NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన..
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన కొనసాగుతోంది.. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధికి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు.. అనంతగిరి మండలం బల్లగరువు (పినకోట పంచాయతీ)లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది.. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్‌.. ఉదయం 10.30 గంటలకు బల్లగరువు ప్రాంతానికి చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈ శాన్యంగా 390 కిలోమీటర్లు.. విశాఖకు దక్షిణాన 430 కిలోమీటర్ల దూరంలో నెమ్మదిగా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది.. గంటకు 5 కిలోమీటర్ల కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతుఏపీ తీరానికి సమాంతరంగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తీరం వెంబడి బలంగా గాలులు వీస్తున్నాయి.. మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలకు తోడు, కారుమబ్బులు కమ్మేశాయి.. ఇక, వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు వెల్లడించారు జిల్లా కలెక్టర్‌..

శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌డెడ్
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మడకశిర మండలంలో జరిగిన ప్రమాదంలో స్పాట్‌లోనే నలుగురు మృతిచెందినట్టుగా చెబుతున్నారు.. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 10 మందికి తీవ్రగాయాలపాలయ్యారు.. వీరిలో మరో నలుగురి పరిస్థితి విషయంగా ఉంది. మడకశిర మండలం బుల్లసముద్రం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టెంపో ట్రావెలర్ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.. మృతులు, క్షతగాత్రులు అంతా గుడిబండ మండలం కే ఎన్ పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.. వాహనంలో ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు, డ్రైవరు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు.. మృతులను ప్రేమ్ కుమార్ (30), అతర్వా (2) , రత్నమ్మ (70) , మనోజ్ (30)గా గుర్తించారు.

శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఫోకస్‌
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు.. ఇక, ఈ సారి 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులతో ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రాథమిక సమావేశం నిర్వహించారు.. జిల్లా యంత్రాంగ సహాయ, సహకారాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేలా సిబ్బంది కృషి చేయాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. ఇక, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.. దేవస్థానం అన్ని విభాగాల అధికారులు విభాగాలపరంగా చేపట్టాల్సిన సౌకర్యాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. మహాశివరాత్రి అన్ని ఏర్పాట్లు ఫిబ్రవరి మొదటివారంలోగా పూర్తి చేసేలా చూడాలని.. గత సంవత్సరం కంటే 30 శాతం అదనపు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.. ఇక, మహారాత్రి బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు, శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, రథోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని పేర్కొన్నారు ఈవో.. పాదయాత్రతో వచ్చే భక్తులకు నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల అటవీశాఖ సహకారంతో ఏర్పాట్లను కల్పించాలని.. శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్, జ్యోతిర్ముడి సమర్పణ.. శివరాత్రికి వచ్చే భక్తులు సేదతీరేందుకు ఆరుబయట ప్రదేశాలలో పైప్ పెండాల్స్, షామియానాలు, మంచినీరు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని శ్రీశైలం దేవస్థానం ఆలయ ఈవో శ్రీనివాసరావు..

నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు.. రైతు భరోసాపై చర్చ..
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరగనుంది. నేడు ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభలో నేరుగా రైతు భరోసాపై చర్చించనున్నారు. దీంతో సభ్యులు అందరూ రైతు భరోసా నిధుల విడుదల మాట్లాడనున్నారు. అటు రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ లో కొత్త విద్యుత్ పంపిణీ పాలసీ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందుబాటులో ఉండే దాన్ని సభలో చర్చించే ఛాన్స్‌ ఉంది. శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే మంత్రి పొంగులేటి భూభారతి బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఫార్ములా ఈ-రేస్ పై చర్చ జరగాలని, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే చర్చ జరగాలని హరీష్ రావు పట్టుబట్టారు. చేతులు జోడించి చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ.. ప్రభుత్వ బిల్లు ఉందని, తన కార్యాలయానికి వస్తే చర్చిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించిన భూభారతి బిల్లుపై చర్చించాలన్నారు. హరీష్ రావుతో స్పీకర్ మాట్లాడుతూ.. మీకు అసెంబ్లీ సంప్రదాయాలు తెలియదా. మీరు కావాలనే అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారు.

మణిపూర్లో తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం 2,000 మందితో గాలింపు..
మణిపూర్ రాష్ట్రంలో గత నవంబర్ 25 నుంచి తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం దాదాపు 2,000 మంది విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నారు. ఇక, లీమాఖోంగ్ ఆర్మీ క్యాంపు నుంచి లైష్రామ్ కమల్ (56) అదృశ్యంపై విచారణ జరిపేందుకు మణిపూర్ హైకోర్టు జస్టిస్ డి కృష్ణకుమార్, గోల్మీ గైఫుల్‌షిల్లులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం డిసెంబర్ 3న ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, ఈ కేసులో విచారణ అధికారికి 2/8 గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన కెప్టెన్ ఆశిష్ యాదవ్‌ను నామినేట్ చేశారు. ఈ కమిటీ స్పాట్ విచారణ జరిపి డిసెంబర్ 18వ తేదీన నివేదిక సమర్పించిన తర్వాత ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. తదుపరి విచారణ కోసం సీసీటీవీ ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపామని కమిటి పేర్కొంది. లైష్‌రామ్‌ కూడా ఉపయోగించిన తప్పిపోయిన వాహనం జాడ కోసం దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి కేసుపై స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్‌లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ముందు దాఖలు చేయాలని మణిపూర్ ఉన్నత న్యాయస్థానం కమిటీని ఆదేశించింది.

డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలను తిరస్కరించిన కాంగ్రెస్..
సమాఖ్య సర్కార్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు జో బైడెన్ ప్రభుత్వం తీసుకునే రుణ పరిమితిని పెంచేందుకు కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్‌ (పార్లమెంటు హౌస్ ) గురువారం నాడు తిరస్కరించింది. దీంతో యూఎస్ సర్కార్ షట్‌డౌన్‌ నివారణకు డొనాల్డ్ ట్రంప్‌ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయినట్లైంది. ఈ పరిణామంతో పలు ఫెడరల్‌ సంస్థల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. అమెరికన్‌ కాంగ్రెస్‌ హౌస్ కొన్ని ఫెడరల్‌ సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలకు 3/2 మెజారిటీతో సకాలంలో ఆమోదం తెలపకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. యూఎస్ పార్లమెంటులో డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్‌ పార్టీకి నామమాత్రపు మెజారిటీ మాత్రమే ఉండటంతో.. షట్‌డౌన్‌ ప్రభావం సమాఖ్య సర్కార్ చేసే 25 శాతం వ్యయానికే పరిమితమైంది. కాగా, 174–235 ఓట్ల తేడాతో రుణ పరిమితి పెంపు బిల్లు వీగిపోయింది. అయితే, శుక్రవారం అర్ధరాత్రి తుది ప్రయత్నంగా తమ ప్రతిపాదనలను మరోసారి సభలో ప్రవేశ పెడతామని స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులకు ఇచ్చే సహాయంతో పాటు రైతులకు ఆర్థిక సాయం కలిపి 110 బిలియన్‌ డాలర్లను జో బైడెన్‌ సర్కార్ వ్యయ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, రుణ పరిమితి పెంచితేనే ఓకే చేస్తామని ట్రంప్‌ అనుకూలురు తెలిపారు. ఈ బిల్లుపై స్పష్టత రాకుంటే ప్రభుత్వ పాలన స్తంభించే ప్రమాదం ఉంది.

నేడు కువైట్కు ప్రధాని మోడీ.. 43 ఏళ్ల తర్వాత గల్ఫ్‌ దేశంలో పర్యటన!
నేటి నుంచి ప్రధాని మోడీ కువైట్‌లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. గత 43 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఈ గల్ఫ్‌ దేశంలో పర్యటనకు వెళ్తుండటం ఇదే మొదటి సారి కావడం విశేషం. కువైట్‌ అమీర్‌ షేక్‌ మెషాల్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ జబీర్‌ అల్‌ సబాహ్‌ ఆహ్వానం మేరకు ఇండియా, కువైట్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. కాగా, ఈ పర్యటనలో భాగంగా మోడీ కువైట్‌ పాలకులతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. అక్కడ భారతీయ సంతతి వ్యక్తులతో సమావేశం కానున్నారు. అయితే, చివరిసారిగా 1981లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. అలాగే, కువైట్- భారత్‌ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం 2023–24లో ఏకంగా 10.47 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక, ఈ నెల 22 (ఆదివారం)న కువైట్ ఉన్నత అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా చర్చలు జరపనున్నారు. కువైట్‌లో దాదాపు పది లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ పర్యటించని ఏకైక జీసీసీ సభ్య దేశం కువైట్.

గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం అదిరిపోయే మొబైల్స్‌ను విడుదల చేయనున్న సామ్‌సంగ్
సామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్ 2025 సంవత్సరంలో విడుదల కాబోయే అత్యంత ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లలో ఒకటి. గెలాక్సీ S25, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రా మోడల్స్ 2024 జనవరి 22న విడుదల చేయబడతాయని సమాచారం. లాంచ్‌కు ముందు, టిప్‌స్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం ఈ సిరీస్‌లోని బేస్ మోడల్ రామ్‌లో గణనీయమైన అప్‌గ్రేడ్‌ను పొందుతుందని భావిస్తున్నారు. గెలాక్సీ S25 సిరీస్‌లోని మూడు మోడల్స్ కూడా 12GB రామ్‌తో అందుబాటులోకి రానున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ S24 సిరీస్‌లో బేస్ వేరియంట్ 8GB రామ్‌తో లాంచ్ అవుతుంది. కానీ, గెలాక్సీ S25 సిరీస్‌లో 8GB రామ్‌తో మోడల్ ఉండదని తెలుస్తోంది. ఇది S24 బేస్ మోడల్‌తో పోలిస్తే పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. గెలాక్సీ S24 బేస్ మోడల్ 8GB రామ్‌తో వచ్చినప్పటికీ, 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. S24 ప్లస్, S24 అల్ట్రా మోడల్స్ 12GB రామ్‌తో లాంచ్ చేయబడ్డాయి. కానీ, కొత్తగా వచ్చే S25 అల్ట్రా వేరియంట్ 16GB రామ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. గెలాక్సీ S25 అల్ట్రా మోడల్‌కి 16GB రామ్ ఉండొచ్చని ఊహిస్తున్నారు. కానీ, ఇది చైనీస్ బ్రాండ్స్‌తో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు, OnePlus 13 24GB LPDDR5X రామ్‌తో చైనాలో లభిస్తోంది.

బౌలింగ్‌తో సచిన్‌ను మెప్పించిన 12 ఏళ్ల అమ్మాయి (వీడియో)
భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడిగా చెప్పుకునే సచిన్ టెండుల్కర్ రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా గ్రామం రామేర్ తలాబ్‌కి చెందిన 12 ఏళ్ల సుశీలా మీనాను ప్రశంసించారు. ఆ చిన్నారి బౌలింగ్ యాక్షన్ జహీర్ ఖాన్‌ను గుర్తుకు తెస్తుందని సచిన్ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. ప్రస్తుతం సుశీలా మీనా బౌలింగ్ చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచిన్ ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. సచిన్, జహీర్ ఖాన్‌ను ట్యాగ్ చేస్తూ, “సరళమైన, సులభమైన, చూడటానికి ఎంతో మధురమైన యాక్షన్.. సుశీలా మీనా బౌలింగ్ యాక్షన్‌లో మీరే కనిపిస్తున్నారోమో, జహీర్ ఖాన్. మీరు ఇది చూసారా?” అని ట్వీట్ చేశారు. ఇకపోతే, సుశీలా మీనా ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి రతన్‌లాల్ మీనా, తల్లి శాంతి బాయి మీనా. వారు పనుల ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సాదారణమైనప్పటికీ, సుశీలా క్రికెట్ పట్ల ఆమె ఆసక్తిని కొనసాగిస్తోంది. సుశీలా బౌలింగ్ యాక్షన్ చూస్తే అచ్చం జహీర్ ఖాన్‌తో పోలికలున్నట్లు తెలుస్తోంది. ఆమె బౌలింగ్ స్లో-మోషన్ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు, ఆమెను ‘లేడీ జహీర్ ఖాన్’గా పోలుస్తున్నారు. సుశీలా స్కూల్ స్థాయిలో క్రికెట్ పోటీల్లో పాల్గొంటోంది. ఆమె టాలెంట్ గురించి తెలుసుకున్న ప్రజలు, ఆమెను ఇండియన్ వుమెన్ క్రికెట్ టీమ్‌లో భవిష్యత్ స్టార్‌గా అభివృద్ధి చెందుతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ చిన్నారి టాలెంట్ సచిన్ వంటి దిగ్గజ క్రికెటర్ ద్వారా గుర్తింపు పొందటంతో గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

బిగ్ బాస్ విన్నర్ కి ఊహించని కొత్త తలనొప్పి.. ఎక్కడికి వెళ్లినా అదే క్వశ్చన్
బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ముగిసిన సంగతి తెలిసిందే. విన్నర్ గా నిఖిల్ మాలియక్కల్ టైటిల్ అందుకున్నారు. గౌతమ్ రన్నర్ గా నిలిచారు. చివరి వరకు టైటిల్ ఫైట్ లో నిలబడి విజేతగా నిలిచిన నిఖిల్ బయటకు రాగానే కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తను సమాధానం చెప్పాల్సిన సందర్భాలు చాలానే ఎదురయ్యాయి. ముఖ్యంగా నిఖిల్ అంతకుముందు కావ్య అనే సీరియల్ నటితో కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్నాడు. హౌస్ లో తన బ్రేకప్ లవ్ గురించి చెబుతూ బయటకు వెళ్లాక తను అర్థం చేసుకుంటుందో లేదో అని కంటెస్టెంట్లతో చెప్పాడు. ఐతే బయట మాత్రం కావ్య నటించడం వచ్చిన వారు ఎక్కడైనా ఎలాంటి సందర్భంలో అయినా నటిస్తారని అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నిఖిల్, కావ్య కలిసి గోరింటాకు సీరియల్ లో పనిచేశారు. దాదాపు రెండు మూడేళ్లు ఇద్దరు కలిసి సీరియల్ లో నటించడంతో వారిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది. స్టార్ మా రియాలిటీ షోలో వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. అంతేకాదు ఒకరి మీద ఒకరి ఇష్టాన్ని చూపించుకున్నారు. అయితే సడెన్ గా ఏమైందో ఏమో కానీ బిగ్ బాస్ కి వెళ్లే ముందు నిఖిల్, కావ్య ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. హౌస్ లో నిఖిల్ వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండడం కూడా కావ్యకు నచ్చలేదు.

నేను పెళ్లికి రెడీ.. తమన్నాకు ఫోటోగ్రాఫర్ ఆహ్వానం.. ఆమె ఏం చేసిందంటే ?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20ఏళ్లు అవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తెలుగులో సినిమాలు చేయడం తగ్గించేసిన తమన్నా ప్రస్తుతం హిందీ భాషలో సినిమాలపై ఫోకస్ చేస్తోంది. ఓ వైపు విజ‌య్ వ‌ర్మతో ప్రేమాయ‌ణం గురించి ముంబై మీడియా ఎక్కువ‌గా ప్రచారం చేస్తుంది. మ‌రోవైపు త‌మ‌న్నా బిజీ షెడ్యూళ్లను మ్యానేజ్ చేస్తూ దేశంలోని పలు నగరాలకు ప్రయాణిస్తోంది. తన కెరీర్‌పై ఫోక‌స్ చేస్తూనే, వ్యక్తిగ‌త జీవితంలో ల‌వ్ లైఫ్ పైనా దృష్టి సారించింది త‌మ‌న్నా. ఇటీవ‌ల కాలంలో దాదాపు సౌత్ కి దూర‌మైనా కానీ, బాలీవుడ్ లో మాత్రం వెబ్ సిరీస్‌లు, సినిమాల‌తో బిజీ అవుతోంది. ఇంత‌కుముందు త‌న ప్రియుడు విజ‌య్ వర్మతో క‌లిసి కొన్ని వెబ్ సిరీస్ ల‌లో నటించింది. 2024లో స్త్రీ 2 లాంటి బ్లాక్ బ‌స్టర్ లో స్పెషల్ సాంగులో మ‌రోసారి ఫ్యాన్స్ ని అల‌రించింది. మ‌రోవైపు త‌మ‌న్నా ఒకేసారి మూడు సినిమాల్లో న‌టిస్తూ బిజీబిజీగా ఉంది. తను నెక్ట్స్ ‘వేద’ అనే చిత్రంలో న‌టిస్తోంది. నీర‌జ్ పాండే సిరీస్ ‘సికంద‌ర్ కా ముఖ‌ద్ద‌ర్’ లోను ప్రధాన పాత్రలో న‌టిస్తోంది. చాలాగ్యాప్ తర్వాత తెలుగులో ‘ఓదెలా 2’ సినిమాకు ఓకే చెప్పింది ప్రస్తుతం అది చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ నిరంత‌రం బిజీగా ఉన్న త‌మ‌న్నా ఇటీవ‌ల ఎయిర్ పోర్టు నుంచి వెళుతుంటే త‌న‌ను క‌లిసిన ఓ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ పెళ్లికి ఆహ్వానించాడు. త‌న‌కు పెళ్లి కుదిరింద‌ని ఆ యంగ్ ఫోటోగ్రాఫ‌ర్ ఎంతో ఉత్సాహంగా త‌మ‌న్నాతో చెప్పడంతో ఆమె విషెష్ తెలిపింది. అతడి పెళ్లికి వస్తాన‌ని మాటిచ్చింది. మరి విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా పెళ్లి ఎప్పుడు? అన్న‌ది ఇప్ప‌టికి సస్పెన్స్ గా మారింది.

‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
దాదాపు రెండు వారాలుగా పుష్ప రాజ్ థియేటర్లను రూల్ చేస్తున్నాడు. తను ఇప్పట్లో స్లో అయ్యే మూడ్‌లో లేనట్లే అనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కుమ్మేస్తోంది. తెలుగుతో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్ లో వసూల్ చేస్తుంది. సెకండ్ వీకెండ్ లోనూ థియేటర్లలో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ‘పుష్ప 2’ (హిందీ). ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ దాదాపు రూ.600కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో అల్లు అర్జున్ సినిమా హిందీలో రెండో అతి పెద్ద సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు షారుక్ ఖాన్ ‘జవాన్’ పేరిట ఉంది, దీని మొత్తం జీవితకాల కలెక్షన్స్ 584 కోట్లు. ‘పుష్ప 2’ వరుసగా రికార్డుల వేట కొనసాగిస్తోంది. కలెక్షన్లలో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా కూడా కళ్లు చెదిరే నంబర్లతో దూసుకుపోతుంది. అయితే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కి సంబంధించి పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు చెక్ పెట్టారు మేకర్స్.

Show comments