NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

శ్రీశైలంలో రేపటితో ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే..
రేపటితో శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నారు.. నేడు శ్రీశైలంలో 6వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో విశేష కార్యక్రమాలు జరగనున్నాయి.. యాగశాలలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం నిర్వహించనున్నారు.. సాయంత్రం సద్యసం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికిన ధ్వజపటం ధ్వజవరోహణ నిర్వహిస్తారు.. బుధ వారం ఐదోవరోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి రావణవాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు.

పల్లెకు బైబై.. మళ్లీ పట్నం బాట.. రద్దీగా హైవేలు..
సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండుగ పూట సొంత ఊరు వెళ్లి.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపారు.. ఇక, కోళ్ల పందాలు, గుండాట ఇలా పలు రకాల ఆటల్లో పాల్గొన్నారు.. కొందరు డబ్బులు పోగొట్టుకుంటే.. మరికొందరు డబ్బులు కొన్ని వెనకేసుకున్నారు.. మరోవైపు.. పండగకు ముందు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కాగా.. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు.. దీంతో.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కీసర టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది.. సంక్రాంతి సంబరాలు ముగించుకొని హైదరాబాద్‌ తిరుగుప్రయాణం చేసే ప్రయాణికుల వాహనాలతో రద్దీగా మారిపోయాయి హైవేపై ఉన్న టోల్ గేట్లు.. గత మూడురోజులు సంబరాలు ముగిసిపోవడంతో తిరుగు ప్రయాణం అయ్యారు పట్టణవాసులు.. ఇక, ఉమ్మడి తూర్పు గోదావరి.. పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు కూడా తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు.. హైదరాబాద్‌కు ఈనెల 19 వరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు రాజమండ్రి ఆర్టీసీ అధికారులు.. శని, ఆదివారాల్లో ప్రతి ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. మరోవైపు.. మొన్నటి వరకు వెళ్లేవారికి.. ఇప్పుడు సంక్రాంతికి వచ్చి తిరిగి వెళుతున్న ప్రయాణికులనుంచి టికెట్ల అధిక రేట్లతో దోపిడీ చేసే పనిలో పడిపోయాయి ప్రైవేట్‌ ట్రావెల్స్‌..

ఫార్ములా-ఈ రేస్ కేసు.. నేడు ఈడీ విచారణకు కేటీఆర్!
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో జనవరి 7న నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం 10 నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరి.. 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో A2, A3గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎన్‌ఎల్ రెడ్డిలను ఈడీ ఇప్పటికే విచారించింది. వావారు ఇద్దరు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈడీ ఇవాళ కేటీఆర్‌ని ప్రశ్నిస్తుంది. అరవింద్ కుమార్, బీఎన్‌ఎల్ రెడ్డి ఇద్దరూ తమ తప్పేమీ లేదని.. కేటీఆర్ బలవంతంతోనే అలా చేశామని చెప్పారు. ఈ నేసథ్యంలో నేడు కేటీఆర్ ఏం చెబుతారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఫెమా రూల్స్‌ని అతిక్రమిస్తూ కేటీఆర్ విదేశాలకు రూ.55 కోట్లు తరలించారని ఆయనపై ఉన్న అభియోగం. ఈ కేసులో కేటీఆర్‌పై ఫెమా ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా నమోదయింది. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.

కుంభమేళా బాట పట్టిన ఏరోస్పేస్ ఇంజనీర్.. ఎవరు ఈ మసాని గోరఖ్‌
ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతున్న మహా కుంభమేళా ఈసారి మరింత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజే రికార్డు స్థాయిలో దాదాపు రెండు కోట్లకు పైగా భక్తులు తరలిరావడంతో, ఈ ఆధ్యాత్మిక వేడుక ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సాధువులు, బాబాలు, ఆధ్యాత్మిక గురువులతో కళకళలాడే ఈ కుంభమేళ ఈసారి ఓ ప్రత్యేక వ్యక్తి ద్వారా మరింత ప్రసిద్ధి చెందింది. ఆయనే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన అభయ్ సింగ్. ఈయన దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి అనుకోని మార్గాన్ని ఎంచుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయనకు జీవితంలో ఏదో వెలితి అనిపించింది. దీంతో తన కెరీర్‌ను వదిలేసి, సన్యాస జీవితాన్ని ఎంచుకున్నారు. సన్యాస జీవితాన్ని గడుపుతున్న సమయంలో అభయ్ సింగ్ పేరు ‘మసాని గోరఖ్’ గా మార్చుకున్నారు. ఆధ్యాత్మికత, తత్వశాస్త్రంపై దృష్టి పెట్టి పోస్ట్ మోడర్నిజం, సాక్రటీస్, ప్లేటో వంటి సిద్ధాంతాలను అధ్యయనం చేశారు. జీవితం, ఆధ్యాత్మికతపై గాఢమైన జిజ్ఞాసతో, చివరికి శివుడికి అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈయన జీవిత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటోగ్రాఫర్‌గా, ఫిజిక్స్ కోచర్‌గా, డిజైన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన చివరికి సన్యాసాన్ని స్వీకరించారు. “ఇదే నిజమైన జీవితం” అంటూ అభయ్ స్పష్టంగా తెలిపారు. ఇప్పుడు ఆయన తన జీవనమార్గాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ‘ఐఐటీయన్ బాబా కథ’ గా వైరల్‌ అవుతుంది. ఇది గమనించిన సోషల్ మీడియా నెటిజన్స్ భౌతిక విజయం కంటే జ్ఞానాన్ని ఎంచుకున్న ఆయనను చాలా మంది ప్రశంసిస్తున్నారు.

రాజ్యాంగంలో మార్పులు చేస్తున్న బంగ్లాదేశ్.. ఏ సవరణలు చేస్తుందంటే ?
బంగ్లాదేశ్‌లోని రాజ్యాంగ సంస్కరణ కమిషన్ అనేక సూత్రాలను మార్చడానికి ఒక ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. లౌకికవాదం, సోషలిజం, జాతీయవాదం రాష్ట్ర సూత్రాలను మార్చడం గురించి చర్చ జరుగుతోంది. రాజ్యాంగ సంస్కరణల కమిషన్ తన నివేదికను దేశ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్‌కు సమర్పించింది. బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమం మధ్య షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్, దేశానికి ద్విసభ పార్లమెంటును, ప్రధానమంత్రి పదవీకాలానికి రెండు పదవీకాల పరిమితిని ప్రతిపాదించింది. ఈ మూడు సూత్రాలు బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని దేశ రాష్ట్ర విధానంలో చేర్చబడ్డాయి. రాజనీతిజ్ఞత ప్రాథమిక సూత్రాలుగా స్థాపించబడిన నాలుగు సూత్రాలలో ఇది ఒకటి. రాజ్యాంగ సంస్కరణ కమిషన్‌లోని కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ప్రజాస్వామ్యం అనే పదాన్ని మాత్రమే మార్చలేదు.

భారీ అప్‌డేట్లతో తక్కువ రేటుకే వచ్చేసిన హోండా కొత్త స్పోర్టీ స్కూటర్
కొత్త సంవత్సరంలో భారత టూవీలర్ మార్కెట్‌లో స్కూటర్ల వరుస లాంచ్‌లు జరుగుతున్నాయి. టూవీలర్ తయారీలో ప్రసిద్ధి పొందిన కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కొత్త మోడళ్లను విడుదల చేస్తూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. ఈ పోటీ మధ్య హోండా కంపెనీ తన కొత్త స్కూటర్ 2025 హోండా డియోను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ కొత్త 2025 హోండా డియో ఫీచర్లు, ధరల వివరాలను వివరంగా చూద్దాం. 2025 డియో 109.51 cc సింగిల్ సిలిండర్, PGM-FI ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7.8 bhp పవర్, 9.03 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ OBD2B ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది. దీని వల్ల తక్కువ కాలుష్య ఉద్గారాలు వెలుబడుతాయి. అలాగే, ఐడ్లింగ్ స్టాప్ ఫీచర్ ఇంధన వినియోగాన్ని మరింత మెరుగుపరుస్తుంది. అలాగే ఈ హోండా డియో 1808 mm పొడవు, 723 mm వెడల్పు, 1150 mm ఎత్తు కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm, వీల్‌బేస్ 1260 mm. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. ఈ కొత్త డియో స్పోర్టీ డిజైన్, ప్రాక్టికల్ స్ట్రక్చర్‌తో మరింతగా ఆకట్టుకుంటుంది.

దూసుకెళ్తున్న అల్కరాస్‌.. యుకి, బోపన్న జోడీలు ఔట్‌!
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025లో నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ కార్లోస్‌ అల్కరాజ్‌ (స్పెయిన్‌) దూసుకెళ్తున్నాడు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో 6-0, 6-1, 6-4తో యోషిహిటో నిషియోకా (జపాన్‌)పై సునాయాసంగా గెలిచాడు. అల్కరాస్‌ జోరు ముందు తొలి రెండు సెట్లలో తేలిపోయిన జపాన్‌ ఆటగాడు.. మూడో సెట్లో కాస్త పోటీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌ ప్లేయర్ 14 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టాడు. అల్కరాజ్‌ జోరు చూస్తుంటే.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఖాతాలో పడడం ఖాయంగా ఉంది. టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్లో 6-1, 6-7 (4), 6-3, 6-2తో జైమీ ఫారియా (పోర్చుగల్‌)పై గెలిచాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓ సెట్‌ను కోల్పోయిన జకో.. ఆపై పుంజుకుని విజయం సాధించాడు. కెరీర్‌లో జకోవిచ్‌కు ఇది 430వ మ్యాచ్‌. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా జకో రికార్డు సృష్టించాడు. రోజర్ ఫెదరర్‌ (429)ను జకో అధిగమించాడు. ఇక రెండో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-1, 6-4, 6-1తో మార్టినెజ్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించాడు.

సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి, లీలావతి ఆసుపత్రిలో చేరిక
సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి జరిగింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. సైఫ్ ఖార్‌లోని ఫార్చ్యూన్ హైట్స్‌లో నివసిస్తున్నారు. అతని ఇల్లు 11వ అంతస్తులో ఉంది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడని చెబుతున్నారు. ఈ సమయంలో ఒక దొంగ సైఫ్ పై దాడి చేశాడు. అందులో అతను గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం ప్రకారం, ఈ సంఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. సైఫ్ ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. ఇంతలో కొంతమంది పని మనుషులు నిద్ర నుండి మేల్కొన్నారు. వాళ్లు పెద్ద చేశారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ నిద్ర లేచి వచ్చారు. ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో దొంగ సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. అతను గాయపడ్డాడు. పనిమనుషులు, ఇంట్లోని కొంతమంది సభ్యులు సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని చేర్చుకున్నారు. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే సైఫ్ గాయం తీవ్రమైనది కాదు.

విదాముయర్చి ట్రైలర్ తో రిలీజ్ డేట్ కూడా..?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్‌ను పలకరించి ఏడాది దాటిపోయింది. 2024 మొత్తం  షూటింగ్స్ తోనే గడిపేశాడు. విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఉన్నట్టుండి  అనివార్య కారణాల వలన ఈ సినిమా పొంగల్ రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. విదాముయర్చి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడడంతో రిలీజ్ కు బ్రేక్ పడింది. మజీజ్ తిరుమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా దీపావళికే సినిమా రిలీజ్ చేయాలనుకుంటే షూటింగ్ చివరి దశలో ఉండటం, పోస్టు ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉండటంతో సంకాంత్రికి అక్కడి నుండి జనవరి చివరి వారానికి పోస్టు పోన్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ కు విపరీతమైన స్పందన లభించగా తాజగా విదాముయర్చి ట్రైలర్ ను నేడు విడుదల చచేయనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. మరోవైపు ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారం లేదా జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల దుబాయ్ లో జరిగిన 24H రేసింగ్ లో మెడల్ సాధించిన అజిత్ తాను నటించిన సినిమా ఈ జనవరి లో విడుదల కానుందని ప్రకటించాడు. దీంతో విదాముయర్చి జనవరి 26న రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ నెలలోనే రిలీజ్ చేస్తారో లేదా ఫిబ్రవరికి మరోసారి పోస్ట్ పోన్ చేస్తారో నేడు రిలీజ్ కానున్న ట్రైలర్ లో ప్రకటిస్తారేమో చూడాలి.

Show comments