నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది.. సాయంత్రం 4గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్‌ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ కేబినెట్‌లో ఆమోదం తెలుపనున్నారు. ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలిచే విషయంపై ఈరోజు జరగబోయే కేబినెట్‌లో చర్చించి.. తర్వాత వాటికి ఆమోదం తెలపనున్నారు. ఈనామ్ భూముల అంశంపై నిర్ణయం తీసుకోనుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసినట్లు సమాచారం.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు..!
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచిస్తోంది.. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదిలే అవకాశముంది. దీని ప్రభావంతో ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈ నెల 27, 28వ తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు.. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ తెలిపింది.
ఏజెన్సీలో వణికిస్తున్న చలి..
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది. మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా.. పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు, శీతల గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో పర్యటాక ప్రాంతాలు టూరిస్టులతో కోలాహలంగా మారాయి.. మరోవైపు.. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్‌లో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్‌లో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఆదిలాబాద్ జిల్లా పొచ్చెరలో 11.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా తాండ్రలో 11.7 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా ర్యాలీలో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. ఇక, హైదరాబాద్‌లోనూ క్రమంగా ఉష్ణోగ్రతలు కిందికి దిగుతున్నాయి.. దీంతో.. ఉదయం పూట బయట రోడ్డెక్కితే వణికిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.. మొన్నటి కంటే నిన్న తక్కువ.. నిన్నటి కంటే నేడు తక్కువ అన్నట్టుగా రోజురోజుకి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి ఉష్ణోగ్రతలు..
నేడు గ్రూప్-1 పై హైకోర్టులో విచారణ.. అభ్యర్థుల్లో ఉత్కంఠ!
తెలంగాణలో ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. ఈరోజు మరోసారి గ్రూప్-1కు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరగనుంది. Go-29 అంశంతో పాటు ఇతర పిటిషన్ల పై నేడు హై కోర్టులో కీలక విచారించనున్నారు. నేటి హై కోర్టు విచారణపై అభ్యర్థుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. కాగా.. జీవో 29 ను రద్దుతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని మెయిన్స్ పరీక్షలకు ముందు గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పరీక్షను రద్దు చేయలేమని చేతులెత్తేసింది. అయితే.. ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్ వాదనలు విన్న సుప్రీం చివరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇంత వరకు వచ్చి ఇప్పుడు వాయిదా వేయడం మంచిది కాదని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇలా చేయడం వలన అభ్యర్థుల ఇంత వరకు ప్రిపేర్ అయిన సిలబస్ అంతా వ్యర్థం అవుతుందని తెలిపారు. ఇది కరెక్ట్ పద్దతి కాదని తెలిపింది. గ్రూప్ 1 పరీక్ష యదావిధిగా కొనసాగించాలని తెలిపింది. అభ్యర్థుల లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు పరిశీలించాలని తెలిపింది. ఈ మేరకు నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.
నేడు వేములవాడకు సీఎం రేవంత్.. ఆలయ అభివృద్ధికి రూ. 127 కోట్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వేములవాడలో పర్యటించనున్నారు. దేవాలయ అభివృద్ధికి రూ. 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వం శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ. 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.3కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. వేములవాడలో రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు. అలాగే రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అంతే కాకుండా రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులు, రూ.50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులు, రూ. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు రూ.85 లక్షల పరిహారం పంపిణీ చేస్తారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు రూ.102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు అందజేస్తారు. అనంతరం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
గ్రీన్ బావర్చిలో బిర్యాని తిని ఆస్పత్రి పాలైన యువకుడు.. ఏం కలిపారంటే?
బయట ఏం తిన్నాలన్న ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ప్రతీ దాంట్లో కల్తీ జరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నేరేడ్మెట్ గ్రీన్ బావర్చిలో బిర్యాని తిని.. వాంతులు విరేచనాలతో హాస్పిటల్లో చేరినట్లు రవి అనే యువకుడు తెలిపాడు. బిర్యానీ తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ వల్లనే వాంతులు విరేచనాలు అయ్యాయని పేర్కొన్నాడు. ఎక్స్ వేదికగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కంప్లైంట్ చేశాడు. స్పందించిన అధికారులు గ్రీన్ బావర్చి రెస్టారెంట్లో తనిఖీలు చేపట్టారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ ను సీజ్ చేశారు. రెస్టారెంట్ లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు తరలించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కల్తీ ఆహారం పెరుగుతోంది. ఆహార కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి హానీకరం. కల్తీ ఆహార పదార్థాల్లో హానీకరమైన రంగులు, రసాయనాలు వాడడం వల్ల ప్రాణాంతక కేన్సర్‌కు కారణమవుతున్నాయి. మరికొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడై ప్రాణాంతకంగా మారుతోంది. కల్తీ వల్ల విరేచనాలు, కడుపునొప్పి, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. కొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కల్తీ ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా, రుచిగా తయారు చేయడానికి ఎన్నో రసాయనాలను కలుపుతున్నారు. ఆహార పదార్థాల్లో అల్యూమినియం, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మెదడు, ఎముకలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. అందరూ జాగ్రత్తలు వహించాలి.
నీ కారణంగానే ఆటను మరింత ఆస్వాదించా.. ఫెదరర్ భావోద్వేగ లేఖ!
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో పోటీ కారణంగానే తాను ఆటను మరింత ఆస్వాదించానని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తెలిపారు. రఫాది గొప్ప ప్రయాణం అని, 14 ఫ్రెంచ్ ఓపెన్‌లు గెలవడం చరిత్రాత్మకం అని ప్రసశంసించారు. స్పెయిన్ సహా మొత్తం టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావని ఫెదరర్ పేర్కొన్నారు. డేవిస్‌కప్ తన కెరీర్‌లో చివరి టోర్నీ ప్రకటించిన నాదల్.. మంగళవారం తీవ్ర భావోద్వేగాల మధ్య బరిలోకి దిగాడు. క్వార్టర్ ఫైనల్స్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఫెదరర్ ఓ భావోద్వేగ లేఖ రాశాడు. ‘రఫా.. నువ్వు నన్ను ఎన్నో సార్లు ఓడించావ్. నేను నిన్ను ఓడించిన దానికన్నా ఎక్కువగా నన్ను ఓడించావు. నీ అంతగా మరెవరూ నాకు సవాలు విసరలేదు. మట్టి కోర్టులో ఆడుతున్నప్పుడు నీ అడ్డాలో ఆడుతున్నట్లు ఉండేది. నేను ఊహించని దాని కన్నా ఎక్కువగా కష్టపడేలా చేశావు. నా రాకెట్ హెడ్ పరిమాణాన్ని మార్చేలా చేశావు. నేను ఆటను మరింతగా ఆస్వాదించేలా నువ్వే చేశావు. నీది గొప్ప ప్రయాణం. 14 ఫ్రెంచ్ ఓపెన్‌లు గెలవడం ఓ చరిత్ర. నీ ఆటతో స్పెయిన్ మొత్తం గర్వపడేలా చేశావు. రఫా.. నువ్ టెన్నిస్ ప్రపంచం మొత్తం గర్వపడేలా చేశావు’ అని రోజర్ ఫెదరర్ లేఖలో పేర్కొన్నారు.
అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే ఫైల్పై పుతిన్ సంతకం..
ప్రపంచం ముందు మరో అణు యుద్ధం ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తుంది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య రోజురోజుకు యుద్ధ తీవ్రత పెరిగిపోతుంది. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అమెరికా పర్మిషన్ ఇవ్వడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కోపం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టినట్లు సమాచారం. ఒకవేళ పశ్చిమ దేశాలు నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలను ఉపయోగించేలా అణు ముసాయిదాను సవరించారు. ఇక, అణ్వాయుధాలు ఉన్న దేశం సహాయంతో తమపై దాడి చేస్తే.. దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పుతిన్ స్పష్టంగా పేర్కొన్నారు. కూటమిగా ఎవరు దాడి చేసినా.. ఆయా దేశాలపై రష్యా అణు దాడి చేసేలా నిబంధనను రష్యా రూపొందించింది. మరోవైపు అమెరికా అనుమతితో ఉక్రెయిన్ ఆరు దీర్ఘశ్రేణి క్షిపణులతో రష్యాపై దాడి చేసింది. ఇందులో ఐదింటిని కూల్చేశాం.. మరోదాన్ని ధ్వంసం చేశామని రష్యా సైన్యం పేర్కొనింది. రెండు దేశాల మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఐరోపా దేశాలు అలర్ట్ అయ్యాయి. చిన్న పిల్లల ఆహార పదార్థాలు, ఔషధాలు, తాగు నీటిని నిల్వ చేసుకోవాలని కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు ఇప్పటికే సూచనలు జారీ చేశాయి. అయితే, లిథువేనియా-స్వీడన్; ఫిన్లాండ్-జర్మనీల మధ్య ఇంటర్నెట్‌ను అందించే సముద్ర గర్భ కేబుళ్లు తెగిపోవడం వెనక మాస్కో హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దని ఐక్యరాజ్య సమితి రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ-జనరల్ రోజ్మేరీ డికార్లో తెలిపారు.
విజయ్ దేవరకొండ చేతిలో ఆ హీరో జాతకం
విభిన్న చిత్రాలదర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. హాస్యనటుడు ప్రియదర్శి, తెలుగమ్మాయి రూప కొడువాయూర్ హీరో, హీరోయిన్స్ గా నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో గతంలో ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ హిట్స్ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ప్రేక్షకులకు సారంగపాణి జాతకం ఎలా ఉండబోతుందో టీజర్ ద్వారా కాస్త పరిచయం చేయనున్నారు. అందుకు ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 21వ తేదీన ఉదయం 11:12 గంటలకు రిలీజ్ చేయనున్నాడు. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టిన మేకర్స్, ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మనిషి భవిష్యత్తు తన చేతి రేఖల్లో ఉంటుందా.. లేదా మనిషి చేసే చేతల్లో ఉంటుందా.. అనే కథాంశంతో వస్తున్న ఈ సినిమా కంప్లిట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదీన క్రిస్టమస్ కానుకగా వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు మేకర్స్.
మెుత్తానికి రామ్ రూటు మార్చి మరో సినిమా స్టార్ట్ చేసాడు
ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ హీరోలలో డాన్స్, యాక్టింగ్, అందం ఇలా అన్ని ఉన్న నటులలో రామ్ పోతినేని అగ్ర స్థానంలో ఉంటాడు. కానీ ఈ హీరో టాలెంట్ కు తగ్గ సినిమాలు చెయ్యట్లేదు నే టాక్ అటు ఫాన్స్ లోను ఇటు టాలీవుడ్ లోను గట్టిగా వినిపించే మాట. ఇటీవల పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన డబుల్ ఇస్మార్ట్ ఘోర పరాజయం పాలయింది. దింతో కాస్త గ్యాప్ తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ఉస్తాద్’ రామ్ పోతినేని హీరోగా బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా చేస్తోంది . నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు దర్శకత్వం వహించిన మహేష్‌బాబు.పి దర్శకత్వంలో రామ్ పోతినేని నటించనున్నాడు. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గురువారం అనగా 21న విశిష్ట అతిధుల సమక్షములో ఈ సినిమా పూజ కార్యక్రమంనిర్వహించనున్నారు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి వరుసగా మాస్ యాక్షన్ ఫిలిమ్స్ చేస్తూ ప్లాప్స్ అందుకున్న రామ్ ఈ సారి రూట్ మార్చాడు. తాజగా విడుదల చేసిన పోస్టర్ లో రామ్ సైకిల్‌తో పాటు నడుస్తూ కనిపిస్తున్నట్టు చూపిస్తూ మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్ర ఎదో చేస్తునట్టు చూపించారు. రామ్ సినీ కెరీర్ లో 22వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాపో మంచి కంటెంట్ తో రాబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ కూడా వినిపిస్తోంది.