Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 15 అంశాలు అజెండాతో సమావేశం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45కి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. గురువారం నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. మొత్తం 15 అంశాలు ఎజెండాగా ఈ రోజు కేబినెట్‌ భేటీ జరగనుంది.. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అనథరైజ్ గా నిర్మించిన భవనాలకు పినలైజేషన్ విధించే ప్రతిపాదనకు నేడు ఆమోదం తెలపనుంది కేబినెట్.. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ చట్టాలను సవరిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. ఇక, వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ, తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ నేడు కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది.. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965 లకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ను అనుసరించి.. ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది..

ఛలో మెడికల్‌ కాలేజీలకు వైసీపీ పిలుపు.. ఆందోళనలకు అనుమతి లేదంటున్న పోలీసులు..
మెడికల్‌ కాలేజీల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతోంది.. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) మోడ్‌లో అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుందడగా.. పీపీపీ మోడ్‌ అంటే.. మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడమే అని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు.. ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఈ తరుణంలో.. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఇవాళ వైసీపీ ఆద్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది వైసీపీ.. తమ ప్రభుత్వ హయాం 2019-24 మధ్యలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.. ఐదు కళాశాలల నిర్మాణం పూర్తి అయ్యి తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి.. మరో రెండు మెడికల్ కళాశాలలు సిద్ధం అయ్యాయి.. వివిధ దశల్లో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాలలను పీపీపీ మోడ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహకాలు జరుగుతుండగా.. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చలో మెడికల్ కాలేజ్ పేరుతో నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది వైసీపీ.. ఛలో మెడికల్‌ కాలేజీల ఆందోళన కార్యక్రమాల్లో ఎక్కడిక్కడ పార్టీ ముఖ్య నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొననున్నారు.. అయితే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న నేపథ్యంలో వైసీపీ నిరసనలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు.. ఇక, ఓవైపు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలకు పిలుపు ఇవ్వటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. ఎక్కడిక్కడ పలువురు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలను హౌస్ రెస్ట్ చేస్తున్నారు పోలీసులు..

వైఎస్‌ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా..
దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.. గుంటూరులో ఉడుముల సాంబిరెడ్డి 15వ వర్దంతి సందర్భంగా విద్యార్థినులకు స్కాలర్‌షిప్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజగోపాల్‌ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్సార్ శిష్యులన్నారని గుర్తుచేసుకున్నారు.. వైఎస్సార్ చనిపోతే కంటతడి పెట్టని వ్యక్తి లేరని, బాధపడని కుటుంబం లేదన్నారు. వైఎస్సార్ కుటుంబంపై ఇప్పటికీ మాకు అభిమానం ఉందన్నారు. రాజశేఖరరెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇంకా ప్రజల్లో ఉన్నాయన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌కి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ ను కలవడానికి వస్తున్నానని ప్రచారం చేస్తున్నారన్నారు.. కానీ, ఆ ప్రచారాన్ని తాను ముందే ఖండించానన్నారు మునుగోడు ఎమ్మె్ల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.. డబ్బు ఉండి దానం చేయని వారు నా దృష్టిలో నేరస్తులు.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నారు కోమటిరెడ్డి.. బాగా చదువుకొని పేద ప్రజలకు సహాయం చేయాలని మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది.. మా అమ్మ చెప్పిన మాట ప్రకారం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాను అన్నారు.. సామాజిక కార్యక్రమాలు చేయడంలో, మానవతా దృక్పథంతో సహాయం చేయడంలో ఉన్నంత తృప్తి దేంట్లోను ఉండదు అన్నారు.. 15 కోట్లతో జనగామ జిల్లా కేంద్రంలో మహిళల అనాధాశ్రమాన్ని నిర్మించాను.. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో మంచి ప్రతిభ చూపిన వారికి 28 లక్షల నగదు బహుమతి అందించా అని వెల్లడించారు.

ఢిల్లీ పర్యటనలో బిజీగా సీఎం రేవంత్.. రాష్ట్రంలో పెట్టుబడులే టార్గెట్!
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న 12వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరై.. “విజన్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్” అంశంపై ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, పెట్టుబడిదారులకు తెలియజేయనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ హోటల్‌లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీతో భేటీ భేటీ కానున్నారు. 11.30కి బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే వార్షిక ఫోరమ్‌లో విజన్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ అంశంపై ప్రసంగిస్తారు.

అమెరికాలో పాలమూరు యువకుడిని కాల్చి చంపిన పోలీసులు..
అమెరికాలో తెలంగాణ యువకుడు హత్యకు గురయ్యాడు.. పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెంఇన యువకుడు మృతి చెందాడు.. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్‌ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. కాగా, మహబూబ్‌నగర్‌ రామయ్య బౌలికి చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్.. డిసెంబర్ 2016లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి కాలిఫోర్నియాలోని శాంటా క్లారాకు వెళ్లాడు. ఆ యువకుడిని శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారు. మృతదేహం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని ఓ ఆసుపత్రిలో ఉందని తమకు తెలిసిందని.. తమ కుమారుడి మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌ తీసుకురావడంలో సాయం చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత కాన్సులేట్ ద్వారా సంప్రదింపులు జరపాలని అభ్యర్థించారు. కాగా, అమెరికా పోలీసుల చేతిలో మహబూబ్‌నగర్ యువకుడు హతం అయ్యాడు.. శాంటా క్లారాలో నిజాముద్దీన్(32) ను కాల్చి చంపారు పోలీసులు.. ప్లాట్ ఓనర్ తో ఘర్షణ సమయంలో నిజాముద్దీన్‌పై కాల్పులు జరిపారట పోలీసులు.. ఆ సమయంలో నిజాముద్దీన్ చేతిలో కత్తి ఉందని.. అందుకే పోలీసులు కాల్పులు జరిపారని అధికారులు ప్రకటించారు.. కానీ, ఎందుకు తమ కుమారుడిపై పోలీసులు కాల్పులు జరిపారో స్పష్టతలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

మావోయిస్టుల హెచ్చరిక లేఖ.. భూస్వాములు, అధికార పార్టీ నాయకుల్లో గుబులు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ కలకలం సృష్టిస్తోంది. చర్లలో భూస్వాములు, రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట లేఖ విడుదల అయింది. లేఖ రిలీజ్ కావడంతో మండలంలోని భూస్వాముల్లో, అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. పరుచూరి ప్రేమ్చంద్, పరుచూరి రవికుమార్, జవ్వాది రవికుమార్, ఇర్ఫా వసంత్ అండ్ కో, లంక రాజు, కోటేరు శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి బ్రదర్స్ సహా వ్యాపారస్తులు శేసెట్టి సాంబయ్య, వలసా లింగమూర్తిలను పద్ధతి మార్చుకోవాలంటూ మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. జవ్వాది మున్ని విలేకరి పేరుతో ప్రజలను ఏం మార్చుతున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, అవును విజయ భాస్కర్ రెడ్డి, ఇందుల బ్రదర్స్.. భూస్వాములకు, పెత్తందారులకు వంత పాడుతున్నారని రాసుకొచ్చారు.

కాల్పుల విరమణపై యూఎన్ తీర్మానం.. అమెరికా తిరస్కరణ
గాజా స్వాధీనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. హమాస్‌ను అంతం చేసి బందీలను విడిపించడమే తమ టార్గెట్ అని ఇజ్రాయెల్ అంటోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక తీర్మానం చేసింది. గాజా కాల్పుల విరమణపై యూఎన్ తీర్మానం చేసింది. దీన్ని అమెరికా తిరస్కరించింది. గాజాలో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. అయితే భద్రతా మండలి తీర్మానాన్ని గురువారం అమెరికా వ్యతిరేకించింది. అల్ జజీరా నివేదక ప్రకారం.. మధ్యప్రాచ్యానికి అమెరికా డిప్యూటీ స్పెషల్ రాయబారిగా ఉన్న మోర్గాన్ ఓర్టగస్.. వాషింగ్టన్ వ్యతిరేకతను సమర్థించారు. యూఎన్ తీర్మానంపై అమెరికా నుంచి వ్యతిరేకత రావడంలో ఆశ్చర్యం లేదన్నారు. హమాస్ తీవ్రవాదం నుంచి ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునే హక్కు ఉందని చెప్పారు. దురదృష్టవశాత్తు యూఎన్.. హమాస్‌కు మద్దతుగా నిలబడడం బాధాకరం అన్నారు. హమాస్‌కు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపాలు సంభవించాయి. రష్యాలో తీవ్రత 7.8గా.. ఇండోనేషియాలో 6.1గా తీవ్రత నమోదైంది. శుక్రవారం తెల్లవారుజామున రష్యాలోని కమ్చట్కాలో భూ కంపం సంభవించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ భూకంపం 10 కి.మీ లోతులో నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తొలుత 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా.. రెండోసారి 5.8 తీవ్రతతో నమోదైనట్లు పేర్కొంది. యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ సునామీ హెచ్చరికను జారీ చేసింది.

నేడు ఒమన్‌తో భారత్‌ ఢీ.. రెండు మార్పులు తప్పవా? తుది జట్లు ఇవే
ఆసియా కప్‌ 2025లో తన చివరి గ్రూప్‌ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. పసికూన ఒమన్‌ను సూర్య సేన ఢీకొట్టనుంది. ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్ 4 పోరు నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌లా ఉపయోగించుకోనుంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత్.. యూఏఈ, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట భారత్ పసికూన ఒమన్‌పై గెలవడం ఖాయం. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. స్టార్ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చే అవకాశముంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్ ఆడనున్నాడు. అబుధాబి పిచ్‌ స్పిన్నర్లకు పెద్దగా సహరించకపోవచ్చు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్, వరుణ్‌ చక్రవర్తిలలో ఒకరికే తుది జట్టులో ఛాన్స్ దక్కొచ్చు. అర్ష్‌దీప్‌తో పాటు హర్షిత్‌ రాణా ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశముంది. బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కోసం ఈ మ్యాచ్‌లో భారత్‌ ముందుగా బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి.

పీసీబీకి ఐసీసీ ఈమెయిల్‌.. పాకిస్థాన్‌పై చర్యలు?
ఆసియా కప్‌ 2025 గ్రూప్ స్టేజ్‌లో భాగంగా సెప్టెంబర్ 14 భారత్, పాకిస్థాన్‌ టీమ్స్ తలపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టాస్, మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్స్ కరచాలనం చేయలేదు. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ నిబంధనలు ఉల్లంఘించాడని, టోర్నీ నుంచి అతడిని తొలగించాలని ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. మ్యాచ్‌ రిఫరీని తొలగించకుంటే తాము టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ ఏసీసీని హెచ్చరించింది. ఈ విషయంపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది. మ్యాచ్ రిఫరీని తొలగించాలన్న పీసీబీ డిమాండ్‌ను ఐసీసీ సున్నితంగా తిరస్కరించింది. ఆసియా కప్‌ 2025 టోర్నీని బహిష్కరిస్తామన్న పాకిస్థాన్‌.. యూఏఈతో మ్యాచ్ సమయంలో నిరసనకు దిగింది. దాంతో మ్యాచ్‌ గంట ఆలస్యంగా మొదలైంది. యూఏఈతో మ్యాచ్‌కు కాసేపటి ముందు రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌.. పాక్ టీమ్‌ కోచ్, కెప్టెన్‌, మేనేజర్‌తో మాట్లాడి క్షమాపణలు చెప్పాడని పీసీబీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. రిఫరీ క్షమాపణలు చెప్పిన కారణంగానే తాము యూఏఈతో మ్యాచ్ ఆడుతున్నట్లు పీసీబీ పేర్కొంది. యూఏఈతో మ్యాచ్‌ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్దమైంది. ఈ మేరకు పీసీబీకి ఓ ఈమెయిల్‌ చేసింది. త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్‌ రిఫరీ క్షమాపణ చెప్పాడని పీసీబీ చెప్పడాన్ని కూడా ఐసీసీ తప్పు పట్టింది.

సూపర్-4 జట్లు ఖరారు.. భారత్, పాకిస్థాన్ మధ్య మరోసారి సంగ్రామం!
ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్‌లో సూపర్-4 దశకు చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు స్థానం సంపాదించగా.. తాజాగా గ్రూప్-B నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు కూడా అర్హత సాధించాయి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. గ్రూప్-B చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్-4లోకి ప్రవేశించింది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచే ఉంటే బంగ్లాదేశ్ నిష్క్రమించాల్సి వచ్చేది. అయితే శ్రీలంక అలా జరగనివ్వలేదు. ఈ గ్రూప్‌ Bలో శ్రీలంక మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ రెండు విజయాలతో 4 పాయింట్లతో రెండో స్థానంలో ముగించింది. ఒకే ఒక్క విజయంతో ఆఫ్ఘనిస్తాన్ మూడో స్థానంలో నిలిచింది. హాంగ్‌కాంగ్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోగా చివరన నిలిచింది. ఇక గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్ ముందుగానే సూపర్-4లోకి వచ్చాయి. భారత్ నేడు (19 సెప్టెంబర్)న ఓమాన్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే అంతకుముందే పాకిస్తాన్, UAEపై విజయాలు సాధించి సూపర్-4లోకి అడుగుపెట్టింది. పాకిస్తాన్ కూడా ఓమాన్, UAEపై గెలిచి అర్హత పొందింది. UAE ఒక్క మ్యాచ్ గెలిచి మూడో స్థానంలో నిలవగా, ఓమాన్ ఒక్క విజయమూ సాధించలేక చివరి స్థానంలో నిలిచింది.

నా రెస్టారెంట్‌లో రూ.50 వచ్చాయి.. నా బాధ ఎవరితో చెప్పుకోను.. వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
ఈ ఏడాది క్లౌడ్‌ బరస్ట్‌లు కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చెందిన మండి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ నష్టాన్ని చవిచూసింది. అయితే గురువారం మండి నియోజకవర్గంలో కంగనా రనౌత్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులు తమ గోడును కంగనాకు చెప్పుకున్నారు. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కౌంటర్‌గా కంగనా తన బాధను ఎవరితో చెప్పుకోవాలంటూ రెస్టారెంట్ స్టోరీ మొదలు పెట్టారు. నిన్న తన రెస్టారెంట్ అమ్మకాల్లో కేవలం రూ.50 మాత్రమే వచ్చాయని.. ప్రతి నెల ఉద్యోగులకు రూ.15 లక్షలు ఇస్తున్నానని.. దయచేసి తన బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలని రివర్స్‌గా నిట్టూర్పు విడిచింది. దీంతో వరద బాధితులంతా షాక్‌కు గురయ్యారు. తాను కూడా హిమాచల్‌ప్రదేశ్‌ ప్రాంత వాసినేనని చెప్పుకొచ్చారు.

టాలీవుడ్‌లో నయా సెన్సేషనల్ హీరోయిన్
ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న బ్యూటీ రితికా నాయక్. ఈ వైబ్ బేబి మిరాయ్‌తో యూత్‌లో వైబ్ సృష్టించుకుంది. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఇప్పటి వరకు ఆమె త్రీ ఫిల్మ్స్ లో నటిస్తే మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒక దాన్ని మించి మరోటి హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ డిల్లీడాళ్ నెక్ట్స్ హాయ్ నాన్నలో నాని-మృణాల్ కూతురుగా స్మాల్ రోల్‌లో మెరిసింది. ఇక రీసెంట్లీ రిలీజైన మిరాయ్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది రితికానాయక్. ఈసినిమా హండ్రెడ్ క్రోర్ క్లబ్‌లోకి చేరింది. తేజా సజ్జా ఖాతాలో ఇది సెకండ్ హండ్రెడ్ క్రోర్ మూవీ కాగా, రితికాకు ఇదే ఫస్ట్. అలాగే ఓవర్సీస్‌లో కూడా బొమ్మ దూసుకెళుతోంది. ఇప్పటికే 2మిలియన్స్ మార్క్ దాటేసింది ఫిల్మ్. ఇక మేడమ్ చేతిలో టూ ఫిల్మ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్ అనే ఫిల్మ్ చేస్తోంది. ఏడాదిన్నర క్రితం స్టార్టైన ఈ సినిమా ఎంత వరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు.  ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ 15 మూవీలో నటిస్తోంది. ఇండో- కొరియన్ హారర్ డ్రామాగా రాబోతుంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. యు.వి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎఫ్3 తర్వాత వరుణ్ హిట్టే చూడలేదు. ఇటీవల తండ్రిగా ప్రమోటైన ఈ మెగా హీరోకి ఇప్పుడు అర్జెంటుగా హిట్ అవసరం. అటు బేబి తర్వాత గంగంగణేశాతో ప్లాప్ చూసిన ఆనంద్ కూడా హిట్ పడాలి. మరీ ఈ భామ వీరిద్దరికీ లేడీ లక్కుగా మారుతుందో లేదో  చూడాలి.

Exit mobile version