NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏపీలో మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ప్రారంభం.. వారిలో ఉత్కంఠ..!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. లాటరీ ద్వారా కేటాయిస్తుండటంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే 17 వందల 97 కోట్ల 64 లక్షల ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా 113 షాపులకు 5 వేల 825 అప్లికేషన్స్‌ వచ్చాయి. అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు ఎక్సైజ్‌శాఖ అధికారులు. సగటున ఒక్కో దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన దుకాణాల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీస్తున్నారు. ఈ ప్రక్రియంతా దరఖాస్తుదారుల సమక్షంలోనే జరుగుతుంది. రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40, అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 దుకాణాల్ని నోటిఫై చేశారు.

ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో సెలవు ప్రకటన..
ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరో 48 గంటల్లో బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. మరోవైపు ఇవాళ.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. భారీ వర్షాల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని.. వాగులు, వంకలకు సమీపంలోకి వెళ్లవద్దని సూచించారు. అలాగే విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలో రాబోయే మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.. మరోవైపు.. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, కాలేజీలకు, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్..

నేటి నుంచి పల్లె పండుగ.. పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శిస్తూ వచ్చిన కూటమి నేతలు.. ఇప్పుడు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.. ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.. ఇవాళ్టి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహిస్తారు.. రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభంకానున్నాయి.. కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. పల్లె పండుగలో భాగంగా దాదాపు రూ.4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను చేపట్టనుంది ప్రభుత్వం.. 3 వేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలో మీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాల వంటి పనులు చేపట్టబోతోంది కూటమి సర్కార్. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో జరిగే భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.. ఇక, సిమెంట్‌ కొనుగోలుకు సంబంధించి ఒక్కో బస్తా రూ.270 చొప్పున స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేసి వాడుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఆమోదించిన క్వారీల నుంచి సేకరించాలని స్పష్టం చేసింది.. ప్రతి రోడ్డు పని వద్ద వర్క్‌సైట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని, దానిపై ఆయా పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండాలని సూచించింది. మొత్తంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు..

అల‌ర్ట్‌.. నేటి నుంచి వెబ్‌సైట్‌ లో గ్రూప్‌-1 హాల్‌టికెట్లు..
తెలంగాణ గ్రూప్ అభ్యర్థులకు టీజీపీఎస్సీ అలర్ట్ చేసింది. నేటి నుంచి తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్ పరీక్షల హాల్‌ టికెట్లు అందుబాటులోకి రానున్నాయని ప్రకటన విడుదల చేసింది. హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ ను కమిషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులందరూ తమ వివరాలను నమోదు చేసి వెబ్‌సైట్ నుండి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా టీజీపీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అభ్యర్థులకు హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా కమిషన్‌ అధికారులను సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్ లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టబడింది. 7 పేపర్లకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది ఇలా ఉంటే మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ MBA, MCA కోర్సుల్లో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ అక్టోబర్ 15 మరియు 16 తేదీల్లో జరుగుతుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మిగిలిన సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని, ప్రాధాన్యత ఆధారంగా అడ్మిషన్లు పొందవచ్చని కన్వీనర్ ఎ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.

చనిపోయే ముందు నాన్నతో ఒక బుక్ గురించి చర్చించాము కానీ..
చనిపోయే ముందు నాన్నతో ఒక బుక్ గురించి చర్చించాము కానీ.. నాన్న ఇక లేరు మమ్మల్ని ఎంతగానో బాధిస్తుందని ప్రొఫెసర్ సాయిబాబా కూతురు మంజీర కన్నీరు పెట్టుకున్నారు. కూతురు మంజీరా మాట్లాడుతూ.. చనిపోయే ముందు నాన్నతో మాట్లాడానని.. ఒక బుక్కు గురించి చర్చించామన్నారు. ఇద్దరం కలిసి చదువుదాం అన్నారు. నాతోనే సమయం గడుపుతామన్నారు నాన్న అని తెలిపారు. కానీ నాన్న ఇక లేరు మమ్మల్ని ఎంతగానో బాధిస్తుందన్నారు. నాగపూర్ జైల్లో సమస్యల వల్ల గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చాయని.. ఇంటర్నల్ బ్లడ్ బ్లీడింగ్ అయిందన్నారు. తన శరీరానికి వైకల్యం ఉన్నా సరే దేశం దివ్యంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి మా నాన్న అన్నారు. ఏం చేయక పోయిన జైల్లో పెట్టారని భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేక పోయిందన్నారు. సమాజం కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడని కూతురు మంజీరా తెలిపారు.

ముంబై-న్యూయార్క్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
ఈరోజు (సోమవారం) ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీకి మళ్లించారు. విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే, తదుపరి తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి అన్ని ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, న్యూయార్క్‌లోని జేఎఫ్ కే విమానాశ్రయానికి AI 119 అనే విమానం ముంబై నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరింది. ఆ తర్వాత బాంబు బెదిరింపు రావడంతో వెంటనే ఫైలెట్స్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. కాగా, గత నెలలో ముంబైకి చెందిన మరో ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో దాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానం వాష్‌రూమ్‌లో టిష్యూ పేపర్‌పై వ్రాసిన “బాంబ్ ఇన్ ఫ్లైట్” సందేశంలో కనుగొన్నారు.

ఇజ్రాయెల్‌కు అమెరికా యాంటీ క్షిపణి వ్యవస్థ.. మండిపడిన ఇరాన్
ఇటీవలే ఇజ్రాయెల్‌పై ఇరాన్ వరుసగా మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో అమెరికా నేరుగా బరిలోకి దిగింది. ఇజ్రాయెల్‌కు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్’ను అందిస్తామని ఆదివారం నాడు వెల్లడించింది. దీంతో పాటు స్వయంగా తమ దేశ సైనిక బలగాలు ఇజ్రాయెల్‌కు వెళ్లి.. అక్కడ థాడ్‌ను ఇన్‌స్టాల్ చేసి వినియోగంలోకి తీసుకొస్తారని అగ్రరాజ్యం ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రతకు అమెరికా తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక, అగ్రజార్యం అమెరికా ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్) మిస్సైల్ సిస్టమ్‌ను ఆపరేట్ చేసేందుకు సైనికులను ఇజ్రాయెల్‌కు పంపడం ద్వారా అమెరికా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. దీని వల్ల అమెరికా సైనికుల ప్రాణాలు అపాయంలో పడే అవకాశం ఉందన్నారు. యూఎస్ కు ఇజ్రాయెల్ ఎంత ముఖ్యమో.. మాకు ఇరాన్ ప్రజలు కూడా అంతే ముఖ్యం అని చెప్పుకొచ్చారు. అందుకోసం తాము ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చీ ‘ఎక్స్’ వేదికగా వార్నింగ్ ఇచ్చారు.

డొనాల్డ్ ట్రంప్ హత్యకు మూడో ప్రయత్నం.? వ్యక్తి అరెస్ట్
అమెరికాలో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మూడోసారి దాడికి ప్రయత్నించారు. అక్టోబర్ 12న కాలిఫోర్నియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ వెలుపల ఆయుధం కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు. కోచెల్లా వ్యాలీలో ట్రంప్ ర్యాలీ వెలుపల చెక్‌ పాయింట్ వద్ద అనుమానితుడైన వేన్ మిల్లర్‌ను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత విషయం సంబంధించి వివరాలను అధికారులు వెల్లడించారు. రివర్‌ సైడ్ కౌంటీ షెరీఫ్ చాడ్ బియాంకో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. “మేము మరొక హత్య ప్రయత్నాన్ని నిరోధించామని భావిస్తున్నామని.. మిల్లర్ (49) అనే వ్యక్తి నకిలీ ప్రెస్ పాస్‌తో ర్యాలీలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసు చెక్‌పాయింట్‌లో పట్టుబడ్డాడు. కానీ., పోలీసులు చూసే సరికి అతని కారు రిజిస్టర్ కాలేదని తెలిసింది. వాహనాన్ని తనిఖీ చేసి తుపాకీతో పాటు నకిలీ పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. లోడ్ చేసిన తుపాకీ కూడా దొరికిందని అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తిపై ఆయుధాల ఆరోపణలపై కేసు నమోదు చేసి 5,000 డాలర్స్ కట్టించుకున్న తర్వాత బెయిల్‌ను మంజూరు చేసిన తర్వాత విడుదల చేశారు. రివర్‌సైడ్ ప్రెస్-ఎంటర్‌ ప్రైజ్‌ కి తన డిపార్ట్మెంట్ ట్రంప్ ప్రాణాలను కాపాడిందని షరీఫ్ రిప్లై ఇచ్చారు. అయితే, ఫెడరల్ ఏజెన్సీలు ఇందుకు ఏకీభవించలేదు.

బాలయ్య సినిమా బాబీ కెరీర్ లోనే బెస్ట్ వర్క్ సినిమా..
స్టార్ హీరోల సినిమాలు 2025 సంక్రాంతి రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. ముందుగా మెగా పావుర స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ను పొంగల్ కానుకగా జనవరి 10 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. అలాగే పొంగల్ కు వస్తున్న మరో సినిమా వెంకీ, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’. ఇక బాబీ – బాలయ్య సినిమా కూడా సంక్రాంతికి రానుంది. ఈ సినిమా విడుదలపై నిర్మాత నాగవంశీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు. నాగవంశీ మాట్లాడుతూ ‘బాలయ్య సినిమా ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది, కొత్త బాలయ్యను చుస్తారు. ఇప్పటిదాకా బాలయ్య ను ఇలా ఎవరు చూపించలేదు. బాబీ ఇంతకు ముందు సినిమాల కంటే డిఫ్రెంట్ గా ఉంటుంది. మొత్తం సినిమాలో ఓ ఐదు ఆరు సీన్స్ కు థియేటర్స్ బ్లాస్టింగ్ అవుతాయి. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో బాలయ్య నటన అద్భుతం. బాబీ డియోల్, బాలయ్య ఫేస్ ఆఫ్ సీన్స్ మాస్ ఆడియెన్స్ కు ట్రీట్. బాలయ్య తో చేస్తున్న సినిమా బాబీ కెరీర్ లో బెస్ట్ వర్క్ సినిమా. నా సినిమా అని చెప్పట్లేదు గాని ఈ సినిమా పక్కా హిట్. బాబీ తప్పుగా అనుకోవచ్చు గాని కథ పరంగా గాని, టేకింగ్ పరంగాని, విజువలైజ్ గాని, టెక్నికల్ గా గాని ఈ సినిమా బాబీ కెరీర్ బెస్ట్ వర్క్. దీపావళి కానుకగా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేస్తాం, సంక్రాంతికి సినిమా రిలీజ్’ అని అన్నారు.

మీ నడుం మీద చపాతీలు వేడి చేస్తానన్న డైరెక్టర్.. నో చెప్పిన బోల్డ్ బ్యూటీ
బోల్డ్ బ్యూటీ ‘మల్లికా షెరావత్’ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయినా ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. హిందీతో పాటు కొన్ని దక్షిణాది సినిమాల్లోనూ మల్లికా షెరావత్ నటించి ఇక్కడి జనాలకు దగ్గరైంది. కమల్ హాసన్ హీరోగా నటించిన దశావతారం లాంటి కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మల్లికా షెరావత్ సౌత్ ఇండస్ట్రీలో కూడా సందడి చేసింది. అయితే, 2012 తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి మల్లికా షెరావత్ హఠాత్తుగా కనుమరుగైంది. ఇక తాజాగా ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ అనే సినిమాతో మళ్లీ వెండితెర పైకి రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. కాగా తాజాగా సౌత్ ఇండియన్ మూవీ డైరెక్టర్స్ గురించి మల్లికా షెరావత్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, మల్లికా షెరావత్ ఏం అన్నారు అంటే.. ‘ఒక సౌత్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి హాట్‌ ఐటెం సాంగ్ ఉందని, చేయాలని అడిగారు. ఇది ఎలా ఉండాలంటే చూసే ప్రేక్షకులకు మీరెంత హాట్‌ అనేది అర్థమవ్వాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నేను ఓకే చెప్పాను. ఇంతకీ, నన్ను ఎలా చూపిస్తున్నారు అని అడిగితే… మీ నడుం మీద చపాతీలు వేడి చేస్తాను అని చెప్పాడు. ఆ మాటకి నేను ఆశ్చర్యపోయి ఆ పాట వెంటనే చేయను అని చెప్పేశాను. వినడానికి మాత్రం ఇది చాలా ఫన్నీగా ఉంది. ఆ తర్వాత మళ్లీ సిట్యూయేషన్స్ ఎదురు కాలేదు’ అని మల్లికా షెరావత్ చెప్పింది. ఇంతకీ, ఆ సౌత్ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఆమె చెప్పలేదు.

ఎవరైనా సరే ఆరేళ్లు ఆగాల్సిందే.. నీల్ మామ లైనప్ లో నలుగురు స్టార్లు
కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్ మూవీతో ఆయన పేరు మార్మోగిపోయింది. స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ లో అలరించాయి. బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కేజీఎఫ్-2 ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. పాన్ ఇండియా లెవెల్‎లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్‎ను అందుకున్నారు ప్రశాంత్ నీల్. సినిమాలో ఆయన ఇచ్చిన ఎలివేషన్లు ఓ రేంజ్ లో అందరినీ అలరించాయి. రిపీట్ మోడ్ లో సినిమా చూసి మరీ ప్రభాస్ అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ లైనప్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మరో ఆరేళ్ల స్టార్ హీరోలతో సినిమాలు చేయనున్నారు. మరి ఆయన లైనప్ లో ఉన్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు ప్రశాంత్ నీల్. కొన్ని రోజుల క్రితం షూటింగ్ స్టార్ట్ అవుతుందని వార్తలు రాగా.. ఇంకా షురూ కాలేదు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు నీల్. ఆ తర్వాత సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం చేస్తారు. చిత్రీకరణకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన సలార్-2.. 2027 సమ్మర్ లో రానుందని సమాచారం. అలాగే కేజీఎఫ్-3 కోసం కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ ను ఇప్పటికే ఆయన రెడీ చేసుకున్నట్లు సమాచారం. డైలాగ్ వెర్షన్ ను కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే అందుకు నీల్ ఒక ఏడాది టైం తీసుకుంటారని తెలుస్తోంది. రీసెంట్ గా మెగా హీరో రామ్ చరణ్, నీల్ కాంబోలో సినిమా ఓకే అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని టాక్ వచ్చింది. ఈ సినిమా 2029 లేదా 2030లో ఆ సినిమా మొదలు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మరో ఆరేళ్ల పాటు ప్రశాంత్ నీల్ డేట్స్ ఖాళీ లేకుండా వరుసగా స్టార్ హీరోలను ఫిక్స్ చేసుకున్నారు.

Show comments