NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌.. వారికి శుభవార్త..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం ముందు కీలక అజెండాను సిద్ధం చేశారు అధికారులు.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతోంది కేబినెట్‌.. ఇక, మహిళలకు, గీత కులవృత్తిదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు.. ఇక, గీత కులవృత్తులవారికి 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది కేబినెట్‌.. మరోవైపు.. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకోనుంది ఏపీ కేబినెట్‌.. మరోవైపు ఎల్లుండి దావోస్‌ పర్యటనకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సాగుతోన్న ఈ పర్యటకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్‌ ముగిసిన తర్వాత మంత్రులకు వివరించే అవకాశం ఉందంటున్నారు..

నేడు టీడీపీ మంత్రులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బిజీబిజీగా గడపనున్నారు.. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్న ఆయన.. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం టీడీపీ మంత్రులతో ప్రత్యేకంగా భేటీకానున్నారు.. నామినేటెడ్ పదవులు.. టీడీపీ సభ్యత్వానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.. ఇక, ఎంపీలు, జోనల్ ఇంఛార్జీలతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని.. కొన్ని శాఖలకు సంబంధించి ఎంపీలు దృష్టి పెట్టాలని ఇప్పటికే సూచించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే దిశగా ఇవాళ సమావేశంలో కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టుగా తెలుస్తోంది.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లే విధంగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

ఏపీలో కొత్త రైల్వే లైన్ పనులకు మోక్షం.. పనులు షురూ..!
అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది. మళ్లీ రైల్వే లైన్ పనులు పట్టాలు ఎక్కాయి. భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైల్వే అధికారులను ఆదేశాలు ఇవ్వడంతో పనులు పునరుద్ధరించారు. గతంలో రైల్వే లైన్‌లో భాగంగా భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలోని భూమిని రైల్వే అధికారులు స్వాధీన పరుచుకొని రైల్వే నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా చర్యలు తీసుకున్నారు. అయినవిల్లి మండలంలోని శానపల్లి లంక, సిరిపల్లి, మాగం, అమలాపురం రూరల్ మండలంలోని ఏ వేమవరం, బట్న విల్లి గ్రామాలలో రైల్వే లైనుకు సంబంధించి భూసేకరణ పూర్తి అయ్యింది. రైల్వే అధికారులు గ్రామానికి ఒకప్రత్యేక బృందాలను పంపి నిర్మాణ పనులను ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాలలో భూ సేకరణ పూర్తయిన భూములను సర్వే చేసి హద్దులను గుర్తించి రైల్వే అధికారులకు అప్పగిస్తున్నారు. సంబంధిత ప్రాంతాలలోని రైతులు తదుపరి పంట వేసేలోపు రైల్వే అధికారులు భూ సేకరణ పూర్తయిన భూములను తమ ఆధీనంలోకి తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు.

నేడు షాబాద్‌లో బీఆర్‌ఎస్‌ రైతు ధర్నా.. అన్నదాతలకు మద్దతుగా రామన్న!
కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు రైతుల పక్షాన పోరాటానికి బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై ‘ రైతు ధర్నా’ పేరుతో బీఆర్‌ఎస్‌ పోరాటానికి సిద్దమైంది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు కాకపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ రైతు ధర్నా, నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో రైతు ధర్నా చేపట్టింది. షాబాద్‌ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఉదయం 11 గంటలకు జరిగే రైతు ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొననున్నారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి సహా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ శ్రేణులు రైతు ధర్నాలో పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ యువనేత పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ రైతు ధర్నా కార్యక్రమం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటి నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్
ప్రతిష్ఠాత్మక భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను ఈరోజు (జనవరి 17) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో వాహనాలు, విడిభాగాల ఉత్పత్తులు, టెక్నాలజీ రంగాల్లో 100కు పైగా కొత్త ఆవిష్కరణలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఈ ఎక్స్‌పో ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఎక్స్‌పోలో వాహన తయారీదార్లతో పాటు విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్‌ భాగాలు, టైర్‌- ఇంధన స్టోరేజ్‌ తయారీదార్లు, వాహన సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, మెటీరియల్‌ రీసైక్లర్‌లు తమ అధునాతన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నారు. అయితే, బియాండ్‌ బౌండరీస్‌: కో-క్రియేటింగ్‌ ఫ్యూచర్‌ ఆటోమోటివ్‌ వాల్యూ చెయిన్‌ పేరిట ఈ గ్లోబల్‌ ఎక్స్‌పోను 3 వేదికలు విభజించారు. అందులో ఒకటి ఢిల్లీలోని భారత్‌ మండపం, రెండోది ద్వారకా దగ్గర యశోభూమి, మూడోది గ్రేటర్‌ నోయిడాలోని ఢిల్లీ, ఇండియా ఎక్స్‌పో సెంటర్‌ అండ్‌ మార్ట్‌లలో జరగనుంది. ఇక, గ్లోబల్‌ ఎక్స్‌పోను పరిశ్రమ సంఘాలు ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్, ఏటీఎంఏ, ఐసీఈఎంఏ, సియామ్, ఏసీఎంఏ, ఐఈఎస్‌ఏ, నాస్కామ్, సీఐఐ, మెటీరియల్‌ రీసైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా సందర్శకులు ఈ ఎక్స్‌పోకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో 5,100 మంది అంతర్జాతీయ భాగస్వాములుగా కొనసాగుతున్నారు.

మహారాష్ట్రలో పులులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్
మహారాష్ట్రలో పులులకు కటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు నిర్ణయించినట్లు రాష్ర్ట అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ స్పష్టం చేశారు. అయితే, పులుల మధ్య ఆవాసం, హద్దుల కోసం ఘర్షణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 పులుల చనిపోయాయని తెలిపారు. అటవీ ప్రాంత గ్రామాల్లో ప్రజలపై దాడి చేసి ఈ పులులు చంపేస్తున్నాయని వెల్లడించారు. అయితే, పెరిగిన పులుల దాడులు, వాటి మధ్య జరిగే ఘర్షణల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పులులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు ప్రతిపాదించామని రాష్ర్ట అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ వెల్లడించారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు చెప్పాడు. మరోవైపు, కవ్వాలతో పాటు ఇంద్రావతి, తడోబా టైగర్‌ జోన్లలో పులుల్లో ఆధిపత్య పోరు కొనసాగుతుండడంతో సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ సమీపంలోని గ్రామల ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సూచించారు.

కారు నడుపుతూ రీల్స్‌ చూసిన డ్రైవర్‌.. కాలువలో పడి ఇద్దరు మృతి
ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు చాలా మంది ట్రై చేస్తూ.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ డ్రైవర్‌ రీల్స్‌ పిచ్చి వల్ల తనతో పాటు మరో ప్రాణం బలితీసుకున్నాడు. కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మరణించగా.. మరొకరు అతి కష్టం మీద తన ప్రాణాలను దక్కించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భోపాల్ లో చోటు చేసుకుంది. అయితే, వివరాల్లోకి వెళితే.. భోపాల్‌లోని కోలార్ రోడ్‌లో బుధవారం నాడు అర్థరాత్రి కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మృతులు పలాష్ గైక్వాడ్, వినీత్ దక్ష (డ్రైవర్‌)గా గుర్తించారు. అయితే, డ్రైవర్‌ కారు నడుపుతూ రీల్స్‌ రికార్డ్ చేస్తుండగా కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెరువులోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో, పలాష్‌, వినీత్‌ అక్కడికక్కడే మరణించగా.. ప్రమాదం సమయంలో మరో వ్యక్తి పియూష్ కారు వెనుక అద్దాన్ని పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక, సమాచారం అందుకున్న కోలారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు అద్దాలు పగలగొట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు.

ఏఐ కంటెంట్‌కు లేబులింగ్‌ తప్పనిసరి చేయాల్సిందే: ఈసీ
ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో రూపొందించిన చిత్రాలు, వీడియోలు, ఆడియోలపై ఏఐ జనరేటెడ్‌/ డిజిటల్లీ ఎన్‌హాన్స్‌డ్‌/ సింథటిక్‌ కంటెంట్‌ లాంటి లేబులింగ్ తప్పనిసరి జతచేయాలంటూ నిబంధనను ఈసీ విధించింది. అయితే, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్‌ కారణంగా తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ ఇటీవల హెచ్చరికలు జారీ చేశాడు. ఈ తప్పుడు సమాచారం వల్ల ఎలక్షన్ ప్రక్రియపై ఉన్న నమ్మకాన్ని దెబ్బ తీసే ఛాన్స్ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సోషల్‌ మీడియా వేదికల వినియోగంపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. కాగా, ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు డిజిటల్‌ ప్రచారకులను నియమించుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల డిస్కైమర్లను ఈసీ తప్పనిసరి చేసింది.

ఆఫ్రికా నుండి స్పెయిన్ వెళ్తున్న పడవ మునక.. 44 మంది పాకిస్తానీయులు సహా 50 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా నుండి స్పెయిన్ వెళ్తున్న పడవ మునిగిపోయినప్పుడు 44 మంది పాకిస్తానీ వలసదారులు సహా 50 మందికి పైగా మరణించారు. ఈ పడవ జనవరి 2న బయలుదేరి గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది. బుధవారం ఈ పడవలో ఉన్న 36 మందిని రక్షించారు. అయితే, మిగిలిన వలసదారులను రక్షించలేకపోయారు. ఈ వలసదారులు స్పెయిన్‌లోని కానరీ దీవులకు చేరుకోవడానికి పడవలో అట్లాంటిక్ దాటడానికి ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ మీడియా ప్రకారం.. ఈ పడవ మౌరిటానియా నుండి బయలుదేరింది. వీరిలో 86 మంది స్పెయిన్ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న వలసదారులు. వారిలో పాకిస్తానీ పౌరుల సంఖ్య 66 కంటే ఎక్కువ. వలస హక్కుల సంస్థ వాకింగ్ బోర్డర్స్ ప్రకారం.. పడవ మునిగిపోవడం కనిపించకుండా పోయిన చాలా రోజుల తర్వాత జరిగిందని తెలుస్తోంది. వాకింగ్ బోర్డర్స్ ప్రకారం.. ఆ పడవ ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయినట్లు తెలిసింది.

సరసమైన ధరలో అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చేసిన రియల్‌మి నెక్‌బ్యాండ్‌
స్మార్ట్‌ఫోన్ రంగంలో వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తున్న రియల్‌మి తాజాగా తన రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌తోపాటు రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 5 ANC నెక్‌బ్యాండ్‌ (Realme Buds Wireless 5 ANC) ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఆకట్టుకునే ఫీచర్లు, అందమైన డిజైన్‌తో వినియోగదారులకు మంచి అనుభూతిని ఇవ్వనుంది. ఇక ఈ రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 5 ANC నెక్‌బ్యాండ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలను వివరంగా చూద్దాం. ఈ నెక్‌బ్యాండ్‌ డిజైన్ విషయానికి వస్తే.. 13.6 mm డైనమిక్ బాస్ డ్రైవర్‌లను కలిగి ఉంది. ఇది రియల్‌మి లింక్ యాప్ ద్వారా EQ సెట్టింగ్స్ మార్చుకునే అవకాశం ఇస్తుంది. ఇందులో అదిరిపోయే నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌లను అందించారు. అవేంటంటే.. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) గరిష్ఠంగా 50dB వరకు నాయిస్‌ను తగ్గిస్తుంది. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) కాల్‌లలో స్పష్టతను పెంచుతుంది. 45ms లేటెన్సీతో 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో అనుభవం అందిస్తుంది.

రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
మలయాళంలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న నటులలో జోజు జార్జ్ ఒకరు. నయట్టు, ఇరట్ట వంటి సినిమాలలో జోజు నటనకు గుర్తింపుతో పాటు పలు అవార్డులు కూడా వచ్చాయి. జోజు తెలుగులోను నటించాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ చేస్తూ మెప్పించడం జోజు స్టైల్. ఒకవైపు సినిమాలు చేస్తూనే తొలిసారిగా ‘పని’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు జోజు. మలయాళంలో 2024లో వచ్చిన సూపర్ హిట్ రివెంజ్ మూవీ పని. దర్శకుడిగా మొదటి సినిమాతో సినీ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాడు జోజు జార్జ్. గత ఏడాది అక్టోబర్ 24న థియేటర్లలో రిలీజ్ అయిన ‘పని’ మిక్డ్స్ రివ్యూస్ వచ్చిన బాక్స్ ఆఫీస్ సూపర్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 37.25 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ సోనీ లివ్ స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది. జనవరి 16 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లోసాగుతుంది. కథ పాతదే అయినా ట్రీట్ మెంట్ కొత్తగా ఉండడంతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ సూపర్ హిట్ సినిమాను ఈ వీకెండ్ లో ఓ సారి చూసేయండి.

భర్తపై దాడి గురించి చెబుతూ ఎమోషనల్ అయిన కరీనా
సెలబ్రెటిల చూట్టు ఫ్యాన్స్ తో పాటుగా శత్రువులు కూడా ఉంటారు. వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడం, బెదిరించడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి బాలీవుడ్‌కి కొత్తేం కాదు. ఇందులో భాగంగా తాజాగా  హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో దుండగులు ప్రవేశించి అతనిపై దాడి చేసి కత్తిపోట్లకు కారణమయ్యారు. దీంతో సైఫ్‌ను ఆస్పత్రికి తరలించగా మొత్తం ఆరు కత్తిపోట్లు దిగినట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాదు రెండు సర్జరీలు నిర్వహించి కత్తి ముక్కను బయటకు తీసినట్లు సమాచారం. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారట. ఈ విషయంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్‌గా విచారణ మొదలు పెట్టారు. ఇక సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి ఘటన గురించి మిగతా సెలబ్రెటిలు వారి సోషల్ మీడియాలో భాగంగా.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా సైఫ్ సతీమణి, హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఎమోషనల్ అవుతూ ‘ఇది మా కుటుంబానికి చాలా కఠినమైన రోజు,అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. మీడియా ప్రతినిధులు తెలిసి తెలియని కథనాలను ప్రచారం చేయకూడదు అని కోరుకుంటున్నాను. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్న’ అని ఇన్ స్టా లో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇలాంటి సంఘటనలు ఒక బాలీవుడ్‌ మాత్రమే కాదు ముంబైలో పారిశ్రామికవేత్తలు కూడా ఎదురుకుంటున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీకి ఒక సారీ రూ.20 కోట్లు ఇవ్వకపోతే నీ కుటుంబాన్ని చంపేస్తానని మెయిల్‌లో బెదిరించాడట. ఈ వార్త కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.

సంక్రాంతికి వాయిదా పడిన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు తమిళ నాట భారి ఫాలోయింగ్ ఉంది.  ఆయన సినిమా రరిలీజ్ అవుతుంది అంటే చాలు థియేటర్స్ వద్ద హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ 2024 మొత్తం  షూటింగ్స్ తోనే గడిపేశాడు అజిత్. ప్రస్తుతం విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేస్తున్నాడు అజిత్. ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు మొదట ప్రకటించిన మేకర్స్,  ఊహించని పరిణామాలతో పొంగల్ రిలీజ్ వాయిదా పడింది.  ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విదాముయర్చి అడ్డంకులు ఏర్పడడంతో రిలీజ్ కు బ్రేక్ పడింది. మజీజ్ తిరుమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మొదట దీపావళి రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ చివరి దశలో ఉండటం, పోస్టు ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉండటంతో అక్కడి నుండి జనవరి 10 కి పోస్టు పోన్ అయ్యింది. కానీ అక్కడ కూడా అవరోధాలు ఎదురుకావడంతో మరోసారి డేట్ మారింది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.  తాజగా విదాముయర్చి ట్రైలర్ ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. రానున్న ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్ గా విదాముయర్చి భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. అజిత్ సరసన త్రిష నటించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా భారీ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సంక్రాంతికి వాయిదా పడిన అన్నిటిని దాటుకుని ఫిబ్రవరిలో థియేటర్స్ లో అడుగుపెడుతోంది.