NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు తణుకులో సీఎం పర్యటన
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు.. తణుకులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివ్‌స’ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆ తర్వాత ‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం-పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి’ అనే థీమ్‌తో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో సమావేశం కానున్నారు.. మరోవైపు.. నియోజకవర్గానికి చెందిన సుమారు రెండు వేల మంది ప్రజలతో ప్రజా వేదిక నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు… ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.. అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య శ్రేణులతో భేటీకానున్న సీఎం.. కీలక సూచనలు చేయనున్నారు.. జిల్లా అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. ఇక, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పర్యటన కోసం.. ఉదయం 7.30 గంటలకు ఉండవల్లిలో తన ఇంటి నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి.. ఉదయం 8 గంటలకు తణుకు ఎస్ఎం వీఎం పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. ఉదయం 8.10 నుంచి 8. 20 వరకు జిల్లాలోని నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. 8.21 నుంచి 8.30 వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతో సమావేశం అవుతారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 8.35కి పట్టణంలోని ఎన్టీఆర్ పార్కుకు చేరుకుని, 9 గంటల వరకు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడతారు. 9.05కి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకుని 10.05 గంటల వరకు ప్రజావేదిక నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 10. 10కి జూబ్లీ రోడ్లోని నూలివారి లేఅవుట్ కి చేరుకుని, 11 గంటల వరకు పార్టీ నాయకులతో, ప్రజాప్రతినిధులతో, 11 నుంచి 12 గంటల వరకు జిల్లా అధికారులతో సమావేశమ వుతారు. ఇక, 12.05కి పాలిటెక్నిక్ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10కి హెలికాఫ్టర్‌లో జిల్లా నుండి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

అమెరికాలో కాల్పులు.. తిరుపతి యువకుడికి తీవ్రగాయాలు
అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడూ ఏదో ఒక సిటీలో.. మూలనో కాల్పుల మోత మోగుతూనే ఉంటుంది.. తాజాగా, అమెరికాలో కారుపై దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యారు.. తిరుపతి జిల్లా ఏర్పేడు మండం గోవిందపురం పంచాయతీకి చెందిన మోహన్ సాయి.. అమెరికాలోని మెమ్సిస్ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.. అయితే, గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఓ స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఈ ఘటనలో మోహన్ సాయి కుడి భుజం, చేతిపై బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు మోహన్‌ సాయి.. ఇక, ఆ కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి‌.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. కాగా, ఇప్పటికే అమెరికాలో జరిగిన ఎన్నో ఘటనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా చాలా మంది గాయాలు పాలుకాగా.. కొందరి ప్రాణాలు కూడా పోయిన విషయం విదితమే..

మండిపోతున్న ఎండలు.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం కూడా ఉంది. ఇవాళ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున 7 జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగినట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల ప్రాంతంలో సాధారణంగా మార్చి నెలలో 35 డిగ్రీల వరకు ఎండ ఉంటుంది. ఈసారి మాత్రం మార్చి మధ్యలోనే 42 డిగ్రీలు దాటిపోయింది. దాంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడి జనం ఆందోళన చెందుతున్నారు. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా పడుతోంది.

నేటి నుంచి ఒంటిపూట బడులు.. మధ్యాహ్నం 12.30 వరకే
తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంట వరకు క్లాసులు జరగనున్నాయి. వేసవి కాలం నేపథ్యంలో ఈరోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్కపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఒంటిపూట బడులు నిర్వహించడానికి నిర్ణయించింది. ఈరోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతుండగా.. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23వ తేదీ వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.

వరంగల్‌లో కిలాడీ లేడీ అరాచకాలు.. పాఠశాల విద్యార్థినులే టార్గెట్..!
వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలకు పాల్పడుతుంది. పాఠశాలకు వెళ్లే బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి.. వారిపై అత్యాచారాలు చేయిస్తుంది. ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ ఘోరాలు బయటపడ్డాయి. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కేసు కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న (14) బాలికకు మాయ మాటలు చెప్పి ల్యాదెల్ల ప్రాంతానికి చెందిన నవ్య అనే(20) యువతి తీసుకెళ్లింది. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల అనంతరం యువతి వద్ద 9వ తరగతి విద్యార్థి బందీగా ఉన్నట్లు పోలీసులు ఆచూకీ కనుక్కున్నారు. హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన కిలాడీ లేడీ కొంతకాలంగా వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటుంది. డ్రగ్స్‌కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠా ఏర్పాటు చేసుకుంది. పాఠశాల బాలికలే లక్ష్యంగా కిలాడీ లేడీ వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించి.. పాఠశాలకు వెళ్లి వచ్చే సమయాల్లో బాలికలకు మాయమాటలు చెప్పి ఎంపిక చేసుకుంటారు. అనంతరం కిడ్నాప్ చేసి.. బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి, అప్పటికే తన గ్యాంగ్‌కు టచ్‌లో ఉన్న మానవ మృగాలకు విద్యార్థినులను అప్పగిస్తుంది.

కెనడా ఎప్పటికీ యునైటెడ్ స్టేట్స్‌లో భాగం కాదు.. పొరపాటున కూడా ఆలోచించకు.. ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్
కెనడా 24వ ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ శుక్రవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒట్టావాలోని రిడ్యూ హాల్‌లో గవర్నర్ జనరల్ మేరీ సైమన్ కార్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మార్క్ కార్నీ మాజీ సెంట్రల్ బ్యాంకర్. అతడు బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెండింటికీ నాయకత్వం వహించాడు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో కెనడా అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన తన పదవీకాలాన్ని ప్రారంభించారు. కెనడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే, ట్రంప్ సుంకాలను ఎదుర్కోవడం తన అగ్ర ప్రాధాన్యత అని కార్నీ అన్నారు. కెనడాను విలీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న బెదిరింపులను ఖండించాడు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కెనడా ఎప్పటికీ యునైటెడ్ స్టేట్స్‌లో భాగం కాదని.. పొరపాటున కూడా ఆలోచించకు అని కార్నీ అన్నారు. ట్రంప్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మార్క్ కార్నీ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.

నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రానున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ NASA- SpaceX ఆమెను, వ్యోమగామి బుచ్ విల్మోర్‌ను తిరిగి తీసుకురావడానికి ప్రయోగాన్ని ప్రారంభించాయి. స్పేస్‌ఎక్స్ శనివారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు క్రూ-10 మిషన్‌ను ప్రయోగించింది. క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను మోసుకెళ్లే స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శనివారం ఉదయం 4.33 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా నలుగురు కొత్త వ్యోమగాములను ISS కి పంపింది. వీరిలో నాసాకు చెందిన అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, JAXAకి చెందిన టకుయా ఒనిషి, రోస్కోస్మోస్‌కు చెందిన కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. మూడు రోజుల క్రితం సాంకేతిక సమస్యతో ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్ ప్రయోగించబోతున్న సమయంలో, ఫాల్కన్-9 రాకెట్ యొక్క గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో మిషన్‌ను రద్దు చేశారు. అయితే ఇప్పుడు సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడానికి మార్గం సుగమం అయ్యింది. మార్చి 19 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశం ఉందని నాసా తెలిపింది.

నేడే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్
WPL 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 15)న ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఢిల్లీ జట్టు గ్రూప్ దశలో టేబుల్ పాయింట్స్ అగ్రస్థానంలో కొనసాగుతూ వరుసగా మూడోసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, తొలి రెండు సీజన్లలో ఢిల్లీ జట్టు ట్రోఫీ అందుకోలేకపోయింది. కానీ, ఈసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు తన శాయశక్తులా ప్రయత్నించనుంది. ఇక మరోవైపు, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ గ్రూప్ దశలో రెండవ స్థానంలో నిలిచింది. దీని తర్వాత, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి ఫైనల్స్‌లోకి సగర్వాంగా ప్రవేశించింది. మొదటి సీజన్‌లో ఢిల్లీని ఓడించడం ద్వారా WPL ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ముంబై జట్టు మళ్ళీ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. ఇక WPL 2025 సీజన్‌లో గ్రూప్ దశలో రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగగా, ఈ రెండు మ్యాచ్‌లలో మెగ్ లానింగ్ జట్టు ఢిల్లీ జట్టు హర్మన్‌ప్రీత్ జట్టు ముంబై పై విజయం సాధించింది. హెడ్-టు-హెడ్ రికార్డులో ఢిల్లీ 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది అలాగే ముంబై 3 గెలిచింది. ఈ విధంగా చూస్తే ఢిల్లీదే పైచేయి. చుడాలిమరి ఈసారైనా ఢిల్లీ గెలిచి తన మొదటి ట్రోఫీ అందుకుంటుందో లేక.. ముంబై మరోసారి ఛాంపియన్స్ గా నిలుస్తుందో.

పవన్‌ కల్యాణ్‌కు ప్రకాష్‌రాజ్‌ కౌంటర్.. ఆయనకి ఎవరైనా చెప్పండి ప్లీజ్‌..!
నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రినాథ్.. ఇది బద్రి వర్సెస్ నంద.. బద్రి సినిమాలో ఈ ఇద్దరి ఫైట్ ఓరేంజ్‌లో ఉంటుంది. సిల్వర్ స్ర్కీన్‌పై పవన్ కల్యాణ్, ప్రకాష్‌రాజ్ ఫైట్ పెద్ద హిట్టే కొట్టింది.. ఇక, పొలిటికల్ పిచ్‌పై కూడా ఈ ఇద్దరూ సెటైర్లు, కౌంటర్లతో విరుచుకుపడుతుంటారు. అవకాశం వచ్చిన ప్రతీసారీ.. పవన్‌కు కౌంటరిస్తుంటారు ప్రకాష్‌రాజ్. లేటెస్ట్‌గా నిన్న చిత్రాడలో పవన్ కల్ఆయణ్‌ చేసిన కామెంట్స్‌పై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు ప్రకాష్‌రాజ్.. #justasking ట్యాగ్‌తో ఇప్పటికే పలు సందర్భాల్లో పవన్‌ కల్యాణ్‌పై సెటర్లు, కౌంటర్లు ఇచ్చిన ప్రకాష్‌.. ఇప్పుడు.. హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్‌పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్స్‌కు కౌంటరిచ్చారు. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దన్నారు పవన్ కల్యాణ్‌… భాష వద్దు కానీ.. డబ్బులు కావాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ కామెంట్స్‌ స్పందించిన ప్రకాష్‌రాజ్.. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కల్యాణ్‌ గారికి ఎవరైనా చెప్పండి please… 🙏🏿🙏🏿🙏🏿 #justasking.. అంటూ ట్వీట్‌ చేశారు ప్రకాష్‌ రాజ్.. అయితే, ఎక్స్‌లో ప్రకాష్‌రాజ్‌ పెట్టిన పోస్టుకు కొందరు అనుకూలంగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు ప్రకాష్‌ రాజ్‌ను టార్గెట్‌ చేసి కామెంట్లలో ఫైర్‌ అవుతున్నారు..

ప్రీమియర్స్ తోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకున్న చిన్న సినిమా
ప్రస్తుతం సినిమా వ్యాపారం ఆశించినంత లాభదాయకంగా లేదు. కోట్లకి కోట్లు పెట్టి నిర్మిస్తున్న స్టార్ సినిమాలు బొక్క బోర్లా పడుతున్నాయి. బయ్యర్స్ కు భారీ నష్టాలు మిగులుస్తున్నాయి. పోస్టర్స్ లో ఉండే నంబర్ కు అసలు నంబర్స్ కు పోలికే ఉండదు. కానీ తాజాగా రిలీజ్ అయిన చిన్న సినిమా ప్రీమియర్స్ తోనే ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఆ సినిమానే కోర్ట్.  నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణసంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని నిర్మించిన చిత్రం ‘కోర్ట్’. సినీనటుడు శివాజీ, హాస్యనటుడు ప్రియదర్శ, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను యంగ్ దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్ట్ చేసాడు. కాగా ఈ సినిమా కంటెంట్ పై నమ్మకంతో రెండు రోజుల ముందుగా నిర్మాత నాని ప్రీమియర్ లు ప్లాన్ చేసాడు. ఈ నేపధ్యంలో నాని ‘కోర్ట్’ సినిమా మీకు నచ్చకుంటే మరో రెండు నెలల్లో నేను హీరోగా నటించిన ‘హిట్ 3′ సినిమా సినిమాను చూడకండి అని భారీ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చాడు. నాని చెప్పినట్టుగా మొదటి రోజు ప్రీమియర్స్ కు భారీ స్పందన వచ్చింది. దీంతో రెండవ రోజు ఏకంగా 75 ప్రీమియర్స్ ప్రదర్శించారు. అన్ని ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడిన ఈ సినిమా ప్రీమియర్స్ రూపంలోనే రూ. 2 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. శుక్రవారం విడుదలైన కోర్ట్ ఓవర్సీస్ లోను వారాంతం నాటికి 500K డాలర్స్ రాబడుతుందని అంచనా. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రేపటిలోగా బ్రేక్ ఈవెన్ సాధించి బయర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టనుంది.