NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. నేడు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ..
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బిజీ బిజీగా గడుపుతున్నారు.. నేడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీకానున్న ఆయన.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు.. ఇక, రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, తొలిరోజు (నిన్న రాత్రి) కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్ర జలశక్తి మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, “కేంద్ర జల సంఘం”, జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు, ఏపీ ఉన్నతాధికారులు గంటకు పైగా సమావేశం అయ్యారు. సత్వరమే పోలవరం నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చలు జరిగాయి.. కొత్తగా పెరిగిన నిర్మాణ పనులను ప్రస్తుతం నిర్మాణ పనులను చేస్తున్న నిర్మాణ సంస్థకే ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు..

ఫలించిన బాలయ్య మంత్రాగం.. వైసీపీకి బిగ్‌ షాక్..!
హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ.. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో శుక్రవారం బిజీబిజీగా గడిపారు.. అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. మరోవైపు.. హిందూపురం మున్సిపాల్టీని కైవసం చేసుకోవడానికి బాలయ్య చేసిన ప్రయత్నాలు ఫలించాయి.. దీంతో.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది.. బాలయ్య మంత్రాంగం ఫలించడంతో.. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకోనుంది.. మున్సిపాల్టీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 38గా ఉండగా.. ఇప్పుడు టీడీపీ కూటమి బలం 20కి చేరింది.. దీంతో.. మున్సిపల్‌చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేశారు ఇంద్రజ.. రాజీనామా పత్రాన్ని మున్సిపల్‌ కమిషనర్ కు అందజేశారు.. మరోవైపు.. ఈ నెల 20న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశం కానుంది.. ఈ సమావేశంలో చైర్‌పర్సన్‌ ఇంద్రజ రాజీనామా ఆమోదం కోసం మిగిలిన సభ్యుల అభిప్రాయం తీసుకోనున్నారు మున్సిపల్‌ అధికారులు.. ఇదే సమయంలో.. హిందూపురం మున్సిపల్‌ కొత్త చైర్మన్‌గా.. కౌన్సిలర్‌ డీఈ రమేష్‌కు అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.. ఇక, తెలుగుదేశం పార్టీలో చేరిన తమ పార్టీ కౌన్సిలర్లపై వేటు వేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా విజయం సాధించి టీడీపీలో చేరిన కౌన్సిలర్లపై సస్పెన్షన్‌ వేటు వేసింది వైసీపీ అధిష్టానం.. పార్టీ ఫిరాయించిన 11 మంది వైసీపీ కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కాగా, హిందూపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజతో పాటు 8 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు.. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై టీడీపీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ఇంద్రజ పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పలు మున్సిపాల్టీలను టీడీపీ నేతృత్వంలోని కూటమి కైవసం చేసుకున్న విషయం విదితమే.

అలర్ట్‌ అయిన వైసీపీ.. కడప జడ్పీటీసీలకు అధిష్టానం పిలుపు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు.. అధికార టీడీపీ కూటమి వైపు చూస్తున్నారు.. ఇప్పటికే పలు మున్సిపాల్టీలను తమ ఖాతాలో వేసుకుంది తెలుగుదేశం పార్టీ.. అయితే, కడప జిల్లాలో వైసీపీ అలర్ట్ అయ్యింది.. ఉమ్మడి కడప జిల్లాలోని జడ్పీటీసీలకు అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది.. జిల్లాలోని జడ్పీటీసీలు అందరూ ఈ నెల 21వ తేదీన విజయవాడకు రావాలంటూ ఆదేశాలు వెళ్లాయి.. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో.. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది.. దీంతో.. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేజారకుండా కసరత్తు ప్రారంభించింది వైసీపీ.. కాగా, కడప జిల్లాలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో రెండు ఖాళీగా ఉన్నాయి.. 48 జడ్పీటీసీ సభ్యులలో ఒక గోపవరం మినహా అందరూ వైసీపీ జడ్పీటీసీలే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఐదురు జడ్పీటీసీలు.. మరో జడ్పీటీసీ.. బీజేపీ గూటికి చేరారు.. ఈ నేపథ్యంలో.. మరింత మంది జడ్పీటీసీలు చేజారకుండా.. కడప జెడ్పీ చైర్మన్‌ పదవి కూడా దూరంగా కాకుండా పావులు కదుపుతోంది వైసీపీ అధిష్టానం.. అందులో భాగంగా.. అందరినీ విజయవాడకు రమ్మని పిలుపునిచ్చారు.. ఇక, విజయవాడలో జడ్పీటీసీలతో వేర్వేరుగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అవుతారని తెలుస్తోంది.

నేటి నుంచి జస్టిస్‌ పీసీ ఘోష్‌ విచారణ..
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ న్యాయ విచారణ ప్రారంభించనుంది. ఘోష్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో విచారణ జరగనుంది. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేటు వ్యక్తులకు సమన్లు ​​జారీ చేసే అవకాశం ఉంది. రెండు వారాల పాటు విచారణ కొనసాగనుంది. కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విచారణ కమిషన్ కాళేశ్వరం విచారణను వేగవంతం చేసింది. దీంతో కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ శుక్రవారం (ఆగస్టు 16) హైదరాబాద్ చేరుకున్నారు. విచారణ వేగవంతం చేయాలనే ఉద్దేశంతో రెండు వారాల పాటు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. అంతే కాకుండా సుందిళ్ల అన్నారం వైఫల్యానికి గల కారణాలపై నివేదిక ఇవ్వనందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ (వీ అండ్ ఈ)కి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ (ఎన్‌డిఎస్‌ఎ) చైర్మన్‌కు కూడా సమన్లు ​​జారీ చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

రేపు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 18న (ఆదివారం) కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె.కేశరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ ధృవీకరించింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించడమే సీఎల్ ఎఫ్ సమావేశంలో ప్రధాన ఎజెండా. దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాలపై చర్చిస్తారని తెలిసింది. అలాగే, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వీ భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చిన సింఘ్వీ.. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రేవంత్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, నాగర్​కర్నూల్​ ఎంపీ మల్లు రవి ఉన్నారు.

అటల్‌ సేతు బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళ.. పోలీసుల రాకతో..?
మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ బ్రిడ్జిపై గత కొద్ది రోజులుగా ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన అనేక కేసులు నమోదవుతున్నాయి. మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అటల్ సేతు సి లింక్‌లో ఆత్మహత్యకు యత్నిస్తున్న మహిళను రక్షించిన సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు ధైర్యం ప్రదర్శించి మహిళ ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. అటల్ సేతు సి లింక్‌లో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అయితే పోలీసులు అలెర్ట్ అయ్యి, వారి ధైర్య సాహసాలతో మహిళను కాపాడారు. సమాచారం ప్రకారం, ములుంద్‌ లో నివసిస్తున్న ఒక మహిళ శుక్రవారం సాయంత్రం 7 గంటల మధ్య ఆత్మహత్యాయత్నం చేసింది. ముంబై నుంచి నవీ ముంబై వెళ్లే మార్గంలో ఓ మహిళ ఫ్లై ఓవర్‌పై నుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటల్ సేతుపై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రిడ్జికి అవతలివైపు మహిళ ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మహిళ దూకుతుండగా, పక్కనే ఉన్న వ్యక్తి ఆమెను పట్టుకున్నాడు. నవీ ముంబైకి చెందిన న్హవా షేవా ట్రాఫిక్ పోలీసుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. తర్వాత అందరూ కలిసి ఆ మహిళ ప్రాణాలను కాపాడారు.

మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్‌.సి.మారక్(82) శుక్రవారం వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 82 ఏళ్ల వయస్సు గల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తురా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1993లో ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన రాష్ట్రానికి మారక్ మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. 1998లో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణం కుప్పకూలినప్పుడు అతి తక్కువ సమయం – 12 రోజులు – సీఎం పదవిని కూడా నిర్వహించారు. 2003లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా కూడా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి మృతికి నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. మారక్ మృతి పట్ల ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సంతాపం తెలిపారు. “మాజీ సీఎం సాల్సెంగ్ సీ మారక్ మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. మేఘాలయ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.” అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా మారక్ మృతికి సంతాపం తెలిపారు.“మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ ప్రెసిడెంట్ సాల్సెంగ్ సి మారక్ మరణం పట్ల మేము చాలా బాధపడ్డాము. మేఘాలయ అభివృద్ధికి ఆయన అలసిపోని నిబద్ధత శాశ్వత వారసత్వాన్ని మిగిల్చింది. మా గౌరవం, ప్రశంసలను సంపాదించింది” అని ఎక్స్‌ వేదికగా ఖర్గే సంతాపం తెలిపారు.

టర్కీ పార్లమెంట్‌లో పిడిగుద్దులు గుద్దుకున్న ఎంపీలు.. ఎందుకంటే?
టర్కీ పార్లమెంట్‌లో శుక్రవారం ఎంపీలు అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు. చాలా మంది ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. నిజానికి జైలులో ఉన్న ఎంపీపై టర్కీ పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ సమయంలో ఎంపీల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్ది సేపటికే తోపులాటగా మారింది. ఈ గొడవ ఎంత తీవ్రమైందంటే ఇద్దరు ఎంపీలు రక్తమోడారు. విపక్ష పార్టీకి చెందిన ఎంపీ అహ్మత్‌ సిక్‌ మాట్లాడుతుండగా.. ఈ ఘర్షణ చెలరేగింది. దీంతో అధికార పార్టీ ఎంపీలు ఆయనను చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు. ప్రతిపక్ష ఎంపీ కూడా తనను తాను సమర్థించుకుంటూ అధికార పార్టీ ఎంపీలపై విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో అహ్మత్ మెడ, ముఖం నుండి రక్తం రావడం ప్రారంభమైంది. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిజానికి జైలులో ఉన్న ఎంపీపై టర్కీ పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ సమయంలో ఎంపీల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్ది సేపటికే తోపులాటగా మారింది. సిక్ తన పార్టీ ఎంపీ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ప్రకారం రాజకీయంగా ప్రేరేపించబడిన కారణాల వల్ల జైలుకెళ్లారు. ఎర్డోగన్ అధికార పార్టీని “ఉగ్రవాద సంస్థ” అని పిలిచిన తర్వాత సిక్‌పై దాడి జరిగిందని వార్తా సంస్థ నివేదించింది. ఈ కొట్లాటలో ఎర్డోగాన్ పార్టీ ఎంపీ, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆల్పే ఓజాలాన్, టర్క్సీ వర్కర్స్ పార్టీకి చెందిన అహ్మత్‌ సిక్ మధ్య ప్రత్యక్ష పోరు జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో ఓ మహిళా ఎంపీ కిందపడిపోవడంతో ఆమెకు రక్తస్రావం అయింది. ఈ సంఘటన తర్వాత, టర్కీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఓజ్‌గుర్ ఓజెల్ దీనిని సిగ్గుమాలిన సంఘటన అని పిలిచారు. ఈ రోజు పదాలు మాత్రమే ఉపయోగించాల్సిన ప్రదేశంలో కిక్స్, పంచ్‌లు ఉపయోగించారని అన్నారు. ఆ వ్యక్తులు ఈ రోజు మహిళలను కూడా వదలలేదు, పవిత్రమైన పార్లమెంటు మైదానంలో రక్తం ఉంది, ఇది చాలా సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. అయితే టర్కీ చట్టసభ సభ్యుల మధ్య శారీరక గొడవలు జరగడం ఇదే మొదటిసారేం కాదు. ఇంతకముందు కూడా పలు సందర్భాల్లో ఎంపీలు ఒకరినొకరు గుద్దుకున్న ఘటనలు చాలా ఉన్నాయి.

షూటింగ్ ని పక్కన పెట్టి వాటిని ప్రాక్టీస్ చేస్తా.. ఒలింపిక్ మెడల్ విజేత..
ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌ లలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే, ఆమె తృటిలో హ్యాట్రిక్ పతకాలను కోల్పోయింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత మను భాకర్ 3 నెలల విరామం తీసుకోబోతోంది. విరామ సమయంలో ఆమె తన అభిరుచులను కొనసాగించనుంది. తాజాగా ఓ ప్రముఖ మీడియాతో ఆమె మాట్లాడుతూ.., “ఇప్పుడు నాకు విరామం లభించింది. నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయగలను. ఇంతకు ముందు నాకు అంత సమయం లేదు. కానీ., ఇప్పుడు నా హాబీలకు సమయం దొరుకుతుంది. నాకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. నేను స్కేటింగ్, భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ సమయంలో మను కోచ్ గ్రేట్ షూటర్ జస్పాల్ రానాతో కలిసి ఉంది. మను భాకర్ తన హాలిడే బకెట్ జాబితాను వెల్లడించినప్పుడు, గుర్రపు స్వారీకి నో అంటూ నవ్వుతూ చెప్పాడు జస్పాల్ రానా. స్కేటింగ్, గుర్రపు స్వారీకి వెళ్లకూడదని ఏదైనా జరిగితే ఆమె బాధ్యత వహిస్తుందని రానా అన్నారు. స్కై డైవింగ్, స్కూబా డైవింగ్ కూడా చేయాలని ఉందని కూడా మను తెలిపింది.

100 మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతున్న “చుట్టమల్లె” సాంగ్
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, వసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేవర పార్ట్ -1 తెలుగు, త‌మిళ‌, హిందీ, కన్నడ, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఆగస్టు 5న ఈ మూవీ నుంచి ‘‘చుట్టమల్లె’’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో టాప్ 1 ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాటకి ఇప్పటి వరకూ 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇది సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పాలి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాటలో ఎన్టీఆర్ లుక్స్, జాన్వీ కపూర్ గ్లామర్ అదిరిపోయింది. ఇద్దరి జోడీ మ్యూజిక్ కి తగినట్లు డ్యాన్స్ చేయడం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. పాట చిత్రీకరించిన లొకేషన్స్, తారక్ – జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ గూస్ బాంబ్స్ తెప్పించాయి. రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పా రావు తన గొంతుతో మెస్మరైజ్ చేసేసింది.

తనకు వచ్చిన జాతీయ అవార్డును వారికి అంకితం ఇచ్చేసిన రిషబ్ శెట్టి.!
జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇందులో ఉత్తమ నటుడిగా ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి గాను కాంతారా చిత్రానికి అవార్డును అందుకున్నారు. దీంతో ఆ అవార్డుకు తను తగినవాడే అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు. మరి లేటెస్ట్ గా ఈ అవార్డు గెలిచిన తర్వాత రిషబ్ ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. తను జాతీయ అవార్డు గెలుచుకోవడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను అని అలాగే తనతో ఈ ప్రయాణంలో భాగం అయిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ తెలిపారు. అలాగే తనకి వచ్చిన ఈ అవార్డును తన రాష్ట్రంలో దేవ నర్తకులకి అలాగే దివంగత హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారికి అంకితం చేస్తున్నాను అంటూ తెలిపారు. ఇప్పుడు తన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2022 సెప్టెంబర్ 30న కర్ణాటక రాష్ట్రంలో 250 థియేటర్లలో విడుదలై కాంతారా మూవీ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఆ తర్వాత ఇతర భాషల్లో కాంతారా మూవీ డబ్ అయ్యి ఇతర భాషల్లో సైతం హిట్ గా నిలిచింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది అంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు బాగా నచ్చింది. కేంద్రం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించగా ఉత్తమ నటుడి పురస్కారం కాంతారా సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది. రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు దక్కడం సినీ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.