NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు గుజరాత్‌కు సీఎం చంద్రబాబు.. ప్రధానితో భేటీ..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుజరాత్‌ వెళ్లనున్నారు.. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో పర్యటించనున్నారు చంద్రబాబు.. గాంధీనగర్ లో నేటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం.. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎనర్జీ రంగంలో పేరున్న పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులతో చర్చల్లో పాల్గొననున్నారు.. గుజరాత్‌ పర్యటన కోసం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు చంద్రబాబు.. గాంధీనగర్ ఇన్వెస్టర్స్ మీట్ కు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనంతరం రాత్రి 9 గంటలకు అమరావతికి తిరిగి ప్రయాణం కానున్నారు.. మరోవైపు.. ఆర్‌ఈ ఇన్వె్‌స్ట్‌-2024కు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. దీంతో.. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది.

తెగించారు కదరా? ఫోన్‌ చేసి బెదిరించి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పేరు మీద భారీ లోన్‌..
సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఏ పేరుతో ఫోన్‌ చేసి.. ఎలా ట్రాప్‌ చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.. ఇప్పుడు ఏ కంగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు పేరు మీద.. అతడికి తెలియకుండానే పెద్ద మొత్తంలో లోన్‌ తీసుకున్నారు కేటుగాళ్లు.. తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రూప్‌ కుమార్‌కు తెలియకుండా.. అతడి పేరు మీద ఏకుండా రూ.13.8 లక్షలు లోన్ కాజేశారు సైబర్ నేరగాళ్లు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యానగర్ కు చెందిన రూప్ కుమార్.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.. ఈ నెల 5వ తేదీ రూప్ కుమార్‌కు ఓ ఫోన్‌ వచ్చింది.. ముంబైకి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులమంటూ రూప్‌ కుమార్‌కు ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. ఇరాన్ కు ఇల్లీగల్ వస్తువులు సరఫరా చేశారంటూ బెదిరించారు.. విచారణ కోసం ముంబైకు రావాలని రూప్ కుమార్‌ను ఆదేశించారు.. లేకపోతే స్కైప్ యాప్‌లో మాట్లాడాలని బెదిరింపులకు దిగారు.. దీంతో బెదిరిపోయిన రూప్‌ కుమార్‌.. వాళ్లు ఏది చెబితే అది చేస్తూ పోయాడు. చివరకు రూప్ కుమార్ బ్యాంక్‌ అకౌంట్ వివరాలు, ఓటీపీలు ఇలా వాళ్లకు కావాల్సిన అన్ని వివరాలు తీసుకున్నారు. ఆ వివరాలతో బాధితుడికి తెలియకుండానే లోన్‌ తీశారు.. ఆ మొత్తాన్ని అతడికి తెలియకుండానే కాజేశారు సైబర్ కేటుగాళ్లు.. అయితే, లోన్ తీసుకున్నట్లు బ్యాంకు నుంచి ఫోన్ రావడంతో మోసపోయానని తెలుసుకున్న రూప్ కుమార్.. ఆ తర్వాత ఎస్పీ సుబ్బారాయుడుకు ఫిర్యాదు చేశాడు.. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో సైబర్ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

మళ్లీ కనిపించిన చిరుత.. రాజమండ్రిలో కలకలం..
రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు కనిపించాయి. చిరుత పులి ప్రస్తుతం దివాన్ చెరువు అటవీప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.. చిరుతపులి కదలికలను గుర్తించు నిమిత్తం సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఫారెస్ట్ అధికారులు ఉపయోగిస్తున్నారు. చిరుతని ట్రాప్ బోనులతో పట్టుకొనుటకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరుత పులిని కచ్చితంగా పట్టుకొంటామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. బయట ప్రాంతాల్లో ప్రజల నుండి వచ్చిన సమాచారం తీసుకొని ఫారెస్ట్ సిబ్బంది వెళ్లి తనిఖీ చేయగా ఎటువంటి అధారాలు లభించలేదు. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు నిర్ధారణ లేదు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి థర్మల్ డ్రోన్ కెమెరాను ఉపయోగించి శోధన చేస్తున్నారు. రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ, ఆటోనగర్ అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఏరియాలలో పిల్లలను తల్లిదండ్రులు సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు తిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, రాజమండ్రి శివారులో గత కొంత కాలంగా చిరుత కలకలం సృష్టిస్తోన్న విషయం విదితమే.. చిరుత కదలికలకు సంబంధించిన దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో.. స్థానికులు భయాందోళనకు గురిఅవుతోన్న విషయం విదితమే.

నేడు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కూమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పెద్దఎత్తున పాల్గొననున్నారు. కాగా, వాస్తవానికి గత నెల 20వ తేదీన రాజీవ్​ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనకుంది. కానీ, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. స‌‌‌‌‌‌‌‌చివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మొదటి నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తుంది. అయితే, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సెక్రటేరియెట్ బయట కాదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హుస్సేన్‌ సాగర్‌పై భారీగా ట్రాఫిక్‌జామ్‌.. కనిపించని పోలీసులు..!
హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున గణేష్‌ నిమజ్జనం కొనసాగుతోంది. నగరం నాలుగు మూలల నుంచి గణనాథులు ట్యాంక్‌ బండ్‌ పైకి తరలి వస్తున్నాయి. దీంతో ఈరోజు (సోమవారం) ఉదయం హుస్సేన్‌ సాగర్‌ చుట్టు పక్కల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రేపు(మంగళవారం) ఖైరతాబాద్ ‘మహా’గణపతి నిమజ్జనం ఉండనుంది. దీంతో నిన్న (ఆదివారం) నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్‌బంక్‌కు చేరుకుంటున్నాయి. అయితే, విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నియంత్రించేందుకు పోలీసులు ఎవరూ లేరు. ట్యాంక్ బండ్ పైకి వచ్చిన వాహనాల్లో చాలా వరకు భారీ వాహనాలు ఉండడంతో.. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. దారి పొడవునా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రతాపరంగా కొంత మంది పోలీస్‌ సిబ్బంది ఉన్నప్పటికీ.. హుస్సేన్ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులెవరూ కనిపించకపోవడం గమనార్హం. అయితే, రేపు ఖైరతాబాద్‌ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగబోతుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించారు. గణేశ్ శోభాయాత్ర భద్రత కోసం 25 వేల మంది సిబ్బందిని పోలీస్‌ శాఖ కేటాయించింది. ఇక, ఖైరతాబాద్‌ గణేషుడికి ఇవాళ( సోమవారం) పూజలు నిర్వహించి.. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర స్టార్ట్ చేయనున్నారు మధ్యాహ్నాం ఒటి గంటలోపు నిమజ్జనం చేయనున్నారు. ఎల్లుండి సాయంత్రం వరకు నగరంలోని అన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మణిపూర్‌లో మళ్లీ జాతి హింస, ఉద్రిక్తత.. మయన్మార్ తో సంబంధం
మణిపూర్‌లో గత సంవత్సరం, ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా కోటాల విషయంలో హిందూ-ఆధిపత్యం గల మెయిటీస్, క్రిస్టియన్ కుకీల మధ్య కాలానుగుణంగా హింస చెలరేగింది. కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొని ఇప్పుడు మరోసారి కుల హింస శకం మొదలైంది. మణిపూర్‌లో హింస పెరగడానికి ప్రస్తుత కొన్ని పరిణామాలే కారణం. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. నిజానికి గత రెండు వారాల్లో మణిపూర్‌లో కుల హింస మళ్లీ తలెత్తడానికి తక్షణ కారణం కొన్ని ప్రభుత్వ మార్పుల నిర్ణయాలే. రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్ బృందాలను తగ్గించి, వాటి స్థానంలో కొన్ని సిఆర్‌పిఎఫ్ బృందాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు, ఇది ప్రజలలో ఆగ్రహాన్ని పెంచింది. మణిపూర్ నుండి అస్సాం రైఫిల్స్ బృందాలను ఉపసంహరించుకోవాలనే నిర్ణయం రాష్ట్రంలోని కుకీ జనాభాలో అసంతృప్తిని రేకెత్తించింది. పారామిలటరీ దళం అస్సాం రైఫిల్స్‌లో గణనీయమైన సంఖ్యలో కుకీ వ్యక్తులు ఉన్నందున, సిఆర్‌పిఎఫ్ వారి పట్ల ఎలా వ్యవహరిస్తుందో తెలియడం లేదని కుకీ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. మణిపూర్‌లో మూడు రోజులపాటు జరిగిన ముఖ్యమైన సమావేశం తర్వాత, రాష్ట్రం నెమ్మదిగా శాంతి వైపు కదులుతోంది. మూడు రోజుల సమావేశం తరువాత, ఒక బెటాలియన్ మార్చబడింది, ఇది అక్కడి ప్రజలలో విశ్వాసాన్ని పునరుద్ధరించింది. త్వరలో మరో బెటాలియన్‌ను భర్తీ చేయనున్నారు.

నేడు గుజరాత్ లో తొలి వందే మెట్రో సర్వీసు, రూ.8000కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈరోజు గుజరాత్‌కు ప్రధాని మోదీ 8000 కోట్ల రూపాయల బహుమతి ఇవ్వనున్నారు. దీనితో పాటు, భారతదేశపు మొట్టమొదటి వందే మెట్రో భుజ్ నుండి అహ్మదాబాద్ వరకు ఫ్లాగ్ ఆఫ్ చేయబడుతుంది. దీంతో పాటు అహ్మదాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోదీ నిన్న సాయంత్రం అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రధాని మోదీ ఈరోజు అహ్మదాబాద్‌లో ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది కాకుండా అహ్మదాబాద్‌లో 30 మెగావాట్ల సోలార్ సిస్టమ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం-గ్రామీణ కింద 30 వేలకు పైగా ఇళ్లను ఆమోదించి, ఈ ఇళ్లకు మొదటి విడత విడుదల చేయనున్నారు. దీంతో పాటు పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తారు.

శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి.. జట్టుకు దూరమైన ఆటగాడికి ఛాన్స్!
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. అక్టోబర్‌ 7 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌ ప్రారంభం అవుతుంది. ఈ టీ20 సిరీస్‌కు స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పని భారాన్ని తగ్గించే విధానంలో భాగంగా అతడిని పొట్టి సిరీస్‌లో ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సీజన్లో భారత్ ఆడే పది టెస్టులకు అతడు జట్టులో ఉండే అవకాశముంది. త్వరలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో గిల్‌తో పాటు కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. ‘బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో అక్టోబర్‌ 7 భారత్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడబోతోంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అక్టోబర్‌ 16న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో గిల్‌పై పని భారాన్ని తగ్గించాల్సి ఉంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్‌తో పాటు మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు కూడా టీ20ల్లో విశ్రాంతిని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రిషబ్‌ పంత్‌కు సైతం రెస్ట్‌ ఇస్తే.. చాలా రోజులుగా జట్టుకు దూరమైన వికెట్ కీపర్ ఇషాన్‌ కిషన్‌ జట్టులో పునరాగమనం చేస్తాడు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..
ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లో అడుగుపెట్టిన జానీ మాస్టర్ అనంతికాలంలోనే స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే రేంజ్ ఎదిగాడు జానీ మాస్టర్. ఇటీవల కేంద ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ అందుకున్నాడు జానీ మాస్టర్. కెరీర్ ఇలా పీక్ స్టేజ్ లో సాగుతూ ఉండగా జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసాడని ఓ మహిళ లైంగిక వేదింపుల కేసు పెట్టింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు రాయదుర్గం పోలీసులు. జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని జానీ దగ్గర పని చేసే ఓ  మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అవుట్‌డోర్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లోవెళ్ళినప్పుడు  తనపై అత్యాచారం చేసాడని, అలాగే హైదరాబాద్  నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్  తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది సదరు మహిళ. మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం  నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతనిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  జాని మాస్టర్‌పై   గతంలో  కూడా పలు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌ స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో వైపు జానీ మాస్టర్ హీరోగా రన్నర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

రాజమౌళి – మహేశ్ బాబు సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..?
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో  రానుందని,టైటిల్ ఇదే అని అలా ఒకేటేమిటి రకరకాల ఊహాగానాలు రోజుకొకటి వినిపించాయి. టాలీవుడ్ లో కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ చేయకుండా ఇంతటి భారీ హైప్ రాబట్టిన ఏకైక సినిమా మహేశ్ రాజమౌళి సినిమా అనే చెప్పాలి. రాజమౌళి సినిమా కోసం లాంగ్ హెయిర్, బియర్డ్ తో ఉన్న మహేశ్ బాబు లుక్ తెగ వైరల్ గా మారింది. కాగా రానున్న రాజమౌళి పుట్టినరోజు కి SSMB29 కి సంబందించిన న్యూస్ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబరు లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ జర్మనీలో మొదలుపెట్టనున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాను పక్కా ప్రణాళికతో రూపొందించేలా అందుకు తగినట్టుగా ప్లాన్ రూపొందించారని టాక్. త్వరలోనే యూనిట్ సభ్యులందరికి వర్క్ షాప్ నిర్వహిస్తారని యూనిట్ సభ్యులకు సమాచారం అందించారని వినికిడి. రెగ్యులర్ షూట్ ఎప్పుడు స్టార్ట్ చేసిన సరే ఈ సినిమానుఎట్టి పరిస్థితుల్లో 2028లో రిలీజ్ చేస్తారని యూనిట్ కీలక సభ్యులు తెలిపారు. అంటే మహేశ్ బాబును తెరపై చూడాలంటే 4 ఏళ్ళు ఆగక తప్పదన మాట

Show comments