ఏపీలో మరో ప్రమాదం.. అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ రోజు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు సమీపంలోని దొడ్లవారిమిట్ట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విజయవాడ నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని చికిత్స కోసం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, కర్నూలు జిల్లాలో బెంగళూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయిన తర్వాత.. వరుసగా కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగిన విషయం విదితమే..
శ్రీవారి భక్తులకు అలర్ట్..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను ఈ రోజు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇక, ఈ రోజు ఉదయం 10 గంటలకు – ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనుండగా.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల చేయబోతున్నారు.. అయితే, శ్రీవారి దర్శనంతో పాటు వసతి గతులు, ఇతర సేవా టికెట్లు ఎప్పుడు విడుదల చేసినా.. నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తి అవుతూ వస్తున్నాయి.. దీంతో, ఆ సమయానికి అలర్ట్‌గా ఉండి.. టికెట్లను బుక్ చేసుకుంటే తప్ప.. టికెట్లు దొరకని పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. మరోవైపు, తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిన విషయం విదితమే.. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీలలో సర్వదర్శనం భక్తులకు మాత్రమే దర్శన అవకాశం ఇవ్వనున్నారు. సర్వదర్శనం భక్తులకు లక్కిడ్రా (Lucky Dip) విధానంలో దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. డిసెంబర్ 27 నుంచి జనవరి 1 వరకు భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.. నిన్న శ్రీవారిని 66,839 మంది భక్తులు దర్శించుకోగా.. 19,220 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.4.61 కోట్లుగా ప్రకటించింది టీటీడీ..
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. రెండు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్..!
రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ పెంచారు. ఈ నేపథ్యంలో ఇటీవలే పార్టీ నిర్మాణ బాధ్యతలను రామ్ తాళ్లూరికి అప్పగించారు. లోకల్ బాడీల ఎన్నికలను టార్గెట్ చేస్తూ జనసేన వ్యూహాలను వేగంగా అమలు చేస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ విభాగాల వారీగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ సంస్థాగతంగా పార్టీని రీబిల్డ్ చేసే పనిలో పార్టీ నిమగ్నమైంది. తెలంగాణలో పూర్తిస్థాయి నాయకత్వ మార్పు దిశగా చర్చలు జరుగుతున్నాయి. కొత్త లీడర్షిప్‌ను ప్రవేశపెట్టి, రూరల్ నుంచి అర్బన్ వరకూ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్‌ను రీడిజైన్ చేస్తున్నారు పార్టీ నేతలు. ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి రాని జనసేన.. ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో, స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు ప్రత్యక్షంగా పోటీ చేస్తూ ప్రభావాన్ని చూపే పార్టీగా మారాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఏపీలో సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్ మాదిరిగానే.. తెలంగాణలో కూడా పార్టీ బలం పెరగాలని పవన్ భావిస్తున్నారు. ప్రత్యక్ష పోటీలో ఉంటేనే కేడర్ యాక్టివ్ అవుతారని, గ్రౌండ్ లెవల్‌లో జనసేన ఎదుగుతుందని పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త నాయకత్వం ఎంపిక, గ్రాస్ రూట్ బలోపేతం, యువతను ఆకర్షించే చర్యలు వరసగా చేపడుతున్నారు..
హర్యానా పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. అల్-ఫలాహ్ అక్రమాలపై సిట్ ఏర్పాటు
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్ర బయటపడింది. ఉగ్ర డాక్టర్ల బృందం ఉమర్, షాహీన్, ముజమ్మిల్ కలిసి దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. టెర్రర్ మాడ్యూల్ బయటపడడంతో అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఎంత కుట్ర జరిగిందో వెలుగు చూసింది. ఇక మంగళవారం హర్యానా డీజీపీ ఓపీ సింగ్, కమిషనర్, డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ బృందం మంగళవారం క్యాంపస్‌ను సందర్శించారు. దీంతో యూనివర్సిటీలో చాలా లోపాలు కనిపించాయి. క్యాంపస్‌లో ఉగ్ర కుట్రలు జరుగుతున్నా.. ఎందుకు గుర్తించలేకపోయారని.. ఇందులో ఏదో మతలబు ఉందంటూ పోలీస్ అధికారుల బృందం భావించింది. ఇప్పటికే సంస్థ ఛైర్మన్‌ను అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల రాకతో చాలా మంది ప్రొఫెసర్లు, స్థానికులు కూడా అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అక్రమాలపై సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది.
కర్ణాటక కాంగ్రెస్‌లో విభేదాలు! ఢిల్లీలో ఎమ్మెల్యేలతో ఖర్గే భేటీ.. తనకేం తెలియదంటున్న శివకుమార్..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన నివాసంలో పలువురు కర్ణాటక ఎమ్మెల్యేలను కలిశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశం గురించి భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వకపోవడంతో గేట్ వద్ద హడావుడి కొనసాగింది. తరువాత మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలతో సమావేశమై వారి సమస్యలను విన్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని శివకుమార్ అన్నారు. “నాకు తెలియదు. నా దగ్గర అంత సమాచారం లేదు. నేను ఎవరినీ అడగలేదు.. నాకు ఏమీ తెలియదు” అని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే తాను ఇంటి నుంచి బయటకు రాలేదని శివకుమార్ చెబుతున్నారు.
భారీ ఒత్తిడిలో భారత్.. మార్పులు తప్పవా..?
గువాహటిలో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్‌కు ఈ మ్యాచ్ సిరీస్ భవితవ్యాన్ని నిర్ణయించేదిగా మారింది. తొలిసారిగా టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న బర్సాపారా స్టేడియంలోని పిచ్ స్వభావంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎర్రమట్టితో రూపొందించిన ఈ పిచ్ ప్రస్తుతం పచ్చికతో ఉన్నప్పటికీ, మ్యాచ్‌కు ముందునే దానిని కత్తిరించే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా ఎర్రమట్టి పిచ్‌లు ఆరంభంలో బౌన్స్ ఇస్తూ, తరువాత త్వరగా పొడిబారి పగుళ్లు వస్తాయి. మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లకు ఎంతో అనుకూలంగా మారే అవకాశం ఉండటంతో, ఈ టెస్టు కూడా ఎక్కువ రోజులు నిలవకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పిచ్ పాతబడిన తర్వాత అర్థంకాని బౌన్స్ వల్ల బ్యాటర్లను మరింత ఇబ్బందిపెట్టే అవకాశముంది. పచ్చికను పూర్తిగా తొలగిస్తే, గువాహటి పిచ్ కూడా ఈడెన్ గార్డెన్స్ తరహాలో మారి మళ్లీ స్పిన్ ఉచ్చు వేయే పరిస్థితులు ఏర్పడవచ్చు.
గిల్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికి ఉంది.. ఆసీస్ దిగ్గజం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోతే.. ఆ బాధ్యతలు స్వీకరించడానికి రిషబ్ పంత్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన గిల్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికి ఉందని పేర్కొన్నాడు. గిల్ మెడ గాయం కారణంగా నవంబర్ 22న ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతా టెస్టు ఓటమి తర్వాత జట్టు పగ్గాలు చేపట్టడం ఎవరికైనా కత్తిమీద సామే.. కానీ, పంత్‌కు ఆ ఒత్తిడిని తట్టుకునే సత్తా ఉందని పాంటింగ్ ‘ఐసీసీ రివ్యూ’లో పేర్కొన్నారు. రిషబ్ పంత్‌కు ఇప్పుడు తగినంత టెస్టు అనుభవం ఉంది. ముఖ్యంగా వికెట్ కీపర్‌గా ఉండటం వల్ల ఆట గమనాన్ని, పరిస్థితులను అతను బాగా అంచనా వేయగలడు. గతంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం కూడా అతనికి ఉందని చెబుతూ.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అతను ఈ క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దగలడని నేను నమ్ముతున్నానని పాంటింగ్ తెలిపారు.
సరికొత్తగా గుడ్ న్యూస్ చెప్పిన వరల్డ్ కప్ విన్నర్.. వీడియో వైరల్..!
భారత మహిళా క్రికెట్ స్టార్, వరల్డ్ కప్ విజేత స్మృతి మంధాన (Smriti Mandhana) తన అభిమానులకు తీపి కబురు తెలిపింది. తన చిరకాల మిత్రుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) తన నిశ్చితార్థం (Engagement) జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని ఆమె చాలా సరదాగా, వినూత్నంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా పంచుకోవడం విశేషం. ‘సమ్జో హో హీ గయా’.. అంటూ స్మృతి తన సహచర క్రీడాకారిణులు జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డిలతో కలిసి ఓ ఫన్నీ వీడియో చేశారు. “లగే రహో మున్నాభాయ్” సినిమాలోని క్లాసిక్ హిట్ సాంగ్ “సమ్జో హో హీ గయా” పాటకు వీరంతా కలిసి డ్యాన్స్ చేశారు. వీడియో చివర్లో స్మృతి మంధాన కెమెరా వైపు తన చేతికున్న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను (Ring) చూపించింది. దీంతో ఎప్పటి నుంచో వీరి ప్రేమాయణంపై వస్తున్న వార్తలను ఆమె కన్ఫామ్ చేసింది. గత అక్టోబర్‌లో ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనే పలాష్ ముచ్చల్.. స్మృతి త్వరలోనే “ఇండోర్ కోడలు” కాబోతోందని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అన్నగారు వస్తారు.. రిలీజ్ పై తర్జన భర్జన
టాలీవుడ్ ఆడియన్స్‌కు సిన్సీయర్‌గా దగ్గరయ్యేందుకు ప్రయత్నించే ఏకైక కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. తొలి నుండి తన సినిమాలను తెలుగులో తీసుకు వచ్చేటప్పుడు ఇక్కడి నేటివిటీకి తగ్గట్లుగా మార్చేస్తుంటాడు. కొన్నిసార్లు తన చేతుల్లో నేమ్ ఛేంజ్ చేసే ఛాన్స్ లేకపోతే తప్ప ఆల్మోస్ట్ కార్తీ సినిమాలన్నీ తెలుగు టైటిల్స్ తో వచ్చినవే. నెక్ట్స్ కూడా వా వాతియార్‌ను అచ్చమైన తెలుగు టైటిల్ ‘అన్నగారు వస్తారు’గా తీసుకొస్తున్నాడు. వా వాతియార్‌ను గతంలో డిసెంబర్ 5న తీసుకు వస్తున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు డిలే అవుతున్నట్లు టాక్. అందుకు దర్శకుడు నలన్ కుమార స్వామి ఒక కారణం కాగా రెండవ కారణం నిర్మాత జ్ఞానవేల్ రాజా అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డీలే కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ చేద్దామనుకునే లోగా ఈ సినిమాకు మరో చిక్కొచ్చింది. అన్నగారు వస్తారు డిజిటల్ అండ్ శాటిలైజ్ రైట్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. నిర్మాత జ్ఞానవేల్ రాజా అడుగుతున్న రేట్ కు డిజిటల్ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయట. జ్ఞానవేల్ రాజా బ్యానర్ స్టూడియో గ్రీన్ పై వచ్చిన గత చిత్రం కంగువ భారీ ప్లాప్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పడు రాబోతున్న వా వాతియార్ పై ఆ ప్లాప్ ప్రభావం పడింది. యాక్షన్ కామెడీగా తెరకెక్కుతోన్న వా వాతియార్‌లో పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడు కార్తీ. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే అన్నగారు డిసెంబరు 12న వస్తారని సమాచారం. లేదా క్రిస్మస్ కు వెళ్లే అవకాశం కూడా ఉంది.
‘సుడిగాడు 2’పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని కసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమాక్షీ భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా రిలీజ్ దగ్గరకు రావడంతో, నరేష్ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటూ, మీడియా – మీమర్లతో సరదాగా మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెడుతున్నారు. ఈ చిట్‌చాట్‌లో భాగంగా ఆయన కెరీర్‌కి స్పెషల్ ఇమేజ్ తెచ్చిన కల్ట్ కామెడీ మూవీ ‘సుడిగాడు’ గురించి ప్రస్తావన వచ్చింది. అదే సందర్భంలో నరేష్, ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న సుడిగాడు సీక్వెల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘సుడిగాడు 2 కోసం రైటింగ్ వర్క్ కొనసాగుతోంది. మొదటి పార్ట్‌లో దాదాపు 100 సినిమాలను ప్యారడీ చేశాం. ఈసారి దానికి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాం. కాబట్టి స్క్రిప్ట్‌పై బాగా వర్క్ జరుగుతోంది’’ అని చెప్పారు. ప్రస్తుతం భారీ విజయాలు సాధిస్తున్న పాన్ ఇండియా సినిమాలు కూడా ఈ సీక్వెల్‌లో భాగం కానున్నాయని వెల్లడించారు. ‘‘ఈసారి యానిమల్, పుష్ప 2 వంటి పెద్ద సినిమాలపై కూడా ఫన్నీ స్పూఫ్స్ జోడించాలని చూస్తున్నాం. ప్రేక్షకులు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మాకు తెలుసు కాబట్టి, ఆ లెవెల్‌లోనే కామెడీ సెట్ చేస్తున్నాం’’ అని చెప్పారు. అయితే ప్రాజెక్ట్ గురించి ఇంకా చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉన్నామని, స్క్రిప్ట్ పూర్తయ్యేందుకు సమయం పడుతుందని నరేష్ స్పష్టం చేశారు. “ప్రస్తుతం ప్లానింగ్ స్టేజ్‌లో ఉన్నాం. షూట్ స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉంది. అనుకున్న టైం కి జరిగితే 2027లో ప్రారంభమయ్యే అవకాశముంది” అని అల్లరి నరేష్ క్లారిటీ ఇచ్చారు.
