NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో సెలవు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారి పుదుచ్చేరి – చెన్నై మధ్య తీరం దాటుతుందని IMD అంచనా వేస్తోంది.. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయల సీమ జిల్లాలకు రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. మరో నాలుగు రోజుల పాటు వీటి ప్రభావం కొనసాగుతోందని పేర్కొంది.. భారీ వర్షాల నేపథ్యంలో.. నేడు, రేపు పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు సెలవు ప్రకటించారు తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టర్లు.. మరోవైపు ప్రకాశం జిల్లాలోనూ సెలవుగా ప్రకటించింది ప్రభుత్వం.. నెల్లూరులో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఈ రోజు సెలవుగా ప్రకటించారు.. ఇక వర్షాల నేపథ్యంలో.. శ్రీ సత్యసాయి జిల్లాలో అక్టోబర్ 15, 16, 17 తేదీలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ టీఎస్ చేతన్.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం .. బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. తదుపరి 2 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుంది.. దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా,రాయలసీమలో విస్తృతంగా వర్షాలు.. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు.. పలుచోట్ల అతితీవ్రభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇవాళ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉండగా.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.. నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. మిగత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నేటితో మూతపడనున్న ప్రభుత్వ వైన్‌షాపులు..
ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు ముగిసింది. ఐదేళ్లుగా ప్రభుత్వం నడుపుతున్న మద్యం దుకాణాలకు నేడే చివరి వర్కింగ్ డే. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త మద్యంపాలసీలో భాగంగా.. ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ షాపులను ఇచ్చే విధంగా టెండర్లను ఆహ్వానించింది 26 జిల్లాల నుంచి 3396 షాపులకి 89,882 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా లక్ష దరఖాస్తులు వస్తాయని భావించిన అధికారులు.. సుమారు 90వేల దరఖాస్తులతో టెండర్లను ముగించారు దాదాపుగా 1800 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.ఎంఆర్పి ప్రకారం మాత్రమే మద్యం విక్రయించేలా చర్యలు చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైన్ షాప్ కోసం దరఖాస్తు చేసిన వారందరికీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు లాటరీ విధానం ద్వారా షాపులను కేటాయించారు. ఢిల్లీ తెలంగాణ మహారాష్ట్ర యుపి ప్రాంతాల నుంచి కూడా లిక్కర్ వ్యాపారులు ఆన్లైన్ ద్వారా టెండర్స్ వేసి షాపులను పొందారు అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులకు 5,825 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 40 షాపులకు 1205 దరఖాస్తులు వచ్చాయి తిరుపతి జిల్లాలో అత్యధికంగా 227 షాపులు ఉన్నాయి. వీటికి 3920 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాలను కైవసం చేసుకోవడం కోసం లిక్కర్ సిండికేట్ లో 50 నుంచి 100 టెండర్లు దాఖలు చేశారు తద్వారా ఐదు నుంచి పది షాపులు పొందారు పది నుంచి 30 టెండర్లు వేసిన కొందరు సిండికేట్లకు ఒక్క షాప్ కూడా రాకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు.

ఉత్తరాంధ్ర ఇలవేల్పు.. నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.. మరోవైపు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా క్యూలైన్లో టెంట్లు ఏర్పాటు చేశారు.. భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.. హుక్కుం పేటలో సిరిమానుకు పసుపు కుంకాలు సమర్పించుకుంటున్నారు భక్తులు.. పైడితల్లి అమ్మావారి సిరిమానోత్సవ సందర్భంగా నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. నగరపాలిక పరిధిలో 120 వరకు బయో మరుగుదొడ్లు సిద్ధం చేసింది.. ఉత్సవాలు జరిగే వేదికలతో పాటు జాతరకు సంబంధించిన ప్రధాన కేంద్రాల వద్ద టాయిలెట్లను అందుబాటులో ఉంచారు అధికారులు.. పారిశుద్ధ్య పనులకు అదనంగా 330 మందిని నియమించారు.. వీరంతా మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు.. ఆలయం చుట్టూ.. సిరిమాను తిరిగే ప్రాంతంలో 620 మంది ప్రత్యక్షంగా పనులు చేయనున్నారు.. విక, విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి జాతర నేపథ్యంలో నేడు నగరంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి..

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుందనే చర్చ సాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు దీనిపై మాట్లాడారు.. అయితే, మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అయ్యే రోజు రానే వచ్చింది.. మహిళలకు ఉచిత బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అందుబాటులోకి వస్తుందన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాటు పడుతున్నారని.. పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు ఇస్తామని చెప్పారు గురజాల జగన్‌ మోహన్‌.. పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జగన్‌ మోహన్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలు బాగుంటేనే అంతా బాగుంటుందని నమ్మే వ్యక్తి సీఎం చంద్రబాబు అన్నారు.. పల్లె నుంచి సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు.. అందుకే ఆయనది మంచి మనసు అన్నారు.. గత ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క నాయకుడైనా వచ్చి.. మీ సమస్యలు అడిగి తెలుసుకున్నాడా? అని ప్రశ్నించారు.. మేం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.. ఇప్పటికే పెన్షన్‌ ఇస్తున్నాం.. దీపావళి నుంచి మీకు సిలిండర్లు ఇస్తాం.. ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలు అవుతుందన్నారు.. ప్రతీ 6 నెలలకు ఓసారి గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం అన్నారు.. దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్సు అమల్లోకి తెస్తామని వెల్లడించారు.. మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారు.. పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు ఇస్తామని తెలిపారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.

నేడు గాంధీ భవన్ లో ప్రజావాణి.. ఫిర్యాదులు స్వీకరించనున్న మంత్రి సీతక్క
నేడు గాంధీభవన్ లో మంత్రుల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రి గాంధీభవన్‌లో ఉంటారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా.. వారానికి (బుధ, శుక్ర) ఇద్దరు మంత్రులు తప్పకుండా గాంధీ భవన్ కి హాజరుకావాలనే నేపథ్యంలో మొదటి రోజు (బుధవారం) ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరు కాగా.. రెండో రోజు (శుక్రవారం) ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఇవాళ మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. అనంతరం వాటి పరిష్కారంపై అధికారులతో చర్చించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.

రేపు జమ్మూకాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వైఎస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా రేపు (బుధవారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తదుపరి సర్కార్ ఏర్పాటు చేసేందుకు తనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హా నుంచి ఆహ్వాన లేఖ అందిందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన తెలిపారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఒమర్‌ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. కాగా, 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్‌కు 6 సీట్లు వచ్చాయి.. బీజేపీ 29 స్థానాల్లో గెలిచింది. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వగా.. దీంతో భారతీయ జనతా పార్టీ బలం 32కు చేరింది. అలాగే, మరో నలుగురు స్వతంత్ర్య అభ్యర్థులు కూడా ఒమర్ అబ్దుల్లా పార్టీకి సపోర్ట్ తెలపడంతో ఆ పార్టీ బలం 46కి చేరిపోయింది. దీంతో కాంగ్రెస్ సహాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీని ఎన్సీ పార్టీ దక్కించుకుంది.

నేటి నుంచి పాకిస్థాన్‌లో ఎస్‌సీఓ సదస్సు.. హాజరుకానున్న జైశంకర్..
పాకిస్థాన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడులతో పాటు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ చేస్తున్న నిరసనల కారణంగా శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారుతుందనే భయంతో ఈ రెండు రోజుల పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, ఈ సదస్సుకు విదేశీ ప్రతినిధులు ఇప్పటికే చేరుకున్నారు. SCO సదస్సులో భారతదేశం తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొంటారు. చైనా, రష్యా ప్రధాన మంత్రులతో సహా ఎస్‌సీఓ సభ్య దేశాల నేతలు బెలారస్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రధానులతో పాటు ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ కూడా రానున్నారు. కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) సమావేశంలో ఆర్థిక, వాణిజ్యంతో పాటు పర్యావరణం లాంటి వివిధ అంశాలపై చర్చించనున్నారు.

మా పోరాటం హెజ్‌బొల్లాపై.. లెబనాన్ ప్రజలపై కాదు
లెబనాన్‌ సరిహద్దుల్లో ఉన్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందే టార్గెట్‌గా ఇజ్రయెల్‌ సైన్యం దాడులు కొనసాగిస్తుందని వస్తున్న ఆరోపణలపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు మీడియతో మాట్లాడుతూ.. లెబనాన్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అక్కడ పర్యటిస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతిపరిక్షణ సిబ్బందిని ఆ ప్రాంతంలో తాత్కాలికంగా తమ విధులు ఉపసంహరించుకోవాలని మా సైన్యం కోరిందని చెప్పుకొచ్చారు. ఇక, హెజ్‌బొల్లా లక్ష్యాలపై దాడి చేస్తున్న టైంలో లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందికి హాని కలిగించకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ సైన్యం తగిన చర్యలు తీసుకుంటుందని ప్రధాని నెతన్యాహూ పేర్కొన్నారు. అయితే, ఉద్రిక్తతలు కొనసాగుతున్న లెబనాన్‌ సరిహద్దు ప్రాంతాన్ని తాత్కాలికంగా విడిచి పెట్టాలని యూఎన్‌ఎఫ్‌ఐఎల్‌ను ఇజ్రాయెల్ సైన్యం పదే పదే కోరుతుంది.. హెజ్‌బొల్లా టెర్రరిస్టులను నిర్మూలించేందుకు లెబనాన్‌పై దాడులు ప్రారంభించిన రోజున ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సభ్యులకు తాను విజ్ఞప్తి చేశాను అని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.

ఘన ప్రస్థానం నుంచి పతనం వైపు.. పాకిస్తాన్ క్రికెట్‌కు ఏమైంది?
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో పాకిస్తాన్ టీమ్ హవా నడించింది. సొంతగడ్డపైనే కాక.. విదేశాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. 1992లో వన్డే ప్రపంచకప్‌, 2009లో టీ20 ప్రపంచకప్‌లను గెలిచింది. అలాంటి టీమ్ ప్రస్తుతం అనూహ్య ఓటములను ఎదుర్కొంటోంది. పసికూనల చేతుల్లో కూడా ఓడిపోతోంది. ఘన ప్రస్థానం నుంచి.. పాకిస్తాన్ పతనం వైపు వేగంగా అడుగులేస్తోందా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌ ఆట తీరు రోజురోజుకు పడిపోతోంది. టీ20ల్లో ఐర్లాండ్‌ చేతిలో ఓడిన పాక్.. టీ20 ప్రపంచకప్‌ 2024లో పసికూన అమెరికా చేతిలో పరాజయం పాలైంది. సొంతగడ్డపై 0-2తో టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్‌కు కోల్పోయింది. తాజాగా ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు చేసినా.. ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఇటీవలి కాలంలో టీమిండియాపై గెలిచిన దాఖలు లేవు. 2022 నుంచి స్వదేశంలో ఆడిన 11 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ గెలవలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌, 2024 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించింది. ఇక టెస్టు ర్యాంకింగ్స్‌లో అయితే 8వ స్థానానికి పడిపోయింది.

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్‌ ముందు ఐదు రికార్డులు!
బుధవారం (అక్టోబర్ 16) నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా ఆడుతున్న టీమిండియా.. సొంతగడ్డపై ఈ సిరీస్‌ను సైతం ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తొలి టెస్టు బెంగళూరులో, రెండో టెస్టు పుణెలో, మూడో టెస్టు ముంబైలో జరగనున్నాయి. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ ఐదు రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉంది. అవేంటో ఓసారి చూద్దాం.
# రోహిత్‌ శర్మ మరో ఐదు సిక్స్‌లు బాదితే.. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
# రెండు డబ్ల్యూటీసీల్లో 1000కి పైగా రన్స్ చేసిన తొలి భారత ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ రికార్డు సృష్టించే అవకాశముంది. రోహిత్ 2019-21లో 1094 పరుగులు చేయగా.. 2023-25 డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 742 పరుగులు బాదాడు.
# న్యూజిలాండ్‌తో సిరీస్‌ను భారత్‌ 3-0తో కైవసం చేసుకుంటే.. డబ్ల్యూటీసీలో అత్యంత విజయవంతమైన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ అరుదైన ఘనత సాధిస్తాడు. 2019-2022 మధ్య విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 14 విజయాలు సాధించింది. ఈ సిరీస్‌ను భారత్ 3-0తో గెలిస్తే కోహ్లీని రోహిత్‌ దాటేస్తాడు.
# న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధిస్తే.. టీమిండియా తరఫున నాలుగో అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు. మహమ్మద్ అజహరుద్దీన్‌ (14 విజయాలు, 47 మ్యాచ్‌లు)ను హిట్‌మ్యాన్‌ అధిగమిస్తాడు. రోహిత్‌ ప్రస్తుతం 18 మ్యాచ్‌లలో 12 విజయాలతో ఉన్నాడు.
# న్యూజిలాండ్‌ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తే.. కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేస్తాడు. దాదా (97 విజయాలు, 195 మ్యాచ్‌లు) నాలుగో స్థానంగా ఉండగా.. రోహిత్‌ (95 విజయాలు.. 128 మ్యాచ్‌లు) ఐదో స్థానంలో ఉన్నాడు.

ఓటీటీలోకి గోపిచంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం విశ్వం.. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ముందు హీరో గోపిచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల ఇద్దరూ ఫ్లాప్ ఫేస్ లో ఉన్నారు. గోపీచంద్ కి ఇటీవల ఒకటి రెండు పర్వాలేదు అని అనిపించే సినిమాలు పడ్డాయి కానీ, శ్రీను వైట్ల హిట్ సినిమా తీసి దాదాపు పదేళ్లకు పైనే అయింది. ఎన్టీఆర్ బాద్ షా సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. విశ్వంతో శ్రీను వైట్ల కమ్ బ్యాక్ ఇచ్చినట్లే అనిపిస్తోంది.. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ గురించి మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. డైరెక్టర్ శ్రీను వైట్ల 2018 లో రవితేజ తో ఆయన తీసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన సినిమాలు చేయలేదు. భారీ గ్యాప్ తీసుకొని విశ్వం చిత్రంతో వచ్చారు. రొటీన్ చిత్రం అనిపించినప్పటికీ, కామెడీ వర్కౌట్ అవ్వడంతో దసరా హాలిడేస్ వరకు నెట్టుకొచ్చింది.. దసరా పండగ గోపి చంద్ కు మంచిగానే వర్కవుట్ అయింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కు భారీగానే రాబట్టిందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ ఓటీటీ పై ఓ వార్త వినిపిస్తుంది.

క్లైమాక్స్‌ షూట్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెనక్కి తగ్గేదే లేదు..
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో క్రేజీ ఎంటర్‌టైనర్  వెంకీఅనిల్03 పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్ షెడ్యూల్‌ను పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌తో జరుగుతోంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి రెండవ వారంలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మేకర్స్. అనిల్ రావిపూడి, వెంకటేష్, దిల్ రాజు కాంబోలో రానున్న హ్యాట్రిక్ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దాదాపు ఆ టైటిల్ నే ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ 75 % పూర్తి చేసారని తెలుస్తోంది. ఓన్లీ క్లైమాక్స్ మాత్రం పెండింగ్ ఉందని సమాచారం. వచ్చే నెల అనగా నవంబరు 14 నుంచి 19 వరకు సంక్రాంతికి వస్తున్నాం క్లయిమాక్స్ షూట్ ప్రారంభం కానున్నట్టు యూనిట్ తెలిపింది. అదే నెల 25 తో పాచ్ వర్క్ లతో సహా సినిమా మొత్తం పూర్తి చేసేలా పక్క ప్రణాళిక రూపొందించారు మేకర్స్. వీలైనంత త్వరగా షూట్ కంప్లిట్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు నిర్మాత దిల్ రాజు. వెంకీ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాలయ్య, రామ చరణ్ సినిమాలతో పోటీగా రిలీజ్ కానుంది

Show comments