NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు తిరుపతికి పవన్‌ కల్యాణ్‌.. నడకమార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు తిరుమలకు చేరుకోనున్నారు. ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న పవన్.. ఈరోజు రాత్రి తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి కాలి నడకన తిరుమలకు బయల్దేరుతారు. ఇక, పవన్ కల్యాణ్ పర్యటనకు నడకమార్గంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. 200 మీటర్ల పరిధి వరకు రోప్‌ పార్టీలతో భద్రతన ఏర్పాటు చేస్తున్నారు. పవన్‌తో పాటు నడిచే ప్రయత్నం చేయవద్దని పార్టీ నేతలకు ఇప్పటికే సూచించారు జనసేన నేతలు.. ఇక, తిరుమల పర్యటన నిమిత్తం.. సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న పవన్‌ కల్యాణ్‌.. అక్కడి నుంచి తిరుపతి చేరుకొని.. రాత్రికి కాలినడకన తిరుమల చేరుకోనున్నారు..

దూకుడు పెంచిన సిట్.. నేడు లడ్డూ పోటు ఉద్యోగుల విచారణ..
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న జరిగిందన్న ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిన సిట్.. వేగంగా దర్యాప్తు చేస్తోంది. నిన్న మూడోరోజు.. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పిండిమరతో పాటు ల్యాబ్‌లో సిట్ టీమ్ తనిఖీలు చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులను నిల్వ చేసే గోదాములను పరిశీలించింది. గోడౌన్‌లలో నిల్వఉంచిన ముడిసరుకుల నాణ్యతను సిట్ చెక్ చేసింది. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిసరుకును ఎలా భద్రపరుస్తారు.. వాటికి సంబంధించిన రికార్డులను ఎలా మెయిన్‌టేన్ చేస్తారు.. అనే అంశాలపై సిట్ ఆరా తీసింది. సుమారు 7 గంటల పాటు మార్కెటింగ్ గోడౌన్‌లో అధికారులు తనిఖీలు చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను తిరుమలలో పరీక్షించేందుకు మెషీన్లు ఉన్నాయా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారని టెక్నికల్ టీంను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇవాళ ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు.. ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు.. లడ్డూ తయారీ ఎలా ఉంటుంది.. తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై సిట్ దృష్టిపెట్టనుంది. లడ్డూ పోటులో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి.. లడ్డూ తయారీ నుంచి.. విక్రయాల విక్రయాల వరకు ఉండే ప్రాసెస్‌ను ఇవాళ పరిశీస్తారు.

నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..
ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.. ఇక వైఎస్‌ జగన్‌ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.. ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి.. ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి.. ఇక, కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో.. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. 11న 3,396 షాపులకు లాటరీ తీస్తారు.. దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలుగా నిర్ణయించింది ఎక్సైజ్‌ శాఖ.. లైసెన్స్‌ ఫీజులు 50 నుంచి 85 లక్షలుకొత్త పాలసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.. అందుకు అనుగుణంగా మంగళవారం ఉదయం జిల్లాల్లో ఎక్సైజ్‌ అధికారులు షాపులను నోటిఫై చేస్తూ గెజిట్‌లు జారీ చేస్తారు.. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.. దరఖాస్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ చేసుకునే వెసులుబాటు ఉంది.. ఈ విడతలో 3,396 షాపులను ప్రైవేటుకు కేటాయించింది ప్రభుత్వం.. ఈ పాలసీ అనంతరం గీత కులాలకు రిజర్వ్‌ చేసిన మరో 340 షాపులకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.. అలాగే ప్రీమియం బ్రాండ్లు విక్రయించేందుకు ఏర్పాటు చేయదలచిన 12 ఎలైట్‌ షాపులకు కూడా విడిగా నోటిఫికేషన్‌ వస్తుంది..

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
తెలంగాణలో డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సచివాలయంలో ఫలితాలను ప్రకటించిన ఆయన, దసరా పండుగకు ముందు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని వెల్లడించారు. సీఎం ప్రకటించిన ప్రకారం, టీచర్ల ఎంపిక ప్రక్రియలో విద్యాశాఖ యాక్టివ్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 1(నేటి) నుంచి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్న ఈ వెరిఫికేషన్ స్థానిక జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నిర్వహించబడుతుంది. పూర్తి సమాచారం కోసం విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా సూచించారు. డీఎస్సీ జనరల్‌ ర్యాంకింగ్ లిస్ట్‌ ప్రకారం.. ఆయా జిల్లాల్లో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి నేటి నుంచి ఈ నెల 5 వరకు సర్టెఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. జిల్లాలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని వెల్లడించారు. ఈ జాబితాలు డీఈవో వెబ్‌సైట్లలో ఉంటాయని పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, టెట్, డీఎస్సీ, కుల, 1-7 తరగతుల స్టడీ సర్టిఫికెట్‌ (ఒరిజినల్‌)లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ పత్రాలను వెంట తీసుకురావాలని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్లో ఉంచిన ఫారాన్ని నింపి తెచ్చుకోవాలని తెలిపారు.

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది దుర్మరణం
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రోడ్లు రక్తమోడాయి. ఈ ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టి కొద్ది దూరం వెళ్లి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ఎనిమిది మందితో ఆదిలాబాద్ వస్తున్న మ్యాక్స్ పికప్ లాంటి ఇసుజీ వాహనం ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ మొయిజ్ (60) , ఎనిమిదేళ్ల బాబు అలీ, ఖాజా మొయినుద్దీన్ (40), మహమ్మద్ ఉస్మానుద్దీన్ (11) అక్కడికక్కడే మృతి చెందగా.. ఫరీద్(12) అనే బాలుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆయేషా ఆఫ్రిన్( 38) ఎఖ్రా (4), సాద్(11) తీవ్రంగా గాయపడగా.. వారు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రులంతా ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబంధికులే.. గాయపడ్డ వారికి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా.. మృతదేహాలను మార్చురీకి తరలించారు. గాయపడ్డ వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఎప్పుడూ కొడుతున్నాడు.. నాకు నాన్న వద్దు..!
“మా నాన్న ఎప్పుడూ కొడుతున్నాడు..నాకు నాన్న వద్ద.. నేను హాస్టల్‌లోనే ఉంటా..” అంటూ ఓ పన్నెండేళ్ల బాలిక సోమవారం జగిత్యాల పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో వెక్కి వెక్కి ఏడుస్తూ ఓ పన్నెండేళ్ల బాలిక తన గోడును వెళ్లబోసుకుంది. అసలేం జరిగిందంటే.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లెకు చెందిన బాలిక తల్లి గతంలో చనిపోయింది. దీంతో ఆ బాలిక తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. అనారోగ్యంతో తల్లి మృతి తో తట్టుకోలేని దీనస్థితిలో బాలిక ఉండగా.. తల్లి లోటును చిన్నమ్మ తీర్చలేదు.. తండ్రి ఆదరించలేదు. ఏడో తరగతి చదువుతున్న బాలికకు గతంలో బాలసదనం, ఆనంద నిలయంలో ఆశ్రయం కల్పించినా ఉండలేదు. అనంతరం కేజీబీవీలో ఆశ్రయం కల్పించగా, తల్లిని తలచుకుంటూ అక్కడ ఇమడ లేక ఇంటికి చేరింది. అయితే తండ్రి కొడుతుండడంతో 5 రోజుల కింద ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంటి నుంచి వెళ్లిన బాలికను వేములవాడలో గుర్తించి సిరిసిల్ల సఖీ కేంద్రంలో చేర్చి డీసీపీవో ఆఫీసర్లు తండ్రికి అప్పగించారు. అయితే సఖీ కేంద్రం నుంచి రాగానే తండ్రి మళ్లీ కొట్టడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆపారు. ఈక్రమంలోనే తండ్రి కొడుతున్నాడని ఇంట్లో ఉండలేనంటూ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలిక.. పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది తల్లి ప్రేమకు నోచుకోని బాలిక ఆవేదన విని పోలీసులు చలించిపోయారు. పట్టణ సీఐ వేణు సమాచారంతో సదరు బాలికను జగిత్యాల డీసీపీవో సిబ్బంది సఖీ కేంద్రానికి తరలించారు.

పండుగలకు ముందు సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
గ్యాస్ కంపెనీలు సామాన్యుడికి పండుగల ముందు షాకిచ్చాయి. అక్టోబరు నెలలో పండుగలు వరుసగా వస్తుంటాయి. ఈ సందర్భంలో గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు భారీగా పెంచాయి. పెరిగిన గ్యాస్ ధరలు ఈ నెల ఒకటో తేదీ(నేటి నుంచి) అమల్లోకి రానున్నాయి. 19 కిలోల గ్యాస్ సిలిండర్‌లకు రూ. 48.50వరకు పెరిగింది. కొత్త ధరలు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం.
* దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1740కి చేరగా, రూ.48.50 పెరిగింది. గత నెల సెప్టెంబర్‌లో దీని ధర రూ.1691.50.
* కోల్‌కతాలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1850.50కి చేరగా, రూ.48 పెరిగింది. గత నెల సెప్టెంబర్‌లో దీని ధరలు రూ. 1802.50గా ఉన్నాయి.
* ముంబైలో ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు 1692 రూపాయలుగా ఉం. దానిని 48 రూపాయలు పెంచారు. గత నెల సెప్టెంబర్‌లో దీని ధరలు రూ.1644గా ఉన్నాయి.
* చెన్నైలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు 1903 రూపాయలుగా ఉంది. దానిని 48 రూపాయలు పెంచారు. గత నెల సెప్టెంబర్‌లో దీని ధరలు రూ.1855గా ఉన్నాయి.

అక్టోబర్ అంతా ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే.. ఎందుకో తెలుసా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న జన్మించిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి. మరి ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆయన ఏ సినిమా రీ రిలీజ్ కాబోతోంది..? మరి ఏ తేదీన మళ్లీ విడుదల చేస్తారనే వివరాలు తెలుసుకుందాం. కొన్నాళ్ల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రం సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో అసిన్, ఛార్మి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న రీ-రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. రెబల్ స్టార్ ప్రభాస్ కొన్నాళ్ల క్రితం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరోగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్, తాప్సీ కథానాయికలుగా నటించగా, దశరథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్టోబరు 22న సినిమాను మళ్లీ విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్లింగ్ చిత్రాన్ని అక్టోబర్ 23న రీ-రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సడన్ గా హాస్పిటల్లో చేరిన రజినీకాంత్.. భయాందోళనలో అభిమానులు
అభిమానుల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చారు. రజినీకాంత్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారని… దాంతో పాటు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ముందుగానే ప్లాన్ చేసుకున్న ఈ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరారు. గుండెకు సంబంధించిన పరీక్షలను మంగళవారం చేయాల్సి రావడంతో రజినీకాంత్ ఆసుపత్రిలో చేరారని తెలిపారు. అయితే అటు వైద్యుల నుంచి గానీ, ఇటు కుటుంబ సభ్యుల నుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు. మంగళవారం రజినీ కాంత్ కు ఎలక్టివ్ విధానాన్ని షెడ్యూల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రజినీ వయసు 73 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని రజినీకాంత్ సన్నిహితులు చెప్పారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రస్తుతం రజినీకాంత్ వెట్టయాన్‌, కూలి సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్నిరోజులుగా వేట్టయాన్, కూలీ చిత్రాల షూటింగ్స్‏లో పాల్గొంటున్నాడు రజినీ. వెట్టయాన్‌ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న వేట్టయాన్ చిత్రం అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్నాడు.

Show comments