Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. వారిని ఉరితీసినా తప్పులేదు..
అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అనకాపల్లి జిల్లా యంత్రాంగంపై విరుచుకుపడ్డ ఆయన.. అనకాపల్లి జిల్లా అవినీతి యంత్రాంగాన్ని ఉరి తీసినా తప్పులేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జిల్లా అధికారులు ప్రతిపక్ష పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ నాయకులు ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు.. ఇలా అయితే జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉంటుందా..? అని ప్రశ్నించారు. మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు కొద్దిరోజుల క్రితం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చొని తన పనులు చేయించుకున్నాడు అని ఆరోపించారు.. జవహర్ రెడ్డి కుమారుడు వద్దకు జిల్లా అధికారులు పరుగులు పెట్టుకొని వెళ్లి పని చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఇక, గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో కుంభకోణాలు, అక్రమాలకు పాల్పడిన అధికారులే జిల్లాలో ఇప్పుడు కీలక పోస్టులలో పనిచేస్తున్నారని విమర్శించారు దాడి వీరభద్రరావు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బదిలీలు జరిగినా.. అనకాపల్లి జిల్లాలో మాత్రం బదిలీలు జరగలేదన్నారు.. టీడీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును బ్రష్టు పట్టించవద్దని జిల్లా అధికారులను వేడుకుంటున్నాను.. ఇకనైనా పద్దతి మార్చుకోండి అని వార్నింగ్‌ ఇచ్చారు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు..

నేడు ఏపీ కేబినెట్‌ కీలక భేటీ..
ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక అంశాలకు సంబంధించి చర్చ జరగనుంది.. వచ్చే నెల 12తో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది.. ఈ సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు సంబంధించి జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణ.. సభలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.. దీనికి సంబంధించి కేబినెట్‌లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.. అదేవిధంగా వచ్చే నెల 12న ఒక భారీ స్థాయిలో సభ నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఇక, ఉద్యోగుల బదిలీలు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కూడా కేబనిఎట్‌లో ప్రధానంగా చర్చ జరగనుంది.. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించిన పలు ప్రాజెక్టులకు.. కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. రాష్ట్రంలో గల కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. మున్సిపల్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలకు సంబంధించి కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.. రాజధాని నిర్మాణ పనులు, ఇతర అంశాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణం వీటికి సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చిస్తారు.. కేబినెట్‌ సమావేశం తరువాత తాజా రాజకీయ పరిణామాలు చర్చించే అవకాశం ఉంది.. లిక్కర్ అరెస్టులకు సంబంధించి ప్రధానంగా కేబినెట్‌ తర్వాత చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది.. తాజా రాజకీయ పరిణామాలు.. మహానాడులో చర్చించే ప్రభుత్వ సంక్షేమం కార్యాచరణ ఎజెండా.. ఏడాది పాలనలో మంత్రుల పాత్ర.. ఇవన్నీ చర్చించే అవకాశం ఉంది.

భారీ పేలుళ్ల కుట్ర భగ్నం.. సిరాజ్‌ నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్ల కుట్రను తెలంగాణ, ఏపీ పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే.. విజయనగరంలో ఒకరిని, హైదరాబాద్‌లో మరొకరని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఈ కేసులో ఎన్‌ఐఏ కూడా రంగంలోకి దిగింది.. ఇప్పటికే రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు వెలుగు చూడగా.. ఉగ్రవాద భావజాలం కలిగిన సిరాజ్ నుంచి అనేక ఆసక్తికర విషయాలు సేకరించారు పోలీసులు.. సిరాజ్ నాలుగు టార్గెట్‌లు పెట్టుకున్నట్టు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.. దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి.. యువతను మతోన్మాదులుగా మార్చాలి.. అవసరమనుకుంటే ప్రాణ త్యాగానికైన సిద్దపడేలా మానవ బాంబుగా మార్చాలని.. అలాగే ఉనికిని చాటుకునేలా జనసాంధ్రత ఎక్కువగా ఉన్నచోట భారీ పేలుళ్లు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టుగా చెప్పాడట.. సిరాజ్ హైదరాబాద్‌ వెళ్లిన తరువాత గ్రూప్స్, ఎస్సై ఎంపిక పరీక్షలకు హాజరయ్యడు.. ఎస్సై కోసం రెండు సార్లు హాజరుకాగా ఎంపిక కాలేదు.. తరువాత కాలంలో ఓ కాల్ సెంటర్ లో పని చేశాడు.. అప్పుడే సమీర్ తోపాటు వరంగల్ కు చెందిన పలువురు మత పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి.. తరచూ జీహాద్ గురించి చర్చించుకునే వారు.. మనం ఎలా అనిచివేయబడుతున్నామో అన్న వాటిపై నెట్‌లో వీడియోలు ఎక్కువగా చూస్తుండేవాడని తెలుస్తోంది.

ఫడ్నవిస్ కేబినెట్‌లోకి 77 ఏళ్ల కురు వృద్ధుడు.. నేడు ప్రమాణం చేయనున్న భుజ్‌బాల్
మహారాష్ట్ర కేబినెట్‌లో మంగళవారం ఒక కీలక పరిణామం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో ఎన్‌సీపీకి చెందిన 77 ఏళ్ల రాజకీయ కురు వృద్ధుడు ఛగన్ భుజ్‌బాల్ చేరనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. ఛగన్ భుజ్‌బాల్‌ చేత ప్రమాణం చేయించనున్నారు. భుజ్‌బాల్.. అనేక దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. పలు ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది. డిసెంబర్‌లో ఫడ్నవిస్ కేబినెట్‌లో భుజ్‌బాల్ మిస్ అయ్యారు. దాదాపు 5 నెలల తర్వాత భుజ్‌బాల్ ఫడ్నవిస్ కేబినెట్‌లో చేరుతున్నారు. మంత్రివర్గంలో చేరుతున్నట్లు భుజ్‌బాల్ ప్రకటించారు. చాలా కాలం తర్వాత తిరిగి మంత్రిపదవి చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే మహాయుతి కూటమి కూడా ఈ వార్తను ధృవీకరించింది. భుజ్‌బాల్ ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి. డిసెంబర్‌లో భుజ్‌బాల్‌ను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో ఆ వర్గ ప్రజల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించిన ఫడ్నవిస్ కేబినెట్‌లోకి తీసుకుంటున్నారు. నాసిక్ జిల్లాలోని యోలా ఎమ్మెల్యే అయిన భుజ్‌బాల్.. వివిధ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంతో పాటు కేబినెట్ మంత్రిగా పని చేశారు. భుజ్‌బల్‌కు పోర్ట్‌ఫోలియో కేటాయింపునకు సంబంధించిన నిర్ణయం ముఖ్యమంత్రిదేనని, ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ప్రకటిస్తారని వర్గాలు తెలిపాయి.

మామతో పరారైన భార్య.. రూ. 20 వేల రివార్డు ప్రకటించిన భర్త
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఎటావా జిల్లాలోని పురాన్‌పురా గ్రామంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఒక వివాహితతన ఇద్దరు కుమార్తెలను తనతో తీసుకెళ్లి, తన కొడుకును మాత్రం అక్కడే వదిలేసి.. తన భర్త తండ్రితో లేచిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అయితే, తమ పిల్లలను తిరిగి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ మహిళ భర్త రివార్డు ప్రకటించాడు. తన తండ్రి, పిల్లలను కనిపెట్టిన వారికి రూ.20,000 బహుమతిని ఇస్తామని తెలిపాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తన భార్య కుటుంబ ఆభరణాలను ఎత్తుకెళ్లిందని సదరు భర్త ఆరోపించాడు. ఇది మాత్రమే కాదు, సంఘటన జరిగి నెల రోజులు గడిచినా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేక పోయారని నిరాశ చెందిన అతడు స్వయంగా తన భార్య, పిల్లలను కనుగొనే వ్యక్తికి 20 వేల రూపాయల బహుమతిని ఇస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటనతో చాలా మంది వారిని పట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఈ ఘటనపై ఎటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. త్వరలోనే లేచిపోయిన వారిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. తమ పోలీసులు వేగంగా దర్యాప్తు వేస్తున్నారని తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణపై త్వరలోనే రష్యా-ఉక్రెయిన్ చర్చలు ప్రారంభిస్తాయని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. దాదాపు వీరిద్దరి మధ్య 2 గంటల పాటు సంభాషణ జరిగింది. ఈ ఫోన్ కాల్ సంభాషణతో తర్వాత ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. పుతిన్‌తో తన సంభాషణ చాలా బాగా సాగిందని తెలిపారు. ఈ చర్చలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగిస్తామని పుతిన్ చెప్పినట్లుగా ట్రంప్ వెల్లడించారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో రష్యా-ఉక్రెయిన్ మాత్రమే చర్చించుకుంటాయని.. ఇతరుల జోక్యం ఉండదన్నారు. ఎందుకంటే ఎవరికీ తెలియని వివరాలు వారికి మాత్రమే తెలుస్తాయని.. ఈ విధానమే ఏకైక మార్గం అని పేర్కొన్నారు.

కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక.. వెంటనే ఈ పని చేయండి!
ఏదైనా తెలియని సమాచారం తెలుసుకోవాలనుకుంటే టక్కున గుర్తొచ్చేది గూగుల్ క్రోమ్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తుంటారు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తుంటే వెంటనే ఈ పని చేయాలని అలర్ట్ చేసింది. ప్రభుత్వ సంస్థ CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. టెక్ దిగ్గజం వెబ్ బ్రౌజర్‌లో ఉన్న కొన్ని లోపాల గురించి తెలియజేసింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు మీ ల్యాప్‌టాప్ నుంచి ముఖ్యమైన డేటాను చోరీ చేసే అవకాశం ఉందని తెలిపింది. గూగుల్ బ్రౌజర్ క్రోమ్ పాత వెర్షన్లలో కొన్ని లోపాలు గుర్తించామని, దీని కారణంగా హ్యాకర్లు వినియోగదారుల కంప్యూటర్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చని CERT-In తెలిపింది. మీరు Windowsలో Chrome ఉపయోగిస్తుంటే, ఈ బగ్‌లు 136.0.7103.114 కి ముందు వెర్షన్‌లలో ఉన్నాయి. మీరు Mac లేదా Linux వినియోగదారు అయితే, ఈ బగ్ 136.0.7103.113 కి ముందు వెర్షన్లలో ఉంది. గూగుల్ క్రోమ్ పాత వెర్షన్లలో రెండు బగ్‌లు ఉన్నాయని CERT-In నివేదించింది.

అభిషేక్ శర్మ, దిగ్వేష్ రాఠి మధ్య గొడవ.. తీరు మార్చుకోని దిగ్వేష్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు లక్నోను 6 వికెట్ల తేడాతో ఓడించి, ప్లేఆఫ్స్‌కు చేరుకునే లక్నో ఆశలను కూడా దెబ్బతీసింది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిషేక్ శర్మ, దిగ్వేష్ రాఠి మధ్య గొడవ జరిగింది. దిగ్వేష్ ఓవరాక్షన్ తో గందరగోళ పరిస్థితి తలెత్తింది. దిగ్వేష్ సింగ్ రాఠి, అభిషేక్ శర్మ మధ్య తీవ్ర వాదన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన హైదరాబాద్ ధాటిగా ఆడింది. అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేయడానికి దిగ్వేష్ సింగ్ రాఠి వచ్చాడు. ఈ ఓవర్‌లో అభిషేక్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీని తరువాత, అభిషేక్‌ను చూసిన దిగ్వేష్ రాఠి తన పాత శైలిలో నోట్ బుక్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అభిషేక్ శర్మను స్టేడియం వదిలి వెళ్ళమని కూడా సంజ్ఞ చేశాడు.

దానికి వయసుతో సంబంధం లేదు..
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీతిసింగ్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడల్లోను సినిమాలు చేసింది. తెలుగులో అయితే మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని, రవితేజ, గోపీచంద్, నాగార్జున ఇలా దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. ఇక అవకాశాలు తగ్గడంతో మెల్లగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక హీరోయిన్‌గా కెరీర్ మంచి స్పీడ్‌లో ఉన్న టైం లోనే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లై నప్పటికీ ఈ అందాల తార క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగులో సినిమాలు చేయక పోయినప్పటికీ ప్రస్తుతం ఆమె జాబితాలో ‘దే దే ప్యార్ దే 2’. ‘ఇండియన్ 3’ తదితర సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ హీరోయిన్స్ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. రకుల్ మాట్లాడుతూ.. ‘నేను హీరోయిన్‌గా పెద్దతెరపై కనిపించాలనే ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. హీరోయిన్ ల పరిమిత కాలం చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లు మాత్రమే ఉంటుంది అని చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మీరు అద్భుతంగా పని చేసినన్ని రోజులు వయసుతో సంబంధం లేకుండా పరిశ్రమలో రాణించే అవకాశం ఉంది. నా వృత్తిలో నేను రోజూ ఉత్తమంగా ఉండక పోయినా పర్వాలేదు. కానీ తమ అభిమాన నటులగానే ఉండాలని కోరుకునే వారిలో పిల్లలు కూడా ఉంటారు. అందుకే. కథలను ఎంపిక చేసుకునేటప్పుడు ఆచితూచి అడుగులేయాల్సిన బాధ్యత నటీనటులపై ఎంతైనా ఉంది అని చెప్పుకొచ్చింది రకుల్.

మణిరత్నం కోసం రాజీ పడిన ప్రశాంత్ నీల్.. ?
తన సినిమాలో నటించేటప్పుడు ఉన్నవి కాకుండా కొత్తగా మరో ప్రాజెక్ట్ కు కమిట్‌మెంట్లు ఇవ్వకూడదు. ఇది రాజమౌళి ఫార్ములా. దర్శకుడు నీల్ కూడా అదే పాటిస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మణిరత్నం కోసం ఈ నిబంధనలు నీల్ పక్కన పెట్టారని టాక్. ‘దగ్ లైఫ్’ మూవీతో బిజీగా ఉన్న మణిరత్నం.. దీం తర్వాత ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకున్నారు. దానికి హీరోగా నవీన్ పోలిశెట్టిని ఎంచుకున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు కానీ ప్రాజెక్టు లాక్ అయిపోయిందని టాక్. అయితే హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ని తీసుకున్నారట. అదే నిజమైతే ప్రశాంత్ నీల్ రాజీ పడినట్టే అనుకోవాలి.. ఎందుకంటే.. జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) లో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ని ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె ఏడాది పాటు ఏ ఇతర సినిమాలో నటించకూడదని నీల్ కండీషన్ పెట్టినట్టు గత ఏడాది వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే రుక్మిణి ఆల్రెడీ షూటింగ్‌లో ఉన్నవి కాకుండా కొత్తగా కమిట్‌మెంట్లు ఏమి లేవు. అయితే మణిరత్నం అంటే ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. మరి  ఆయన సినిమా కోసం హీరోయిన్ విషయంలో ప్రశాంత్ నీల్ రాజీ పడక తప్పదు. ప్రస్తుతం సితార బ్యానర్ లో ‘అనగనగా ఒక రాజు’ చేస్తున్న నవీన్ దీని తర్వాత ఏదనే క్లారిటీ ఇప్పటిదాకా లేదు. చూస్తుంటే ఫైనల్‌గా మణిరత్నం లాంటి కల్ట్ డైరెక్టర్‌లో పడటం ఖాయంగానే కనిపిస్తోంది.

Exit mobile version