NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ.. డిప్యూటీ సీఎంకు చెక్‌ అందజేసిన హైపర్ ఆది
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. అయితే.. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు చెక్కులు అందించారు పలువురు దాతలు.. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ తరఫున రూ.67,29,398 చెక్కును పవన్‌ కల్యాణ్‌కి అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు యువ షణ్ముఖ, అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ ఫరూక్ జాన్, ప్రధాన కార్యదర్శి బి.శంకరరావు దొర తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఒక రోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస విభాగం అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణమ్ మార్కండేయ బాబు పాల్గొన్నారు. మరోవైపు.. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి శ్రీమతి వెంకట లక్ష్మి రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. అదే విధంగా నియోజకవర్గం నుంచి అందిన రూ.4.82 లక్షల విరాళం సహాయ నిధికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను పవన్ కల్యాణ్ కి అందచేశారు. మరోవైపు టాలీవుడ్‌ యువ నటుడు ఆది అలియాస్‌ హైపర్‌ ఆది తన వంతు సాయాన్ని అందించారు.. గ్రామ పంచాయతీలకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అందించారు. వరదల పీడిత గ్రామమైన ఎ.కె.మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) పంచాయతీకి రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆది.. మరో రూ.2 లక్షలు తన స్వగ్రామం పల్లామల్లి గ్రామ పంచాయతీ (ప్రకాశం జిల్లా)కి ఇచ్చారు. ఆ రెండు వేర్వేరు చెక్కులను పవన్‌ కల్యాణ్‌కి అందజేశారు.. ఈ సందర్భంగా హైపర్‌ ఆది మాట్లాడుతూ.. వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రూ.6 కోట్లు విరాళం ఇచ్చి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు. నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వవచ్చని తెలిసి నా వంతుగా రూ.3 లక్షలు అందించాను అని వెల్లడించారు హైపర్‌ ఆది..

తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి..! ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌..
తిరుమల లడ్డులో కల్తీ నెయ్యుని వినియోగించారని.. గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు ఆమోదించిన టెండర్ వల్ల కల్తీ నెయ్యి వినియోగం జరిగిందనే విషయాన్ని ఈవో శ్యామల రావు నిర్ధారించారు. జాతీయ స్థాయిలో పేరొందిన NDDB ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. దీనిపై రాజకీయంగా దుమారం రేగుతోంది. అధికార టీడీపీ.. మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ అపచారం నువ్వు చేశావంటే నువ్వు చేశావని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ రాజకీయాలు పక్కన పెడితే వెంకన్న భక్తుల మనోభావాలు.. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా.. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయీంశంగా మారింది. కల్తీ నెయ్యిని పక్కన పెట్టేసి.. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డుల తయారీ చేస్తున్నామని ఈవో స్పష్టం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. జరిగిన అపచారం సంగతేంటనే దాని పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీని పైనే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భక్తుల మనోభానాలను.. ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం సీరియస్సుగానే ఆలోచిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. మరోవైపు ఈ అపచారానికి పాల్పడిన వారిని శిక్షించాలని.. ఈ వ్యవహరంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలన్న డిమాండ్లూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో ఈ అపచారానికి పాల్పడి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారు ఎవరు..? ఎవరిపై కేసులు నమోదు చేయాలి..? దీనికి బాధ్యులు ఎవరనే అంశాన్ని నిగ్గు తేల్చనున్నారు. ఇంతటి ఘోర అపచారం జరిగిన తర్వాత కూడా సంబంధిత వ్యక్తులపై చర్యలు లేకుండా వదివేస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంతే కాకుండా ప్రభుత్వమే రాజకీయం చేసిందని అప్రతిష్టని మూట గట్టుకోవాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బాధ్యులపై కేసులు నమోదు చేయడమే కాకుండా శిక్ష పడే విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. గత ఐదేళ్ల కాలంలో తిరుమల కొండ మీద అపచారాలు జరిగాయని చాలా సార్లు విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం గురించి తిరుమల లడ్డూ విషయంలో తీవ్రమైన అపచార చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గోదావరిలో పైపులైన్‌ నుండి గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు
గోదావరిలో పైపులైను నుండి గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది.. యానాం దరియాలతిప్ప కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య ప్రాంతంలో గోదావరిలో చమురు సంస్థలు వేసిన పైపులైను నుండి గ్యాస్ లీకవడంతో కలకలం రేగింది.. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప ప్రాంతం నుండి యానాం దరియాల తిప్ప మీదుగా గోదావరిలో వేసిన పైపులైను నుండి గ్యాస్ లీకు కావడంతో.. గోదావరిలో సుడులు తిరుగుతూ, బుడగలు వేస్తూ నీరు పైకి ఉబికి వచ్చింది.. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు భయబ్రాంతులకు గురవుతున్నారు.. గ్యాస్ వాసన విపరీతంగా వస్తూండడంతో మంటలు చెలరేగే అవకాశం ఉందంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.. చమురు కంపెనీ ఓఎన్‌జీసీ అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకు కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక మత్సకారులు కోరుతున్నారు.. కాగా, గోదావరి జిల్లాల్లో ఓఎన్‌జీసీ పైపు లైన్ల నుంచి గ్యాస్‌ లీక్‌లు గతంలోనూ చెలరేగాయి.. ఇక, కొన్నిసార్లు మంటలు కూడా చెలరేగి భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం విదితమే..

సీతారాం ఏచూరి సంస్మరణ సభ.. ఒకే వేదికపై సీఎం రేవంత్‌, కేటీఆర్..
హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈరోజు ఉదయం 11 గంటలకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కార్మిక ఉపాధి శాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ నెల 12న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభరం అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, వివిధ వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలను ఆహ్వానించారు. ఇటీవల సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపిస్తారనే వార్త రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇద్దరిలో ఒకరు వెళ్లిన తర్వాత మరొకరు వస్తారా?… లేక సీతారాం ఏచూరి సంస్మరణ సభ వారిద్దరినీ కలిపే వేదిక అవుతుందా? రాజకీయ విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తపడతారా?… లేదంటే ఇద్దరి మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంటుందా? అనే దానిపై గుసగుసలు వినపిస్తున్నాయి. సీతారాం ఏచూరి సంస్మరణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున ఆ అంశానికే పరిమితమయ్యేలా తమ్మినేని వీరభరం చొరవ తీసుకుంటారా? అనే దానిపై ఉత్కంఠంగా మారింది.

నేడు రాష్ట్ర వ్యాప్త బంద్.. తుడుం దెబ్బ పిలుపు..
ఆదిలాబాద్ జిల్లాలో ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి పిలుపు నిచ్చింది. జిల్లా కేంద్రంలో ని బస్టాండ్ ముందు ఆదివాసి ల ధర్నా చేపట్టారు. బస్సులు బయటకి వెళ్లకుండా గేటు ముందు తుడుం దెబ్బ నాయకులు బైఠాయించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసి మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జైనూర్ లో ఆదివాసి మహిళ పై హత్యాచారయత్నంకు పాల్పడిన వ్యక్తిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజనులను రక్షించడానికి ఏజెన్సీలో PESA (భారతదేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం సాంప్రదాయ గ్రామసభల ద్వారా స్వయం పాలనను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం రూపొందించిన చట్టం) వంటి చట్టాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బంద్‌ను సహకరించాలని కోరుతూ తుడుందెబ్బ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ తుడుందెబ్బ గ్రామస్టులు బంద్ కు పిలుపునివ్వడంతో అలర్ట్ అయిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నేడు సెలవు ప్రకటించారు. అంతే కాకుండా నేడు మంత్రి సీతక్క ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ముందస్తు అరెస్ట్ లు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు చేరుకున్నారు.

మూడురోజుల పాటు అమెరికా పర్యటనకు ప్రధాని.. క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొననున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఇంతకు ముందు ఆయన ఎనిమిది సార్లు అమెరికాను సందర్శించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, ప్రధాని మోదీ నేటి నుండి సెప్టెంబర్ 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో నేడు జరగనున్న క్వాడ్ లీడర్‌ల నాలుగో శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. క్వాడ్ సమ్మిట్ కోసం తన సహచరులు ప్రెసిడెంట్ బిడెన్, ప్రధాన మంత్రి అల్బనీస్, ప్రధాన మంత్రి కిషిడాతో చేరేందుకు తాను ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో రాశారు. ఈ ఫోరమ్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సమాన-అభిప్రాయం గల దేశాల ప్రముఖ సమూహంగా ఉద్భవించింది. ప్రెసిడెంట్ బిడెన్‌తో నా సమావేశం మన ప్రజల ప్రయోజనాల కోసం మరియు ప్రపంచ శ్రేయస్సు కోసం భారతదేశం-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలంగా చేయడానికి కొత్త మార్గాలను సమీక్షించడానికి… గుర్తించడానికి అనుమతిస్తుంది అని ఆయన అన్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పుట్టిన రోజు జరుపుకున్న సునీత విలియమ్స్
సునీతా విలియమ్స్ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి లక్షలాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అంతరిక్షంలో చిక్కుకున్నారు. కాగా, సెప్టెంబర్ 19న సునీతా విలియమ్స్ తన పుట్టినరోజును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరుపుకున్నారు. చాలా మంది ప్రజలు తమ పుట్టినరోజులను కేక్, కొవ్వొత్తులతో జరుపుకుంటారు. అయితే సునీతా విలియమ్స్ తన 59వ పుట్టినరోజును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని ట్రాంక్విలిటీ మాడ్యూల్‌లోని వ్యర్థాలు, పరిశుభ్రత కంపార్ట్‌మెంట్ ఫిల్టర్‌లను భర్తీ చేయడం ద్వారా జరుపుకున్నారు. సాధారణ భాషలో దీనిని బాత్రూమ్ ఆఫ్ స్పేస్ అంటారు. సెప్టెంబర్ 19న విలియమ్స్ తన ప్రత్యేక రోజును కొన్ని ముఖ్యమైన పనిలో గడిపారు. తోటి నాసా వ్యోమగామి డాన్ పెట్టిట్‌తో పాటు స్టేషన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లను నిర్వహించడంపై కూడా ఆమె దృష్టి సారించారు. ఇది కాకుండా సునీతా విలియమ్స్ సైన్స్ కూడా చదివారు. నిర్వహణ పనులతో పాటు, విలియమ్స్ వ్యోమగాములు బారీ విల్మోర్, ఫ్రాంక్ రూబియోలతో కలిసి హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ఫ్లైట్ డైరెక్టర్‌లతో ఒక సమావేశంలో పాల్గొన్నారు. బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. సునీత, విల్మోర్ భూమికి తిరిగి రావడం ఫిబ్రవరి 2025 నాటికి సాధ్యమవుతుంది.

కోర్టులోనే జడ్జిని కాల్చి చంపిన పోలీస్ ఇన్‭స్పెక్టర్..
అమెరికాలోని కెంటకీలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పోలీసు అధికారి న్యాయమూర్తిని కోర్టు గదిలో కాల్చి చంపాడు. ఈ కేసులో, పోలీసులు కెంటకీకి చెందిన షాన్ ఎం. స్టైన్స్‌ (పోలీసు ఇన్‌స్పెక్టర్‌) ను అరెస్టు చేశారు. అలాగే జిల్లా జడ్జి మరణించినట్లు ప్రకటించారు. అందిన సమాచారం ప్రకారం.. ఈ కేసులో జిల్లా జడ్జి కెవిన్ ముల్లిన్స్ (54)కి అనేక బుల్లెట్‌లు తగిలాయని, ఆ తర్వాత న్యాయమూర్తి అక్కడికక్కడే మరణించారని కెంటుకీ పోలీసులు తెలిపారు. పోలీసు ఇన్‌స్పెక్టర్ షాన్ ఎం. స్టైన్స్ కోర్టు గదిలో న్యాయమూర్తితో వాగ్వాదానికి దిగారని, ఆ తర్వాత అతను పిస్టల్‌ని తీసుకుని జిల్లా జడ్జిని కెవిన్ ముల్లిన్స్‌ ను కాల్చాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటన తర్వాత సదరు కాల్పులు జరిపిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దాంతో పోలీస్ ఇన్‌స్పెక్టర్ షాన్ ఎం. స్టైన్స్‌పై హత్య కేసు నమోదైంది.

బాహుబలి -2 రికార్డును బద్దలు కొట్టబోతున్న దేవర – 1
జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా, ఇటీవల వచ్చిన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది. కాగా దేవర ఒవర్సీస్ ప్రీ సేల్స్ మిలియన్ వ్యూస్ రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 1.67 మిలియన్ ప్రీ సేల్స్ కలెక్ట్ చేసి రికార్డు తిరగరాసింది దేవర. ఇక టికెట్స్ బుకింగ్స్ విషయంలోనూ దేవర తన సత్తా చాటుతోంది.  ఇప్పటివరకు 50,000 పైగా టికెట్స్ బుక్ అయి, రిలీజ్ కు 7 రోజులు ఉండగా ఇంతటి భారీ స్థాయి బుకింగ్స్ సాధించిన సినిమాగా దేవర నిలిచింది. రిలీజ్ నాటికి 2.5 మిలియన్ కు పైగా రాబట్టి బాహుబలి – 2 ప్రీ సేల్స్ ను దేవర క్రాస్ చేస్తుందని ట్రేడ్ అంచనా. ఇదిలా ఉండగా ఈ నెల 22 న భారీ స్థాయిలో దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, రాజమౌళి అతిధులుగా రానున్నట్టు తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించిన దేవర సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

లడ్డు గాని పెళ్లితో షురూ చేసిన మ్యాడ్ బాయ్స్
యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం గతేడాది విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని నెలల క్రితం బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్‌’ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, వైభవంగా ప్రారంభ వేడుకను నిర్వహించింది. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యువత ఈ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  తాజాగా ఈ  చిత్రం నుంచి లడ్డు గాని పెళ్లి అంటూ సాగే మొదటి గీతాన్ని విడుదల  చేస్తూ సాంప్రదాయ దుస్తులలో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రం బృందం. ఈ పోస్టర్ లో వారి వేషధారణ, శైలి మొదటి భాగానికి భిన్నంగా ఉంది. మ్యాడ్ గ్యాంగ్ ను సరికొత్తగా పరిచయం చేస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ‘మ్యాడ్ స్క్వేర్‌’ పోస్టర్ ను చూడగానే ‘మ్యాడ్’ అభిమానులు ప్రేమలో పడిపోతారు అనడంలో సందేహం లేదు.మొదటి భాగానికి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన పాటలన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు రెండో భాగంలో అంతకుమించిన చార్ట్‌బస్టర్ పాటలు ఉంటాయని నిర్మాతలు వాగ్దానం చేశారు.అందరూ మెచ్చుకునేలా ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్.. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరూ, రెండో భాగాన్ని మరింత ఇష్టపడతారని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రెట్టింపు వినోదంతో, రెట్టింపు విజయాన్ని ఖాతాలో వేసుకుంటామని చిత్ర బృందం చెబుతోంది.