NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు పవన్‌ కల్యాణ్‌తో బాలినేని భేటీ..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి అడుగులు జనసేన పార్టీ వైపు పడుతున్నాయి.. ఇప్పటికే తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి పంపిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.. ఇక, జనసేన పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు బాలినేని.. ఇక, ఈ రోజు విజయవాడలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు బాలినేని.. జనసేన ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది.. ఇప్పటికే జనసేన కీలక నేత నాగబాబుతో మంతనాలు కూడా జరిపారు బాలినేని.. అయితే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరతారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది..

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గతంలో మూతపడిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తోంది.. ఆగస్టు 15వ తేదీన తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించిన చంద్రబాబుసర్కార్‌.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండో విడత అన్న క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. సెక్రటేరీయేట్ వద్దనున్న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.ఇక, రాష్ట్రవ్యాప్తంగా.. వివిధ ప్రాంతాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే..

పళ్లు తోముతుండగా ఊహించని ఘటన.. బాలుడు దవడలోకి చొచ్చుకుపోయిన టూత్ బ్రష్..
టూత్ బ్రష్ అనేది దంతాలతో పాటు చిగుళ్లు మరియు నాలుకను శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తారు.. అయితే, దంతాలు శుభ్రం చేసుకొనేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. కొందరు బ్రష్‌ వేసుకొని ఊరంతా తిరిగేస్తుంటారు.. మరికొందరు.. బ్రష్ నోట్లో పెట్టుకుని ఏదో పనిలో మునిగిపోతారు.. టూత్ బ్రష్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే.. ప్రమాదాన్నా కోరి తెచ్చుకున్నట్టే.. ఎందుకంటే.. బ్రష్ రెండు నిమిషాలపాటు శ్రద్ధగా వేస్తే సరిపోతుందని వైద్యులే చెబుతున్నారు.. అయితే, పళ్లు తోముతుండగా జరిగన ఓ ఊహించని ఘటన.. ఓ బాలుడికి చుక్కలు చూపించింది.. దవడలోకి టూత్ బ్రష్‌ చొచ్చుకుపోవడంతో.. చివరకు ఆపరేషన్‌ చేసి బయటకు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.. శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో పళ్లు తోముతున్న బాలుడు దవడలో టూత్ బ్రష్ గుచ్చుకుంది.. బాలుడు బ్రష్ చేస్తుండగా.. ఒక్కసారిగా కింద పడడంతో దవడలోకి చొచ్చుకుపోయింది టూత్ బ్రష్.. దీంతో విలవిలలాడిపోయాడు ఓ బాలుడు.. వెంటనే బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు తల్లితండ్రులు.. ఇక, బాలుడికి ఆపరేషన్ చేసి బ్రష్ ను తొలగించారు వైద్యులు.. ప్రస్తుతం బాలుడు ప్రవీణ్ కుమార్ (11) ఆరోగ్యం నిలకడగా ఉంది.. అయితే, బ్రష్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు..

పట్టుమని పదేళ్లు కూడా లేదు.. కానీ ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానం..
ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (PMEAC) రూపొందించిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దీని ప్రకారం దేశంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.పదేళ్లు కూడా నిండని రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే 2వ ధనిక రాష్ట్రంగా నిలిచింది. పూర్తి అర్బన్ (పట్టణ) రాష్ట్రంగా ఢిల్లీ తర్వాత తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ కూడా ధనిక రాష్ట్రమే అయినా తలసరి ఆదాయ గణాంకాల పరంగా మొదటి 5 స్థానాల్లోకి రాలేకపోయింది. అత్యధిక ఆదాయం వచ్చే హైదరాబాద్ లాంటి మహానగరం లేకపోవడమే ఇందుకు కారణమని ఆ రాష్ట్ర పాలకులు చెబుతున్నారు. అయితే, GDP పరంగా 9వ స్థానంలో, తలసరి ఆదాయ గణాంకాలలో 16వ స్థానంలో ఉంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం, తలసరి ఆదాయం పరంగా, దక్షిణాదిలోని ఐదు ధనిక రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు. 1991 సంవత్సరంలో ఇక్కడ తలసరి జనాభా చాలా తక్కువగా ఉన్నప్పటికీ, సరళీకరణ , ఇతర కారణాల వల్ల ఈ రాష్ట్రాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. దేశ జీడీపీలో ఈ 5 రాష్ట్రాల వాటా మార్చి, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 30% గా నమోదైంది. మనం భారతదేశంలోని ఐదు ధనిక రాష్ట్రాల గురించి మాట్లాడినట్లయితే, అవి ఢిల్లీ (కేంద్రపాలిత ప్రాంతం), తెలంగాణ, కర్ణాటక, హర్యానా, తమిళనాడు. తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రాలు అత్యంత సంపన్నమైనవి. కాగా.. దక్షిణాదికి ఆనుకుని ఉన్న మధ్య, పశ్చిమ రాష్ట్రం మహారాష్ట్ర ఇప్పటికీ అత్యధిక జీడీపీ అందిస్తున్న రాష్ట్రంగా నిలిచిన.. గత దశాబ్దన్నర కాలంగా 15% వాటా కలిగిన ఈ రాష్ట్రం ఇప్పుడు 13.3%కు పరిమితమైంది. దీంతో.. దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై మహానగరమే అత్యధిక జీడీపీకి కారణం.

వాహనదారులకు అలర్ట్.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..
ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ అంక్షలను విధించారు. ముస్లింల పండుగ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు నేపథ్యంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఫలక్‌నుమా నుండి వోల్టా హోటల్ వరకు, యాహియా పాషా దర్గా నుండి వోల్టా హోటల్ వరకు, మక్కా మసీదు నుండి హజ్ హౌస్ మరియు పట్టరగట్టి అలీజా కోట్ల వరకు ఊరేగింపులు ఉంటాయి. ప్రధాన ఊరేగింపు సయ్యద్ క్వాద్రీ చమన్, గులాం ముర్తుజా కాలనీ, ఫలక్‌నుమా నుండి ప్రారంభమవుతుంది. అలియాబాద్ ఎక్స్ రోడ్స్, లాల్ దర్వాజా ఎక్స్ రోడ్స్, చార్మినార్, గుల్జార్ హౌస్, మదీనా, నయాపూల్ బ్రిడ్జి, సాలార్జంగ్ మ్యూజియం, పురానీ హవేలీ మీదుగా ర్యాలీ సాగనుంది. ర్యాలీ బీబీ బజార్‌, ఎటెబార్‌ చౌక్‌ వద్ద ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ను మహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్డు మీదుగా కందికల్ గేట్, పెసలబండ, కర్నూలు రోడ్డు మీదుగా షంషీర్‌గంజ్, నాగుల చింత మీదుగా మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రవాణా సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9010203626కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

నేడు వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ సమావేశం..
వక్ఫ్ సవరణ బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ రోజు (గురువారం) సమావేశం జరగనుంది. బుధవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడటంతో నేడు కొనసాగబోతుంది. కొంతమంది సభ్యుల అభ్యర్థన మేరకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జేపీసీ చైర్‌పర్సన్, బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ తెలిపారు. ఇక, జగదాంబిక పాల్ విలేకరులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది.. కానీ మా సభ్యులు కొందరు 17వ తేదీన గణేష్ చతుర్థి, ఈద్-ఎ-మిలాద్ కోసం ఊరేగింపు జరుగుతోందని చెప్పారు. దీంతో షెడ్యూల్ ప్రకారం బుధవారం నాటి సమావేశం సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరగనుంది. కాగా, నేటి సమావేశంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు వక్ఫ్ (సవరణ) బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ముందు మౌఖిక సాక్ష్యాలను నమోదు చేస్తారు. ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా లాంటి కొంతమంది నిపుణులు, వాటాదారుల అభిప్రాయాలు లేదా సూచనలను కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వింటుంది. వీరితో పాటు వైస్ ఛాన్సలర్, చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పాట్నా, పస్మాండ ముస్లిం మహాజ్, ఆల్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు, అఖిల భారత సజ్జదనాశిన్ కౌన్సిల్, అజ్మీర్, ముస్లిం రాష్ట్రీయ మంచ్, ఢిల్లీ అండ్ భారత్ ఫస్ట్ కమిటీలు ఇచ్చే సలహాలు, సూచనలు జేపీసీ కమిటీ తీసుకోనుంది.

100 మంది రౌడీలు, 80 మంది ఇళ్లు, 50 రౌండ్ల కాల్పులు… నవాడలో దళిత కాలనీకి నిప్పు
బీహార్‌లోని నవాడా జిల్లాలో రౌడీలు దళిత కాలనీని చుట్టుముట్టి నిప్పంటించారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ గ్రామంలో జరిగిన ఈ దహనం ఘటనలో గ్రామంలోని 80 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ విషయంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భూవివాదానికి సంబంధించి ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఒక పక్షం ఇక్కడ నివసిస్తుండగా, మరో పక్షం ఈ భూమిపై క్లెయిమ్ చేసుకుంటూ వస్తోంది. అయితే ఈ భూమి బీహార్ ప్రభుత్వానికి చెందినది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతోంది. బుధవారం వంద మంది రౌడీలు అకస్మాత్తుగా దళితుల ఆవాసానికి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కాలనీలోకి ప్రవేశించిన వెంటనే దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కాల్పులతో ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. దుండగులు దాదాపు 50 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ సమయంలో గ్రామస్తులు తమను తాము రక్షించుకునేందుకు అక్కడక్కడ తలదాచుకున్నారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ముందుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని డీఎం, ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కెనడా వెళ్లే విద్యార్థులకు షాక్.. స్టడీ ప‌ర్మిట్లు 10 శాతం తగ్గింపు
కెనడియన్ ఫెడరల్ సర్కార్ విదేశీ విద్యార్థుల‌కు షాక్ ఇచ్చింది. ఇంటర్ నేషనల్ స్టూడెంట్స్ ను మరింత తగ్గిస్తున్నట్లు పేర్కొనింది. తాత్కాలిక నివాసితుల రాకపోకల పరిమితి నిర్వహణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. 2025లో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 10 శాతం మేర తగ్గించబోతున్నట్లు చెప్పారు. ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వం కెనడా (ఐఆర్‌సీసీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2024లో జారీ చేయాల‌ని లక్ష్యంగా పెట్టుకున్న 4,85,000 నుంచి 10 శాతం త‌గ్గితే కేవ‌లం 4,37,000 మందికి మాత్రమే స్టడీ పర్మిట్లు అందుతాయ‌ని కెనడకు చెందిన ఓ వార్తా సంస్థ కథనం ప్రసారం చేసింది. ఇక, 2025లో జారీ చేసే స్టడీ పర్మిట్‌ల సంఖ్య 2026లో కూడా ఎలాంటి మార్పులు ఉండదని ప్రకటించారు. కాగా, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో దాదాపు 3,60,000 అండర్‌ గ్రాడ్యుయేట్ స్టడీ పర్మిట్‌లను కెనడియన్ ఫెడరల్ ప్రభుత్వం ఆమోదించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇది 2023లో జారీ చేయబడిన 5,60,000 స్టడీ పర్మిట్లతో పోలిస్టే దాదాపు 35 శాతం మేర తగ్గించబడింది. అయితే, కెనడా జనాభా 2024 మొదటి త్రైమాసికంలో 41 మిలియన్లకు పైగా ఉంది. ఇక, ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక నివాసితులలో భారీ పెరుగుదల కనిపించడంతో ఐఆర్‌సీసీ కీల‌క ప్రకటన వెలువరించింది. తాత్కాలిక నివాసితుల సంఖ్యపై ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది. త‌ద్వారా 2026 నాటికి కెనడా మొత్తం జనాభాలో 6.5 శాతంగా ఉన్న తాత్కాలిక నివాసితుల సంఖ్యను 5 శాతానికి తగ్గించాల‌ని అక్కడి సర్కార్ ల‌క్ష్యంగా పెట్టుకుంది.

ఒక సెంచరీ.. ఏకంగా ఐదు రికార్డులు సొంతం! డాన్‌ బ్రాడ్‌మన్‌తో సమంగా
గాలే అంతర్జాతీయ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్‌ అద్భుత సెంచరీ చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కమిందు.. 173 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 114 పరుగులు చేశాడు. శ్రీలంక 29 ఓవర్లలో 89/3 స్కోరుతో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన కమిందు.. కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు స్కోరును 302కు చేర్చాడు. కమిందు ఒక్క శతకంతో ఏకంగా ఐదు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. కమిందు మెండిస్‌ తాను ఆడిన ఏడు టెస్టుల్లో ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం హాఫ్ సెంచరీ బాదాడు. దాంతో ప్రతి మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన తొలి శ్రీలంక క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన కమిందు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధిస్తే.. మరో రికార్డును సొంతం చేసుకుంటాడు. ఇప్పటికే పాక్‌ బ్యాటర్ నమోదు చేసిన రికార్డును సమం చేసిన కమిందు.. మరో హాఫ్ సెంచరీతో తొలి బ్యాటర్‌ అవుతాడు. కమిందు మెండిస్ ఇప్పటివరకు ఏడు టెస్టులు ఆడాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 809 పరుగులు చేశాడు. కమిందు బ్యాటింగ్‌ యావరేజ్‌ 80.90గా ఉంది. కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆసియా బ్యాటర్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాడిగా కమిందు కొనసాగుతున్నాడు. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (68.53) రెండో స్థానంలో ఉన్నాడు.

యూటర్న్ తీసుకోవడం ఓ జోక్‌గా మారింది.. క్రికెటర్లపై మండిపడిన రోహిత్!
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో రిటైర్మెంట్ ఇవ్వడం.. ఆపై యూటర్న్ తీసుకోవడం సాధారణమైపోయింది. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్, పాకిస్తాన్ సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్‌లు రిటైర్మెంట్ ఇచ్చి.. మళ్లీ జాతీయ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా మరలా జట్టు తరఫున ఆడేందుకు ప్రయత్నాలు చేశాడు. మరికొందరు ప్లేయర్స్ కూడా రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రిటైర్మెంట్ ఇచ్చి యూటర్న్ తీసుకోవడం ఓ జోక్‌గా మారింది అని మండిపడ్డాడు. జియో సినిమాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ప్రస్తుత రోజుల్లో ప్రపంచ క్రికెట్‌లో రిటైర్మెంట్ అనేది ఓ జోక్‌గా మారింది. క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారు, ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఆడతారు. అదృష్టవశాత్తు భారతదేశంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నేను ఇతర దేశాల ఆటగాళ్లను గమనిస్తున్నాను. రిటైర్మెంట్ ప్రకటిస్తారు కానీ యూ-టర్న్ తీసుకుంటున్నారు. ఎందుకు రిటైర్మెంట్ ఇస్తున్నారో వారికే తెలియదు. అలా చేస్తే వారిపై వారికి నమ్మకం ఎలా ఉంటుంది. నా విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను. నా నిర్ణయం ఫైనల్. టీ20 క్రికెట్ నుండి వీడ్కోలు చెప్పడానికి ఇది సరైన సమయం అని భావించా’ అని చెప్పాడు.

13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు గట్టి దెబ్బే..
ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ యంగ్ గెటప్, లుక్స్ పట్ల ఫ్యాన్స్ కాస్త   నిరుత్సహానికి గురయ్యారు. భారీ  అంచనాల మధ్య రిలీజ్ అయిన GOAT ఆ అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. మరోవైపు ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 126.32 రాబట్టిన GOAT, 4రోజులకు గాను రూ. 288 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. వినాయక చవితి లాంగ్ వీకెండ్ రావడంతో కలెక్షన్స్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ రాబట్టింది GOAT.  కానీ తమిళనాడులో ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా 13 రోజులకి గాను రూ.  194.85 కోట్లు కలెక్ట్ చేసింది. తాజగా ఈ సినిమా 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ప్రకటించారు నిర్మాతలు. రిలీజ్ నాటి నుండి ఇప్పటి వరకు GOAT వరల్డ్ వైడ్ గా  రూ. 413 కోట్లు కొల్లగొట్టి విజయ్ సత్తా ఏ పాటిదో చూపింది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కవుగా కలెక్షన్స్ రాబడుతోంది. ఓన్లీ నార్త్ అమెరికాలోనే 13 రోజులకు గాను రూ. 35.25 కోట్లు రాబట్టింది, ఓవర్సీస్ మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు అటుఇటుగా $16.02M ( 150కోట్లు) కొల్లగొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు కేవలం రూ. 12 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ ముగించింది.

ఆంధ్ర – నైజాం ఏరియాల వారిగా దేవర డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన  పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.  ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ  నుండి వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ తారక్ అభిమానులలో ఉంది. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దేవర థియేట్రికల్ రైట్స్ అవుట్ రేట్ కు భారీ ధరకు కొనుగోలు చేసాడు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో సితార వారి రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్చేస్తున్నారు. ముందుగా నైజాం ఏరియాలో చుస్తే సితార సినిమాలు పంపిణి చేసే దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా రిలీజ్ కానుంది. ఆంధ్ర ఏరియాల వారిగ చూస్తే ఉత్తరాంధ్ర పూర్వి పిక్చర్స్, ఈస్ట్ గోదావరి విజయలక్ష్మి సినిమాస్, నెల్లూరు అంజలి పిచ్చర్స్, వెస్ట్ గోదావరి ఆదిత్య ఫిల్మ్స్ ( LVR ), కృష్ణ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, గుంటూరు రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా రిలీజ్ కానుంది. ఇక నందమూరి ఫ్యాన్స్ అడ్డాగా పిలవబడే సీడెడ్ లో చుస్తే చిత్తూరు వందన ఫిల్మ్స్, కడప SRR ఫిల్మ్స్, కర్నూల్ విక్టరీ ఫిల్మ్స్, అనంతపురం ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తెల్లవారు జామున 1.08 గంటల ఆటతో షోస్ మొదలు కానున్నాయి