అమరావతి పునర్నిర్మాణం.. నేడు సీఎం చంద్రబాబు శ్రీకారం..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టినా.. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అవి ముందుకు సాగలేదు.. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సిద్ధమైంది.. ఆ పనులకు నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు.. ఏపీ సీఆర్దీయే ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను మొదలు పెట్టనుంది ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆ పనులను ప్రారంభించనున్నారు చంద్రబాబు.. అయితే, 160 కోట్ల రూపాయలతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టింది సీఆర్డీఏ.. కానీ, ఆ తర్వాత ఆ పనులు నిలిచిపోయాయి.. ఇక, ఈ నెల 16 తేదీన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు.. అందులో భాగంగా నేడు.. పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు..
శ్రీవారి భక్తులకు అలర్ట్..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. తిరుమలలో శ్రీవారి దర్శనానికి.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ఇప్పటికే ఈ ఏడాది ఆర్జిత సేవా టికెట్ల కోటా పూర్తి కాగా.. వచ్చే ఏడాది టికెట్ల కోటాను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందులో భాగంగా ఈ రోజు జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.. మరోవైపు.. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి (ఈ నెల 21వ తేదీ) ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది.. ఇక, ఎల్లుండి (21వ తేదీ) మధ్యాహ్నం లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది టీటీడీ.. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ వెల్లడించింది.. ఇక, నిన్న శ్రీవారిని 61,576 మంది భక్తులు దర్శించుకున్నారు.. 23,412 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.
కర్నూలులో దారుణం.. బాలికపై అత్యాచారయత్నం.. తిరస్కరించడంతో పురుగులమందు తాగించి..!
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో బాలిక బలైంది. తనను ప్రేమించాలంటూ గత కొంత కాలంగా ఓ బాలిక వెంట పడుతోన్న యువకుడు.. ఎవరూ లేని సమయం చూసుకొని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు.. ప్రేమించాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో.. బలవంతంగా ఆమె నోట్లు పురుగుల మందు పోసి పరారయ్యాడు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అశ్విని అనే ఇంటర్ విద్యార్థిని నోట్లో పురుగుల పోసి ప్రేమోన్మాది చిన్న వీరేశ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పత్తికొండ మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అశ్విని.. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చింది. ప్రేమించకపోతే చంపేస్తానని చిన్న వీరేశ్.. సదరు బాలికను బెదిరించారు. ఇక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.. ఆ బాలిక ప్రతిఘటించడంతో బలవంతంగా పురుగుమందు తాగించాడు… అయితే, పెనుగులాటలో వీరేశ్ కు కూడా గాయాలయ్యాయి. ఇక, పొలం పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చావు బతుకుల్లో కనిపించిన అశ్వినిని చూసి షాక్ తిన్నారు.. వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అశ్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో.. కన్నీరు మున్నీరవుతున్నారు.. ప్రేమ పేరుతో తన కూతురు వేధింపులకు గురి చేసి.. అత్యాచార యత్నం చేసి ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..
పటాకుల దుకాణం కోసం దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..
దీపావళి పండుగ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరికలు జారీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేయనున్న పటాకుల దుకాణాలకు తాత్కాలిక లైసెన్స్ కోసం ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని పటాకుల వ్యాపారులకు సూచించారు. అనుమతి లేకుండా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసే వారు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలంలో దుకాణం ఏర్పాటు చేస్తే జీహెచ్‌ఎంసీ అనుమతి పొందాలని తెలిపారు. ప్రైవేట్ స్థలంలో ఉంటే యజమాని నుంచి ఎన్‌ఓసీతో పాటు గతేడాది తీసుకున్న అనుమతి లేఖ తప్పని సరిగి ఉండాలన్నారు. ఏర్పాటు చేయబోయే షాపు బ్లూ ప్రింట్, తదితర రసీదులను నేరుగా సంబంధిత జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో దాఖలు చేయాలని సూచించారు. ఈనెల 24లోపు దరఖాస్తు చేయకుండా టపాసుల షాపులు పెడితే వారిపై కఠిచర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు.
పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు.. అదుపులో 100 మంది యువకులు, 42 మంది మహిళలు..
హైదరాబాద్ లో పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4లో టాస్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్దంగా యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. పబ్ లోకి వెళ్లిన పోలీసులు వారందరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుమారు 142 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిర్వాహకులు పబ్‌కు కస్టమర్లను ఆకర్షించేందుకు 42 మంది యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారని తెలిపారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు పబ్‌పై కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో పబ్‌లో మెుత్తం 100 మంది యువకులు… 42 మంది మహిళలు వున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు.
గాజాపై మరోసారి దాడి చేసిన ఇజ్రాయెల్.. 33 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఉత్తర గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 33 మంది పాలస్తీనా ప్రజలు మృత్యి చెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో మరణించిన వారిలో 21 మంది మహిళలే ఉండటం గమనార్హం. ఈ దాడుల్లో మరో 85 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు 42,500 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక, ఇజ్రాయెల్‌పై సిరియా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నించింది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడులను ఐడీఎఫ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తెలిపింది. అది తమ భూభాగంలోకి ప్రవేశించక ముందే ఆ రాకెట్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. ఇరాన్ మద్దతుతోనే సిరియా ఈ డ్రోన్లతో దాడి చేసేందుకు యత్నించిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ప్రపంచకప్ ఫైనల్ గుర్తుందిగా.. మరోసారి అదే ఫలితాన్ని చూడబోతున్నాం!
బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడోరోజు ఆట ముగిసేసరికి 231/3 స్కోరుతో నిలిచింది. రోహిత్ సేన ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఆట చివరి బంతికి విరాట్ కోహ్లీ (70) అవుట్ కాగా.. క్రీజ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (70) ఉన్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. నాలుగో రోజు తొలి సెషన్ టీమిండియాకు అత్యంత కీలకం. వికెట్స్ కోల్పోకుండా స్కోర్ చేస్తేనే రేసులో నిలవొచ్చు. అయితే టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఫలితం మరోసారి పునరావృతం అవుతుందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత జట్టు కమ్‌బ్యాక్‌తో మ్యాచ్ రసవత్తరంగా మారుతుందని, టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఫలితం రిపీట్ అవుతుందని సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు. ‘నేడు న్యూజిలాండ్ ఆటగాడినైతే.. భారత్ కమ్‌బ్యాక్‌తో కాస్త ఆందోళన చెందేవాడిని. ఎందుకంటే ఈ జట్టుకు గొప్పగా పుంజుకునే నైపుణ్యం ఉంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. ఓ దశలో భారత జట్టుకు ఓటమి ఖాయమని అంతా భావించారు. ఆ సమయంలో అద్భుతంగా పోరాడి గెలిచింది. ఇప్పుడు న్యూజిలాండ్‌పై మరోసారి అదే ఫలితాన్ని చూడబోతున్నాం. భారత్ కమ్‌బ్యాక్‌తో మ్యాచ్ రసవత్తరంగా మారుతుందని భావిస్తున్నా’ అని మంజ్రేకర్ ఎక్స్‌లో పేర్కొన్నాడు.
ఓటమి ఉచ్చులోనే భారత్.. ఈరోజు నిలబడితేనే..! ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో 231/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయినా కూడా టీమిండియా ఇంకా ఓటమి ఉచ్చులోనే ఉంది. ప్రస్తుతానికి భారత్ ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటర్లు నాలుగోరోజైన శనివారం పూర్తిగా పోరాటాన్ని కొనసాగిస్తే తప్ప.. రోహిత్ సేన ఓటమి ఉచ్చులోంచి బయటికి రాదు. ఇప్పుడు భారం అంతా సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్‌లపైనే ఉంది. గాయపడిన రిషబ్ పంత్ మైదానంలోకి దిగుతాడో లేదో చూడాలి. మూడోరోజు 180/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (134; 157 బంతుల్లో 13×4, 4×6) అద్భుత శతకం బాదాడు. పేసర్ టీమ్ సౌథీ (65; 73 బంతుల్లో 5×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/72), కుల్దీప్ యాదవ్ (3/99) చెరో మూడు వికెట్స్ పడగొట్టారు. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (52; 63 బంతుల్లో 8×4, 1×6), యశస్వి జైస్వాల్ (35; 52 బంతుల్లో 6×4) మంచి ఆరంభం ఇచ్చారు. అయితే ఈ ఇద్దరినీ స్పిన్నర్ అజాజ్ పటేల్ పెవిలియన్ చేర్చాడు.
బాలకృష్ణ, చిరంజీవి కాంబోపై డైరెక్టర్ బోయపాటి సెన్సేషనల్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. గతంలో వీరిద్దరితో మల్టీ స్టారర్ సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించినా అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. కొన్ని సందర్భాల్లో విడుదలైన సినిమాలను చూస్తుంటే ఫలానా హీరోలను వాడుకుంటే బాగుండేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమా తీయడానికి ముందు రచయితలు, దర్శకులు కథలో ఎవరు బాగుంటారన్నది ఆలోచించి ఆ హీరోల దగ్గరకు వెళ్తారు కానీ కథలు నచ్చక కాల్షీట్‌లు దక్కడం లేదు. చిరంజీవి శివుడిగా నటించిన చిత్రం శ్రీ మంజునాథ. ఇందులో అర్జున్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాలో శివ పాత్రలో బాలకృష్ణ అయితే బాగుంటుందని దర్శకుడు కె.రాఘవేంద్రరావు భావించారు. వీరిద్దరూ కమర్షియల్ చిత్రాల్లో నటించలేకపోయారు కాబట్టి.. పౌరాణిక సినిమాలో నటింపజేయాలనుకున్నాడు. అయితే కథలో అర్జున్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదని భావించి బాలకృష్ణ ఈ పాత్రలో నటించేందుకు ముందుకు రాలేదు. దీంతో అర్జున్, సౌందర్య ప్రధాన నటులుగా, చిరంజీవి శివుడిగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మళ్లీ వారి కాంబో గురించి ఎన్నో వార్తలు వచ్చినా అవి పట్టాలెక్కలేదు.
రూ. 300 కోట్ల క్లబ్ లో రజనీకాంత్ ‘వేట్టయన్- ద హంటర్’
సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది. గ్లోబల్ గా అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ రిలీజైన కొద్ది రోజుల్లోనే రూ . 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైల్ స్టోన్ అని చెప్పుకోవడమే గాక, లైకా ప్రొడక్షన్స్ కి మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షక లోకాన్ని కట్టిపడేశాయి. ప్రతి షాట్ లో డైరెక్టర్ టేకింగ్ హైలైట్ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహిద్ ఫాజల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ప్రతి యాక్టర్ కూడా తన ఎనర్జిటిక్ పర్ఫార్‌మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకం అయింది. వెట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 300 కోట్లను అధిగమించడం, ఇటీవలి కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా అవతరించడం విశేషం. అన్ని వయసుల వారు ఈ సినిమాను ఆదర్శిస్తుండటం గమనార్హం.