NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు జగ్గన్నతోట ప్రభల తీర్థం.. భారీ ఏర్పాట్లు
నేడు కనుమ పండుగ సందర్భంగా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రభల ఉత్సవానికి తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రాధాన్యత ఉంది.. ఈ ప్రభల తీర్థాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భారీగా తరలి రానున్నారు భక్తులు.. జగన్నతోటలో కొలువు కానున్న ఏకాదశ రుద్రులను దర్శించు కునేందుకు ఎడ్ల బండ్లపై రావడం ఇక్కడి ప్రత్యేకత. ఎగువ కౌశిక నదిలో నుండి పీకల లోతు నీటిలో మునిగి ప్రభలను భుజాలపై మోసుకుని వచ్చే అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది.. ఏ విధమైన ఆలయం లేకుండా కేవలం కొబ్బరి తోటలోకి ఏడాదికి ఒక్కసారి జరుపుకునే ఉత్సవం ఈ ప్రభల ఉత్సవం. జగ్గన్నతోటలో ప్రభల తీర్థంకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల నుండి జగ్గన్నతోటకు ప్రభల ఊరేగింపులు చేరుకోనున్నాయి..

ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య.. కొత్త రాజకీయ చర్చ..!
తమకు నచ్చిన నాయకుడు, మెచ్చిన లీడర్‌, అభిమానించే నటులు.. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది.. కొన్నిసార్లు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు కొత్త చర్చకు దారి తీస్తుంటాయి.. మరికొన్ని.. భవిష్యత్‌ రాజకీయాలను కూడా సూచిస్తుంటాయి.. అయితే, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.. వెంకటాపురం గ్రామంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ, బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ దృశ్యాలు కాస్తా సోషల్‌ మీడియాకు.. ఆ తర్వాత మీడియాకు కూడా ఎక్కడంతో వైరల్‌గా మారిపోయాయి.. సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతూ సైకిల్ గుర్తు, కారు గుర్తులు వేసి తమ అభిమాన నాయకులు ఫొటోలను ఒకే ఫ్లెక్సీలో వేసి ప్రధాన రహదారి పక్కన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం.. కల్లూరు మండలంలో హాట్ టాఫిక్ గా మారింది. ఆ ఫ్లెక్సీలల్లో చంద్రబాబు ఫొటో కింద బాస్ ఈజ్ బ్యాక్, బాలకృష్ణ ఫొటో కింద డాకు మహారాజ్, కేసీఆర్‌ ఫొటో కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్.. అని క్యాప్షన్లు పెట్టాటంతో ఆసక్తి నెలకొంది.

నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్‌పై విచారణ..
నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈనెల 8న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయగా.. క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కేటీఆర్ పిటిషన్‌ను జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారించనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ సుప్రీంకోర్టులో కేవియట్లు దాఖలు చేసింది. “ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. మా వాదన కూడా వినాలి” అని కేవియట్ పిటిషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది.

కాశీ యాత్రకు వెళ్లిన వ్యక్తి సజీవ దహనం..
తెలంగాణ రాష్ట్రం బైంసా నుంచి ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులోని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడు.. కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దుర్పత్తిగా గుర్తించారు. సజీవ దహనం ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ గ్రామం నుంచి 8 మంది యాత్రకు వెళ్లారు. వారితో పాటు 50 మంది బస్సులో ఉన్నారు. మిగతా వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారు. మంటలు చెలరేగే సమయంలో దుర్పత్తి, డ్రైవర్ మాత్రమే బస్సులో ఉన్నారు. డ్రైవర్ బయట పడగా.. సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సింగ్ ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖలు సమగ్ర విచారణలో నిమగ్నమై ఉన్నాయి. బాధిత ప్రయాణికులకు అన్ని విధాలా సాయం చేస్తామని స్థానిక యంత్రాంగం హామీ ఇచ్చింది. ఈ ఘటనపై అధికారులు సంబంధిత వర్గాలకు సమాచారం అందించారు. కాశీకి వెళ్ల కుండానే అనంత లోకాలకు చేరుకున్న ద్రుపత్ కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

నేడు నేవీలోకి మరో మూడు యుద్ధనౌకలు.. జాతికి అంకితం చేయన్నున్న ప్రధాని మోడీ
అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్‌ఎస్‌ సూరత్, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లను ఈరోజు (జనవరి 15) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ యుద్ధనౌకల రాకతో నేవీ బలం మరింత పెరగనుంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న భారత్‌కు ఇది పెద్ద విజయం అని చెప్పాలి. ఇక, ఐఎన్‌ఎస్‌ సూరత్‌.. పీ15బీ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ప్రాజెక్ట్‌ కింద నాలుగో యుద్ధనౌకను అభివృద్ధి చేస్తున్నారు. ఇది, ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్‌ యుద్ధనౌకల్లో ఒకటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ-సెన్సర్‌ వ్యవస్థలు సైతం పని చేస్తాయి. నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ సామర్థ్యం దీని సొంతం అని చెప్పాలి. అలాగే, ఐఎన్‌ఎస్‌ నీలగిరి.. పీ17ఏ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌకగా నిలవనుంది. శత్రువును ఏమార్చే స్టెల్త్‌ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఇక, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌.. పీ75 కింద తయారు చేస్తున్న ఆరో, చివరి జలాంతర్గామిగా చెప్పుకొవాలి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌ సహకారంతో దీన్ని డెవలప్మెంట్ చేశారు.

నేడు మథురలో వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ..
ఉత్తరప్రదేశ్‌లోని మథురాలో గల శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంలో మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఈరోజు (జనవరి 15న) విచారణ జరగనుంది. ఈ వివాదంపై దాఖలైన 15 కేసులను విచారణకు తీసుకో వద్దని మసీదు కమిటీ వేసిన పిటిషన్ ను అలహాబాద్‌ హైకోర్టు ఏక సభ్య న్యాయస్థానం గత ఆగస్టు 1వ తేదీన తిరస్కరించడంతో కమిటీ అత్యున్నత న్యాయస్థానాకి వెళ్లింది. మథురాలోని కృష్ణాలయాన్ని ఔరంగజేబ్‌ హయాంలో కూలగొట్టి అక్కడ మసీదు కట్టారని హిందూ సంస్థలు వాదనలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు గొడవ చెలరేగడంతో 1991లో పార్లమెంట్ ప్రార్థన స్థలాల చట్టం తీసుకొచ్చింది. మన స్వాతంత్య్ర దినమైన 1947 ఆగస్టు 15వ తేదీ వరకు ప్రార్థన స్థలాలకున్న మత స్వభావాన్ని మార్చొద్దని ఆ చట్టంలో వెల్లడించింది. ఇక, అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదానికి ప్రత్యేక ప్రార్థన స్థలాల చట్టం నుంచి 1991లో కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. శ్రీ కృష్ణ జన్మభూమి సమీపంలోని మసీదుపై హిందూ సంస్థలు వేసిన పిటిసన్ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మసీదు కమిటీ హైకోర్టులో వేసిన పిటిషన్ లో తెలిపింది. దానికి ఆలహాబాద్ ఉన్నత న్యాయస్థానం సింగిల్‌ బెంచ్ న్యాయమూర్తి 1991నాటి చట్టం మత స్వభావమంటే ఏమిటో స్పష్టంగా చెప్పలేదని, వివాదాస్పద స్థలంలో మసీదు, ఆలయం పక్కపక్కనే ఉండటం వల్ల ఆ స్థలం మత స్వభావాన్ని నిర్దారించలేమని తీర్మానించారు. అక్కడి కట్టడం మసీదు లేదా ఆలయం అయి ఉండాలి.. కానీ, ఏకకాలంలో రెండూ కాలేదన్నారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్..
దక్షిణ కొరియా దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను కొరియన్ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు విచారణ అధికారులు వెల్లడించారు. ఇక, ఈరోజు తెల్లవారుజామున సుమారు 3000 వేల మంది పోలీసులతో పాటు అవినీతి నిరోధక శాఖ అధికారులు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్‌ చేసేందుకు వెళ్లగా.. అతడి తన వ్యక్తిగత భద్రతా దళాల వెనకకు వెళ్లి దాక్కోవడంతో యూన్ ను అతి కష్టం మీద అరెస్ట్ చేశారు. దీంతో యూన్ మద్దతుదారులతో పాటు అధికార పీపుల్ పవర్ పార్టీ సభ్యులు అధ్యక్ష భవనం దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలను నిరసించడంతో.. అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే, యూన్ సుక్ యోల్‌ మార్షల్ లా ప్రకటన దక్షిణ కొరియన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యాలలో ఒకటైన దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీని వల్ల డిసెంబర్ 14న యూన్ పై అభిశంసన తీర్మనం ద్వారా అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాలని చట్టసభ సభ్యులు ఓటు వేశారు. ఇక, రాజ్యాంగ న్యాయస్థానం ఆ అభిశంసనను సమర్థించడంతో.. అతనిని శాశ్వతంగా పదవి నుంచి తొలగించారు.

అమ్మకాలలో రికార్డ్స్ సృష్టిస్తున్న టీవీఎస్ జూపిటర్
దేశీయ టూవీలర్ తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ సంస్థ భారత మార్కెట్లో బైక్స్, స్కూటర్లను విక్రయిస్తూ ఆటోమొబైల్ మార్కెట్ లో దూసుకెళ్తుంది. ప్రతి ఏడాది ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో టీవీఎస్ టూవీలర్స్ వినియోగదారులను ఆశ్చర్య పరిచేలా చేస్తుంటాయి. మరింత ముఖ్యంగా, వీటి ధరలు బడ్జెట్ రేంజ్‌లో ఉండడం మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రముఖ స్కూటర్ మోడల్ జూపిటర్ తాజాగా 70 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ టీవీఎస్ జూపిటర్ 2013 సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ కాగా.. విడుదలైన కొద్ది కాలంలోనే ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందింది. హోండా యాక్టివాకు ప్రత్యామ్నాయంగా మైలేజ్, ధర, డిజైన్ పరంగా ఇది వినియోగదారులను ఆకట్టుకుంది. మొట్టమొదటి సారి లాంచ్ అయిన తర్వాత కేవలం రెండు సంవత్సరాల్లోనే జూపిటర్ 5 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత ఎక్కడ తగ్గకుండా 2016 నాటికి 10 లక్షల యూనిట్లు, 2017 నాటికి 20 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 నాటికి ఈ స్కూటర్ 50 లక్షల యూనిట్ల సేల్స్‌ను దాటింది. ఇప్పుడు, 2024 నాటికి ఈ స్కూటర్ 70 లక్షల యూనిట్ల విక్రయాలను పూర్తి చేసిందంటే ప్రజలు ఈ స్కూటీని ఎంత ఆదరించారో ఇట్టే అర్ధమవుతుంది.

భారీ సిక్సర్ కొట్టిన క్లాసెన్.. బంతిని తీసుకుని పారిపోయిన అభిమాని
SA20లో జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య 8వ మ్యాచ్‌ జరిగింది. డర్బన్ జట్టు బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్‌తో ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తబ్రేజ్ షమ్సీ బౌలింగ్‌లో, క్లాసెన్ 10వ ఓవర్ 5వ బంతిని కాస్త బలంగా బ్యాక్‌ఫుట్ నుంచి కొట్టాడు. దాంతో 87 మీటర్ల దూరాన్ని దాటిన ఈ సిక్సర్ స్టేడియం పైకప్పుపై పడింది. అక్కడ నుంచి బౌన్స్ అయి బంతి నేరుగా పక్కనే ఉన్న రోడ్డుపైకి వెళ్లింది. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ అభిమాని బంతిని చూసి దానిని తీసుకుని పారిపోయాడు. ఈ సంఘటనతో ఆ మ్యాచ్‌లో బంతిని మార్చాల్సి వచ్చింది. స్టేడియం బయట జరగడంతో ఆ అభిమాని తర్వాత ఏమి చేసాడో తెలియ రాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ జనవరి 14న డర్బన్‌లో జరిగింది. జోబర్గ్ సూపర్ కింగ్స్ టాస్ గెలిచి 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన డర్బన్ జట్టు 7 ఓవర్లలోనే 51 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్లలో కేవలం 66 పరుగులే చేయగలిగిన స్థితిలో, క్లాసెన్ ఇన్నింగ్స్‌ను స్పీడ్ ను పెంచే ప్రయత్నం చేసాడు. అయితే ఈ దశలో అతను 2 ఫోర్లు, 2 సిక్సర్లతో కేవలం 29 పరుగులు చేసి క్లాసెన్ అవుట్ అయినప్పటికీ, అతని సిక్సర్ మాత్రం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఘటన డర్బన్ క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతోంది. మొత్తానికి డర్బన్ సూపర్ జెయింట్స్ కేవలం 18 ఓవర్లు లోనే 141 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాంతో జోబర్గ్ సూపర్ కింగ్స్ 28 పరుగులతో విజయం సాధించింది.

సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న స్టార్ హీరో.. కారణం ఇదే
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగు వారికి కూడా సుపరిచితుడే. వరుసగా సినిమాలు చేస్తున్న ఆయన తన అభిమానులకు షాక్ ఇచ్చారు. కిచ్చా సుదీప్ తన రిటైర్మెంట్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 28 ఏళ్లుగా కన్నడ ఇండస్ట్రీలో తన స్టార్ డమ్ కొనసాగిస్తున్న సుదీప్ కేవలం కన్నడలోనే కాదు మిగతా దక్షిణాది సినిమాలలో కూడా నటిస్తూ వచ్చారు. కన్నడ స్టార్ గా ఎదిగిన సుదీప్ తన సినిమా జర్నీని హీరోగా ఆపేస్తానని హింట్ ఇచ్చాడు. ఐతే తానింకా అలసిపోలేదు.. ఏదో ఒక టైం లో యాక్టింగ్ ఆపేస్తానని అభిమానులకు షాక్ ఇచ్చారు సుదీప్. అయితే ఎంత స్టార్ అయినా కూడా ఏదో ఒక టైం లో బోర్ కొట్టేస్తాడు. ప్రతిదానికీ ఓ టైం అనేది ఉంటుంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఒక హీరోగా తానెప్పుడు ఎవరినీ సెట్ లో వెయిట్ చేయించలేదన్నారు. ఐతే తాను సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మరొకరి కోసం వెయిట్ చేస్తూ కూర్చోలేనని తెలిపారు సుదీప్. బ్రదర్, అంకుల్ పాత్రలు పోషించడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు సుదీప్.

‘దేసీ రాజు’ను పరిచయం చేయబోతున్న ‘ఘాటీ’
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కెరీర్ మొదట్లో గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను పంథా మార్చుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రం ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్క నాలుగో సినిమా చేస్తుంది. అనుష్క బర్త్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో అనుష్క పాత్ర స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. కాగా ఈ సినిమా నుంచి ‘దేసీ రాజు’ అనే పాత్రను సంక్రాంతి కానుకగా రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ పాత్రలో ఓ ప్రముఖ యాక్టర్ నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు ఏర్పడటంతో ఇప్పుడు ఈ ‘దేసీ రాజు’ పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమాకు నాగవెల్లి విద్యా సాగర్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Show comments