వారికి గుడ్‌న్యూస్.. ఇవాళే అందనున్న సొమ్ము
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది.. కొన్నిసార్లు అయితే, ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసి సందర్భాలు లేకపోలేదు.. గతంతో ఉన్న పెన్షన్ల సొమ్ము పెంచి మరి.. లబ్ధిదారులకు అందజేస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఇక, సెప్టెంబర్‌లోకి అడుగుపెట్టడంతో.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నారు.. ఇక, ప్రతి నెలా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రతీసారి ఏదో ఒక జిల్లాకు వెళ్లున్నారు.. లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందిస్తూ.. వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.. ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు… అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, బోయినపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.. వృద్ధులకు, వికలాంగులకు సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తారు.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రాజంపేటకు చేరుకుంటారు.. తాళ్లపాకలో ప్రజా వేదికలో పాల్గొంటారు సీఎం.. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశంకానున్నారు సీఎం చంద్రబాబు.. సాయంత్రం 6 గంటలకు తాళ్లపాక నుంచి తాడేపల్లికి బయల్దేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు..
గణేష్ నిమజ్జనంలో విషాదం.. చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
గణపయ్యకు పూజలు నిర్వహించిన భక్తులు.. మూడు రోజులు, ఐదు రోజులకు ఇలా నిమజ్జనం చేస్తున్నారు.. ఆట పాటలు, డబ్బు వాయిద్యాలతో గణపయ్యను సాగనంపుతున్నారు.. అయితే, గణపయ్య గంగమ్మ ఒడికి చేరే సందర్భంలో పాలు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. తాజాగా, చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ విషాద ఘటన జరిగింది.. గంగవరం మండలం చిన్నమనాయనిపల్లి గణేష్ నిమజ్జన సమయంలో చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.. కాకర్లకుంట చెరువులో ఈ ఘటన జరిగింది.. మృతులు అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల భార్గవ్, 26 సంవత్సరాల చరణ్ గా గుర్తించారు పోలీసులు.. అయితే, నిమజ్జనం ముగించుకుని గ్రామానికి చేరుకుంది మిత్ర బృందం.. కానీ, ఇద్దరు మిత్రులు కనపడకపోవడంతో చెరువు వద్దకు వెళ్లి వెతికే ప్రయత్నం చేశారు.. విగత జీవులైన ఇద్దరి మిత్రుల మృతదేహాలను బయటకు తీశారు గ్రామస్తులు.. దీంతో, ఆ గ్రామంలో విషాదం నెలకొంది.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు..
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు!
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి కేసు అప్పగించాలని నిర్ణయించింది. ఆదివారం అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి బదులిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ భాగస్వామ్యమై ఉన్నాయని.. అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సరైన నిర్ణయం అని సీఎం చెప్పారు. కాళేశ్వరం పేరుతో దోచుకున్నవాళ్లందరికి శిక్షపడాలిని ఆయన కోరారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. కేంద్రమే నిధులిచ్చే ప్రాజెక్టులను కేసీఆర్ కాలదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో లోపం ఉంటే చెప్పాలి. కానీ సుదీర్ఘ అనుభవం ఉన్న ఘోష్‌ని కించపరిచేలా మాట్లాడటం సరికాదు. పీసీ ఘోష్ అనేక ముఖ్యమైన హోదాల్లో పనిచేశారు. పీసీ ఘోష్ ఎన్నో కీలక తీర్పులు ఇచ్చారు. పీసీ ఘోష్‌ను తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. కాళేశ్వరం పనుల కోసం ఇప్పటి వరకు రూ.85,449 కోట్లు అప్పు తీసుకున్నారు. పీఎఫ్‌సీ నుంచి రూ.27,738 కోట్లు (11.5 శాతం వడ్డీ), ఆర్‌ఈసీ నుంచి రూ.30,536 కోట్లు (12 శాతం వడ్డీ) అప్పు తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.19,879 కోట్లు రుణం చెల్లించాం.. రూ.29,956 కోట్లు వడ్డీగా చెల్లించాం. మొత్తంగా రూ.49,835 కోట్లు చెల్లించినా.. ఇంకా రూ.60,869 కోట్ల అప్పు ఉంది. పనులు పూర్తి చేయడానికి ఇంకా రూ.47,000 కోట్లు కావాలి’ అని చెప్పారు.
రాళ్లతో కొట్టలేదు, నడి రోడ్డులో ఉరి వేయలేదు.. కేసీఆర్‌పై సీఎం ఫైర్!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతి ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దొర.. దోపిడి దొంగగా మారి ప్రజల సొమ్ము దోచుకున్నారని విమర్శించారు. ఆనాడు వేసిన శిక్షల మాదిరిగా రాళ్లతో కొట్టలేదని, నడి రోడ్డులో ఉరి వేయలేదని.. పద్ధతి ప్రకారం విచారణకు ఆదేశాలు ఇచ్చాం అని పేర్కొన్నారు. కేసీఆర్.. ఆయన మనువడు వరకు పరిపాలన చేయాలని ఆశ పడ్డారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు లక్ష కోట్ల అప్పు ఎలా వచ్చింది?, కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల అస్తులు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. కేసీఆర్ సహా మాజీ మంత్రి హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా? అని సీఎం అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఆదివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘ప్రాజెక్టు పేరుతో మాజీ సీఎం కేసీఆర్ చేసిన మోసం అంతా ఇంతా కాదు. ఏకంగా రూ.లక్ష కోట్లు జేబులో వేశారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే.. 75 శాతం నిధులు ఇచ్చే నిబంధన ఉంది. 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించింది. ఆ జాబితాలో ప్రాణహిత-చేవెళ్ల ఉంది. ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చారు. డా బీఆర్ అంబేడ్కర్‌పై కోపంతో కేసీఆర్ ప్రాజెక్టు పేరును మార్చి మేడిగడ్డ పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారు. కేసీఆర్, హరీశ్‌రావులు చేసిన అరాచకాలను ఈటల రాజేందర్ ఆపలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ సరిగా లేవు. ప్రాజెక్టు వైఫల్యం క్షమించరాని నేరమని ఎన్‌డీఎస్‌ఏ చెప్పింది. కమిషన్ ఇచ్చిన రిపోర్టులో లోపం ఉంటే చెప్పాలి. లోపాలుంటే ప్రస్తావించకుండా.. జస్టిస్ ఘోష్‌ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు’ అని అన్నారు.
సెప్టెంబర్‌లోనే అత్యధిక వర్షాలుంటాయి.. ఐఎండీ వార్నింగ్
దేశ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలు రాష్ట్రాలు ఇంకా తేరుకోను లేదు. ఇంతలోనే కేంద్ర వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. సెప్టెంబర్‌లో సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. సెప్టెంబర్‌లో ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించవచ్చని తెలిపింది. ఇక దక్షణ హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్‌లో సాధారణం కంటే తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వార్నింగ్ ఇచ్చింది. సగటున 167.9 మి.మీ వర్షపాతం నమోదు కావొచ్చని.. సాధారణ వర్షపాతం 109 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర హెచ్చరించారు.
హూస్టన్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. నదులు తలపిస్తున్న రహదారులు
అమెరికాలోని హూస్టన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ నీట మునిగిపోయి. పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీవ్ర తుఫాన్ కారణంగా ఆదివారం కుండపోత వర్షం కురిసింది. హూస్టన్, దాని పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. దీంతో కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వాగులు, ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్దారు. వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవడంతో రోడ్లపై వదిలిపెట్టి షెల్టర్లలోకి వెళ్లి రక్షణ పొందారు.
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఈ నెలలో సగం రోజులు సెలవులే
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. సెప్టెంబర్ లో సగం రోజులు అంటే 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ ను రిలీజ్ చేసేంది. సెప్టెంబర్ 2025లో, భారతదేశం అంతటా ప్రాంతీయ పండుగలు, రాష్ట్ర ఉత్సవాలు, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులు మూసిఉండనున్నాయి. ఆర్‌బిఐ ప్రకారం, నెలలో రెండవ నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు బ్యాంకులు మూసివేయబడతాయి. కానీ వినియోగదారులు డిజిటల్ లావాదేవీల ద్వారా ఆర్థిక సేవలను నిర్వహించుకోవచ్చు. సెలవు రోజుల్లో భౌతిక శాఖలు మూసి ఉన్నప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ మార్గాలు – UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, ATMలు – అంతరాయం లేకుండా పనిచేస్తూనే ఉంటాయి.
టాలీవుడ్ లో ప్లాప్స్ రావడంతో తమిళంపై కేరళ కుట్టీల దండయాత్ర…
కేరళ కుట్టీలు తెలుగులో క్లిక్ అవ్వాలంటే ఇక్కడే నటించనక్కర్లేదు. జస్ట్ కోలీవుడ్‌లో ట్రై చేస్తే చాలు డబ్బింగ్ చిత్రాలతో ఎలాగో ఇక్కడి ఆడియన్స్‌కు చేరువైపోవచ్చు. ఇదే ఫార్ములాను ప్రజెంట్ యంగ్ బ్యూటీలు గట్టిగా ఫాలో అయిపోతున్నారు. ప్రేమలు బ్యూటీ మమితా బైజుకు ఒక్క తెలుగు ఆఫర్ లేదు. కానీ తమిళంలో బిగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొట్టేసింది. జననాయగన్, సూర్య46, ధనుష్54, డ్యూడ్ అన్నీకూడా బైలింగ్వల్ మూవీస్సే. నటిస్తోందేమో కోలీవుడ్ క్రేజేమో టాలీవుడ్ అన్నట్లు ఉంది మేడమ్ పరిస్థితి. మాలీవుడ్ ఫాలో అయ్యే వారికి అనేశ్వర రాజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నేరు, రేఖా చిత్రం, గురువాయిర్ అంబల్ నడయిల్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్టైన ఈ బ్యూటీ.. ఇక్కడ నేరుగా సినిమాలు చేయకపోయినా తమిళంలో టూ ఫిల్మ్స్ కమిటయ్యింది. అందులో 7/జీ రెయిన్ బో కాలనీ సీక్వెల్ తెలుగులో బృందావన్ కాలనీ2గా రాబోతుంది. అలాగే రీసెంట్లీ టూరిస్ట్ ఫ్యామిలీతో హిట్ కొట్టిన దర్శకుడు అభిషన్ జీవంత్ సరసన ఓ ఫిల్మ్ కమిటైంది. రజనీ డాటర్ సౌందర్య వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. కన్ను గీటీ ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన ప్రియా ప్రకాష్ వారియర్‌కు తెలుగు అస్సలు కలిసిరావడం లేదని కోలీవుడ్ చిత్రాలతోనే పలకరిస్తోంది. ఈఏడాది టూ ఫిల్మ్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ, నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబంతో అటు తమిళ ప్రేక్షకులను ఇటు తెలుగు ఆడియన్స్‌ను అలరించింది. ఇక మాళవిక మనోజ్ ఓ భామ అయ్యోరామతో క్లిక్ కాకపోయే సరికి ప్రజెంట్ తమిళంలో బ్రో కోడ్‌తో రెండూ ఇండస్ట్రీలను కవర్ చేసేస్తోంది. ఒక్క తెలుగు సినిమాతో సరిపెట్టేసిన చైల్డ్ ఆర్టిస్టు నుండి హీరోయిన్‌గా మారిన అనిఖా సురేంద్రన్‌ది కూడా ఇదే దారి. మాలీవుడ్ టూ టాలీవుడ్ వయా కోలీవుడ్ ప్రయాణీస్తున్నారు ఈ కేరళ ముద్దుగుమ్మలు.
కోడల్ని కూతురిలా చూసుకున్న..వేరే కాపురం పెట్టిన నాగ శౌర్య తల్లి ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్ హీరో నాగ శౌర్య గురించి పరిచయం అక్కర్లేదు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని ఎల్లప్పుడూ అలరిస్తుంటాడు. 2023లో విడుదలైన రంగబలి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అతను, ఇప్పుడు ‘ఏకంగా పోలీస్ వారి హెచ్చరిక’, ‘బాయ్ బాయ్ కార్తీక్’, ‘నారీ నారీ నడుమ మురారీ’ వంటి మూడు కొత్త సినిమాలతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీస్ షూటింగ్ దశలో ఉన్నాయి. వృత్తిపరంగా బిజీగా ఉన్న నాగ శౌర్య వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగు పెట్టాడు. 2022 నవంబర్‌లో బెంగళూరులోని అనుషా శెట్టిని వివాహం చేసుకున్న నాగ శౌర్య, కొద్దికాలంలోనే తండ్రయ్యాడు. గత ఏడాది ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. నవంబర్‌లో చిన్నారి మొదటి పుట్టిన రోజు గ్రాండ్‌గా జరిపారు.అయితే, పెళ్లి తర్వాత తల్లి ఉషా ముల్పురి తెలిపినట్లుగా, నాగ శౌర్య, కోడలు వేరే ఇంట్లో కాపురం పెట్టారు. “ఇద్దరు మంచివాళ్లు ఒకే చోట ఉండకూడదు” అనే నమ్మకంతో ఇప్పుడు వేరే ఇంట్లో ఉంటారని ఉషా వివరించారు. అంతే కాదు “నాకు ఇద్దరు కొడుకులు. చిన్నప్పుడే వాళ్లిద్దరికి ఆస్తమా ఉండేది. స్కూల్ కి పంపించకుండా ఇంట్లోనే చదివించేదాని. రోజంతా వాళ్లతో గడిపే దాని వాలే నా ప్రపంచం. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుని వేరుగా ఉండిపోవడంతో ఇల్లు బోసి పోయినట్లు అనిపిస్తుంది’ అని తెలిపారు.
