NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం.. నేడు శాంతిభద్రతలపై
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ వైఫల్యాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తుంది.. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్, సహజ వనరుల దోపిడీ (ఇసుక, గనులు, భూ కబ్జాలు) వంటి వాటిపై శ్వేత పత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడచిన ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బందకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించనున్నారు సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వ హయాంలో.. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునేలా పాలకులు వ్యవహరించిన తీరు, సాధారణ పౌరుల పైనా కేసులు నమోదు చేసిన వ్యవహారం, ఎస్సీలపై దాడులు, హత్య కేసులు తదితర అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించే అవకాశం ఉంది.. మరోవైపు.. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి, వైఎస్‌ వివేకా హత్యకేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టుగా తెలుస్తోంది. గడచిన ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం. ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేయగా.. శాంతి భద్రతలు ఐదో శ్వేత పత్రం. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం.. ఇవి కాకుండా మరో రెండు శ్వేత పత్రాలు విడుదల చేయాల్సి ఉంది.. వీటిల్లో మద్యం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వంటి అంశాలున్నాయి. ఈ నెల 20వ తేదీలోగా శ్వేత పత్రాలను పూర్తి చేయనున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ శ్వేత పత్రాల అంశాన్ని ప్రస్తావించి.. వాటిపై సభలో చర్చించనుంది ప్రభుత్వం.

వినుకొండలో దారుణం.. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై యువకుడి నరికివేత..!
ఆంధ్రప్రదేశ్‌లో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై నరికివేశాడో యువకుడు.. ఈ ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో చోటు చేసుకుంది. పట్టణంలో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేయడం తీవ్ర కలకలం సంచలనం కలిగించింది.. వ్యక్తిగత కక్షలతో రషీద్ అనే వ్యక్తిపై జిలాని అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.. చేతులపై, మెడపై, తలపై ఇలా విచక్షణా రహితంగా దాడి చేస్తూ.. ప్రాణం పోయే వరకు నరికి హత్య చేశాడు… అయితే దాడి చేస్తుంటే, కనీసం రోడ్డుపై వెళ్లేవారు కానీ, స్థానికులు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.. దీంతో అందరూ చూస్తోందగానే రషీద్ అనే వ్యక్తి ప్రాణం కోల్పోయాడు.. ఇక, స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సీరియస్‌గా స్పందించారు. నడిరోడ్డుపై హత్యా ఘటనపై ఎస్పీ మాట్లాడుతూ.. రషీద్ అనే వ్యక్తి ని జిలాని అనే యువకుడు నరికి హత్య చేశాడన్నారు.. ఈ హత్యకు కారణం ఇద్దరికి వ్యక్తిగత ఘర్షణలు ఉన్నాయని.. దీనిలో ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేదని సృష్టం చేశారు జిల్లా ఎస్పీ.. వినుకొండలో జరిగిన దారుణ హత్య నేపథ్యంలో, పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం అని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు ఎస్పీ శ్రీనివాసరావు.

నేడే లక్ష రుణం మాఫీ.. వీడియో కాన్ఫరెన్స్​లో రైతులతో సీఎం ముఖాముఖి..
ఇవాల్టి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి దశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణాలు ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా రూ.6,098 కోట్లు జమ చేయనుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశాయి. వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు ట్రయల్న్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్న నున్నారు. మధ్నాహ్నం 2 గంటలకు తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్​ సొసైటీ (TGC)) సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు రైతునేస్తం. 500 రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్య్రమం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ లెక్కల ప్రకారం లక్షా 60వేల మంది రైతులు సహా మొత్తం 39 లక్షల కుటుంబాలు రుణమాఫీకి అర్హులు. రుణమాఫీకి మొత్తం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని, అయితే నెలాఖరులోగా రూ.1.5 లక్షలు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రుణమాఫీకి గడువు విధించిన ప్రభుత్వం.. ప్రక్రియ పూర్తికాగానే రైతుల వేదికల వద్ద సంబురాలు నిర్వహించాలని నిర్ణయించింది. రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్‌లైన్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం రైతువేదికలో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి వేడుకలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆయా నియోజకవర్గాల్లో రుణమాఫీ ప్రచారంలో పాల్గొంటారు.

రుణమాఫీ డబ్బులు రైతుల అప్పులకు మళ్లించొద్దు.. బ్యాంకర్లకు భట్టి వార్నింగ్..
ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు.. మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించనున్నారు. ఈ నేథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రజా భవన్ లో బ్యాంకర్స్ తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం జరగునుంది. రుణమాఫీ గురించి బ్యాంకర్లతో చర్చించనున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు.. మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించనున్న ఉప ముఖ్యమంత్రి. రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామని నిన్న ప్రజాభవన్ లో భట్టి తెలిపారు. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని, ఎవరిని వదలం.. ఎవరికి అవకాశం ఇవ్వమన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ నాయకులారా రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. తల ఎత్తుకొని … ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయండని, మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని 25000 చొప్పున.. నాలుగు ద పాలుగా పూర్తి చేశారన్నారు భట్టి విక్రమార్క.

కేరళలో చిక్కుకుపోయిన 11 మంది మత్స్యకారులను రక్షించిన ఐసీజీ
ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కేరళ తీరంలో చిక్కుకుపోయిన భారతీయ ఫిషింగ్ బోట్‌ను 11 మంది వ్యక్తులతో రక్షించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ జూలై 17న చిక్కుకుపోయిన భారతీయ ఫిషింగ్ బోట్‌లోని 11 మంది సిబ్బందిని విజయవంతంగా రక్షించింది. భారీ వర్షం మధ్య సముద్ర-గాలి ఆపరేషన్‌లో, కోస్ట్ గార్డ్ కేరళలోని కొచ్చికి 80 నాటికల్ మైళ్ల దూరంలో ఐఎఫ్‎బీ అష్నిని సురక్షితంగా రక్షించింది. కీల్ సమీపంలో పొట్టు విరిగిపోవడం వల్ల వరదలు సంభవించాయి. దీనివల్ల ఓడ చిక్కుకుపోయింది. ఈ సమయంలో సిబ్బంది ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడింది. సముద్ర నిఘాలో ఉన్న ఇండియన్ కోస్ట్ గార్డ్స్ బోటును గుర్తించింది. పెట్రోలింగ్ ICG నౌకను వెంటనే ICG జిల్లా ప్రధాన కార్యాలయం కేరళ, మహే నౌకకు సహాయంగా మళ్లించారు. సిబ్బందిని రక్షించడానికి హెలికాప్టర్‌తో పాటు మరో ఐసిజి నౌక అభినవ్‌ను కూడా మోహరించారు. ఐసిజికి చెందిన సాంకేతిక బృందం డిస్ట్రెస్ బోట్‌లోకి ఎక్కి అవసరమైన సహాయాన్ని అందించింది. అన్ని సిబ్బందిని, ఓడను రక్షించడంతో ఆపరేషన్ ముగిసింది. అనంతరం బోటును మత్స్యశాఖకు అప్పగించారు. ఇంతకు ముందు కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎన్నో ఆపరేషన్లు చేసింది. భారత తీర రక్షక దళం ఏప్రిల్‌లో ఆపరేషన్‌లో 27 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించింది. మత్స్యకారులంతా సముద్రంలో తమ పడవల్లో చిక్కుకుపోయారు. బోటును తనిఖీ చేయగా, బంగ్లాదేశ్‌కు చెందిన సాగర్‌-2 బోట్‌లో గత రెండు రోజులుగా స్టీరింగ్‌ గేర్‌ నాసిరకంగా ఉందని, బోటులోని లోపాన్ని గుర్తించిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ టెక్నికల్‌ టీమ్‌ రిపేర్‌ చేసేందుకు ప్రయత్నించగా అది కాలేదు.. పూర్తిగా దెబ్బతింది. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ షిప్ (BCGS) కమ్రుజ్జామన్‌ను బీఎఫ్బీకి ఎస్కార్ట్ చేయడానికి బీసీజీ నియమించింది.

ఒమన్‌లో ఎనిమిది మంది భారతీయులను రక్షించిన ఇండియన్ నేవీ
ఒమన్ సముద్ర ప్రాంతంలో ‘ప్రెస్టీజ్ ఫాల్కన్’ అనే ఆయిల్ ట్యాంకర్ మునిగిపోయిన సంఘటన తెలిసిందే. అందులో ఉన్న 16 మంది సిబ్బంది అదృశ్యమయ్యారు, వారిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంకకు చెందినవారు ఉన్నారు. భారత నావికాదళం మిషన్‌లో మోహరించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ టెగ్, ఈ ట్యాంకర్‌కు సహాయం చేస్తూ మొత్తం తొమ్మిది మంది సిబ్బందిని రక్షించింది. ఇందులో ఎనిమిది మంది భారతీయులు, ఒకరు శ్రీలంక సిబ్బంది ఉన్నారు. ఒమన్‌లోని రాస్ మదరకాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో సోమవారం రాత్రి ఈ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ఒమన్ అధికారులు విచారణ ప్రారంభించారు. మంగళవారం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎలాంటి క్లూ లభించకపోవడంతో భారత నౌకాదళం కూడా ట్యాంకర్ కోసం వెతకడానికి ఓడను పంపింది. దీని తరువాత, సవాలు వాతావరణ పరిస్థితులలో భారతదేశం, ఒమన్ సైనికులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన గాలులు వీస్తున్నాయి.

అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ కు కోవిడ్ పాజిటివ్
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. లాస్ వెగాస్‌లో జరిగిన మొదటి ఈవెంట్ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ కోవిడ్ -19టెస్ట్ పాజిటివ్ గా వచ్చింది. డాక్టర్లు ఆయనకు టీకాలు వేస్తున్నారు. బూస్టర్ డోస్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం బిడెన్ డెలావేర్ సిటీలో ఐసోలేషన్లో ఉన్నారు. అలా ఉంటూనే తాను అన్ని విధులు నిర్వహిస్తాడని వైట్ హౌస్ నుంచి సమాచారం. వైట్ హౌస్ కూడా అధ్యక్షుడి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తుంది. బిడెన్ కరోనా తేలికపాటి లక్షణాలను అనుభవించినట్లు వైట్ హౌస్‌కు తెలియజేసింది. బిడెన్‌కు కరోనా సోకినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ప్రకటించారు. కరోనా సోకిన కారణంగా జో బిడెన్ భవిష్యత్ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారని చెప్పారు.

తక్కువ ధర, భారీ బ్యాటరీతో ‘శాంసంగ్‌’ కొత్త ఫోన్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ ‘శాంసంగ్‌’ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎం సిరీస్‌లో ‘శాంసంగ్‌ ఎం 35 5జీ’ను భారతదేశంలో బుధవారం లాంచ్‌ చేసింది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండడం విశేషం. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌, నథింగ్‌ 2ఏ, రెడ్‌మీ 13 5జీ ఫోన్‌లకు ఎం 35 5జీ గట్టి పోటీనివ్వనుంది. ఈ ఫోన్ ఫుల్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. శాంసంగ్‌ ఎం 35 5జీ స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా.. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.21,499గా కంపెనీ నిర్ణయించింది. ఇక 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా ఉంది. మూన్‌లైట్‌ బ్లూ, డే బ్రేక్‌ బ్లూ, థండర్‌ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది. శాంసంగ్‌ వెబ్‌సైట్, అమెజాన్‌ సహా ఇతర రిటైల్‌ స్టోర్లలో జులై 20 నుంచి ఎం 35 5జీ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అన్ని బ్యాంక్‌ కార్డులపై రూ.2 వేల తగ్గింపు ఉంది. రూ.1000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను శాంసంగ్‌ అందిస్తోంది. మరోవైపు అమెజాన్‌ పే క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

అలాంటి ఆటగాళ్లనే ఎంపిక చేస్తా: గంభీర్
ఇటీవల జింబాంబ్వే టూర్ ముగించిన భారత్ మరో పర్యటనకు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ప్రస్తుతం లంక పర్యటనపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ పర్యటనతోనే గౌతమ్ గంభీర్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. భారత జట్టు ఎంపికపై అందరిలో ఆసక్తి పెరిగింది. జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది, కెప్టెన్ ఎవరు అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ఓ వీడియోలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… భయం లేని క్రికెటర్లను జట్టులోకి ఎంపిక చేస్తానని చెప్పాడు. హిట్టర్లతో పాటు అన్ని రకాల ప్లేయర్స్ జట్టులో ఉండేలా చూస్తానన్నాడు. ‘భయం లేని ఆటగాళ్లను జట్టులోకి ఎంచుకోవాలి. 50 ఓవర్ల ఫార్మాట్‌కు సరిపోయే ఆటగాళ్లను తీసుకోవాలి. యాంకర్ ఇన్నింగ్స్ ఆడే వాళ్లు, హిట్టర్లు, ఆల్‌రౌండర్‌లు, బౌలర్లు అన్ని రకాల ఆటగాళ్లు జట్టులో ఉండాలి. గతంలో ఒకే కొత్త బంతితో ఆడేవారు. ఇప్పుడు రెండు కొత్త బంతులతో ఆడుతున్నారు. అయిదుగురు ఫీల్డర్లు సర్కిల్‌ లోపలే ఉండాలి. దీంతో పార్ట్ టైమ్ బౌలర్‌ అవసరం తగ్గిపోయింది. రివర్స్ స్వింగ్‌ను చూడలేకపోతున్నాం. ఫింగర్ స్పిన్నర్ల ఆటను కోల్పోతున్నాం. అందుకే తమ బాధ్యతలను సులువుగా అర్థం చేసుకుంటూ.. సహజసిద్ధంగా ఆడే ఆటగాళ్లు జట్టులో ఉండాలి. అలాంటి ఆటగాళ్లనే ఎంపిక చేయాలి’ అని గంభీర్ తెలిపాడు.

శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరు?
మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు భారత జట్టు శ్రీలంకకు వెళుతున్న విషయం తెలిసిందే. జూలై 27 నుంచి టీ20 సిరీస్, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నాయి. శ్రీలంక పర్యటనకు భారత జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించే అవకాశముంది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా.. సెలక్షన్‌ కమిటీ సమావేశం నేటికి వాయిదా పడ్డట్లు సమాచారం. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ, టీమిండియా కొత్త హెడ్ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కలిసి జట్టును ఎంపిక చేయనున్నారు. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ను కూడా ఈ సమావేశంలోనే ఎంపిక చేస్తారు. రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యానే పగ్గాలు అందుకుంటాడని అందరూ అనుకున్నా.. సూర్యకుమార్‌ యాదవ్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని గౌతమ్‌ గంభీర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాండ్యా‌కు ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తకుండా.. వర్క్‌లోడ్ మేనేజ్‌ చేయడానికి గౌతీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలని భావిస్తున్నాడట. ఈ విషయంపై నేడు క్లారిటీ రానుంది. రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో భారత టీ20 జట్టులో కుర్రాళ్లకు అవకాశం దక్కనుంది. ఇక వన్డే సిరీస్‌కు రోహిత్‌, కోహ్లీ దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. దీంతో కేఎల్‌ రాహుల్‌ తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపిక అయ్యే అవకాశముంది. అతడికి పోటీగా శ్రేయాస్ అయ్యర్ కూడా ఉన్నాడు. బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించిన ఇషాన్ కిషన్ జట్టులోకి ఎంపికవుతాడో లేదో చూడాలి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము..అందరూ ఆహ్వానితులే
ఘట్టమనేని వారి ఇంట పెళ్లి బాజా మోగనుంది, దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఘట్టమనేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. అతిధిలకు, బంధువులకి ఆహ్వాన పత్రికల పంపకాలు కూడా ప్రారంభించారు. ఈ వేడుకను ముత్యాల పందిరిలో, అతిరధ మహారథుల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల రుచులను విందులో వడ్డించనున్నారు. ఘట్టమేని సత్యనారాయణ కనిష్ట పుత్రుడు వరుడు: మురారిని, చంటి – అన్నపూర్ణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక చి||లా|| సౌ. వసుంధర కు ఇచ్చి శ్రీ క్రోధినామ సంవత్సర శుక్ల పక్ష త్రయోదశి నాడు అనగా ఆగస్టు 9న వివాహం జరిపించుటకు నిశ్చయించినారు. కావున తామెల్లరు విచ్చేసి, మా ఆతిధ్యం స్వీకరరించి వేద పండితుల సాక్షిగా ఒక్కటవుతున్న మా చిరంజీవులు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము అని ఘట్టమనేని వారి కుటుంభ సభ్యులు వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే ఆగస్టు 9న ఘట్టమనేని సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఆ సందర్భంగా మహేశ్ నటించిన కల్ట్ క్లాసిక్ లో ఒకటైన మురారి చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా చేసారు. దీంతో అభిమనులు ఈ రీరిలీజ్ ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు గాను ఘట్టమనేని వారి వివాహ ఆహ్వాన ప్రతీకలను డిజైన్ చేసి ప్రతి ఒక్క అభిమానిని అవాహానిస్తున్నారు. ప్రస్తుతం ఈ పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మురారి తో పాటు ఒక్కడు చిత్రాన్ని కూడా రీరిలీజ్ చేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఒక్కడు ఉదయం రెండు ఆటలు, మురారి సాయంత్రం రెండు ఆటలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ప్లాన్ చేసారంటే రీ రిలీజ్ నాటికీ ఇంకెంత హంగామా చేస్తారో ఘట్టమేని అభిమానులు.

దీపావళి రేస్ మొదలు పెట్టిన హీరో..ఆ హీరో ఎవరంటే..?
పండగకు సినిమాల విడుదల అంటే నిర్మాతలకు కాసింత ఆనందం. టాక్ కొంచం అటు ఇటు ఉన్న లాగేస్తుంది, కలెక్షన్లు రాబడతాయి అని నమ్మకం, అది గతంలో ప్రూవ్ అయింది కూడా. ఎప్పుడో వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కోసం ఇప్పటి నుండే కర్చీఫ్ లు వేసి ఉంచారు నిర్మాతలు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు పండుగ రోజుల్లో రిలీజ్ కోసం ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తారో హీరోలు, నిర్మాతలు. ఈ ఏడాది ముఖ్యమైన పండగలకు స్లాట్స్ నిండిపోయాయి. ఆగస్టు 15న ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్, #35 వంటి చిన్న, పెద్ద 4 సినిమాలు విడుదల అవబోతున్నాయి. వినయాక చవితి నాడు విజయ్ నటించిన G.O.A.T తో పాటు దుల్కర్ సల్మాన్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ లక్కీ భాస్కర్ పోటీపడనున్నాయి. మరోవైపు దసరా కోసం తారక్ దేవర, కంగువ పోటీ పడనున్నాయి. తాజాగా ఇప్పుడు దీపావళి విడుదలకు రేస్ మొదలైంది. ముందుగా ఈ రేస్ లోకి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వచ్చి చేరాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో మెకానిక్ రాకి అనే చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్. రవితేజ ముళ్ళపూడి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించింది నిర్మాణ సంస్థ. దీపావళి కానుకగా అక్టోబరు 31న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేశారు. కాగా ఈ సినిమా ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్, సురేష్ సంస్థలు కొనుగోలు చేశారు. పండగ నాటికి ఈ రేస్ లోకి ఇంకెన్ని సినిమాలు వచ్చి చేరతాయో ఏవి కలెక్షన్లు సాధించి హిట్ గా నిలుస్థాయో చూడాలి.