NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం.. గుడివాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం కానున్నాయి.. రాష్ట్రంలో కేవ‌లం 5 రూపాయలకే పేదవాడి కడుపు నింప‌డం కోసం కూటమి సర్కార్ మళ్లీ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఈ రోజు అన్న కాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 180 రెడీ అయ్యాయి.. ఇక, తొలి విడ‌త‌లో 100 అన్న కాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. అలాగే, మిగిలిన 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. కాగా, సెప్టెంబర్ 5వ తేదీన మరో 99 క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేసేందుకు ఎన్డీయే కూట‌మి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇక‌పోతే, అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ అనే సంస్థ ద‌క్కించుకుంది. కాగా, అన్న క్యాంటిన్ల యొక్క మెనూ అండ్ టైమింగ్స్ ను మనం ప‌రిశీలిస్తే.. ఆదివారం మిన‌హా వారంలో ఆరు రోజులు అన్న క్యాంటీన్లు కొనసాగుతాయి. రూ. 5 కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందించనున్నారు. టిఫిన్‌ ఉదయం 7.30 నుంచి 10 గంటల మధ్య అందుబాటులో ఉండగా.. మధ్యాహ్నం లంచ్ 12.30 నుంచి 3 గంటల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి భోజనం 7.30 నుంచి 9 గంటల మధ్య అందించనున్నారు.

నేటి నుంచి శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు
తిరుమలలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.. ఈ మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. 18వ తేదీన కళ్యాణోత్సవ సేవ కూడా రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఇక, తిరుమలలో పవిత్రోత్సవాలకు బుధవారం రోజు అంకురార్పణ జరిగింది.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగారు.. కాగా, శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు శాస్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బందిచే కలిగే దోషాల వలన ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవమే పవిత్రోత్సవం. పవిత్రోత్సవాలలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేస్తారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తారు అర్చకులు. ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమాని నిర్వహించిన అనంతరం శ్రీవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తులు, అనుబంధ ఆలయాలలో అర్చకులు పవిత్రాలు సమర్పిస్తారు. దీంతో మొదటి రోజు కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. ఇక, రెండోవ రోజు వైఖానస అగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి వున్న మరియు భక్తుల వల్ల ఏదైనా దోషాలు జరిగి వుంటే తొలగిపోవాలంటూ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. మొదట స్వామి, అమ్మ వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం స్వామి వారి మూల విరాట్‌కు అనుబంధ ఆలయాల్లో ఉన్న విగ్రహాలకు పవిత్ర మాలలు సమర్పించడంతో కార్యక్రమం ముగియనుంది.. మరోవైపు.. తిరుమలలో మరమ్మతుల కారణంగా శ్రీవారి పుష్కరిణి మూసివేసిన విషయం విదితమే.. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి పుష్కరిణిలోకి భక్తులను అనుమతించనుంది టీటీడీ.. ఇక, చిరుతల సంచారం కారణంగా ఘాట్ రోడ్‌లో ద్విచక్ర వాహనాల పై ఆంక్షలు కొనసాగుతున్నాయి.. సెప్టెంబర్‌ 30 వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను అనుమతించనుంది టీటీడీ..

ఉచిత ఇసుక విధానం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఇసుక సరఫరా, నూతన ఉచిత ఇసుక విధానంపై అధికారులతో బుధవారం రోజు సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక బుకింగ్ విధానం, రవాణా, సులభమైన లావాదేవీలు, విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పై సమీక్ష చేసిన సీఎం.. వెబ్ సైట్, యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి సులువుగా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని ఆదేశించారు.. ఆన్‌లైన్‌ లేదా గ్రామవార్దు సచివాలయం నుంచి ఇసుక బుకింగ్ చేసుకునేలా విధానం ఉండాలని స్పష్టం చేశారు.. ఇసుక ఎప్పుడు సరఫరా చేస్తామో కూడా వినియోగదారులకు చెప్పేలా వ్యవస్థ ఉండాలన్న సీఎం. దళారులు, మధ్యవర్తులు కాకుండా సాధారణ ప్రజలకు ఇసుక చేరేలా చూడాలన్నారు.. ఇక, ఇసుక వినియోగంపై థర్డ్ పార్టీ అడిట్ కూడా చేయించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఆన్ లైన్ బుకింగ్ అందుబాటులోకి వస్తే ప్రజలు ఇసుక రీచ్ లకు, స్టాక్ యార్డులకు వెళ్లే అవసరం రాదన్న సీఎం. అలాగే ఇసుక రీచ్ ల వద్ద రద్దీ కూడా తగ్గించవచ్చన్నారు.. ఆన్ లైన్ బుకింగ్ వల్ల రీచ్ ల వద్ద వాహనాల వెయిటింగ్ సమయం తగ్గడంతో పాటు ఇసుక రవాణా చార్జీలు కూడా తగ్గుతాయన్నారు.. ఇసుక రవాణా వాహనాల ఎంపానల్ మెంట్ చేయాలని తద్వారా అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పారదర్శకత పెరుగుతుందన్నారు.. ఇసుకను భారీ మొత్తంలో వినియోగించే బల్క్ కస్టమర్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరని పేర్కొన్నారు. బల్క్ కస్టమర్లుగా ప్రకటించుకున్న వారి వద్దకు తనిఖీ కోసం వెళ్లాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డులు, రీచ్ ల వద్ద మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన ఇసుక అందించాలని స్పష్టం చేశారు.. ఇసుక సరఫరా, రవాణా వంటి అంశాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించుకోవాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.

సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ..?
ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ నెలాఖరు నుంచి చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తును చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రాథమిక కీ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.. అభ్యంతరాలను పరిశీలించి తుది కీని ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు, డీఎస్సీ పరీక్షల అభ్యర్థుల వివరాలను క్రోడీకరించారు. రోస్టర్ విధానం, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి సారించారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడం వల్ల ఫలితాలు సులువుగా ప్రకటించవచ్చని అధికారులు చెబుతున్నారు. తుది కీ విడుదల చేసిన రోజునో.. లేదా మరుసటి రోజునో ఫలితాలు ప్రకటించవచ్చు. ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితా రూపొందించే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 3,29,897 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,79,957 మంది పరీక్షకు హాజరయ్యారు. కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శాసనసభలో చెప్పారు. అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తాం. అయితే వర్గీకరణపై తీర్పు రాకముందే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ నియామకాలకు వర్గీకరణ అంశాన్ని జోడిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వర్గీకరణ అంశం ముందుకు వస్తే.. నిర్ణీత తేదీల్లో ఉపాధ్యాయుల నియామకం కష్టసాధ్యమనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

రూ.2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ తేదీ తర్వాత..
రూ. 2 లక్షల పైనున్న అప్పులన్న రైతులకు ఆగస్టు 15వ తేదీ తర్వాత రుణ మాఫీ ప్రక్రియ షురూ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనిని ఉద్దేశించి వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. మొదటి, రెండో విడతల్లో రుణమాఫీ జరగని అర్హులైన రైతుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిధుల కేటాయింపు నేపథ్యంలో సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తే రుణమాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్న రైతులు, రేషన్ కార్డులు లేని రైతు కుటుంబాలు, సాంకేతిక సమస్యలతో రుణమాఫీ చేయని అర్హులైన రైతులు మిగిలిపోయారు. వీరికి సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15 తర్వాత ప్రారంభమవుతుంది. రేషన్ కార్డులు లేని రుణమాఫీ పథకానికి అర్హులైన రైతులు 6 లక్షల మందికి పైగా ఉన్నారు. ఆగస్టు 15 తర్వాత ఈ కోవలోని రైతులపై ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుంది. కాగా, రూ.2 లక్షలకు మించి పంట రుణాలు ఉన్న రైతులకు రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రైతులు రూ.2 లక్షలకుపైగా సొమ్ము చెల్లిస్తే.. మిగిలిన రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కేటగిరీలోని రైతులు కూడా ఆగస్టు 15 తర్వాత ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రాథమికంగా రూ. 9 వేల కోట్లు మాఫీ చేయాలంటే రూ. 2 లక్షలకు మించిన రుణానికి రూ. 2 లక్షలు. కానీ, పీఎం-కిసాన్ పరిమితులను పరిగణనలోకి తీసుకుని రుణమాఫీ అమలు చేస్తున్నందున, రైతుల సంఖ్య మరియు రుణమాఫీ బడ్జెట్ క్రమంగా తగ్గుతోంది. దీంతో నాలుగో విడతలో రూ. 9 వేల కోట్లు కంటే తక్కువ నిధులే ఖర్చయ్యే అవకాశాలున్నాయి.

2047 నాటికి ‘వికసిత భారత్‌’ మనందరి లక్ష్యం
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు. అప్పుడు ఉన్న 40 కోట్ల మంది దేశానికి స్వతంత్రాన్ని సాధిస్తే.. ఇప్పుడు 140 కోట్ల మంది ఎంత సాధించవచ్చో ఆలోచించాలన్నారు. ఈ 140 కోట్ల జనం వారి కలలను సాకారం చేయాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయని.. విపత్తు బాధిత కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యమని.. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలన్నారు. తయారీరంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ను మార్చాలని ఆకాంక్షించారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్‌ ఎదగాలని ప్రధాని మోడీ కోరుకున్నారు. దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమని, న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో భారత స్పేస్‌ స్టేషన్‌ త్వరలో సాకారం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. మనం అనుకుంటే 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. ‘వికసిత్‌ భారత్‌ 2047’ నినాదం 140 కోట్ల మంది కలల తీర్మానమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలన్నారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనేది ప్రభుత్వ వ్యూహమని ప్రధాని పేర్కొన్నారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పు తెచ్చిందన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారని తెలిపారు. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 15 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. అంతరిక్ష రంగంలో భారత్‌ దూసుకుపోతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తయారీ రంగంలో భారత్‌ గ్లోబల్‌ హబ్‌గా మారాలన్నారు. . ప్రపంచంలోనే భారత్‌ ఇప్పుడు శక్తవంతంగా మారిందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతమైతే మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైనదన్నారు. భారత్‌ చిరుధాన్యాలు ప్రపంచంలోని అందరికీ చేరాలన్నారు.

పదేళ్ల తర్వాత తొలిసారి.. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రతిపక్ష నేత
ఢిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని విన్నారు. గతంలో ఆ పదవి ఖాళీగా ఉండడంతో ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడం ఇదే తొలిసారి. 2014 నుండి 2024 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరూ ఉండలేదు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలలో ఎవరికీ అవసరమైన సంఖ్యలో ఎంపీలు లేవు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఎంపీల సంఖ్యను మెరుగుపరుచుకున్న తర్వాత జూన్ 25న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా నియమించారు. పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు. అప్పుడు ఉన్న 40 కోట్ల మంది దేశానికి స్వతంత్రాన్ని సాధిస్తే.. ఇప్పుడు 140 కోట్ల మంది ఎంత సాధించవచ్చో ఆలోచించాలన్నారు. ఈ 140 కోట్ల జనం వారి కలలను సాకారం చేయాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయని.. విపత్తు బాధిత కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యమని.. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలన్నారు. తయారీరంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ను మార్చాలని ఆకాంక్షించారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్‌ ఎదగాలని ప్రధాని మోడీ కోరుకున్నారు.

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO.. ఎంపాక్స్ విజృంభణ‌..
ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ఎంపాక్స్‌ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందిన తర్వాత ఈ ప్రకటన చేసారు. ఇది పొరుగు దేశాలకు కూడా వ్యాపించింది. Mpox ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. అంతకుముందు, ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) Mpox సంక్రమణకు సంబంధించి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దీంతో పాటు అంతర్జాతీయ సరిహద్దులు దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికి సంబంధించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం నిపుణుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని నిర్ణయించారు. Mpox దగ్గరి పరిచయం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది లైంగిక సంపర్కం ద్వారా కూడా వ్యాపిస్తుంది. సాధారణంగా తేలికపాటి, అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకం. ఇది ఫ్లూ వంటి లక్షణాలను, శరీరంపై చీముతో నిండిన పుండ్లను కలిగిస్తుంది. వ్యాధి వ్యాప్తిని ‘అంతర్జాతీయ ఆందోళన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’ గా నిర్ణియించారు. WHO యొక్క అత్యున్నత స్థాయి హెచ్చరికగా.. పరిశోధన, నిధులు, అంతర్జాతీయ ప్రజారోగ్య చర్యలు ఇంకా వ్యాధిని నియంత్రించడానికి సహకారాన్ని వేగవంతం చేస్తుంది.

షేక్ హసీనాపై మారణహోమం ఆరోపణలు.. అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్‌లో కేసు నమోదు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. మంగళవారం అతడిపై కిరాణా వ్యాపారి హత్య కేసు నమోదైంది. బుధవారం ఉదయం ఆమెపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఈసారి షేక్ హసీనాతో పాటు 9 మందిపై అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్‌లో నేరాలు, మారణహోమం ఆరోపణలపై కేసు నమోదైంది. అధికారంలో ఉండగా 1971 యుద్ధ నేరస్థులను విచారించేందుకు షేక్ హసీనా 2009లో ఈ ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ మద్దతు ఉన్న రజాకార్ల సభ్యులు మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారు. అనేకమందిని ఉరితీశారు. ఈసారి కూడా అదే అభియోగాలపై అదే ట్రిబ్యునల్‌లో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది ఘాజీ ఎంహెచ్‌ తనీమ్‌ ఫిర్యాదు చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్‌ ట్రిబ్యునల్‌ దర్యాప్తు సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ అతౌర్‌ రెహమాన్‌ తెలిపారు. ఆగస్టు 5న, షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన రోజున, ఢాకాలోని సవార్ ఉపజిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థి అలీఫ్ అహ్మద్ సియామ్ కాల్చి చంపబడ్డాడు. చికిత్స పొందుతూ ఆగస్టు 7న మరణించాడు.

శ్రీవారి సేవలో సూపర్ స్టార్ కుటుంబ సభ్యులు..
టాలివుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంభసభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు.తిరుమల శ్రీవారి దర్శనార్దం బుధవారం శ్రీవారి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమల చేరుకున్నారు మహేష్ బాబు సతీమణి నమ్రతా శిర్కోదర్, కుమారుడు గౌతమ్, కూతురు సితార. గురువారం వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గోని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు, అనంతరం మహేశ్ బాబు కుటంబ సబ్యులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్దప్రసాదాలు అందజేసారు. మహేశ్ కుటుంబ సభ్యులతో కలసి మేఘా గ్రూప్ డైరెక్టర్ సుధా రెడ్డి కూడా శ్రీవారి సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమలో నటించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబరులో వర్క్ షాప్ ప్రారంభించి డిసెంబర్ నుండి రెగ్యులర్ షూట్ స్టార్ చేయనున్నారు మేకర్స్. లొకేషన్స్ వేటలో ఉంది యూనిట్. ఫస్ట్ షెడ్యూల్ ను జర్మనీలో స్టార్ట్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు గోల్డ్ అనే యూనివర్సల్ టైటిల్ పరిశీలనలో ఉంది.

తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
‘చియాన్’ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్‌’. పా రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ సినిమాలో మాళవిక మోహనన్‌ కథానాయికగా నటించారు. పార్వతి తిరువోతు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు (ఆగస్టు 15) తంగలాన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ చూసిన వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తంగలాన్‌ సినిమాకు మిశ్రమ రివ్యూస్ వస్తున్నాయి. కొందరు సినిమా బాగుందంటుంటే, మరికొందరేమో ఫ్లాఫ్ అంటున్నారు. అందరూ మాత్రం విక్రమ్ నటన మరో లెవల్ అని ట్వీట్స్ చేస్తున్నారు. ‘సినిమా అస్సలు మిస్ అవ్వొద్దు. ఇది తంగలాన్‌ రోజు’, ‘అక్కడక్కడ కొన్ని లాగ్‌లు ఉన్నాయి కానీ మొత్తంగా ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా’, ‘చియాన్ విక్రమ్ భారీ హిట్ కొట్టాడు’, ‘ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ బాగుంది’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘కథ ఎంపికలో విక్రమ్ తడబడ్డాడు, ఫెయిల్యూర్స్ కంటిన్యూ అవుతున్నాయి’, ‘సారీ చియాన్’ అంటూ నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

మిస్టర్ బచ్చన్ సినిమాలో అదిరిపోయిన స్టార్ బాయ్ కామియో
మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకుని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేసారు మేకర్స్. ఆగస్టు 15న రిలిజ్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. మిస్టర్ బచ్చన్ సినిమాను 14న అనగా బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ ప్రీమియర్స్ తో ఒకరోజు ముందుగానే గ్రాండ్ గా రిలీజ్ చేసారు మేకర్స్. రవితేజ మాస్ పెర్ఫామెన్స్ కు, భాగ్యశ్రీ బోర్స్ అందాల ఆరబోత ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందిస్తున్నాయి. ముఖ్యంగా రెప్పల్ డప్పుల్, నల్లంచు తెల్లచీర సాంగ్స్ లో మాస్ రాజా, భాగ్యశ్రీ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. కాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యామియోలో DJ టిల్లు స్టార్ బాయ్ సిద్దుజొన్నలగడ్డ మెరిశాడు. అయితే సిద్దు కనిపించిన కాసేపు ఆడియెన్స్ ను ఒక ఊపు ఊపేసాయి. ఫైట్ సిక్వెన్స్ లో కనిపించే సిద్దు తనదైన పంచులతో అదరగోట్టాడు. ఈ సీన్స్ మిస్టర్ బచ్చన్ కె హైలైట్ గా నిలుస్తాయనడంలో సందేహమే లేదు. అలాగే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కూడా ఒక పాటలో కనిపించాడు. మాస్ మహారాజతో కలిసి స్టెప్పులేసి అలరించాడు దేవి. దేవి స్పెషల్ ఎంట్రీ ఆడియన్స్ తో విజిల్స్ వేయించింది. మొత్తానికి అతిధి పాత్రల్లో మెరిసి అదరగొట్టారు సిద్దు జొన్నలగడ్డ, దేవిశ్రీ ప్రసాద్.