NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

భ‌వ‌న నిర్మాణాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేవారికి గుడ్‌న్యూస్‌.. సింగిల్ విండో ద్వారా అనుమతులు..!
భ‌వ‌న నిర్మాణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి త్వరిత‌గ‌తిన అన్ని అనుమ‌తులు మంజూరయ్యేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏపీ మున్సిప‌ల్ మ‌రియు ప‌ట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ.. భ‌వ‌నాల నిర్మాణాల కోసం అనుమ‌తులిచ్చే శాఖ‌ల అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు మంత్రి.. ఈ సమావేశానికి పుర‌పాల‌క శాఖ క‌మిష‌న‌ర్ మ‌రియు డైరెక్టర్ హ‌రినారాయ‌ణ‌న్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్‌ల శాఖ ఐజీ శేష‌గిరి బాబుతో పాటు ప‌ట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ, గ‌నులు, అగ్నిమాప‌క శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వ‌ర‌కూ ఆయా శాఖ‌ల వారీగా అనుమ‌తులు జారీ చేస్తున్న విధానం… అనుమ‌తుల మంజూరుకు తీసుకుంటున్న గ‌డువు వంటి అంశాల‌ను అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయ‌ణ‌.. అన్ని శాఖ‌ల‌ను ఆన్ లైన్ విధానంలో అనుసంధానం చేసేలా అవ‌స‌ర‌మైన సాంకేతిక ప‌రిజ్జానాన్ని అందుబాటులోకి తీసుకురావాల‌ని సూచించారు.. ఇక, భ‌వ‌న నిర్మాణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఆయా శాఖ‌ల‌కు వేర్వేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి వ‌స్తుంది. దీనివ‌ల్ల ఒక్కోశాఖ నుంచి అనుమ‌తి రావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది.. ఈ జాప్యాన్ని త‌గ్గించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్యలు చేప‌ట్టాల‌ని స్పష్టం చేశారు.

ఏపీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఇవాళ క్లారిటీ..!
అటు కర్ణాటక.. ఇటు తెలంగాణలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాయి.. ఇక, ఎన్నికల్లో హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌ కూడా కసరత్తు చేస్తోంది.. త్వరలోనే ఏపీలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే, దీనిపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఈ రోజు రవాణాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదనంగా 2 వేల బస్సులు.. 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చించనున్నారు.. అదే విధంగా రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణ శాఖ చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలా..? వద్దా..? అనే అంశంపై కూడా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి తీసుకొస్తే.. బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సిన అవసరం ఉంటుందని, ఖాళీలున్న డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండగా.. వాటిలో సొంత బస్సులు 8,220 కాగా.. మిగతావి అద్దె బస్సులు. మరోవైపు.. గతంలో 1,480 కొత్త బస్సుల కొనగా.. వీటిలో ప్రతినెలా కొన్ని చొప్పున బస్సులు బాడీబిల్డింగ్‌ పూర్తిచేసుకొని డిపోలకు చేరుతూనే ఉన్నాయి.. ఇక, మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా కనీసం 2 వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు ఓ అంచనాకు వచ్చారు.. మరో వైపు ఈ స్కీమ్‌తో ఆర్టీసీకి నెలకు రూ. 250-260 కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది.. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే రాబడిలో 25 శాతం అంటే దాదాపు రూ.125 కోట్లు ప్రభుత్వం తీసుకుంటోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే మాత్రం.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకపోవడంతో పాటు.. అదనంగా రూ.125-135 కోట్లు అదనంగా ప్రభుత్వమే.. ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది.. అయితే, రవాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షలో దీనిపై క్లారిటీ వస్తుందని భావిస్తు్న్నారు.. నేటి సమీక్షలో మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.

నేడు భారత్ బంద్.. మరి తెలంగాణలో సూళ్లు, బ్యాంకులు..?
ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో అయితే అన్ని వ్యాపారాలను మూసివేయాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని ఎస్సీ, ఎస్టీ సంఘాల మద్దతుతో భారీ సంఖ్యలో ప్రజలు ఈ బంద్‌లో పాల్గొంటారని ప్రకటించింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నీ మూసి ఉంచాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. అయితే భారత్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, పాఠశాలలు తెరుస్తాయా అనేది ప్రజలకు ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. తెలంగాణ రాష్ట్రంలోనూ భారత్ బంద్ కొనసాగుతుంది. కానీ.. భారత్ బంద్ దృష్ట్యా రాజస్థాన్‌లో మాత్రమే పాఠశాలలను మూసివేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయి. ప్రభుత్వ భవనాలు, పోస్టాఫీసులు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, గ్యాస్ స్టేషన్లు యథావిధిగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు వైద్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, రైలు సేవలు, ప్రజా రవాణా, విద్యుత్ సరఫరా వంటి అత్యవసర సేవలు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. మరోవైపు బుధవారం కూడా స్టాక్ మార్కెట్లు తెరుచుకున్నాయి. ఈ విషయంలో, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) బంద్ గురించి ఎటువంటి నిర్దిష్ట సమాచారాన్ని అందించలేదు కాబట్టి.. స్టాక్ మార్కెట్లు కూడా సాధారణ రోజుల మాదిరిగానే పనిచేస్తాయి.

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నేడు భారత్‌ బంద్‌
ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు పర్మిషన్ ఇస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పుపై మాల సామాజిక వర్గం నిరసన వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ, ఎస్టీల్లో విభజన ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఇవాళ (బుధవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. కాగా, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని మాల సామాజిక వర్గాల నేతలతో పాటు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించాలని సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలని కోరారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

నేడు జమ్మూకశ్మీర్కు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జమ్మూ, శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులతో వారు సమావేశం కానున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకు కోవాల్సిన చర్యలపై వారితో వీరిరువురు చర్చించనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా తెలిపారు. నేటి (బుధవారం) మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జమ్మూకు చేరుకుంటారు. ఆ తర్వాత వారు.. పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు. ఇక, ఆ తర్వాత శ్రీనగర్ లో సైతం కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పార్టీ జత కట్టే అవకాం ఉందని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. అధికారంలోకి రాకుండా భారతీయ జనతా పార్టీని నియంత్రించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నారు.

జూనియర్ డాక్టర్ పై దాడికి ముందు రెడ్‌లైట్‌ ఏరియాలకు నిందితుడు..!
కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశమంతా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించి మరొక విషయం వెలుగులోకి వచ్చింది. సంజయ్‌ రాయ్‌ బాధితురాలిపై హత్యాచారానికి పాల్పడే ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి సమయంలో అప్పటికే మద్యం తాగిన రాయ్‌.. ఆసుపత్రికే చెందిన మరో సివిక్‌ వాలంటీర్‌తో కలిసి కోల్‌కతాలోని ‘రెడ్‌ లైట్‌ ఏరియా’లకు వెళ్లాడని.. వీరిద్దరు కలిసి ఓ ద్విచక్రవాహనాన్ని రెంట్ కు తీసుకొని.. తొలుత సోనాగచికి అర్ధరాత్రి టైంలో వెళ్లారు.. అక్కడ రాయ్‌ వ్యభిచార గృహం బయట నిలబడగా.. అతడి మిత్రుడు లోపలికి వెళ్లి వచ్చాడు.. ఆ తర్వాత రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్‌కతాలోని మరో వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను సంజయ్ రాయ్‌ వేధింపులకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతడు.. ఆమె నగ్న చిత్రాలు కావాలంటూ వేధించాడు. ఇక, ఉదయం 3.50 గంటల సమయంలో ఆర్‌జీ కార్‌ ఆసుపత్రికి చేరుకున్న సంజయ్ రాయ్.. తొలుత ఆపరేషన్‌ థియేటర్‌ డోర్‌ను పగలగొట్టాడు.. 4.03 గంటల టైంలో ఎమర్జెన్సీ విభాగంలోకి వెళ్లాడు.. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్‌ గదిలోకి వెళ్లాగా.. అక్కడే బాధితురాలు గాఢ నిద్రలో ఉండటంతో ఆమెపై సంజయ్ రాయ్ దాడికి పాల్పడ్డాడు అని కోల్‌కతా పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆర్‌జీ కార్‌ ఆసుపత్రి వెనక వైపు వెళ్లి రాయ్‌ మద్యం తాగినట్లు పలువురు వెల్లడించారు. ఆ సమయంలో పోర్న్‌ వీడియోలు చూసినట్లు కూడా చెప్పుకొచ్చారు. మద్యం తాగిన తర్వాత పలుమార్లు ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.

ఇకపై ఎలాంటి సెటప్‌ బాక్స్‌ అవసరం లేకుండానే 800 డిజిటల్ ఛానెల్స్.. ఎలా అంటే.?
JioTV+ స్ట్రీమింగ్ యాప్ అన్ని ప్రముఖ ప్రముఖ స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉందని కంపెనీ అధికారిక పత్రికా ప్రకటనలో పేర్కొంది. దీని సహాయంతో, వినియోగదారులు ఒకే లాగిన్‌ తో అనేక OTT యాప్‌ లకు సులభంగా యాక్సెస్ పొందుతారు. ఆధునిక గైడ్‌లు కాకుండా.. ఇది స్మార్ట్ రిమోట్ అనుకూలత, వ్యక్తిగతీకరించిన సిఫార్సుల వంటి ప్రయోజనాలను పొందుతుంది. వినియోగదారులు వారి భాష, వర్గానికి అనుగుణంగా కంటెంట్‌ను కూడా ఫిల్టర్ చేయగలరు. JioTV+ యాప్‌లో, వినియోగదారులు వార్తలు, వినోదం, క్రీడలు, సంగీతం, పిల్లలు, వ్యాపారం, భక్తి మొదలైన అనేక వర్గాలలో దాదాపు 800 డిజిటల్ టీవీ ఛానెల్‌ లకు యాక్సెస్ పొందుతారు. ఇది కాకుండా, Jio Cinema Premium నుండి Disney + Hotstar, Sony Liv, Zee5, FanCode వంటి 13 OTT ప్లాట్‌ఫారమ్‌ లకు కూడా యాక్సెస్ అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీ వినియోగదారులు JioTV+ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి సులభంగా యాక్సెస్‌ ను పొందుతున్నారు. Android TV లేదా Google TV వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ ని సందర్శించడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదే విధమైన ప్రక్రియను Apple TV, Amazon FireOS పవర్డ్ TV లలో కూడా ప్రయత్నించవచ్చు.

ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ.. అందరి కళ్లు జై షా పైనే!
ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే పదవీకాలం వచ్చే నవంబరు 30తో ముగుస్తుంది. మూడోసారి ఛైర్మన్‌ ఎన్నికల బరిలో నిలవకూడదని అతడు నిర్ణయించుకున్నారు. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్‌ పదవి కోసం పోటీ పడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జై షా పోటీ చేస్తాడా? లేదా అన్నది ఆగష్టు 27న తెలుస్తుంది. ఎందుకంటే ఐసీసీ ఛైర్మన్‌ పదవి కోసం నామినేషన్ల దాఖలుకు అది చివరి రోజు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఏ బోర్డుకు చెందిన ఎవరైనా పర్యాయానికి రెండేళ్ల చొప్పున ఐసీసీ ఛైర్మన్‌గా మూడు పర్యాయాలు ఉండొచ్చు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్‌ బార్‌క్లే రెండు పర్యాయాలు (నాలుగేళ్లు) పూర్తి చేశాడు. మూడోసారి ఛైర్మన్‌ పదవికి పోటీపడే అవకాశం అతడికి ఉంది. కానీ మూడోసారి ఛైర్మన్‌ పదవికి తాను పోటీపడనని బార్‌క్లే స్వయంగా ధ్రువీకరించారు. నవంబరులో అతడి పదవీకాలం పూర్తవుతుంది. బార్‌క్లే 2020 నవంబరులో మొదటిసారి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2022లో మరోసారి ఎన్నికయ్యారు.

ఐసీసీ కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్‌కు షాక్!
అందరూ ఊహించిందే జరిగింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024 బంగ్లాదేశ్‌ నుంచి తరలిపోయింది. ప్రస్తుతం బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వచ్చే అక్టోబర్‌లో అక్కడ జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి తరలివెళ్లింది. బంగ్లాదేశ్‌లో పర్యటించడానికి పలు క్రికెట్ దేశాలు నిరాకరిస్తున్న నేపథ్యంలో టోర్నీ వేదికను తరలించక ఐసీసీకి తప్పలేదు. వేదిక మార్పునకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) కూడా అంగీకరించింది. ‘బంగ్లాదేశ్‌లో మహిళల టీ20 ప్రపంచకప్‌ జరగకపోవడం నిరాశ కలిగించే విషయం. మెగా టోర్నీని బీసీబీ గొప్పగా నిర్వహించేది. ప్రస్తుతం బంగ్లాలో పర్యటించడానికి చాలా దేశాలు సుముఖంగా లేని నేపథ్యంలో అక్కడ టోర్నీని నిర్వహించడం సాధ్యం కాదు. అయితే బంగ్లాకు ఆతిథ్య హక్కులు కొనసాగుతాయి. భవిష్యత్తులో ఏదైనా ఐసీసీ టోర్నీని బంగ్లాలో నిర్వహించడానికి ప్రయత్నిస్తాం. మెగా టోర్నీని నిర్వహించడానికి ముందుకు వచ్చిన యూఏఈ బోర్డును అభినందిస్తున్నాం’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జెఫ్‌ అలార్డిస్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రభాస్‌ది వేరే లెవెల్.. నీలాంటి వాడు చేసే ఛీప్ కామెంట్స్‌ను పట్టించుకోరు: సుధీర్ బాబు
‘కల్కి 2898 ఏడీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ పాత్ర జోకర్‌లా ఉందని బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభాస్‌ అభిమానులు అర్షద్‌ కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభాస్‌ను చులకన చేసి మాట్లాడడంపై ఇప్పటికే నిర్మాతలు ఎస్‌కేఎన్, అభిషేక్ అగర్వాల్‌ స్పందించారు. తాజాగా అర్షద్‌కు ‘నవ దళపతి’ సుధీర్ బాబు కౌంటర్ వేశారు. ప్రభాస్‌ది వేరే లెవెల్ అని, నీలాంటి వాడు చేసే ఛీప్ వ్యాఖ్యలను ఆయన అస్సలు పట్టించుకోరన్నారు. సుధీర్ బాబు మంగళవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘నిర్మాణాత్మకంగా విమర్శిస్తే పర్వాలేదు కానీ.. ఇలా కించపరిచేలా మాట్లాడడం సరికాదు. ప్రొఫెషనలిజం లేని ఇలాంటి కామెంట్స్‌ అర్షద్ వార్సీ నుంచి వస్తాయని నేను ఎప్పుడూ ఊహించలేదు. ప్రభాస్‌ స్థాయి చాలా పెద్దది. కుంచిత మనస్తత్వంతో చేసే వ్యాఖ్యలను ఆయన అస్సలు పట్టించుకోరు’ అని సుధీర్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

నాని కథతో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘ఫౌజీ’..?
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ వరుస సినిమాలతో దూసుకువెళుతున్నాడు. టాలీవుడ్ లో ఏ ఇతర స్టార్ హీరో కూడా ప్రభాస్ స్పీడ్ ని అందుకోలేకపోతున్నారు. మొన్నా మధ్య సలార్ రిలీజ్ చేసాడు. నిన్నగాక మొన్న కల్కి విడుదలయి సూపర్ హిట్ టాక్ తో ఇటీవల ఏ హీరో సినిమా కూడా అనుకోని 50 రోజుల థియేట్రికల్ రన్ రెబల్ స్టార్ సాధించాడు. ఈ లోగా మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే పాన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ, హను రాఘవపూడితో మరో సినిమా స్టార్ట్ చేసాడు. బ్రిటిష్ కాలం నాటి రాజకార్ల నేపథ్యంలో ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమా పూజ కార్యక్రమం ఇటీవల గ్రాండ్ గా జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.నాని కోసం రాసుకున్న కథను నేచురల్ స్టార్ నో అనడంతో ప్రభాస్ దగ్గరకు వచ్చి చేరిందని, రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెలుతుందనేది ఆ వార్త సారాంశం. ఈ విషయమై దర్శకుడు హనుని ఆరా తీయగా అయన అందుటులో లేరని తెలుస్తోంది. కానీ నాని కోసం అనుకున్న కథ వేరు, ప్రభాస్ సినిమా కథ. అప్పుడు నాని కోసం అనుకున్న పాయింట్ కూడా రెబల్ స్టార్ కు వినిపించగా రిజెక్ట్ చేసాడని తెలిసింది. సో ఆ కథకి ఈ కథకి అసలు సంబంధం లేదని, ప్రస్తుతం హను రాఘవపూడి షూటింగ్ కోసం లొకేషన్ల రెక్కీలో ఉన్నారట. వచ్చే నెల నుండి ఫౌజీ షూట్ మొదలు కానున్నట్టు సమాచారం.

హ్యాట్రిక్ పై కన్నేసిన కుర్ర హీరో.. దసరా బరిలో ఆగస్టు 15 విన్నర్..?
చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్… వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్స్ తో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు నార్నె నితిన్. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ” మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి ఫీల్ గుడ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. వీటికి భిన్నంగా మా సినిమా వుంటుంది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతోతెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న, నితిన్ బావ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నె నితిన్ ఖాతాలో ఆయ్ , మ్యాడ్ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం అని అన్నారు.