ సినిమాతో దర్శకుడిగా మారాడు రాధాకృష్ణ కుమార్. 2015లో గోపిచంద్ హీరోగా వచ్చిన జిల్ యావరేజ్ గా నిలిచింది.  గోపీచంద్ లుక్స్, స్టైల్ బాగుంది అనే పేరు తప్ప సినిమాలో విషయం లేదని తేల్చేసారు ఆడియెన్స్. ఇక రెండవ సినిమాగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ‘రాధేశ్యామ్’. ఒక్క ఫైట్ కూడా లేకుండా ఎక్కడ మల్లి ఫ్యాన్స్ కు నచ్చుతుందేమో అని ఫ్లాప్ అవడానికి కావలసిన వేసుకుని తీసిన సినిమా రాధేశ్యామ్. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. తాజగా రాధాకృష్ణ మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అసలే హిట్లు లేక సతమతమవుతున్న హీరో గోపిచంద్. జిల్ రూపంలో తనకి ఫ్లాప్ ఇచ్చిన మరోసారి రాధాకృష్ణకు అవకాశం ఇవ్వబోతున్నాడు గోపీచంద్. ఈ దర్శకుడి గత రెండు సినిమాలు నిర్మించిన యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ముచ్చటగా మూడవ సినిమా తెరకెక్కబోతున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. త్వరలోనే అధికారక ప్రకటన ఉండనుంది. మరి ఈసారైనా హిట్ ఇస్తాడో లేదో ఈ దర్శకుడు.

ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాయన్’.. ఎక్కడ చూడొచ్చంటే..?
కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా ప్రేక్షకులను మెప్పించిన చిత్రం ‘రాయన్’. సొంత దర్శకత్వంలో నటించిన ధనుష్ ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ రివెంజర్ డ్రామాగా సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకడైన సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ‘రాయన్’ సినిమాలో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి, కాళిదాసు జయరాం, వరలక్ష్మి శరత్ కుమార్, శరవన్, దిలీపన్, ఇలవరసు మొదలగు నటీ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాలో ధనుష్ చెల్లెలుగా దుర్గ పాత్రలో దుషార విజయన్ పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను కలానిది మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమా విడుదల కాకముందే ఈ సినిమాకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్, పాటలు ఇలా అన్ని సినిమాపై భారీగా అంచనాలను ఏర్పరిచాయి. అంతేకాకుండా.. హీరో ధనుష్ తన సినీ కెరియర్ లో ఈ సినిమా 50వ సినిమా కావడంతో భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ రిలీజ్ అయింది.