నేడు గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ..
తమ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్‌లో నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమబాట పట్టింది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అనేక రూపాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే జనం నుంచి కోటికిపైగా సంతకాల సేకరించింది వైసీపీ. వీటిని గవర్నర్‌కి సమర్పించి పీపీపీ మోడల్‌ను అడ్డుకోవాలని కోరబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గవర్నర్‌కు కోటి సంతకాలు ఇవాళ సమర్పించబోతున్నారు. ఇవాళ గవర్నర్‌ను కలిసి ప్రజల అభిప్రాయాన్ని వివరించనున్నారు. సంతకాల పత్రాలు నిండిన వాహనాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపనున్నారు జగన్. వాహనాలు పంపిన అనంతరం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, సీనియర్ నాయకులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు కోటి సంతకాల ప్రతులతో గవర్నర్‌ను కలిసి పీపీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరనున్నారు వైసీపీ అధినేత.
బెజవాడలో పసిబిడ్డల విక్రయాల ముఠా అరెస్ట్
బెజవాడలో పసిబిడ్డల విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నెలల వయసున్న శిశువులను తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను గుర్తించి పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి ఐదుగురు పసిబిడ్డలను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఒక్కో శిశువును రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. గతంలో అరెస్ట్ అయిన బండి సరోజ ముఠానే ఈ అక్రమ శిశు విక్రయాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం అరెస్ట్ అయిన అనంతరం బయటకు వచ్చిన సరోజ ముఠా మళ్లీ ఈ దందాను కొనసాగిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. నిందితులు విజయవాడ, పాయకాపురం, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురు పసిబిడ్డలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, రక్షణ చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, ఈ అక్రమ శిశు విక్రయాల వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టారు.
“పల్లె పోరు”లో అనూహ్య విజయాలు.. ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు వీళ్లే..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. మూడో విడత ఎన్నికలతో గ్రామీణ స్థాయిలో ప్రజాప్రతినిధుల ఎంపిక పూర్తయ్యింది. చివరి దశలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ విడతలో భాగంగా 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల కోసం 12,652 మంది, వార్డు సభ్యులుగా 75,725 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 80.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. భైంసా మండలం లింగా గ్రామంలో పోస్టల్ ఓటు సర్పంచ్‌ను తేల్చింది. మొత్తం 329 ఓట్లలో 293 పోలవగా మూడు చెల్లలేదు, ఒకటి నోటాకు పడింది. గడ్‌పాలే సుష్మారాణి, స్వాతికి 142 ఓట్లు చొప్పున రాగా, చివరగా లెక్కించిన ఒక పోస్టల్ ఓటు సుష్మారాణికి పడటంతో ఆమె విజేతగా నిలిచారు. అదే జిల్లాలో ముథోల్ మండలం రువ్వి గ్రామంలో బీజేపీ మద్దతుదారు మల్లేశ్‌కు 183 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారు గంగాధర్‌కు 182 ఓట్లు రావడంతో మల్లేశ్ ఒక్క ఓటుతో గెలిచారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గుర్రాలగండి రాజపల్లి పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు బూస నర్సయ్యకు 191 ఓట్లు రాగా, బీఆర్ఎస్ మద్దతుదారు కత్తుల కుమారస్వామికి పోస్టల్ ఓటుతో కలిపి 190 ఓట్లు రావడంతో నర్సయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపురంలో బీజేపీ మద్దతుదారు టేకుల మంజులకు 181 ఓట్లు, కాంగ్రెస్ బలపర్చిన బద్దం మమతకు 180 ఓట్లు రావడంతో మంజుల ఒక్క ఓటుతో విజయం సాధించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో సర్పంచ్ పదవికి మేనల్లుడు ఊట్కూరి మాధవరెడ్డి, మేనమామ కందుకూరి సత్యనారాయణరెడ్డి మధ్య పోటీ జరిగింది. 798 పోలైన ఓట్లలో మాధవరెడ్డికి 397, సత్యనారాయణరెడ్డికి 396 ఓట్లు రావడంతో ఒక్క ఓటుతో మాధవరెడ్డి విజయం సాధించారు. ఇదే జిల్లాలో పాలకవీడు మండలం మహంకాళిగూడెంలో కాంగ్రెస్ రెబల్ పిడమర్తి దాసుకు 187 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి చిట్టిప్రోలు నారాయణకు 186 ఓట్లు రావడంతో దాసు ఒక్క ఓటుతో గెలిచారు.
లక్నోలో మ్యాచ్ రద్దుకు బీజేపీనే కారణం.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..
లక్నోలో జరగాల్సిన భారత్- దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ రద్దు కావడంపై యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పెరిగిన కాలుష్యం ఇప్పుడు లక్నోకు కూడా చేరింది.. అందుకే ఈ మ్యాచ్ జరగలేదన్నారు. ఇది పొగ వల్ల కాదు, కాలుష్యంతో ఏర్పడిన స్మాగ్ కారణంగానే మ్యాచ్ రద్దయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ముఖాలను కప్పుకోవాలని తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో సూచించారు. కాగా, లక్నోలో స్వచ్ఛమైన గాలి కోసం మేము నిర్మించిన పార్కులను బీజేపీ ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్ ఈవెంట్ల పేరుతో నాశనం చేస్తోంది.. బీజేపీ నేతలకు మనుషులపై, పర్యావరణంపై కూడా ప్రేమ లేదని ఆరోపించారు. లక్నోలోని ప్రజలు ఇప్పుడు తమ ముఖాలను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అఖిలేష్ యాదవ్ తెలిపారు. అయితే, బుధవారం సాయంత్రం లక్నోలోని భారత్‌రత్న అటల్ బిహారీ వాజపేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా అంపైర్లు రద్దు చేశారు. మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, టాస్ 7 గంటలకు జరగాల్సింది. కానీ, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు ఆరు సార్లు పిచ్ ను పరిశీలించినప్పటికీ ఆట ప్రారంభించలేమని నిర్ణయించారు. చివరికి రాత్రి 9.25 గంటలకు పరిశీలించి ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను క్యాన్సిల్ చేసేశారు. ఇక, మ్యాచ్ రద్దుతో స్టేడియానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా, భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే చివరి టీ20 మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
యూరోపియన్ నాయకులు ‘పంది పిల్లలు’.. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకుంటాం..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం నాడు ఐరోపా నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు పంది పిల్లలు అంటూ ఎద్దేవా చేశారు. రష్యా ఏదోక రోజు నాటో కూటమి దేశాలపై కూడా దాడి చేస్తుందనే అనవసర భయాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి మద్దతు తెలపకపోతే.. ఉక్రెయిన్ లోని మరిన్ని భూ భాగాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించాడు. రష్యా రక్షణ శాఖ వార్షిక సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాస్కో అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. రష్యా దళాలు అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌లోకి చొచ్చుకెళ్తున్నాయని పేర్కొన్నారు. దౌత్యం లేదా బలప్రయోగంతోనైనా చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలకు ఉక్రెయిన్ నుంచి విముక్తి కల్పిస్తామని వెల్లడించారు. అమెరికా ప్రతిపాదిక శాంతి ఒప్పందంపై పురోగతి లేకపోవడంతో పుతిన్ ఈ హెచ్చరికలు చేశారు. అలాగే, యుద్ధం ముగింపు దిశగా యూఎస్ ఇటీవల రష్యాతో పాటు ఉక్రెయిన్, ఐరోపా నేతలతో వేర్వేరుగా చర్చలు కొనసాగించింది. కానీ, శాంతి ఒప్పందంలో భాగంగా తన భూభాగాలు కోల్పోవాల్సి రావడంపై ఉక్రెయిన్‌తో పాటు ఇతర యూరోపియన్ దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భద్రతకు మరిన్ని రక్షణలు కావాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పట్టుబడుతున్నాడు. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ తాము మాత్రం తమ ప్రణాళికలతో యథావిధిగా ముందుకు కొనసాగుతామని వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు.
ప్రపంచ ధనికుల కుటుంబం లిస్ట్ విడుదల.. అంబానీకి ఎన్నో ర్యాంక్ అంటే..!
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనికుల కుటుంబాల జాబితా విడుదలైంది. ప్రపంచంలోని 25 సంపన్న కుటుంబాల జాబితాను బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశం నుంచి అంబానీ కుటుంబానికి చోటు దక్కింది. 25 సంపన్న కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ 8వ స్థానంలో నిలిచింది. అంబానీ కుటుంబం అపారమైన సంపద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానం ఉందంటూ పేర్కొంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. అంబానీ కుటుంబం సంపద 105.6 బిలియన్లుగా ఉన్నట్లుగా తెలిపింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార రాజవంశాల్లో ఒకరిగా వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, శక్తి, పెట్రోకెమికల్స్, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో పనిచేస్తుందని తెలిపింది. అదే సమయంలో డిజిటల్ సేవలు, స్థిరత్వం-ఆధారిత వెంచర్లలోకి కూడా విస్తరిస్తుందని పేర్కొంది. అమెరికాలో రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ యజమానులైన వాల్టన్ కుటుంబంగా పేర్కొంది. 513.4 బిలియన్ల నికర విలువతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మొదటిసారిగా అర ట్రిలియన్ డాలర్ల పరిమితిని అధిగమించింది. వాల్‌మార్ట్ ఇటీవలి ఆర్థిక సంవత్సరంలో 681 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రపంచవ్యాప్తంగా స్టోర్‌లు విస్తరిస్తున్నాయి. ఈ ప్రత్యేక ర్యాంకింగ్‌లోకి ప్రవేశించడానికి కనీసం 46.4 బిలియన్ల నికర విలువ ఉండాలి. అలా ఉన్నవాళ్లనే సంపన్న కుటుంబాల జాబితాలో చేర్చుతారు. 2025 జాబితాలో నాలుగు ఖండాలకు చెందిన నాలుగు కొత్త కుటుంబాలు ఉన్నాయి. మెక్సికోకు చెందిన లారియా మోటా వెలాస్కో కుటుంబం. ఇటలీకి చెందిన డెల్ వెచియో కుటుంబం. సౌదీ అరేబియాకు చెందిన ఒలాయన్ కుటుంబాలు ఉన్నాయి.
IPL 2026లో MS Dhoniని కంటే ఎక్కువ డబ్బు సంపాదించే 8 మంది సీఎస్కే ప్లేయర్స్ వీళ్లే..?
ఐపీఎల్ 2026 సీజన్‌లో మరోసారి యెల్లో జెర్సీలో అభిమానులను అలరించేందుకు మహేంద్ర సింగ్ ధోనీ రెడీ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆయన మరో సీజన్ ఆడనుండటం ఫిక్స్ అయింది. ధోనీ రిటైర్మెంట్ తర్వాతి జట్టు ఎలా ఉండాలనే దాని కోసం CSK ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం ధోనీ జట్టులో కీ రోల్ కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ 2025 తొలి అర్ధభాగంలో రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బయటకు వెళ్లిన సమయంలో జట్టు నాయకత్వ బాధ్యతలను కూడా మళ్లీ ధోనీనే భుజాన వేసుకున్నారు. ఇక, అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ధోనీని CSK రిటైన్ చేసుకోవడంతో, ఐపీఎల్ 2026లో ఆయనకు రూ.4 కోట్లు చెల్లిస్తుంది. ఒకప్పుడు ఐపీఎల్‌లో అత్యధిక వేతనం పొందిన ఆటగాడిగా ఉన్న ధోనీ, ఐపీఎల్ 2026లో MSD కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న ప్లేయర్స్ CSKలో ఎనిమిది మంది ఉన్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 2019 నుంచి జట్టుతో కొనసాగుతున్నారు. ఐపీఎల్ 2022, 2025 మెగా వేలాలకు ముందే అతడ్ని రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2024కు ముందు జట్టు పగ్గాలు చేపట్టిన రుతురాజ్, 2026లో రూ.18 కోట్లు తీసుకుంటున్నాడు. అలాగే, సంజూ శాంసన్ కూడా రూ.18 కోట్లు అందుకునే ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రాజాసాబ్ ప్రీమియర్స్
ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌తో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రేలర్ అలాగే ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్ ను హైదరాబాద్ లోని లులు మాల్ లో రిలీజ్ చేశారు. సహన సహన అని సాగిన ఈ సాంగ్ లో ట్యూన్ ..డ్రెస్ సెన్స్..లోకేషన్లు చాలా బాగున్నాయి. ఇక ప్రభాస్ స్టెప్స్ విషయంలో కొరియోగ్రాఫర్ మంచి కేర్ తీసుకుని చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాని జనవరి 8న ప్రిమియర్స్ తో రిలీజ్ చేస్తున్నామని విశ్వప్రసాద్ ప్రకటించారు. అయితే ప్రీమియర్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రెండు తెలుగు స్టేట్స్ లో భారీ ఎత్తున భారీ స్థాయిలో ప్రీమియర్స్ కు పప్లానింగ్ జరుగుతోంది. అలాగే ఏపీలో ఈ సినిమాకు అదనపు రేట్లు ఉండే ఛాన్స్ ఉంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావండతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక రాజాసాబ్ నుండి మరొక ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు మేకర్స్.
అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేసిన బిగ్గేస్ట్ మల్టీస్టారర్
మలయాళంలో మరొక మల్టీస్టారర్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎంపురాన్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన మాలీవుడ్ లో మరోక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఈ రోజు రిలీజ్ అయింది. మాలీవుడ్ వన్స్ అపాన్ ఎ టైం స్టార్ హీరో దిలీప్ హీరోగా ‘భా భా బా’ అనే ఫిల్మ్ తెరకెక్కింది. ఈ సినిమాలో క్యామియో అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు కంప్లీట్ స్టార్ మోహన్ లాల్. నటి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న దిలీప్‌ను నిర్ధోషిగా ప్రకటించిన తర్వాత దిలీప్ నుండి వస్తున్న ఫిల్మ్ కావడంతో అంచనాలు పెరిగాయి. దీనికి తోడు లాలెట్టన్ స్పెషల్ అప్పీరియన్స్ మూవీకి మరింత ఎట్రాక్షన్ అయింది. చిరకాల మిత్రులు ఇద్దరు కలిసి రాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్టే అడ్వాన్సు బుకింగ్స్ అదరగోట్టాయి. మలయాళ బిగ్గెస్ట్ అడ్వాన్స్ సేల్స్ లో రూ. 11.69 కోట్లతో ఎంపురాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో సూపర్ స్టార్ రజినికాంత్ కూలీ రూ. 8.02 కోట్లతో రికార్డు నెలకొల్పింది. మూడవ ప్లేస్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆయిన ‘భా భా భా’ నిలిచింది. కేవలం కేరళలో మాత్రమే రూ. 4.29 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో రాబట్టింది. ఇందుకు కారణం దిలీప్, మోహన్ లాల్. చాలా కాలం తర్వాత చిరకాల మిత్రులు ఇద్దరు కలిసి నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ క్రేజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించింది. నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న భా భా భా రాబోఏ రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
