పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి
పోటీపడి 19 బీర్లు తాగిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలం బండ వడ్డీపల్లిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీ సమయంలో మణికుమార్ (34), పుష్పరాజ్ (26) అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పరస్పరం పోటీపడి మద్యం సేవించారు. గత శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు ఇద్దరూ కలిసి మొత్తం 19 బడ్‌వైజర్ టిన్ బీర్లు తాగినట్లు పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర డీహైడ్రేషన్‌కు గురైన ఇద్దరి పరిస్థితి విషమించింది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మణికుమార్ మార్గమధ్యలో మృతి చెందగా, పుష్పరాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రాథమిక విచారణలోనూ, పోస్టుమార్టం నివేదికలోనూ మృతికి అతిగా మద్యం సేవించడమే కారణమని స్పష్టమైనట్లు పోలీసులు వెల్లడించారు.
లక్ష మంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణులు తయారీ.. టార్గెట్‌గా పెట్టుకున్న సర్కార్..
ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దిశగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన లభిస్తుండటంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ కోర్సు కోసం దాదాపు 50 వేల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని సీఎం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) వేదికగా స్పందించారు. ఏపీని క్వాంటం టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్‌పీటీఈఎల్ (NPTEL) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన లక్ష మంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణులను తయారు చేయాలన్న లక్ష్యం దిశగా ఇది కీలక అడుగు అని చంద్రబాబు తెలిపారు. క్వాంటం రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆవిష్కరణలు, పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ గమ్యస్థానంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్వాంటం స్కిల్లింగ్ కోర్సులో బంగారు, వెండి పతకాలు సాధించే నిపుణులను స్వయంగా సత్కరించేందుకు ఎదురు చూస్తున్నానని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ కోర్సు పూర్తి చేసినవారే క్వాంటం కంప్యూటింగ్ రంగంలో గ్లోబల్ లీడర్లుగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం… వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ఎంపీకి నోటీసులు జారీ చేసింది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు ఉన్నాయని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా హవాలా మనీ ల్యాండరింగ్ రూపంలో భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి పలువురిని విచారించిన ఈడీ, తాజాగా మరో ఎంపీకి నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిధుల మళ్లింపు, అక్రమ ఆర్థిక లావాదేవీలపై ఈడీ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈడీ నోటీసుల నేపథ్యంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొనగా, రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ..
సిద్దిపేటలో దారుణం.. భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి చంపిన భర్త
సిద్దిపేటలో ఆదర్శ్ నగర్ స్ట్రీట్ నంబర్ 7 లో దారుణం చోటుచేసుకుంది. భార్య శ్రీలతపై అనుమానంతో భర్త ఎల్లయ్య కత్తితో పొడిచి చంపాడు. అనంతరం కూతురిపై కత్తితో దాడి చేసి తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్పందించిన స్థానికులు గాయపడిన కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో ఎల్లయ్య చికిత్స పొందుతున్నాడు. ఎల్లయ్య నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్జేడీ కొత్త వ్యూహం.. తేజస్వి యాదవ్‌కు ప్రమోషన్!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఆశించిన స్థానాలు రాక చతికిలపడింది. అంతేకాకుండా ఓటమి తర్వాత కుటుంబంలో అంతర్గత కలహాలు కూడా రచ్చకెక్కాయి. మొత్తానికి అపజయం ఆర్జేడీలో ఓ కుదుపు కుదిపేసింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు కుదిటపడినట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీ బలోపేతంపై ఆర్జేడీ తీవ్ర కసరత్తే చేసింది. పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘ మేథోమధనం తర్వాత నాయకత్వంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఆర్జేడీ నేతల చర్చల తర్వాత నాయకత్వం మార్పు జరగాలని ఒక భావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే తేజస్వి యాదవ్‌కు ప్రమోషన్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. త్వరలోనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాలని ఆర్జేడీ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జనవరి 16, 17 తేదీల్లో జరిగిన ఆర్జేడీ తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లాలూ ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలోకి తేజస్వి యాదవ్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీకి 30 లక్షల ఓట్లు వచ్చారు. ఇదంతా తేజస్వి యాదవ్ కారణంగానే వచ్చినట్లుగా భావించడంతో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తే పార్టీ పరిస్థితి మరింత బాగుంటుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో పార్టీ నాయకులు మిసా భారతి, మనోజ్ ఝా, సంజయ్ యాదవ్, సుధాకర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రియుడితో అసభ్యకర రీతిలో చూసిన కొడుకు.. చంపేసిన తల్లి.. కలల్లో కనిపించడంతో
అక్రమ సంబంధాలు కడుపున పుట్టిన పిల్లలను సైతం చంపేలా చేస్తున్నాయి. ఓ తల్లి తన ప్రియుడితో అసభ్యకర రీతిలో ఉండగా తన ఐదేళ్ల కొడుకు చూడడంతో దారుణానికి పాల్పడింది. భర్తకు చెప్తాడని భావించి ఆమె తన కొడుకును రెండంతస్తుల ఇంటి పైకప్పు నుండి తోసేసి చంపేసింది. ఈ సంఘటన ఏప్రిల్ 28, 2023న గ్వాలియర్ జిల్లాలోని థాటిపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. అయితే ఆ తల్లి ఈ నిజాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడింది. కానీ తన కొడుకు పదే పదే కలల్లో కనిపించడంతో ఆమెను నిజం ఒప్పుకునేలా చేశాయి. దీని తరువాత, ఆ పిల్లవాడి కానిస్టేబుల్ తండ్రి, తన భార్య నుంచి వివరాలు తెలుసుకుని ఒక వీడియో తయారు చేసి, ఆధారాలు సేకరించి, పోలీసులకు ఇచ్చాడు. సాక్ష్యం ఆధారంగా, సెషన్స్ కోర్టు శనివారం హత్యకు పాల్పడిన తల్లికి జీవిత ఖైదు విధించింది. అయితే, ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఆమె ప్రేమికుడిని నిర్దోషిగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం, తన కొడుకును హత్య చేసినందుకు దోషిగా తేలిన జ్యోతి రాథోడ్, సంఘటన జరిగిన సమయంలో తన పొరుగువాడు ఉదయ్ ఇందూలియాతో కలిసి టెర్రస్ మీద ఉంది. ఇంతలో, ఆమె ఐదేళ్ల కుమారుడు సన్నీ అలియాస్ జతిన్, టెర్రస్ పైకి చేరుకుని తన తల్లిని తన ప్రేమికుడితో అభ్యంతరకరమైన స్థితిలో చూశాడు. అక్రమసంబంధం బహిర్గతం అవుతుందనే భయంతో, జ్యోతి తన కొడుకును రెండంతస్తుల ఇంటి పైకప్పు నుండి కిందికి విసిరివేసింది. కిందపడటంతో ఆ చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు అతను మరణించాడు. మృతుడి తండ్రి, పోలీస్ కానిస్టేబుల్ ధ్యాన్ సింగ్ మొదట దీనిని ప్రమాదవశాత్తు జరిగినట్లు భావించారు.
ముదురుతున్న గ్రీన్‌లాండ్ వివాదం.. ఈయూ దేశాలపై ట్రంప్ టారిఫ్ వార్నింగ్
గ్రీన్‌లాండ్ విషయంలో మిత్ర దేశాల మధ్య రగడ మొదలైటట్టు కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని ఎప్పటి నుంచో ట్రంప్ కలలు కంటున్నారు. ప్రస్తుతం ఆ ఒత్తిడి మరింత పెంచుతున్నట్లు కనిపిస్తోంది. వెనిజులాను స్వాధీనం చేసుకున్నాక.. ఇప్పడు ఫోకస్ అంతా గ్రీన్‌లాండ్‌పైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం డెన్మార్క్ ఆధ్వర్యంలో గ్రీన్‌లాండ్ ఉంది. ఈ డెన్మార్క్ నాటోలో భాగంగా ఉండడంతో ట్రంప్ నిర్ణయాన్ని యూరోపియన్ దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకుంటామంటే ఊరుకోమని ప్రత్యక్షంగా వార్నింగ్ ఇస్తున్నాయి. ఇక తన ప్రణాళికకు యూరోపియన్ దేశాలు అడ్డు తగులుతుండడంతో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1, 2026 నుంచి డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకం విధిస్తామని.. అంతేకాకుండా జూన్ 1 నుంచి 25 శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా భద్రతకు గ్రీన్‌లాండ్ చాలా అవసరం అని.. దాని మీద ఒప్పందం కుదరకపోతే.. అవసరమైతే బలవంతంగానైనా తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
గంభీర్ శకంలో మరో అవమానకరమైన రికార్డు..
ఆదివారం ఇండోర్‌లో జరిగిన వన్డేలో భారత జట్టు 338 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత గడ్డపై న్యూజిలాండ్ తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. 37 సంవత్సరాల తర్వాత కివీస్ చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లో ఓటమితో, టీమ్ ఇండియా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. ఇండోర్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో కివీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 124 పరుగులు చేసినప్పటికీ, భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 137, గ్లెన్ ఫిలిప్స్ 106 పరుగులతో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్లకు 337 పరుగులు చేసింది. గంభీర్ మరో అవమానకరమైన రికార్డును తన పేరు మీద చేర్చుకున్నాడు. అక్టోబర్ 2024లో, కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల తర్వాత, మూడు మ్యాచ్‌ల స్వదేశీ సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన తొలి భారత కోచ్ అయ్యాడు. 1955-56లో తొలిసారి భారతదేశాన్ని సందర్శించిన న్యూజిలాండ్, భారతదేశంలో ఎప్పుడూ వన్డే సిరీస్‌ను గెలవలేదు. కానీ ఈసారి, కివీస్ సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, భారత జట్టు 2024లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి.
నా క్యారవాన్ లోకి దూరి నాపై చేయి వేసిన పాన్ ఇండియా హీరోను చెంపదెబ్బ కొట్టాను
సినీ పరిశ్రమలో గ్లామర్ వెనుక ఎన్నో అవమానకర అనుభవాలు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ముఖానికి రంగు వేసుకున్నంత మాత్రాన చులకనగా చూస్తారని ఎన్నో సార్లు ఎందరో నటీనటులు తమకు ఎదురైనా ఇబ్బందికర సంఘనల గురించి చెప్తుంటారు. మరి ముఖ్యంగా హీరోయిన్స్ పట్ల కొందరు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ నటి పూజా హెగ్డే తన కెరీర్‌లో ఎదురైన ఓ షాకింగ్ ఘటనను గురించి వెల్లడించింది. వివరాలలోకెళితే పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘కొన్ని సంవత్సరాల క్రితం తాను ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటించాను. ఆ సినిమా షూటింగ్ సమయంలో తన అనుమతి లేకుండా కనీసం మాట కూడా అడగకుండా ఓ స్టార్ నటుడు తన కారవాన్‌లోకి ప్రవేశించాడు. ఆ క్షణంలో తాను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ నటుడు నాతో హద్దులు దాటినట్లుగా అనిపించింది. అప్పుడు ఏమి చేయాలో అర్ధం కాలేదు. ఇక ఆ పరిస్థితిలో తాను మౌనంగా ఉండలేక వెంటనే అతడిని చెంపదెబ్బ కొట్టాను. దాంతో అతను వ్యాన్ దిగి వెళ్ళాడు. ఆ ఘటన తర్వాత ఆ నటుడు మళ్లీ తనతో కలిసి పని చేయడానికి ఇష్టపడలేదు. చివరకు ఆ పాన్ ఇండియా సినిమాలో నాకు సంబంధించిన కొన్ని సీన్స్ లో నేను నటించాల్సి ఉండగా డూప్ ను పెట్టి తీసేసారు’ అని తెలిపింది పూజా. అయితే ఆ వ్యక్తి ఎవరో మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఎవరా స్టార్ హీరో అని ట్వీట్స్ చేస్తున్నారు.
అఖిల్ ‘లెనిన్’ షూటింగ్ అప్‌డేట్..
అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమైన ‘లెనిన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ వారం నుంచి కీలకమైన క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో అఖిల్ తో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంత నేపధ్యంలో సాగే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో కథానాయికగా నటిస్తుండగా, అఖిల్-భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ప్రస్తుతం టీమ్ ఒకవైపు షూటింగ్ పూర్తి చేస్తూనే, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుతోంది. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల చాలా ధీమాగా ఉన్నారట. మరి ఈ రాయలసీమ కథతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
