NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు శ్రీశైలం, సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నారు.. ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయల్దేరనున్నారు సీఎం చంద్రబాబు. నేడు శ్రీశైలం రానున్నారు.. సీఎం చంద్రబాబు. ఉదయం 10:30కి సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10:50కి శ్రీమల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి.. కృష్ణానదికి జలహారతి సమర్పిస్తారు. తర్వాత నీటిపారుదలశాఖ అధికారులతో భేటీ అవుతారు.. ముఖ్యమంత్రి. ఇక శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శిచి.. నీటి వినియోగదారుల అసోసియేషన్‌తో భేటీ అవుతారు. తిరిగి 12:30కి హెలికాప్టర్‌లో అనంతపురం వెళ్తారు సీఎం చంద్రబాబు. ఇక, శ్రీ సత్యసాయి జిల్లా గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని చేపట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాలలో లబ్దిదారులకు పింఛన్‌ అందిస్తారు.. సీఎం. అనంతరం మల్బరి ప్లాంటేషన్ షెడ్‌ను సందర్శించి .. పట్టు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. తర్వాత గుండుమలలో కరియమ్మ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. కరియమ్మ గుడి వద్దనే గ్రామస్తులతో చంద్రబాబు ఇంటరాక్షన్ ఉండనుంది.. మధ్యాహ్నం 3:25 నుంచి 4:25 వరకు స్థానికులతో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానం ద్వారా అమరావతికి తిరిగి బయల్దేరనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి.. ఆశగా ఎదురు చూస్తున్న 3 పార్టీల నేతలు..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. మంత్రి పదవుల పంపకం పూర్తి అయ్యింది.. ఆ తర్వాత ఎమ్మెల్సీలను కూడా షేర్‌ చేసుకున్నారు.. ఇప్పుడు ఏపీ అధికార కూటమిలో నామినేటెడ్ పోస్టుల సందడి నడుస్తోంది. ఈ రెండు నెలల్లోగా విడతల వారీగా పోస్టుల జాతర ముగించేయాలనేది హైకమాండ్‌ ప్లాన్‌. మరోవైపు భర్తీలో ఈక్వేషన్లు ఎలా ఉంటాయనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. పరిపాలన పరంగా సెక్రటేరియేట్ ఎంత బిజీగా ఉంటుందో.. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూటమి పార్టీల నేతలూ అంతే బిజీగా ఉంటున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నానినేటెడ్ పోస్టుల భర్తీని విడతల వారీగా చేపట్టాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, పురందేశ్వరి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు పార్టీల్లోనూ పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తల సమాచార సేకరణ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు సహా టిక్కెట్లు దక్కించుకోలేని చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తమకు ఎన్నికల్లో తక్కువ సీట్లే ఇచ్చినా సర్దుకుపోయామని.. నామినేటెడ్ పోస్టుల్లో కచ్చితంగా ప్రయార్టీ లభిస్తుందనేది జనసేనలో జరుగుతున్న చర్చ. ఇటు తమకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ కూడా భావిస్తోంది. ఇలా చూసుకుంటూ పోతే ఆశావహులు భారీగానే ఉన్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కూటమి పార్టీల మధ్య బంధం మరింత బలపడేలా ఉండాలనే కానీ.. బలహీనపడడానికి బీజాలు పడేలా ఉండకూడదనే భావన మూడు పార్టీల్లో ఉంది. ఓవరాల్‌గా చూస్తే నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం పార్టీల మధ్య ఓ ఈక్వేషన్ తేవాలనే ఆలోచన చేస్తున్నట్టు సమచారం. దానికి అనుగుణంగా పదవుల భర్తీ జరిగితే ఇబ్బంది ఉండదని భావిస్తోంది కూటమి. దీనికోసం ఎలాంటి కసరత్తు చేస్తారో చూడాలి.

శ్రీవాణి ట్రస్ట్‌పై టీటీడీ నిర్ణయం అదేనా..?
శ్రీవాణి ట్రస్ట్ అంటే.. తెలియని వారుండరు. అలాంటిది.. టీటీడీకి మంచి ఆదాయ వనరుగా మారింది. ఇక శ్రీవారి భక్తులుకు కూడా ఉపయోగకరంగా వుండడంతో భక్తులు నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా 10 వేలు రూపాయులు ట్రస్ట్ కి చెల్లిస్తే చాలు. ప్రోటోకాల్ దర్శనాన్ని భక్తులుకు కల్పిస్తుంది. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కి నెలకు దాదాపు 30 కోట్లు పైగానే ఆదాయం లభిస్తుంది. అది కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పరిమిత సంఖ్యలోనే టిక్కేట్లు కేటాయిస్తుండడంతో విరాళం కూడా పరిమితమవుతుంది. గతంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రోజుకి వెయ్యి టిక్కెట్లు మాత్రమే కేటాయిస్తూండగా. ఈ మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ కారణంగా టీటీడీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది. ఇక ట్రస్ట్ ద్వారా కేటాయించే టిక్కేట్ల పై నియంత్రణ ఎత్తివేసింది. దీంతో రోజుకి 2800 వరకు టిక్కెట్లను భక్తులు కొంటున్నారు. అయితే.. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కేటాయించే టిక్కెట్ల సంఖ్య పెరిగితే సామాన్య భక్తులుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని గమనించిన టీటీడీ టికెట్ల సంఖ్యను రోజుకు 1500కు పరిమితం చేసింది. ఆన్ లైన్ విధానంలో 500 టిక్కెట్టు.. ఆఫ్ లైన్ విధానంలో 900 టిక్కెట్లు, తిరుపతి ఎయిర్‌పోర్టులో మరో 100 టిక్కెట్లు మాత్రమే కేటాయిస్తుంది. దీంతో బోర్డుకు నెలకు 40 నుంచి 45 కోట్ల ఆదాయం వస్తుంది. ఏడాదికి 509 కోట్ల వరకు విరాళాలు అందనున్నాయి. టిటిడి నిర్వహిస్టున్న అన్ని పథకాలుకు అందే విరాళాలు 250 కోట్లకు పరిమితం అవుతుంటే..! శ్రీవాణి ట్రస్ట్‌కి అందే విరాళాలు మాత్రం అంతకు రెట్టింపుగా అందుతుంది. ఇక, దీనిపై ఎన్నికలకు ముందు పలు విమర్శలు వచ్చాయి. ఒక దశలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు ప్రక్కదారి పడుతున్నాయని ప్రధాన పార్టీ అధ్యక్షులే ఆరోపణలు చెయ్యడంతో.. ఎన్నికల తరువాత శ్రీవాణి ట్రస్ట్ కోనసాగుతుందా? అన్న అనుమానాలు తల్లేత్తాయి. ప్రభుత్వం మారడం.. టీటీడీకి కొత్త ఉన్నతాధికారులు వచ్చారు. ఈ టైమ్‌లో అందరి దృష్టి శ్రీవాణి ట్రస్ట్‌పైనే పడింది. ఇక ట్రస్ట్ కోనసాగింపుకే మొగ్గు చూపుతున్న సంకేతాలు అందుతున్నాయి. టీటీడీ ఇఓగా శ్యామలరావు, అడిషనల్ ఇఓగా వెంకయ్య చౌదరి భాధ్యతలు చెపట్టిన తరువాత శ్రీవాణి ట్రస్ట్ నిర్వహణ పై పరిశీలన చేశారు. భక్తులకు సౌకర్యాలను మరింతగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. టికెట్ల సంఖ్యను కూడా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుంది. విరాళాలు అందించే వారికి సౌకర్యవంతంగా వుండేలా ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన జరుగుతోంది. ఇలాం ఆదాయ వనరుగా ఉన్న శ్రీవాణి ట్రస్ట్ కోనసాగింపుకే టీటీడీ మొగ్గు చూపుతుంది.

నేడు రంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేటలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. అధికారులు, నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రైతులకు ప్లాట్లు కేటాయించే లేఅవుట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ శశాంక బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆయన వెంట టీజీఐఐసీ ఈడీ పవన్, ఆర్డీఓ సూరజ్‌కుమార్, డీఈవో సుశీంధర్ రావు, తహసీల్దార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అటానమస్‌ హోదా కల్పిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి గతంలో చెప్పిన విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాలతో పోటీపడే విధంగా కాకుండా ప్రపంచంతో పోటీపడే విధంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం వివరించారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు, జేఎన్టీయూ వీసీ బుర్రా వెంకటేశం, ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

బీర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడ్డ మందుబాబులు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారం స్టేజీ సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉంది. ఈ క్రమంలో మరో లారీ వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ రెండు లారీల్లో ఒకటి ఉల్లిపాయలు… మరొకటి బీర్లు లోడు. ఈ ప్రమాదం కారణంగా రెండు ట్రక్కుల సరుకు రోడ్డుపై పడిపోయింది. బీరు బాటిళ్లు, ఉల్లిపాయలు రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో వాటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఇక మందు బాబులు బీరు సీసాలు తెచ్చుకునేందుకు రోడ్డంతా నిండిపోయారు. ఈ క్రమంలో ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మృతదేహాన్ని వెలికితీశారు. ట్రాఫిక్‌ జామ్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. మొత్తానికి వివిధ రకాల సరుకులు తీసుకెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురై చాలా మంది గాయాలపాలవుతున్నారు. ఒక్కోసారి పెట్రోల్, డీజిల్ కోసం తీసుకుని వెళ్లేందుకు వెళ్లిన స్థానికులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. గతంలో ఓ ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో స్థానికులు అందులో ఉన్న పెట్రోల్‌ను తీసుకెళ్లేందుకు ఎగిరిపడ్డారు. ఈ క్రమంలో అక్కడ మంటలు చెలరేగి..దాదాపు 150 మంది చనిపోయారు. అదేవిధంగా మరో ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది సహాయం చేయడం మానేసి సరుకుల కోసం ఎగడబడటం మరికొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదిఏమైనా బీర్లు మాత్రం రోడ్డు పై పడటంతో మందుబాబులు ఎగబడ్డారు.

ఢిల్లీలో భారీ వర్షం.. గంట వ్యవధిలో 11 సెంమీ వాన! స్కూళ్లకు సెలవు
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు వీడటం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్‌ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ అబ్జర్వేటరీలో అయితే ఒక గంట వ్యవధిలో 11 సెంమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చుక్కుకుపోయారు. డిల్లీలోని చాలా చోట్ల రోడ్లపైకి మోకాల్లోతు నీళ్లు వచ్చాయి. ఐటీవో, ఆర్కేపురం, జన్‌‌‌‌పథ్, పార్లమెంట్ స్ట్రీట్, కరోల్ బాగ్, నౌరోజీ నగర్, పంత్ మార్గ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాలు చెరువులను తలపించాయి. రాజేంద్రనగర్‌ ప్రాంతం మరోసారి వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లపైకి మోకాలి లోతు నీళ్లు రావడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఎక్స్‌ వేదికగా నగర ప్రజలకు సూచనలు జారీ చేశారు. రావూస్‌ అకాడమీలో ముగ్గురు విద్యార్థుల మృతికి నిరసనగా ఓల్డ్‌ రాజేందర్‌నగర్‌లో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన సివిల్స్‌ అభ్యర్థులు భారీ వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు. నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

దేశంలో నిలిచిపోయిన యూపీఐ సేవలు.. కారణం ఏంటంటే?
గత రెండు రోజులుగా దేశంలోని కొన్ని బ్యాంకులకు చెందిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలు సరిగా పనిచేయడం లేదు. చెల్లింపుల సంగతి అటుంచితే.. కనీసం బ్యాంకు బ్యాలెన్స్ కూడా చూపించలేదు. యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడడంతో యూజర్లు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. యూపీఐ సేవలు పనిచేయకపోవడానికి అసలు కారణం ఏంటంటే.. టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది. భారతదేశంలోని పలు బ్యాంకులకు టెక్నికల్ సపోర్టును ‘సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌’ అందిస్తోంది. ఈ టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌పై ‘ర్యాన్సమ్‌వేర్‌’ దాడి జరిగింది. దీంతో భారత్‌లోని దాదాపు 300 బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వార్తా ఏజెన్సీ సంస్థ రాయిటర్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి అటు సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ గానీ, ఇటు ఆర్‌బీఐ గానీ స్పందించలేదు. ర్యాన్సమ్‌వేర్‌ దాడి ఘటన తమ దృష్టికి వచ్చినట్లు చెల్లింపు వ్యవస్థలను పర్యవేక్షించే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్సీపీఐ) పేర్కొంది. కోపరేటివ్‌, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలు అందించే సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడితో కొన్ని చెల్లింపు వ్యవస్థలపై ప్రభావం పడినట్లు పబ్లిక్‌ అడ్వైజరీ విడుదల చేసింది. మిగతా చెల్లింపుల వ్యవస్థలపై దీని ప్రభావం పడకుండా ఉండేందుకు రిటైల్‌ పేమెంట్స్‌ సిస్టమ్‌తో సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ను తాత్కాలికంగా వేరుచేసినట్లు పేర్కొంది. ఈ సంస్థ సేవలు అందిస్తున్న సదరు బ్యాంకుల ఖాతాదారులు ఈ ఐసోలేషన్‌ సమయంలో సేవలు పొందలేరని చెప్పింది. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అవసరమైన సెక్యూరిటీ రివ్యూ జరుపుతున్నట్లు తెలిపింది. బ్యాంకులు సాధ్యమైనంత త్వరగా పనిచేస్తాయని చెప్పుకొచ్చింది.

పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు..ఎంతంటే.?
నేటి నుంచి ఆగస్టు నెల ప్రారంభమైంది. ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరల్లో మార్పు చోటుచేసుకుంది. బడ్జెట్ తర్వాత.. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్ పీజీ సిలిండర్ ధరలను పెంచాయి. ఈసారి కూడా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో పెరుగదల కనిపించింది. 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం యథాతథంగా ఉంది. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర గురువారం నుంచి రూ.8.50 పెరిగింది. ఐవోసీఎల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 6 గంటల నుంచే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. తాజా మార్పు తర్వాత ఇప్పుడు రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1646 నుంచి రూ.1652.50కి పెరిగింది. ఇక్కడ సిలిండర్‌పై రూ.6.50 చొప్పున పెంచారు. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.8.50 పెరిగింది. ఇప్పటివరకు రూ. 1756 గా ఉన్న 19 కిలోల సిలిండర్ ఇప్పుడు రూ. 1764.5లకు చేరింది. ముంబైలో ఈ ధర రూ.7 పెరిగింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుత ధర రూ. 1896 గా ఉంది.

ఆగస్టులో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏకంగా 13 రోజులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెల బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. సాధారణంగా, రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు. ఇది కాకుండా.. జాతీయ, రాష్ట్ర స్థాయి పండుగలలో కూడా బ్యాంకులకు హాలిడేస్ ఉంటాయి. స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పండుగలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే రాష్ట్ర స్థాయి పండుగలలో ఆ రాష్ట్రంలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆగస్టు నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులకు హాలిడేస్ ప్రకటించింది ఆర్ బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఆగస్టు నెలలో మొత్తం 13 రోజులు (బ్యాంక్ సెలవులు 2024) బ్యాంకులకు సెలవులు కేటాయించింది. ఈ 13 రోజులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సేవలు నిలిపివేయడతాయి. ఈ నెలలో సెలవులు అధికంగా ఉన్నందున మీరు మీ బ్యాంక్ సంబంధిత పనులను సకాలంలో పూర్తి చేసుకోవడం మంచిది. ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో చూడండి.

నేటి భారత షెడ్యూల్ ఇదే.. మూడో పతకం ఖాయమేనా!
పారా ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. ఇప్పటికే షూటింగ్ విభాగంలో రెండు 2 పతకాలు రాగా.. బుధవారం మనోళ్లు సత్తాచాటారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్ ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించారు. టేబుల్ టెన్నిస్‌లో తెలంగాణ అమ్మాయి శ్రీజ ఆకుల ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. బాక్సింగ్‌లో లోవ్లినా బర్గోహైన్ క్వార్టర్ ఫైనల్ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. షూటింగ్‌లో స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు అర్హత సాధించగా.. ఆర్చర్ దీపికా కుమారి ప్రీక్వార్డర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నేడు (ఆగష్టు 1) భారత్ అథ్లెట్లకు కీలకమైన ఈవెంట్స్ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 1.00 గంటలకు షూటింగ్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే ఫైనల్‌లో తలపడనున్నాడు. అతను దేశానికి మూడో పతకం సాధించే అవకాశం ఉంది. బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 50 కేజీల విభాగంలో చైనా బాక్సర్ వు యుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నిఖత్ విజయం సాధిస్తే మెడల్ సాధించేందుకు మార్గం సుగుమమవుతోంది. ఆరోరోజు భారత్ పూర్తి షెడ్యూల్ తెలుసుకుందాం.

సెకండ్ సింగిల్ రిలీజ్ వేళ నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్..
నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తన్న సినిమా ‘దేవర’. jr,ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రానుంది దేవర. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ దేవర చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మరొక బాలివుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా తెలుగు తెరపై కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న దేవర సినిమా థియేట్రికల్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ భారీ ధరకు కొనుగులు చేసాడు. ఇటీవల దేవర ఫస్ట్ సింగిల్ అంటూ వచ్చిన ఫియర్ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. కాగా దేవర నుండి సెకండ్ సింగిల్ మరో ఒకటి, రెండు రోజుల్లో రానుంది.ఈ నేపథ్యంలో నాగవంశీ తన ‘X’ ఖాతాలో చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ ట్వీట్ లో ఏముందంటే తారక్ అన్నని లవర్ బాయ్ గా చూసి 6 సంవత్సరాలు అయింది కదా. మళ్లీ క్యూట్ గా నవ్వుతూ రొమాన్స్ చేయడం చూస్తారు ఈ సారి. మనకి అనగా ఫ్యాన్స్ అదే సరిపోతుంది కదా అని స్మైలింగ్ ఎమోజిని చూపిస్తూ అరవింద సమేతలోని పాటకు సంబంధించిన ఫోటోలను జత చేశారు. దేవర సెకండ్ సింగిల్ లవ్ రొమాంటిక్ రానుందని, ఈ అప్ డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. రెండు భాగాలుగా రానున్న దేవర పార్ట్ -1 వరల్డ్ వైడ్ గా సెప్టెంబరు 27న థియేటర్లలో విడుదల కానుంది.

ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..రంగంలోకి పూరి, ఛార్మి..
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానున్న ఈ చిత్రంఫై అంచానాలు ఉన్నాయి. ఇటీవల విడుడల చేసిన రెండు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు లైగర్ తో పూరి జగన్నాధ్ డిజాస్టర్ ఇచ్చాడు , ఇటు స్కందతో ఫ్లాప్ కొట్టాడు రామ్. ఇద్దరు చెరొక భారీ ఫ్లాప్ తర్వాత వీరి కలయికలో రానున్న ఈ చిత్రంపై హీరో, దర్శకుడు చాలా నమ్మకంగా ఉన్నారు. కాగా ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు గాను రూ.56 కోట్లకు కొనుగోలు చేసారు హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి. హిందీ రైట్స్ ను రూ.6 కోట్లకు కొనుగోలు చేసారు. కానీ ఈ సినిమా నైజాం విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రైట్స్ కొనుగోలు చేసిన నిరంజన్ రెడ్డి మైత్రీ మూవీస్ ద్వారా రిలీజ్ చేయాలని చూడగా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. నైజాం తనకు కాకుండా ఎవరికి ఇచ్చినా ఒప్పుకునేది లేదు అని భీష్మించుకూర్చున్నాడు. ఈ నేపథ్యంలో 20% కమిషన్ బేసిస్ వరంగల్ శ్రీను పంపిణి చేసేందుకు మాటలు జరిగాయి. అసలు లైగర్ నష్టాలు ఎంత అనేది లెక్క తేలని కారణంగా మొదటికి వచ్చింది వ్యవహారం. దీంతో లైగర్ నిర్మాతలయిన ఛార్మి, పూరి జగన్నాధ్ నేడు ముంబయి నుండి  హైదరాబాద్ రానున్నారు. మరోసారి పూరి జగన్నాధ్, ఛార్మి, వరంగల్ శ్రీను, మైత్రీ మూవీస్ సమక్షంలో పంచాయతీ జరగనుంది. మరి విడుదలకు 14 రోజులు ఉండగా ఈ పంచాయతీలు ఏమిటో అని రామ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Show comments