Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు కడప జిల్లాకు సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు.. పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఉదయం 11.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. అక్కడ నుండి హెలికాప్టర్ లో జమ్మలమడుగు చేరుకుంటారు.. మధ్యాహ్నం 12.25 గంటలకు గూడెం చెరువు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 12.50 నుండి 2 గంటల వరకు గూడెం చెరువులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని మాట్లాడతారు.. అనంతరం జమ్మలమడుగులో పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు టీడీపీ అధినేత.. ఇక, సాయంత్రం 4 గంటలకు గండికోటకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. గండికోట వ్యూ పాయింట్ సందర్శన.. గండికోట వ్యూ పాయింట్ వద్ద 78 కోట్లతో సాస్కీ పథకం కింద గండికోట ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు.. అనంతరం అక్కడ వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములైన ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు.. సాయంత్రం 6 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. ఇవాళ్టి నుంచి అమలు..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్‌ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తోంది టీటీడీ.. ఈ ప్రయోగం ఇవాళ్టి నుంచి అమలుకానుంది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనుంది. ఆన్‌లైన్‌లో అక్టోబర్ నెల టిక్కెట్లు పొందిన భక్తులకు యథావిథిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతించనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు పొందిన భక్తులను నవంబర్ నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలో తిరుమలలో 800 టిక్కెట్లు, రేణిగుంట ఎయిర్‌పోర్టులో 200 టిక్కెట్లు జారీ చేయనుంది టీటీడీ.

విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్‌ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. సిట్‌ అధికారులు ఓ వైపు దర్యాప్తులో దూకుడు చూపిస్తున్నారు.. మరోవైపు, ఈ రోజు ఎంపీ మిథున్‌ రెడ్డిని కోర్టులో హాజరుపర్చనున్నారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టుకు బయల్దేరాడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్‌ రెడ్డిని రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకెళ్తున్నారు పోలీసులు .. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గత నెల 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్ లో ఉన్నారు మిథున్ రెడ్డి.. అయితే, ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు సిట్‌ అధికారులు.. ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ పోలీసులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకువెళ్లుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయలుదేరిన సమయంలో జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెండ్..
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అక్రమాల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్ సీఏలో భారీ కుదుపు చోటుచేసుకుంది. హెచ్ఎసీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేసినట్లు తెలిపింది. కార్యదర్శి దేవరాజ్, ఖజాంచి శ్రీనివాస్ రావు పదవి నుంచి తొలగించినట్లు పేర్కొంది. 28 జూలై 2025న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

నేటి నుంచి భారత్‌పై 25 శాతం సుంకాలు.. ఏ ఏ రంగాలను ప్రభావితం చేయనుందంటే..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఈరోజు ( ఆగస్టు 1వ) తేదీ నుంచి అమలులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ తన లిబరేషన్ డే వాణిజ్య వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ వ్యూహం అమెరికా వాణిజ్య భాగస్వామ్యాలను పరస్పర ప్రయోజనాల దిశగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని తెలియజేశారు. భారత్ మన స్నేహ దేశం అయినప్పటికీ, వారు విధించే సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యధిక టారీఫ్స్ విధించే దేశాల్లో భారతదేశం ఒకటని పేర్కొన్నారు. అంతేకాక ఇండియా- రష్యా నుంచి సైనిక సామగ్రి, ఇంధనాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారని ట్రంప్ అన్నారు.

ట్రంప్ టారిఫ్‌ ఎఫెక్ట్.. ఆ ఒక్క రంగంలోనే లక్ష ఉద్యోగాలకు ఎసరు..!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశంలోకి వచ్చే భారతదేశ ఉత్పత్తులపై విధించిన అదనపు 25 శాతం టారీఫ్స్ నేటి (ఆగస్టు 1న) నుంచే అమల్లోకి వచ్చింది. దీని ప్రభావంతో ఒక్క రత్నాభరణాల రంగంలోనే దాదాపు లక్ష మంది ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడబోతుందన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. చేతితో తయారు చేసే ఆభరణాల ధరలు మరింత పెరిగి, అక్కడ అమ్ముడుపోక పోవచ్చని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి (AIGJDC) ఛైర్మన్‌ రాజేశ్‌ రోక్డే పేర్కొన్నారు. గతంలో అమెరికా 10 శాతం సుంకం విధించినపుడు సుమారు 50 వేల మంది ఉపాధి కోల్పోగా.. కొత్త టారిఫ్‌ అమలుతో లక్ష మందికి పైగా జీవితం రోడ్డునపడొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరమ’ని రోక్డే చెప్పుకొచ్చారు. ఐరోపా సమాఖ్య, పశ్చిమాసియా లాంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు ఈ రంగం చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

తడబడిన భారత్.. ఆదుకున్న కరుణ్‌ నాయర్..
లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానం వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు త‌డ‌బ‌డింది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి కీలకమైన 6 వికెట్ల న‌ష్టానికి 204 ప‌రుగులు చేసింది టీమిండియా. అయితే, వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో ప‌డిన జ‌ట్టును మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ అర్థ శతకం చేసిన ఆదుకున్నాడు. కరుణ్ 98 బంతుల్లో 52 రన్స్ తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఇక, అత‌డితో పాటు వాషింగ్టన్ సుందర్ (19) ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. కాగా, టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ య‌శ‌స్వి జైశ్వాల్‌(2), కేఎల్ రాహుల్‌ (14), రవీంద్ర జ‌డేజా(9), కెప్టెన్ గిల్‌ (21) తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చ‌గా.. సాయి సుదర్శన్ (38) ప‌ర్వాలేద‌నిపించాడు. అయితే, ఇంగ్లండ్ బౌల‌ర్లలో జోష్ టంగ్‌, అట్కిన్సన్ త‌లా రెండు వికెట్లు తీసుకొగా.. క్రిస్ వోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. విడాకులపై మౌనం వీడిన చాహల్
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ధనశ్రీ వర్మ నుంచి విడాకులపై చాహల్ మౌనం వీడాడు. రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో జరిగిన ఇంటర్య్వూలో, ధనశ్రీ గురించి చాలా పుకార్లు వచ్చినప్పటికీ తాను ఎప్పుడూ ఆమెను మోసం చేయలేదని చాహల్ స్పష్టం చేశాడు. విడాకులు ఖరారు అయ్యే వరకు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచామని తెలిపాడు. ఆ సమయంలో తనకు ఆత్మహత్య ఆలోచనలు మొదలయ్యాయని యుజ్వేంద్ర చాహల్ చెప్పాడు.

నా కూతురికి మెంటల్ డిసార్డర్ ఉంది… గచ్చిబౌలి పోలీసులకు తండ్రి ఫిర్యాదు
వరుస వివాదాలలో ఉన్న సినీ నటి కల్పిక పై తండ్రి సంఘవార్ గణేష్ గాచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేశాడు. తన కూతురు కల్పిక డిప్రెషన్ లో ఉంది.. బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిసార్డర్ తో బాధపడుతూ ఉంది.. గతంలో 2023లో ఆశ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం మెడికేషన్ తీసుకుంది..రెండేళ్ళు గా మెడికేషన్ ఆపివేసింది. దీంతో తరచూ గొడవలు సృష్టిస్తుంది… న్యూసెన్స్ చేస్తుంది. కల్పిక వల్ల ఆమెకు.. కుటుంబ సభ్యులకు.. సాధారణ ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. తాజాగా రిహాబిలిటేషన్ సెంటర్ కి కూడా తరలించాము. అక్కడి నుంచి డిశ్చార్జ్ అయింది..కల్పిక తరచూ న్యూస్ డిస్టబెన్స్.. క్రియేట్ చేస్తుంది. ఆమెను రియాబిటేషన్ సెంటర్ కు తరలించే విధంగా చర్యలు తీసుకోండని గచ్చిబౌలి పోలీసులకు కల్పిక తండ్రి సంఘవార్ గణేష్ ఫిర్యాదు చేశారు.. తండ్రి ఫిర్యాదు ఆధారంగా కల్పికపై సెక్షన్ 23 మెంటల్ హెల్త్ ఆక్ట్ ప్రకారం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version