పీఏసీ ఎన్నిక.. చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ కూడా… పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయడంతో… ఆసక్తి నెలకొంది. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరుగుతుంది. సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తారు. టీడీపీ తరపున ఏడుగురు సభ్యులు నామినేషన్లు వేశారు. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు.. బీజేపీ తరపున విష్ణుకుమార్‌రాజు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే… పీఏసీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. వైసీపీ హయాంలో పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్ పనిచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో… పీఏసీ ఛైర్మన్ పదవికి తమకు ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ తరపున ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ కూడా వేశారు. అయితే… ఆ పదవికి వైసీపీ దక్కే అవకాశం లేదు. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలన్నా, చైర్మన్ కావాలన్నా… 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ… అసెంబ్లీలో వైసీపీకి సంఖ్యా బలం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో… పీఏసీ చైర్మన్ పదవి దక్కదని కూటమి నేతలు చెప్తున్నారు. దీంతో.. జనసేనకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు కేబినెట్ హోదా..!
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజక వర్గ ఎమ్మెల్యేగా వరసగా నాలుగు సార్లు గెలుపొందిన సీనియర్ శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ హోదా దక్కనుంది. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ గా వేగుళ్ల నియమితులు కానున్నారు. ఇవాళ అసెంబ్లీలో అంచనాల కమిటీ ఛైర్మన్ గా నియమితులు కానున్నారు.. ఈ మేరకు వేగుళ్లకుకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. మండపేట నియోజకవర్గం ఆవిర్భవించిన 2009 నుంచి టీపీపీ తరఫున బదిలోకి దిగి నాలుగు సార్లు వరుసగా 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ పదవి వరించింది. కేబినెట్ హోదా కలిగిన పదవి మండపేట నియోజక వర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇక్కడ ఎమ్మెల్యే గా ఎన్నికయిన వారికి దక్కనుంది..
లా స్టూడెంట్ గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం సీరియస్.. విచారణ వేగవంతం
విశాఖ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పేమ పేరుతో నమ్మించి… పెళ్లి చేసుకుంటానని వంచించిన ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. విశాఖకు చెందిన లా స్టూడెంట్‌ను లవ్ పేరుతో ట్రాప్ చేసిన వంశీ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. తర్వాత వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడా దుర్మార్గుడు. వారి టార్చర్ భరించలేక రెండు నెలలు తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోయింది బాధితురాలు. అయితే, తండ్రి గమనించి ఆమెను కాపాడాడు. విషయం తెలుసుకుని టూటౌన్ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు. గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతడి స్నేహితులు ఆనంద్, జగదీశ్, రాజేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ముగ్గురు లా చదువుతుండగా, మరొకడు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. మరోవైపు నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. వీడియోలను నిందితులు ఎవరికి పంపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటు విశాఖ ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమ్మాయిని రేప్ చేసి.. అశ్లీల ఫోటోలు తీసి, జీవితాలను నాశనం చేయడమేంటని.. ఇలాంటివారి తాట తీస్తామని హెచ్చరించారు. ఇక, విశాఖ గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపడంతో లోతుగా ఎంక్వయిరీ చేస్తున్నారు పోలీసులు. నిందితుల బ్యాగ్రౌండ్ ఏంటి? గతంలో నేర చరిత్ర ఉందా? అన్నది కూడా ఆరా తీస్తున్నారు.
నేడు శిల్పారామంలో లోక్ మంథన్ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి
లోక్ మంథన్ మహోత్సవానికి భాగ్యనగరం వేదికయ్యింది. నేడు లోక్ మంథన్ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 9.30కి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరివెళతారు. లోక్‌మంథన్ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. నిన్న లోక్ మంథన్ కార్యక్రమంలో భాగంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి జూపల్లి కృష్ణారావు శిల్పారామంలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 2016లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో లోక్‌మంథన్ నిర్వహించారు. ఒక్కో రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఇది నాల్గవ లోకమంతన్. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. దేశంలోని జానపద కళాకారులందరినీ ఒక చోట చేర్చి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రజ్ఞా ప్రవాహ అనే సంస్థ ఒక వేదికను ఏర్పాటు చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రతినిధులు, విదేశీ కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. లోక్ మంథన్ వేడుకలో గిరిజన హస్తకళల, కళా ప్రదర్శనలు ఉంటాయి. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో వివిధ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు, ప్రజలు తమ నైపుణ్యాలను ప్రదర్శించే కార్యక్రమం కూడా ఉంటుంది. వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, 1500 మందికి పైగా కళాకారులు సంప్రదాయ సంగీత వాయిద్యాలు, ఉపకరణాలను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు.
వాజేడులో దారుణం.. ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన మావోలు..
మావోయిస్టులు మరోసారి బీభత్సం సృష్టించారు. తాజాగా ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన పెను గోలు కాలనీలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల ఇన్ ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో ఒకరైన ఉయిక రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఉయిక అర్జున్ అనే గిరిజన వ్యక్తిని కూడా రాత్రి 11.30 నిమిషాల సమయంలో సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇద్దరినీ ఒకే సమయంలో గొడ్డలితో నరికి చంపారు. ఉయిక అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా రమేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. వీరిద్దరు వ్యక్తులు కూడా పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి గత కొద్ది సంవత్సరాలుగా మావోయిస్టు కదలికలను పోలీసులకు చేరవేస్తూ మావోయిస్టులపై దాడులకు కారకులు అయ్యారని.. గమనించిన మావోలు వీరిద్దరికి పలు మార్లు హెచ్చరించారు. అయినా వీరు పద్ధతి మార్చుకోకపోవడంతో హతమార్చడం జరిగిందని వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో లేఖలో పేర్కొన్నారు. వీరిద్దరి హత్య ఏజెన్సీలో మరోసారి కలకలం సృష్టించింది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఏటూరు నాగారంలోకి ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
అమెరికా మమ్మల్ని రెచ్చగొడుతోంది.. మాతో శత్రుత్వం మంచిది కాదు..!
ఉత్తర కొరియా అధినేత కిమ్ ప్యాంగ్‌యాంగ్‌లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు. యూఎస్ మమ్మల్ని బాగా రెచ్చగొడుతోంది.. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే నిర్ణయాలను తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ఘర్షణ వాతావరణాన్ని ఎప్పుడు చూడలేదన్నారు. ప్రస్తుత పరిస్థితులు థర్మో న్యూక్లియర్ యుద్ధం వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. ఇక, కొరియా ద్వీపకల్పంలో ఇప్పటి వరకు అణు యుద్ధాలు జరగలేదని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ చెప్పారు. ఇక, అమెరికాతో చర్చలు జరిపేందుకు తాను ముందుకు వచ్చిన.. అక్కడి నుంచి సరైన రియాక్షన్ రాలేదన్నారు. మాపై దూకుడు, శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో అమెరికాలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఆయనతో 3 సార్లు కిమ్ జోంగ్ ఉన్ సమావేశం అయ్యారు. 2018-19 మధ్య కాలంలో సింగపూర్, హనోయ్, కొరియా సరిహద్దుల్లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చలు జరిపినప్పటికి అవి సఫలం కాలేదు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.
కెనడాలో మరిన్ని కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్
కెనడాలో అధికారుల బెదిరింపులకు వ్యతిరేకంగా కనీస భద్రత కూడా అందించలేకపోవడంతో.. టొరంటోలోని మరికొన్ని భారత కాన్సులర్ క్యాంపులను రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది. నవంబరు 2, 3 తేదీల్లో బ్రాంప్టన్, సర్రేలోని రెండు శిబిరాలపై ఖలిస్తానీ గ్రూపులు జరిపిన దాడుల తర్వాత కెనడాలోని భారత హైకమిషన్ కొన్ని కాన్సులర్ క్యాంపులను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల తర్వాత తాజా చర్యలకు దిగింది. కాగా, గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని డయాస్పోరాలోని దాదాపు 4,000 మంది భారత్- కెనడియన్ ప్రజలకు అవసరమైన కాన్సులర్ సేవలను కోల్పోయిన.. వారికి తాము అండగా ఉంటామని కాన్సులేట్ ప్రకటించింది. ఇక, బ్రాంప్టన్‌లోని హిందూ సభా దేవాలయం ఆవరణలోకి ఖలిస్తానీ ఉగ్రవాదులు ప్రవేశించి అక్కడి భక్తులపై దాడి చేశారు. అంటారియో ప్రావిన్స్‌కు చెందిన పీల్ పోలీసులు ఖలిస్తానీ టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో కెనడాలో భద్రతా సమస్యల కారణంగా కాన్సులర్ సేవలను మూసివేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
కలెక్షన్ కింగ్ టాలీవుడ్ @ 50 ఇయర్స్
తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టారు. పాత్రల వైవిధ్యం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు గారి ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అంకితభావం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. మోహన్ బాబు 1975 నుంచి 1990 వరకు, మోహన్ బాబు గారు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న ప్రతినాయకులలో ఒకరిగా నిలిచిన ఆయన నటన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. స్వర్గం నరకం చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం అయినా.. విలన్ పాత్రలతో టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
1990వ దశాబ్దంలో, మోహన్ బాబు హీరోగా మారి ప్రేక్షకులను తనదైన శైలితో అలరించారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు సినిమాలు ఆల్ టైమ్ రికార్డు హిట్స్ గా నిలిచాయి . పెదరాయుడు 200 డేస్ వేడుక తిరుపతిలో నిర్వహించిన ఈ చారిత్రక వేడుకకు మొత్తం రాష్ట్ర రాజకీయ కేబినెట్, ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. మోహన్ బాబు ప్రభావం సినిమాలపై మాత్రమే కాకుండా రాజకీయ రంగానికీ విస్తరించింది. 1993లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం. ఎన్.టి.రామారావు గారి తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్ర 100 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.
మల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్పరాజ్ కేరళ వస్తున్నాడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా పుష్ప -2. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మరొక యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో బన్నీతో ఆడిపాడనుంది. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ట్రైలర్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్ పాన్ ఇండియా వైజ్ గా ప్లాన్ చేసారు మేకర్స్. అందులో భాగంగానే ట్రైలర్ ను బీహార్ లోని పాట్నాలో భారీ స్థాయిలో నిర్వహించి రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ సూపర్ హిట్ కావడంతో మరిన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసారు మేకర్స్. ఇక పుష్ప కు తెలుగు రాష్ట్రాల్లో తో పాటు లేదా అంతే స్థాయిలో కేరళలోను క్రేజ్ నెలకొంది. బన్నీ సినిమాలకు మాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ వస్తాయ్. ఈ నేపథ్యంలో కేరళ ఫ్యాన్స్ కోసం మేకర్స్ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసారు మేకర్స్. కేరళలోని కొచ్చి లో ఈ నవంబరు 27న సాయంత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప -2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచేస్తున్నాడు. దీంతో మల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కేరళలో ఎర్లీ మార్నింగ్ 4.00 గంటల షోస్ తో రిలీజ్ కానున్న ఈ సినిమాను E4 ఎంటర్టైన్మెంట్స్ పంపిణి చేస్తోంది.
వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పై గాసిప్స్.. అబ్బే అలా ఏం తగ్గలే
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. కంగువతో పాటుగా ఈ గురువారం విడుదలయింది మట్కా. కానీ మట్కా డిజాస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి ఆట నుంచే మట్కాకు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దాంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. ఓవర్సీస్ లో అయితే మట్కా కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. వరుణ్ తేజ్ సినిమాకు కనీసం మినిమం ఓపెనింగ్ కూడా రాలేదు.. దీంతో ఆయన జాగ్రత్తపడాల్సిన టైమ్ వచ్చిందని అర్ధం చేసుకోవాలి. రిలీజ్ రోజు కలెక్షన్స్ కేవలం లక్షల్లో గ్రాస్ వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో వరుణ్ తేజ్ చూసుకోవాలి. తన కెరీర్ మొదట్లో చేసిన ఫిదా, తొలిప్రేమ సూపర్ హిట్స్ మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చాయి. ఆ తర్వాత మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ చేసిన మిస్టర్, లోఫర్, గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ అన్ని ఫ్లాప్ లే. వీటన్నింటి మధ్యలో వచ్చిన గద్దలకొండ గణేష్ కాస్త ఊరట ఇచ్చినా అది రీమేక్, తాజగా వచ్చిన మట్కా ఫైనల్ రన్ లక్షల్లో ముగిసేలా ఉంది. మెగా ఫ్యామిలీ స్టాంప్ ఉన్నా కూడా ఈ విధమైన కలెక్షన్స్ హీరో కెరీర్ కు అంత మంచిది కాదు. ఇక ఈ మూవీ రిజల్ట్ పక్కన పెట్టేసి వరుణ్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సందర్భంగా ఆయన రెమ్యునరేషన్ విషయంలో సినీ సర్కిల్స్‌లో తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తుంది. గతకొంత కాలంగా వరుస ఫ్లాపులు అందుకుంటున్న వరుణ్ తేజ్, తన రెమ్యునరేషన్ విషయంలో వెనకడుగు వేయడం లేదని.. ఆయన ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు వసూలు చేస్తున్నాడని టాక్. వరుణ్ తేజ్ ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడని.. ప్రస్తుతం ఇవి ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలకు కూడా వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం లేదనే చెప్పాలి.