మళ్లీ సర్వీసులోకి వచ్చే ఆలోచనలో సీనియర్ ఐఏఎస్..!
సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ సర్వీసులోకి వచ్చే ఆలోచనలో ఉన్నారట.. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్.. ఇక, ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేశారు. వీఆర్‌ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.. ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉన్నా.. ఆయన జూన్ 25వ తేదీన వీఆర్‌ఎస్‌కు అర్జీ చేసుకోవడం.. కూటమి ప్రభుత్వం దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి.. అయితే, ఐఏఎస్‌కు తాను చేసిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని సీనియర్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ యోచనగా ఉందట.. మానసిక ఒత్తిడి వల్ల సర్వీసు నుంచి వైదొలగాలని తొలుత నిర్ణయించుకున్నానంటూ ప్రవీణ్ ప్రకాష్ మొదట వెల్లడించారు.. అయితే, దరఖాస్తు చేసిన 90 రోజులలోగా ఉపసంహరణకు నిబంధనల ప్రకారం అవకాశం ఉంది.. అయితే, సర్వీసులోకి తిరిగి తీసుకునే విచక్షణాధికారం సీఎంది మాత్రనటమేనంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి తన ఆలోచనలను.. వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నంలో ప్రవీణ్ ప్రకాష్ ఉన్నట్టుగా తెలుస్తోంది.. ముఖ్యమంత్రి ఆమోదిస్తే, ప్రవీణ్ ప్రకాష్ సర్వీసులోకి కొనసాగే అవకాశం ఉందంటున్నారు..
అనకాపల్లి ఘటనతో ప్రభుత్వం అలర్ట్.. సీఎం కీలక ఆదేశాలు..
అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలు జారీ చేశారు.. హాస్టళ్లు, సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయా? లేదో? చూడాలని కలెక్టర్లకు సూచించారు సీఎం.. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాలు సురక్షితమా కాదా అన్న కోణంలోనూ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.. బాలలు ఉన్న చోట పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, ఆరోగ్యకరమైన పరిస్థితుల ఉన్నాయో లేదో చూడాలని పేర్కొన్నారు.. సంబధిత విభాగాలు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. కాగా, కలుషిత ఆహారం కాటేసిన ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చిన ఈ దారుణం అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కొన్నేళ్లుగా పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ నడుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన 90 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. మతపరమైన కార్యకలాపాలు నిర్వహించే కిరణ్ కుమార్ ఈ ట్రస్ట్ చైర్మన్. కనీస వసతులు లేని రేకుల షెడ్ లో నడుస్తున్న ఈ హాస్టల్లో విద్యార్థులు శనివారం సాయంత్రం కలుషిత ఆహారం తిన్నారు. పునుగుల కూర, సమోసా, బిర్యానీ వంటి ఫుడ్ తినగా పిల్లల్లో డయేరియా లక్షణాలు కనిపించాయి. మొదట స్వస్థత గురైన ఒకర్ని కోటవురట్ల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
నేడు సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తాజాగా ఈ కేసులో బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసి, మార్చి 16న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు విడతలుగా 10 రోజుల పాటు ఆమెను విచారించారు. ఆ తర్వాత కవితను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఇంతలో సీబీఐ జోక్యం చేసుకుని కవిత తిహార్ జైలులో ఉండగానే ఆమెను అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో తన కుమారుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టును ఆశ్రయించారు. అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తి అని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది.
ఏకంగా 60,244 పోలీసుల ఉద్యోగాల భర్తీ..
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో యూపీ పోలీస్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. నోటిఫికేషన్ ప్రకారం 60,244 పోస్టులకు రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు అతిపెద్ద కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్. ఇందులో 20 శాతం పోస్టుల్లో మహిళా కానిస్టేబుళ్లను కూడా రిక్రూట్ చేయనున్నారు. దీనివల్ల మహిళలకు కూడా పెద్ద అవకాశం లభిస్తుంది. డిసెంబర్ 27 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని, దరఖాస్తు రుసుము రూ.400గా నిర్ణయించారు. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 16, 2024. అలాగే దరఖాస్తులో ఫీజు సర్దుబాటు, సవరణకు చివరి తేదీ జనవరి 18, 2024. ఇందులో ఈడబ్ల్యూఎస్‌కు 6024, ఓబీసీకి 16264, ఎస్సీలకు 12650, ఎస్టీలకు 1204 పోస్టులు రిజర్వు చేయబడ్డాయి. నోటిఫికేషన్ ప్రకారం 12,049 పోస్టుల్లో మహిళలను నియమించనున్నారు. ఇకపోతే రిక్రూట్‌మెంట్ కోసం మొత్తం పోస్టులలో 20 శాతం మహిళలకు రిజర్వ్ చేయబడింది. దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారమ్ తో పాటు దరఖాస్తు రుసుమును సమర్పించాలి. జనరల్, ఓబీసీ, షెడ్యూల్డ్ కులాలకు చెందిన పురుష అభ్యర్థుల కనీస ఎత్తు 168 సెం.మీలు, మహిళా అభ్యర్థుల కనిష్ట ఎత్తు 152 సెం.మీ.లు ఉండాలి. షెడ్యూల్డ్ తెగల కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు కనిష్ట ఎత్తు 160 సెంటీమీటర్లు, మహిళా అభ్యర్థులు కనిష్ట ఎత్తు 147 సెంటీమీటర్లు కలిగి ఉండటం తప్పనిసరి. ఎంపిక కావడానికి అభ్యర్థులు ఆఫ్‌లైన్ రాత పరీక్షకు హాజరు కావాలి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను శారీరక పరీక్షకు పిలుస్తారు. పురుషులు 25 నిమిషాల్లో 4.8 కిలోమీటర్లు, మహిళలు 14 నిమిషాల్లో 2.4 కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది.
కోల్‌కతా కేసు నేపథ్యంలో ఢిల్లీలో బెంగాల్ గవర్నర్.. రాష్ట్రపతితో భేటీకి ఛాన్స్..
కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ నేతలతో భేటీ కావచ్చని తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హస్పిటల్‌లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై మమతా బెనర్జీ సర్కాన్ అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ కేసును కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారిస్తోంది. మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేస్తున్నారు. గవర్నర్ గత గురువారం ఆస్పత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, గవర్నర్ మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్య దిగజారుతోందని ఆరోపించారు. కోల్‌కతా పోలీసులు పనితీరుపై ఆయన సోమవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో వారు అంతా తప్పుగా చేశారని అన్నారు. ప్రస్తుతం ఈ కేసుని సుప్రీంకోర్టు సమోటోగా తీసుకుంది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉందని, ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు.
మార్కెట్ లోకి సరికొత్త ఫీచర్ల ఫోనును తీసుకొచ్చిన వివో..
Vivo ఇటీవలే Vivo V40 సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో రెండు హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. ఒకదాని పేరు Vivo V40. మరొకటి Vivo V40 Pro. సోమవారం నుండి ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో Vivo V40 విక్రయం ప్రారంభమైంది. ZEISS కెమెరా సెన్సార్‌ని కలిగి ఉన్న Vivo V సిరీస్‌లో ఇది మొదటి హ్యాండ్‌సెట్. Vivo V40 మూడు వేరియంట్లలో వస్తుంది. ఇది 8 + 128 GB, 8 + 256 GB, 12 + 512 GB అంతర్గత నిల్వను కలిగి ఉంది. వాటి ధర వరుసగా రూ. 34,999, రూ. 36,999, రూ.41,999. Vivo V40ని 10 శాతం తక్షణ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీని కోసం HDFC బ్యాంక్, SBI కార్డ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనితో పాటు మీరు ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. Vivo V40 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌లతో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 4,500 nits గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఇందులో HDR మోడ్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
ఎవరికీ మినహాయింపు ఉండదు.. ఆ బాధ్యత వినేశ్ ఫొగాట్‌దే: కాస్
తమ బరువును పరిమితి లోపు ఉంచుకునే బాధ్యత అథ్లెట్లదే అని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ మినహాయింపు ఉండదని ద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్) స్పష్టం చేసింది. ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. వినేశ్ గోల్డ్ మెడల్ సాధిస్తుందని అనుకున్నా.. అనర్హత వేటు కారణంగా అందరూ నిరాశకు గురయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో తన అర్హతను సవాలు చేస్తూ వినేశ్ ఫొగాట్.. కాస్‌కు అప్పీలు చేసుకుంది. రజత పతకంకు తాను అర్హురాలిని అంటూ కోరింది. అయితే వినేశ్ చేసుకున్న అప్పీలును కాస్ తిరస్కరించింది. అందుకుగల కారణాలను కాస్ తాజాగా వివరించింది. ‘నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. బరువు విషయంలో నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయి. నిబంధనలలో ఎవరికీ మినహాయింపు ఉండదు. బరువు పరిమితి దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత అథ్లెట్‌దే’ అని పేర్కొంది.
నటి భావన లైంగిక వేధింపుల కేసు..మలయాళ సినీ ఇండస్ట్రీపై సంచలన రిపోర్ట్..
మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళపై వేధింపుల గురించి ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటి రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కి నివేదిక అందించింది. 2017లో నటి భావనపై కారులో లైంగిక దాడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమెను కారులో తిప్పుతూ దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడిగా స్టార్ హీరో దిలీప్ ఉన్నాడు. ఈ ఘటన తర్వాత అప్పటి ప్రభుత్వం మలయాళ ఇండస్ట్రీలో మహిళల వేధింపులకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. తాజాగా ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో అకృత్యాలను వెలుగులోకి తీసుకువచ్చింది. కాస్టింగ్ కౌచ్‌తో పాటు లైంగిక దోపిడికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను కమిటీ రిపోర్టు వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు, దోపిడి, అసభ్యంగా ప్రవర్తించడం సహజంగా మారిందని నివేదిక వెల్లడించింది. పరిశ్రమను ‘‘క్రిమినల్ గ్యాంగ్స్’’ నియంత్రిస్తున్నాయని ఆరోపించింది. తమకు లొంగని మహిళల్ని వేధిస్తున్నారని, కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్లతో కూడిన ‘‘పవర్ నెక్సస్’’ ఉందని ప్యానెల్ ఆరోపించింది.
క్షేమంగా ఇంటికి చేరుకున్నా.. మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి: పి.సుశీల
ప్రముఖ సినీ గాయని, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం (ఆగస్టు 19) చెన్నైలోని కావేరి ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నా అని ఓ వీడియో ద్వారా సుశీల తెలిపారు. అభిమానుల ప్రార్థనలే తనను రక్షించాయని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తోన్నవదంతులను ఎవరూ నమ్మవద్దని అభిమానులను కోరారు. 86 ఏళ్ల సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇది సాధారణ కడుపు నొప్పేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. రెండు రోజులు చికిత్స తీసుకున్న సుశీల.. సోమవారం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తాను క్షేమంగా ఉన్నానంటూ అభిమానుల కోసం ఓ వీడియో విడుదల చేశారు.
