NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఆర్జీవీకి థర్డ్‌ డిగ్రీ టెన్షన్‌..! ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణకు రానుంది.. హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు ఆర్జీవీ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌పై గతంలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుతో రాంగోపాల్‌ వర్మపై కేసు నమోదు చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు.. పోలీసులు నోటీసులు ఇవ్వగా.. తొలి విచారణకు డుమ్మాకొట్టారు ఆర్జీవీ.. ఇక, తాజాగా మరో నోటీసు కూడా జారీ చేశారు.. అయితే, మొదట తనపై నమోదైన కేసును క్వాష్‌ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన రాంగోపాల్‌ వర్మకు ఎదురుదెబ్బ తగిలింది.. దీంతో.. మరోసారి హైకోర్టు మెట్లు ఎక్కిన ఆయన.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. తనపై థర్డ్ డిగ్రీ కూడా పోలీసులు ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఇప్పటికే వర్మ క్వాష్ పిటిషన్ వేయగా తోసి పుచ్చిన హైకోర్టు.. నేడు ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.

నేడు ‘కోటి దీపోత్సవం’లో 13వ రోజు.. ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!
2024 కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘కోటి దీపోత్సవం’ విజయవంతంగా కొనసాగుతోంది. రోజుకో కల్యాణం, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలు, వాహనసేవ, పూజలతో భక్తులు పరవశించిపోతున్నారు. దీపాల వెలుగులు, వందలాది భక్తులతో ప్రతిరోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం కళకళలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవంకు భక్తులతో పాటుగా ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. కోటి దీపోత్సవం 2024కు ముఖ్యఅతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డిలు హాజరయ్యారు. నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి కార్తీక దీపారాధన చేయనున్నారు. ఇందుకోసం భక్తి టీవీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. నేటి కోటి దీపోత్సవంలో ద్రౌపది ముర్ము మాట్లాడనున్నారు. ఇక నేడు కోటి దీపోత్సవంలో 13వ రోజు. నేటి విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రయాణికులు అలర్ట్‌.. నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు..
హైదరాబాద్ ప్రజలకు నగర ట్రాఫిక్ అధికారులు అలర్ట్ చేశారు. నేడు, రేపు (21,22) ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురు, శుక్రవారాల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌ తెలిపారు. వాహనదారులు ఆంక్షలు పాటించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ మళ్లింపు ఇవాళ సాయంత్రం నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు కింది ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిపివేస్తారు లేదా దారి మళ్లించనున్నారు. బేగంపేట్ ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్ అవుట్‌గేట్, శ్యామ్‌లాల్ బిల్డింగ్, పీపీఎన్‌టి ఫ్లైఓవర్, ఎయిర్‌పోర్ట్ వై జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కత్రియా హోటల్, రాజ్ భవన్ రోడ్, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్, తెలుగుతల్లి జంక్షన్, కట్టమైసమ్మ దేవాలయం, ఇక్బాల్ మినార్, పాతది అంబేద్కర్ విగ్రహం జంక్షన్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్ జంక్షన్ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఇక రేపు (శుక్రవారం) ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఈ జంక్షన్లలో ట్రాఫిక్ నిలిపివేయనున్నారు. రాజ్ భవన్ కుడివైపు వీవీ విగ్రహం హక్కు, కేసీపీ అన్సారీ మంజిల్- తాజ్‌కృష్ణ 1/7 రోడ్, 1/4 రోడ్, ఎన్ఎఫ్సీఈఎల్ ఎస్ఎల్టీ, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం-45 జంక్షన్, కేబుల్ బ్రిడ్జ్, రోడ్ నెం-65, జూబ్లీ హిల్స్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ- ఎన్ఎఫ్సీఎస్, పంజాగుట్ట వంతెన, ప్రజా భవన్, బేగంపేట్ వంతెన, హెచ్‌పిఎస్ అవుట్‌గేట్, శ్యామ్‌లాల్ బిల్డింగ్, ఎయిర్‌పోర్ట్ వి జంక్షన్, బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడిచారు.

పాతబస్తీలో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమేనా?
యువకుడిపై కత్తులతో దాడిచేసి హత్యచేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేపుతుంది. పాతబస్తీలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓవైసీ కాలనీలో మోహీద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బుధవారం అర్థరాత్రి బర్హానా షా సాహబ్ దర్గా కమాన్ వద్ద నడుకుంటూ వెలుతున్న మోహిద్‌ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కత్తులతో దాడిచేశారు. మోహిద్ ను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. దీంతో మోహీద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. మోహీద్ మృతి చెందిన అనంతరం దాడి చేసిన వారు అక్కడి నుంచి పరార్‌ అయ్యారు. స్థానిక సమచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మోహిద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు ప్రేమ వ్యవహారమే నని అనుమానం వ్యక్తం చేశారు. మోహిద్ పై దాడికి ఇతర కారణాలు ఏమైనా వున్నాయా? అనే దానిపై ఇంకా తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకుని సంతోష్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తి.. 5.8 కోట్ల నకిలీ రేషన్‌ కార్డుల గుర్తింపు
రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాను అప్డేట్ ఏళ్లు గడవడంతో లబ్ధిదారుల్లో జరిగిన మార్పులను సవరించేందుకు ఈ-కేవైసీల ధ్రువీకరణ ప్రారంభించారు. లబ్ధిదారుల్లో కొంత మంది చనిపోయినా.. మరికొంత మంది పెళ్లి తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లి స్థిరపడినప్పటికీ వారి పేరు మీద కుటుంబసభ్యులు రేషన్ తీసుకుంటూరని కేంద్రం గుర్తించింది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాగా.. తాజాగా ఆధార్, ఈ-కేవైసీల ధ్రువీకరణ ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్‌ కార్డులను తొలగించినట్లు కేంద్రం వివరించింది. తద్వారా పెద్ద ఎత్తున అక్రమాలను నివారించి, అర్హులకు పంపిణీని మెరుగుపర్చడం సాధ్యమైనట్లు వెల్లడించింది. దేశ ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార భద్రత కార్యక్రమాల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని.. ఆహార భద్రత కింద 80.6 కోట్ల మంది లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 20.4కోట్ల రేషన్‌ కార్డుల డిజిటలీకరణ పూర్తైంది. 99.8శాతం రేషన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. బయోమెట్రిక్‌ ద్వారా 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ, ఈ-కేవైసీ ప్రక్రియతో ఇప్పటివరకు 64శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్‌ పూర్తయ్యింది. 98 శాతం ఆహార ధాన్యాల పంపిణీలో ఆధార్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను వినియోగిస్తున్నారు.

బిలియన్ డాలర్ల లంచం ఇచ్చాడని అమెరికాలో అదానీపై కేసు
బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో ఓ కేసు నమోదు అయింది. భారత్ లో పోర్టులు, విమానాశ్రయాలు, ఇంధన రంగాల్లో నెంబర్ వన్ పారిశ్రామిక వేత్తగా ఉన్న ఆయనపై.. నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ట్రై చేశాడని యూఎస్ లోని న్యూయార్క్ లో నేరారోపణలు వచ్చాయి. ఈ కేసులో గౌతమ్‌ అదానీ సహా ఆయన బంధువు సాగర్ అదానీ పాటు మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు న్యూయార్క్ అధికారులు చెప్పుకొచ్చారు. రాబోయే 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్ల లంచాలు చెల్లించినట్లు తెలుస్తుంది. అయితే, అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్‌ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని అధికారులు ఆరోపణలు చేశారు. కాగా, ఈ విషయంపై అదానీ గ్రూప్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.

పాకిస్థాన్‌లో 10 ఏళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి.. బలవంతంగా..
పదేళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి ముస్లిం వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసిన ఉదంతం పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది. అయితే అధికారులు ఆమెను కాపాడారు. గత వారం మిర్‌పూర్ ఖాస్‌లోని కోట్ గులామ్ ముహమ్మద్ గ్రామంలోని ఇంటి బయటికి వెళ్లిన 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. సిర్‌హండి ఎయిర్ సమరో మదర్సాకు తీసుకెళ్లారు. బాలికను బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశారు. అనంతరం షాహిద్ తల్పూర్‌తో వివాహం జరిపించారు. అయితే.. హిందూ మైనారిటీలో అధికారులతో సమస్యను విన్నవించడంతో ఎస్‌ఎస్పీ పోలీసు అన్వర్ అలీ తల్పూర్ జోక్యం చేసుకుని బాలికను తిరిగి తన ఇంటికి పంపించారు. కాగా.. సింధ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని హిందూ సమాజానికి మైనర్, యుక్తవయసులో ఉన్న హిందూ బాలికలను కిడ్నాప్ చేయడం, బలవంతంగా మతమార్పిడి చేయడం, వివాహం చేసుకోవడం ప్రధాన సమస్యగా మారింది. పాకిస్థాన్ దారావర్ ఇత్తెహాద్ (మైనారిటీల హక్కుల కోసం ఏర్పాటైన ఎన్‌జీవో) అధ్యక్షుడు శివ కట్చి ప్రకారం.. సంఘర్‌లోని మరో ఘటన వెలుగు చూసింది. ఇక్కడ15 ఏళ్ల హిందూ బాలికను 50 ఏళ్ల ముస్లిం వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. ఇది మరవక ముందే తాజాగా ఈ ఘటన జరిగింది. కొందరు అవినీతిపరులైన పోలీసుల అండతో నకిలీ పత్రాలు తయారుచేశారని, బాధితురాలి తల్లిదండ్రులు/న్యాయవాది కోర్టులో కేసు వేసినప్పుడు వాటిని కోర్టులో హాజరుపరుస్తారని శివ బుధవారం చెప్పారు.

అతడికి ఆల్‌టైమ్ రికార్డు ధర పక్కా.. సురేష్ రైనా జోస్యం!
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం సమీపిస్తోంది. నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. మెగా వేలానికి 1574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. 574 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇండియన్ స్టార్స్ రిషబ్ పంత్‌, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. తాజాగా మిస్టర్ ఐపీఎల్, టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మెగా వేలంపై స్పందించాడు. రిషబ్ పంత్‌కు ఆల్‌టైమ్ రికార్డు ధర పక్కా అని జోస్యం చెప్పాడు. పంత్ గన్ ప్లేయర్‌ మాత్రమే కాదు వికెట్ కీపర్ కూడా అని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు కూడా వేలంలో భారీ డిమాండ్ ఉందని చెప్పాడు. కొన్ని జట్లు కెప్టెన్ కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయని రైనా చెప్పుకొచ్చాడు.

నటి కస్తూరికి బెయిల్ మంజూరు
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కస్తూరి పై చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసారు పోలీసులు. దాంతో చెన్నై వదిలి హైదరాబాద్ లో తలదాచుకుంటు మధురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కు దరఖాస్తు చేసింది. కానీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మధురై హైకోర్టు నిరాకారించింది. కస్తూరి పుప్పాల గూడ లోని BRC అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కస్తూరి ఉందన్న సమాచారం రావడంతో సైబరాబాద్ పోలీసుల సహకారంతో సినిమా చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. కస్తూరిని కోర్ట్ లో హాజరుపరిచగా మాట్లాడేముందు ముందు వెనక చూసి మాట్లాడాలి, ఏది పడితే అలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే న్యాయస్థానం చూస్తూ కూర్చోదని గట్టిగా హెచ్చరిస్తూ 14 రోజులు రిమాండ్ విధించింది. గత కొద్దీ రోజూలుగా జైలు జీవితం అనుభవిస్తున్న నటి కస్తూరి తన లాయర్లు ద్వారా బెయిల్ కోరింది. తన కూమారుడు ఆటిజంతో ఇబ్బందులు పడుతున్నారని తల్లి దగ్గర ఉండాల్సిన బాధ్యత ఉందని కోర్టును అభ్యర్ధించింది కస్తూరి. విచారణ చేసిన న్యాయస్థానం నటి కస్తూరికి ఎగ్మోర్ కోర్టు‌ పలు షరతులు విధిస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా నేడు మధ్యంతర బెయిల్ రావడంతో నేడు జైలు నుండి విడుదల కానుంది. మరో వివాదంలో నటి కస్తూరి, బ్రాహ్మణేతరులు ఉద్యోగులపై వివాదాస్పద వ్యాఖ్యలు , కస్తూరిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంగం డిమాండ్.

‘గేమ్ ఛేంజర్’ మూడో సింగిల్ సాంగ్‌పై క్రేజీ అప్డేట్
మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, ఎస్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక టీజర్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ తనకి మంచి కం బ్యాక్ లా నిలుస్తుంది అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తుండగా ఈ సినిమాపై మరో అప్ డేట్ చెర్రీ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే, ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అవగా, వాటికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా నుండి మూడో సింగిల్ గా మెలోడీ పాటను తీసుకు రానున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపాడు. ఈ పాట ప్రేక్షకులందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాట.. వారికి సరికొత్త అనూభూతిని కూడా ఇస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ 22న.. ప్రోమోని నవంబర్ 25న.. సాంగ్‌ని నవంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య, అంజలి, సునీల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

రామ్ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్..?
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎన్నోఆశలు పెట్టుకున్నారు. కాగా ఈ సినిమాను సరికొత్త పంధాలో తెరకెక్కించనున్నాడు దర్శకుడు మహేశ్. అందుకోసం అంతా కొత్తవారితో వెళుతున్నాడు. ఇప్పటికే హీరోయిన్‌గా యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ను ఫిక్స్ చేసారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కూడా దర్శకుడు కొత్త వారిని ఎంపిక చేస్తున్నాడు. రామ్ కోసం తమిళ్ కు చెందిన మార్విన్ సోలొమన్, వివేక్ శివకు సంగీత భాద్యతలు అప్పగించాలని మహేశ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం దర్శకుడు ఇటీవల చెన్నై లో వివేక్, మార్విన్ లను కలిసి కథ నేపథ్యంను వివరించారు. దాదాపు ఈ మ్యూజిక్ ద్వయం కన్ఫర్మ్ అని యూనిట్ ద్వారా సమాచారం అందుతోంది. వివేక్ మార్విన్ లు గతంలో కార్తీ హీరోగా నటించిన సుల్తాన్, ప్రభుదేవా నటించిన గుళేభావకళి వంటి సినిమాలకు సంగీతం అందించారు. మరి ఇప్పుడు రామ్ సినిమాకు ఎటువంటి మ్యూజిక్ అందిస్తారో చూడాలి. త్వరలోనే రామ్ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్స్ పై అధికారక ప్రకటన రానుంది