శ్రీవారి భక్తులకు అలర్ట్..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఇవాళ ఆన్ లైన్ లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయబోతున్నారు.. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు రిజిష్ర్టేన్‌కు అవకాశం కల్పించగా.. ఎల్లుండి మధ్యహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయించనున్నారు.. మరోవైపు.. ఇవాళ టీటీడీ పాలమండలి సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది..
ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు.. నేడు సభ ముందుకు కీలక బిల్లులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఆరవ రోజు కొనసాగనున్నాయి.. ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఇక, అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు ప్రవేశ పెట్టనున్నారు మంత్రి పొంగూరు నారాయణ.. డివిజినల్ రైల్వే యూసర్స్ కన్సల్టేటివ్ కమిటీలో ప్రతినిధిగా ఎంఎల్ఏలలో ఒకరిని ఎన్నుకోవడానికి అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. 2024-25 గ్రాంట్స్ కోసం డిమాండ్స్ పై చర్చ.. ఓటింగ్ నిర్వహించనున్నారు.. మరోవైపు కీలక బిల్లులు ఈ రోజు అసెంబ్లీ ముందుకు రాబోతున్నాయి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ పంచాయితీరాజ్ సవరణ బిల్లు 2024.. మంత్రి పొంగూరు నారాయణ.. ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లు 2024.. మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024.. ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024.. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024.. మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024.. మంత్రి అచ్చెం నాయుడు.. ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు..
ఆంధ్రలో అమానవీయ ఘటన.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరింపు..
ఆంధ్రప్రదేశ్‌లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థునుల జుట్టు కత్తిరించారు.. ఈ ఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చోటు చేసుకుంది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించడం విమర్శలకు దారితీసింది. జి. మాడుగుల KGBV జూనియర్ కాలేజ్ హాస్టల్ లో ఈ నెల 15న ఈ ఘటన జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో ప్రత్యేక అధికారిణి విద్యార్థినుల జుత్తును కొద్దికొద్దిగా కత్తిరించగా.. తల్లి దండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కార్తిక పౌర్ణమి రోజు స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నీరు అందుబాటులో లేదు. దీంతో, బైపీసీ రెండో ఏడాది విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా హాజరయ్యారు. 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులను ఎండలో నిల్చో పెట్టారు. మధ్యాహ్న భోజన విరామంలో 18 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించారు. అయితే, విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడం.. వాళ్లు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది.. మరోవైపు.. జుట్టు విరబోసుకుని తిరుగుతున్నందుకు శిక్ష విధించినట్టు చెప్పుకొచ్చారట ప్రత్యేక అధికారిణి.. అయితే, ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో.. విద్యాశాఖ విచారణ చేపట్టింది.
తెలంగాణలో నేటి నుంచి నూతన ఈవీ పాలసీ..
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఈవీ పాలసీలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్నును కూడా 100 శాతం తగ్గిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు ఏడాదికి లక్ష రూపాయలు ఆదా అవుతుందని తెలిపారు. ఢిల్లీ మాదిరిగానే హైదరాబాద్ నగరంలో కూడా కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని నివారించేందుకే కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో నంబర్ 41 ద్వారా తీసుకొచ్చిన ఈవీ పాలసీ నేటి నుంచి (నవంబర్ 18) 2024 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు చెల్లుబాటు అవుతుందని పొన్నం పేర్కొన్నారు.కొత్త ఈవీ విధానం ద్వారా ఆటో, రవాణా బస్సులకు అదనంగా 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని జంటనగరాలు, జిల్లాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నామని.. మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న మూడు వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారన్నారు. త్వరలో అన్ని ఈవీ ఆర్టీసీ బస్సులు నగరంలో నడపనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై నగరవాసులు శ్రద్ధ వహించాలని సూచించారు.
హైదరాబాద్‌లో ఫిఫా ఫుట్‌బాల్ మ్యాచ్.. మలేసియాతో భారత్ ఢీ!
గత సెప్టెంబర్‌లో ఇంటర్‌కాంటినెంటల్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్.. మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. సోమవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి మైదానంలో భారత్, మలేసియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఇప్పటికే పూర్తిచేసింది. తొలిసారి హైదరాబాద్ వేదికగా ఫిఫా మ్యాచ్ జరుగుతుండడంతో ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. రాత్రి 7:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ ఏడాదిలో 10 మ్యాచ్‌లు ఆడిన భారత్ 4 డ్రాలు, 6 ఓటములను ఎదుర్కొంది. 2024లో ఒక్క విజయం సాధించని భారత్.. మలేసియాపై గెలవాలని చూస్తోంది. ఈ ఏడాది భారత జట్టుకు ఇదే చివరి మ్యాచ్ కావడంతో విజయం సాధించి.. వచ్చే ఏడాది మార్చిలో ఆరంభమయ్యే 2027 ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు సిద్ధమవ్వాలని చూస్తోంది. గాయం కారణంగా దాదాపు 10 నెలలు దూరంగా ఉన్న సెంట్రల్ డిఫెండర్ సందేశ్ జట్టుతో చేరుతున్నాడు. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ 125వ స్థానంలో ఉండగా.. మలేసియా 133వ స్థానంలో ఉంది.
నేను మహారాష్ట్ర సీఎం రేసులో లేను కానీ.. సీఎం ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని, అయితే సీఎం పదవి తనకు రావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను తప్పకుండా సీఎం అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌ను కూడా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ది విభజించు పాలించు విధానమన్నారు. తన పార్టీని ఎప్పటికీ కాంగ్రెస్‌లోకి మార్చనివ్వనని బాలాసాహెబ్ ఠాక్రే చెబుతుండేవారని గుర్తుచేశారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం తన స్వార్థం కోసం, ముఖ్యమంత్రి కుర్చీ కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలిపారని మండిపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని వెన్నుపోటు పొడిచారన్నారు. కాగా.. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలను వెల్లడిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 145 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) అవసరం. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడి కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. మహాయుతిలో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (ఏక్‌నాథ్ షిండే), మన్సే, ఆర్‌పీఐ సహా 8 పార్టీలు ఉండగా.. మహావికాస్ అఘాడిలో కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) సహా పలు పార్టీలు ఉన్నాయి.
మణిపూర్‌లో ఉద్రిక్తత.. బీజేపీ ప్రభుత్వానికి ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరణ
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగిలిపోతుంది. రెండు జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిభద్రతలను పరీరక్షించడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలం కావడంతో ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరించుకుంది. 60 మంది సభ్యులున్న సభలో ఎన్పీపీ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ ఉండటంతో మద్దతు ఉపసంహరణ ప్రభుత్వంపై ప్రభావం చూపించదు. కాగా, మణిపూర్‌లో శనివారం రాత్రి మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో కుకీలు ఆరుగురి మైటీ వర్గానికి చెందిన వారిని హతమార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసనకారులు ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడి చేశారు. దీంతో పాటు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇంటిపై కూడా దాడికి పాల్పడ్డారు.
బ్రెజిల్ చేరుకున్న భారత ప్రధాని.. జీ-20 సదస్సులో పాల్గొననున్న మోడీ
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ.. బ్రెజిల్ చేరుకున్నారు. నేడు రియో డీజెనిరోలో జరిగే జీ-20 సదస్సులో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో ప్రధాని సమావేశం కానున్నారు. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోడీ.. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున బ్రెజిల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. జీ-20 సదస్సులో భాగంగా నేడు పలు దేశాధినేతలతో నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. గతేడాది భారత్‌లో జీ-20 సదస్సు జరిగింది. ఇప్పుడు బ్రెజిల్‌లో జరుగుతుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 శిఖరాగ్ర సమ్మిట్ జరగనుంది. అలాగే, జీ-20 సదస్సు తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ.. గయానాకు వెళ్లనున్నారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అహ్వానం మేరకు ఆయన ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉండనున్నారు. గయానాలో జరగనున్న ఇండియా- కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ప్రదానం చేయనున్నారు. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, 50 ఏళ్ల భారత ప్రధాని గయానాలో పర్యటిస్తున్నారు.
కెప్టెన్‌గా శ్రేయస్.. అయ్యర్ సారథ్యంలో సూర్యకుమార్!
నవంబర్ 23 నుండి డిసెంబర్ 15 మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 జరుగుతుంది. ఈ టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) ఆదివారం ప్రకటించింది. అందరూ ఊహించినట్టే.. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవరిస్తున్నాడు. అయ్యర్ సారథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేలు ఆడనున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల మొదటి మ్యాచ్‌కు సూర్య దూరం కానున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ 2024లో ముంబైకి కెప్టెన్‌గా అజింక్య రహానే ఉన్న విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ చెలరేగాడు. రెండు సెంచరీలతో 90.40 సగటుతో 452 పరుగులు చేశాడు. ఒడిశాపై 233 పరుగులు, మహారాష్ట్రపై 142 రన్స్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సారథిగా రహానే వ్యహరిస్తాడని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఎంసీఎ మాత్రం శ్రేయస్ వైపు చూపింది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా రంజీ ట్రోఫీ జట్టు నుండి తొలగించబడ్డ పృథ్వీ షాకు మరలా చోటు దక్కింది. తనుష్ కోటియన్, సిద్ధేష్ లాడ్ కూడా జట్టులోకి వచ్చారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2006-7లో ప్రారంభమైంది. తమిళనాడు తొలి విజేతగా నిలిచింది. 2023-24 సీజన్‌లో ఛాంపియన్‌గా పంజాబ్ నిలిచింది.
ప్రధాని మోడీ మాజీ సెక్యూరిటీ గార్డుకి బిగ్ బాస్‌లో ఆఫర్.. కానీ..
సల్మాన్ ఖాన్ రియాల్టీ షో ‘బిగ్ బాస్ 18’ బుల్లితెరపై హల్ చల్ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ భద్రతా సిబ్బంది లక్కీ బిష్త్ షోలో అవకాశం వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్‌ను అతడు తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. లక్కీ మాజీ స్నిపర్, RAW ఏజెంట్. అతడు తన సోషల్ మీడియాలో బాగా ప్రసిద్ధి చెందాడు. దీని కారణంగా ‘బిగ్ బాస్ 18’ మేకర్స్ అతనిని సంప్రదించినట్లు సమాచారం. లక్కీ ఒక ప్రకటనలో.. “నేను ఒక RAW ఏజెంట్. మా జీవితాలు తరచుగా గోప్యత, మిస్టరీలతో నిండి ఉంటాయి. చాలా తక్కువ మందికి మా గురించి పూర్తి వివరాలు తెలుసు. మా గుర్తింపు లేదా వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ బహిర్గతం చేయకుండా మేము శిక్షణ పొందాం. నేను దానిని అనుసరించాను. ప్రజలు దీనిని అర్థం చేసుకుని మద్దతు ఇస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.” అని పేర్కొన్నాడు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ నివాసి అయిన లక్కీ బిష్త్, తన టీమ్‌తో మాట్లాడి, బిగ్ బాస్ మేకర్స్‌తో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది లక్కీ జీవిత చరిత్రపై ఓ నవల కూడా ప్రచురించారు. అతని కథ ‘హిట్‌మ్యాన్: ది రియల్ స్టోరీ ఆఫ్ ఏజెంట్ లిమా’లో ప్రదర్శించబడింది. దీనిని సైమన్ , షుస్టర్ ప్రచురించారు. ఆయన చరిత్రపై సినిమా చేసే అవకాశం కూడా ఉంది. కాగా.. బిగ్గెస్ట్ బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ కు ఎంతటి క్రేజ్ వుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ షో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ఘనంగా మొదలైంది. విజయవంతంగా కొనసాగుతోంది.
గత పదేళ్లలో ఇలా జరగడం మొదటిసారి : మైత్రీ రవి
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప -2. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్ గత ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది పాట్నా చరిత్రలో ఎన్నడు జరగని పెద్ద ఈవెంట్ గా కొత్త రికార్డు సృష్టించింది.సుమారు 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ వ్యక్తుల మధ్య ఈ ఈవెంట్ జరగటం విశేషం. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మాట్లాడుతూ “పాట్నా ప్రజలందరికీ నమస్కారం. ఇంతటి అభిమానాన్ని మేము పాట్నా నుండి అస్సలు ఊహించలేదు. ఒకరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఈ చిత్రం ఇంతటి విజయవంతమైన ప్రయాణం కావడానికి ముఖ్య కారణం స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్. మైత్రి మూవీ మేకర్ రవి మాట్లాడుతూ “మేము ఇప్పటికీ ఎన్నో చిత్రాలను చేశాము. ఎన్నో ఈవెంట్స్ కూడా చేశాము. కానీ ఒక ట్రైలర్ను ఇలా విడుదల చేయడం అనేది మొదటిసారిగా జరుగుతుంది. పాట్నా నుండి ఇంతటి అభిమానాన్ని మేము ఊహించలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. డిసెంబర్ 5తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత పది సంవత్సరాల్లో ఇంతటి పెద్ద ఈవెంట్ చూడటం ఇదే తొలిసారి” అన్నారు.
కాంతారా 2 రిలీజ్ అయ్యేది అప్పుడే.. అప్ డేట్ వచ్చేసిందోచ్
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ‘కాంతార’. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ‘కాంతార’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లను వసూళ్లు చేసి ఔరా అనిపించింది. కొన్ని పదుల రెట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టిన కాంతార సినిమాకు సీక్వెల్ రావాలని అభిమానులు కోరుతున్నారు. అంతా కోరుకున్నట్లుగానే కాంతార 2 రాబోతున్న సంగతి తెలిసిందే. కాంతార లో చూపించిన కథకు ముందు జరిగే కథతో కాంతార : చాప్టర్ 1 టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ‘కాంతార’ను లో బడ్జెట్ మూవీగా తీసుకు వచ్చిన రిషబ్ శెట్టి ఈసారి వంద కోట్లకు మించిన బడ్జెట్‌తో తెరకెక్కిస్తారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోంది. 2025లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని గతంలోనే రిషబ్ శెట్టి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయమై మరింత స్పష్టత ఇచ్చింది చిత్రయూనిట్. అక్టోబర్ 2, 2025న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ రావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.