NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పెట్టుబడులపై ఫోకస్‌ పెట్టిన ఏపీ ప్రభుత్వం.. నేడు సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ భేటీ
రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి.. పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ఫోకస్‌ పెట్టారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల తెచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.. గతంలో వెనక్కి వెళ్లిన సంస్థలను మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకానున్నారు టాటా గ్రూపు ఛైర్మన్ నజరాజన్ చంద్రశేఖరన్. ఉదయం 10.30 గంటలకు టాటా గ్రూప్ ఛైర్మన్‌తో సమావేశం జరగనుంది.. అనంతరం సీఎంతో భేటీకానున్నారు CII ప్రతినిధుల బృందం. CII డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో భేటీకానున్నారు సీఐఐ ప్రతినిధులు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. కాగా, అమరావతి రాజధాని ప్రాంతంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పరిశ్రమలు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. ఇక, విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే.

పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల కీలక సూచనలు.. డిజైన్‌ మార్పులతో..!
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో కీలకమైనది పోలవరం ప్రాజెక్టులు.. అయితే, పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సూచనలు చేసింది. వర్షాకాలం దాటగానే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు వీలుగా డిజైన్‌, నిర్మాణ అంశాలు చర్చించేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్‌ డిజైనర్‌, ప్రాజెక్టను పర్యవేక్షించే ఇంజినీర్ల బృందం, విదేశీ నిపుణుల బృందం ఉండాలని సూచించింది. డిజైన్ల రూపకల్పన, నిర్మాణ షెడ్యూలు నిర్ణయించడం, అందుకుతగ్గ వనరులు ఏవేంకావాలో ఈ వర్క్‌షాప్‌లో ఒక స్పష్టతకు రావాలని అభిప్రాయపడింది.. ప్రధాన డ్యాం ప్రాంతం పొడవునా సీపేజీ నీటిమట్టానికి 8 మీటర్ల ఎత్తులో ఒక ప్లాట్‌ఫాం నిర్మించాలని.. దాన్నుంచి ఎప్పుడూ నీటి మట్టం 8 మీటర్ల కన్నా దిగువన ఉండేలా పంపింగ్‌ ఏర్పాట్లు చేయాలని బృందం స్పష్టం చేసింది.. ఈ ఏర్పాట్లు వచ్చే వానాకాలంలో కూడా డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అవాంతరాలు కలిగించని స్థితిలో ఉండేలా చూడాలని విదేశీ నిపుణుల బృందం సూచించింది.

అక్కచెల్లమ్మలపై ఆ ఉద్దేశం లేదు.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యలు మహిళలను బాధపెట్టి ఉంటే క్షమించండి అన్నారు. పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని తెలిపారు. నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదని కేటీఆర్ అన్నారు. బస్సుల్లో సీట్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఇంకా బస్సులను పెంచాలనే ఉద్దేశంతో అన్నానని తెలిపారు. బస్సుల్లో అల్లం, వెల్లుల్లి పొట్టులు తీసుకుంటే తప్పేంటని మంత్రి సీతక్క అన్న మాటలకు కేటీఆర్ రిప్లై ఇచ్చానని తెలిపారు. బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకుంటుంటే సీతక్కకు కనపడలేదా? అని ప్రశ్నించానని అన్నారు. మరిన్ని బస్సులు పెంచాలని డిమాండ్ చేశామని తెలిపారు. బస్సుల సంఖ్య పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డ్యాన్స్, రికార్డ్ డ్యాన్స్ చేద్దాం.. మాకేంటి అంటూ కేటీఆర్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం నాకులేదని కేటీఆర్ ఎక్స్ వేదికగా క్షమాపనలు కోరారు.

స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నన్స్ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి గవర్నర్స్ బోర్డు చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు కంపెనీల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే, ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస సి.రాజు ఈ యూనివర్సిటీ గవర్నర్ల బోర్డులో కో-చైర్మన్ హోదాలో సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఏడాదిపాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఆటోమొబైల్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ రంగాల్లో ప్రసిద్ధి చెందిన మహీంద్రా గ్రూప్‌కు ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అతను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (ఆసియా-పసిఫిక్ అడ్వైజరీ బోర్డు), హార్వర్డ్ గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్ అడ్వైజరీ కమిటీ, ఆసియా బిజినెస్ కౌన్సిల్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో సభ్యుడు.

ఆగస్ట్ 15న రసగుల్లాలు అందలేదని ఉపాధ్యాయులను పరిగెత్తించి కొట్టిన విద్యార్థులు
బీహార్‌లోని బక్సర్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు అందకపోవడంతో ఉపాధ్యాయులను కొట్టారు. మిఠాయిలు అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్గమధ్యంలో ఉపాధ్యాయులను బ్లాక్ చేశారు. ఇంటికి వెళ్తుండగా ఉపాధ్యాయులను వెంబడించి కొట్టారు. విద్యార్థుల ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. ఉపాధ్యాయులను విద్యార్థులు కొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం అనంతరం పాఠశాలలో రసగుల్లాలు పంపిణీ చేశారు. విద్యార్థుల రద్దీ ఎక్కువ కావడంతో రసగుల్లాల పంపిణీని నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఇంటికి తిరిగి వస్తుండగా ఉపాధ్యాయులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే విద్యార్థులంతా పరారయ్యారు.

ఆ అభ్యర్థులకు రైల్వే ఉద్యోగాలు..
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని కింద లెవల్ 1 నుండి 5 వరకు వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరిగనుంది. ఈ పోస్ట్‌లు కానీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం RRC WR స్పోర్ట్స్ కోటా అధికారిక నోటీసును జారీ చేయబడింది. దీని కోసం మొత్తం 64 పోస్ట్‌ లలో రిక్రూట్మెంట్ జరగనుంది. RRC WR స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్ 2024 ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ 16 ఆగస్టు 2024, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 సెప్టెంబర్ 2024. జనరల్, OBC మరియు EWS అభ్యర్థులు రూ. 500/- దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST, ESM, PWD, EBC, మైనారిటీ, మహిళా అభ్యర్థులు కేవలం రూ. 250/- చెల్లిస్తే చాలు. కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ట వయో పరిమితి 25 సంవత్సరాలు. ఇక ఈ నోటిఫికేషన్ లోని లెవెల్‌- 4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే లెవెల్‌ – 2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ లేదా పన్నెండో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇక లెవెల్‌-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి.

నా భర్త నన్ను మోసం చేయలేదు.. బంగ్లా మాజీ కెప్టెన్ షకీబ్ భార్య!
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్ తన భార్య ఉమ్మీ అహ్మద్‌ శిశిర్‌ను మోసం చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనిఎం విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. భర్త షకీబ్‌తో కలిసి దిగిన ఫొటోలను శిశిర్‌ సోషల్ మీడియాలో డిలీట్ చేయడమే ఇందుకు కారణం. ఈ వార్తలను షకీబ్‌ భార్య శిశిర్‌ తాజాగా ఖండించారు. అసత్య వార్తలను వ్యాప్తి చేయొద్దని.. ఓ భర్తగా, మంచి తండ్రిగా షకీబ్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నాడని పేర్కొన్నారు. భర్త షకీబ్‌తో కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయలేదని, ప్రైవేట్‌లో పెట్టానని శిశిర్‌ వివరణ ఇచ్చారు. ‘క్రికెట్‌ పరంగా నా భర్త షకీబ్‌ గురించి మీకు రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మీరు క్రికెట్‌ పరంగా ఎన్ని విమర్శలైనా చేయండి కానీ.. వాటిని మా వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టొద్దు. షకీబ్‌ గొప్ప భర్త, మంచి తండ్రి. నాతో ఎంతో నిజాయితీగా ఉంటాడు. నన్ను అస్సలు బాధపెట్టడు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పెళ్లయినప్పటినుంచి ఏం మారలేదు. జీవిత భాగస్వామిగా 100/100 మార్కులు ఇవ్వొచ్చు’ అని శిశిర్‌ చెప్పారు.

తన నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పేసిన నాని.. దర్శకుడు ఎవరంటే..?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాల దర్శకులు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరక్టర్లుగా అవార్డులు అందుకోవడంతో పాటు, దసరా చిత్రంలో అద్భుత నటనకు నాని బెస్ట్ హీరోగా అవార్డు అందుకుని ఆ ప్రౌడ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు నేచురల్ స్టార్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ ఆగస్టు 15న స్వాతంత్‌ర్య దినోత్సవం సందర్భంగా యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ పోలీసులతో సరదగా ముచ్చటించారు. పోలీసుల ప్రశ్ననలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు నాని. ఇందులో భాగంగా Ntv యాంకర్ నానిని ‘మీరు ఇప్పటి వరకు క్లాస్, మాస్ సినిమాలు చాలా చేసారు, సరిపోదా శనివారం సినిమాలో విలన్ పోలీస్ క్యారక్టర్ చేస్తున్నాడు, మరి హీరోగా పోలీస్ క్యారక్టర్ లో ఎప్పుడు కనిపిస్తారని’ నానిని ప్రశ్నించారు. ఈ ఆసక్తికర ప్రశ్నకు సమాధానం ఇస్తూ నాని చేయబోయే తర్వాతి సినిమా అప్ డేట్ ఇచ్చాడు. నాని మాట్లాడుతూ “ ఈ నెల 29న నా సరిపోదా శనివారం రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అయినా సరిగ్గా 4 లేదా 5 రోజుల తర్వాత నా నెక్ట్స్ సినిమా అనౌన్స్ మెంట్ చేద్దాం అని అంతా రెడీ చేసాను. కాని ఇప్పుడు ఇంత కంటే మంచి సందర్భం రాదు, నా తరువాతి సినిమాలో నేను పోలీస్ గా నటిస్తున్నాను” అని తెలిపాడు. HIT  ఫ్రాంచైజ్ లో భాగంగా  HIT  -3 లో శైలేష్ కొలను దర్శకత్వంలో నటిస్తున్నాడు నాని.

నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రం అదే: నాని
‘జెర్సీ’ తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రం అని నేచురల్ స్టార్ నాని తెలిపారు. తన శైలికి పూర్తి భిన్నమైన సినిమా అని, ఎప్పుడో గానీ అలాంటి కథలు రావన్నారు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ వస్తూ పోతుంటాయని.. ప్రశంసలే ఎప్పటికీ తరగని ఆస్తి అని పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరం యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న వారితో నాని ప్రత్యేకంగా ముచ్చటించారు. ట్రైనీ కానిస్టేబుళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. జెర్సీ చిత్రంలో నటించడం ఎలా అనిపించింది అని రామకృష్ణ అనే ట్రైనీ కానిస్టేబుళ్ అడగగా… ‘జెర్సీ నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. ఎప్పుడూ హిట్ సినిమాకు మించిన చిత్రంను తీయడానికి ప్రయత్నించాలి. నా శైలికి పూర్తి భిన్నమైన సినిమా జెర్సీ. ఎప్పుడో గానీ అలాంటి కథలు రావు. గొప్ప కథ, మ్యూజిక్, టేకింగ్ అన్ని కుదిరాయి. ప్రతి వ్యక్తి తనకు అనుకున్న విజయం దక్కిన తర్వాత జెర్సీలోని రైల్వేస్టేషన్‌ సీన్‌ను గుర్తు చేసుకుంటూ పోస్ట్‌లు పెట్టడం ఆనందంగా ఉంది. కొంచెం బాధలో ఉన్నపుడు జెర్సీ సినిమా చూస్తామని నాతో చాలామంది చెప్పారు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అనేవి వస్తూ పోతుంటాయి కానీ ఇలాంటి ప్రశంసలే ఎప్పటికీ తరగని ఆస్తి’ అని నాని చెప్పుకొచ్చారు.